Friday, 22 August 2014

గృహహింసకు ఎడంకాలి దెబ్బ! డా. జి వి పూర్ణచందు

గృహహింసకు ఎడంకాలి దెబ్బ!
డా. జి వి పూర్ణచందు
జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో, వామ పాదంబునన్
దొలగం దోచె లతాంగి యట్లె యగు నాథుల్ నేరముల్ సేయ, బే
రలుకం జెందిన యట్టి కాంత లుచిత వ్యాపారముల్ నేర్తురే?
ఒకప్పుడు, భార్యలకు కోపం వస్తే, తలగడ మంత్రం చదివేవాళ్ళట! అంటె, మంచం ఎక్కి పడుకుని ముఖం మీద తలగడ అడ్డపెట్టుకుని తనకి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడ్తూ ప్రదర్శించే అలుక. సాధారణంగా పడగ్గది ఇందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమనైనా కోపాన్నైనా ఈ గదిలోనే ప్రదర్శించాల్సి ఉంటుందికోపం ప్రదర్శీమ్ఛతానికైతా ఇదే కోపగృహం. ప్రేమకైతే ఇదే శృంగార మందిరం. కోపం కూడా శృంగారంలో ఒక భాగమేనని కదా వాత్స్యాయనుడు చెప్పింది...!
కృష్ణుడు సత్యభామని వెదుక్కోంటూ పడగ్గదిలోకి వెళ్ళినప్పుడు అతనికి అయిపోయింది, జరగ బోయేది రాగుంజు పోగుంజులాట అని! భార్యాభర్తల మధ్య కీచులాట వచ్చినప్పుడు భార్యలు తలగడ మంత్రం చదివితే, దాన్ని భర్తలు పెద్దగా పట్టించుకోక పోవచ్చు. కానీ, భర్తలు తప్పు చేసి ఆ రహస్యాలన్నీ భార్యలకు తెలిసిపోయి దొరికిపోయినప్పుడు, ఆ భర్త ఎంతటి వాడైనా పాదాక్రాంతుడు కాక తప్పదు. పారిజాతాపహరణం కథలో ప్రత్యేకత ఇది! భార్య తప్పుచేసిందనే అనుమానంతో అగ్నిప్రవేశం చేయించటం, శిలవైపోమ్మని శపించటం లాంటి కథలు పురాణాల్లో చాలా చదివాం. కానీ, ఇలా తప్పు చేసిన భర్త తన భార్యకు దొరికిపోయి నానా అగచాట్లు పడటం ఎక్కడా కనిపించదు. పారిజాతాపహరణం కావ్యం సాక్షాత్తూ కృష్ణుడికే ఆ పరిస్థితి కల్పించి, మగ పండితులెవ్వరూ నోరెత్తకుండా చేసింది. మగాడు తప్పుచేస్తే, వాడు మగాడిదే ననే సిద్ధాంతాన్ని ప్రకటించిందా కావ్యం. ఇంత గొప్ప ఊహ చేసింది నందితిమ్మన. ప్రథమాశ్వాసంలోనే ఈ పద్యం ఉంది.
జలజాతాసనుడు అంటే నీటిలో పుట్టిన పువ్వు(పద్మం)మీద కూర్చుని ప్రకాశించే బ్రహ్మ దేవుడు లాంటి
వాసవాది సురపూజా భాజనంబై తనర్చు దేవతలుఎప్పుడూ కొలిచేటి
లతాంతాయుధు కన్న తండ్రిమొక్కల తీగలనే విల్లుగా చేసుకున్న మన్మధుడి కన్నతండ్రి యొక్క
శిరమచ్చో...అలాంటి మహనీయుడి తలకాయి అయ్యయ్యో..
వామ పాదంబునన్దొలగం దోచె లతాంగి తన ఎడమకాలితో తొలగేలా పక్కకి తోసిందట ఆ లతాంగి.
ఎవరా లతాంగీ...? సాక్షాత్తూ సత్యభామ! చూస్తూ చూస్తూ మొగుణ్ణి ముఖం పక్కకు తిరిగేలాగా తోసిందని ఎంతో మర్యాదగా చెప్పాడు తిమ్మన కవి. అంతేగానీ, కాలితో చాచి తన్నిందని వ్రాయలేదు. మగపక్షపాతులైన కవులూ, సినిమా వాళ్ళు జమున లాంటి నటీమణులతో చాచి తన్నినట్టే చూపించారు. తన్నినా, నెట్టినా రెంటికీ పెద్ద తేడా లేకపోయినప్పటికీ ఆ పని చేసింది. తన్నింది ఎడమకాలితో కాబట్టి, అది పెద్ద చర్చనీయాంశం అయ్యింది. నిజానికి చేత్తో కొట్టినా, కాలితో తన్నినా ఒకటే! కానీ, భారతీయులకు కాలు అపవిత్రమైనది. అందులో ఎడమకాలు మరీ అపవిత్రమైంది. ఆ దెబ్బేదో చేత్తో ఒక్కటిస్తే జన్మజన్మాలకూ బుద్ధొచ్చేదేమో. కానీ, ఎడం కాలి ప్రయోగం అనే సరికి మగాళ్ళ మనసు గాయపడింది. మనోబావాలు దెబ్బతిన్నాయి. ఇదా దాంపత్యం అంటే...? ఇదా ప్రేమంటే...? అని కసికొద్దీ తిట్టుకున్నారు నంది తిమ్మనగార్ని! ఒళ్ళు మండితే పడగ్గదులన్నీ నక్సల్బరీ లౌతాయన్నది హెచ్చరిక!
నందితిమ్మనగారు ఇలాంటి ప్రతిస్పందనలను పట్టించుకోలేదు. సాక్షాత్తూ శ్రీ కృష్ణభగవానుడు ఒక తప్పు చేసి ఏ అర్థరాత్రో పిల్లలా ఇంట్లోకి జొరబడ్డి మెల్లగా నక్కినక్కి వస్తే ఏ ఆడదైనా ఊరుకుంటుందా...? మర్యాదస్తురాలైతే, ఛడామడా కడిగి పారేస్తుంది. చండీరాణి లాంటి దైతే, చేతికి పని చెబ్తుంది. కానీ, సత్యభామ రెండూడు చెయ్యదు. ఆవిడ రూటే సెపరేటు.
మంచం మీద బాపూ గారి బొమ్మలాగా వయ్యారంగా పడుకుని ఉన్న ఆ సత్యభామను చూసి, కృష్ణుడు ఆమె కాళ్ళు పుచ్చుకుని ప్రాథేయ పడుతూ సత్యా అని పిలిచాడు. సత్య ఆ గొంతు విని కోపంగా తన కాళ్ళ మీద తలను ఉంచిన కృష్ణుణ్ణి ఆ తలతో సహా ఎడం కాలితో అవతలకు నెట్టేసింది. 
యట్లె యగు నాథుల్ నేరముల్ సేయ ఇట్లాగే తిక్క కుదరాలి, తప్పుడు పనులు చేసి కొంపకు వచ్చిన మగాళ్లందరికీ... అంటాడు కవి. బేరలుకం జెందిన యట్టి కాంత లుచిత వ్యాపారముల్ నేర్తురే? అలుక బూనిన స్త్రీలు ఉచితానుచితాలు మరిచిపోయి ఆ కోపం మీద ఎవరూ ఏవిటీ అని చూడకుండా చాచి తన్నేస్తారంటాడు. నంది తిమ్మన పూర్తిగా సత్యభామ పక్షమే వహించినట్టు ఈ పద్యంలో కనిపిస్తోంది. కవి ధర్మం కూడా అంతే! తప్పు చేసినవాడు పరమాత్మ అయితే ఏంటటా...?అన్నట్టు వ్యవహరించాడు తిమ్మన!
ఇది 16వ శతాబ్దినాటి కథ. దీని వెనుక మహిళా తీవ్రవాదం ఉంది. సమస్యకు పరిష్కారం ఉంది. ఆచరణీయ యోగ్యత ఉంది. లతగారి నవలల్లో ఇలాంటి ముగింపులు చాలా వున్నాయ్యి. వినాయకరావు అనే శాడిష్టు మొగుణ్ణి వీథిలో పడేసి కాళ్ళతో తన్నుకుంటూ వెళ్ళినట్టు ఇది తులసివనం అనే నవలలో వ్రాస్తుందామె!  నందితిమ్మన కాలానికే ప్రారంభమైన ఈ మహిళా ఉద్యమాన్ని తరువాతి కాలంలో ఎవ్వరూ కొనసాగించక పోయినా లతగారు చాలా చొరవని ప్రదర్శించింది.
గృహహింసని అదుపు చేయటం చాలా కష్టం. ఎందుకంటే దాని గురించి రిపోర్టు చేయటానికి ఎవరూ ముందుకు రారు కాబట్టి అని ఒక అమెరికన్ రచయిత్రి అమెరికాలో గృహహింస చట్టం అమలుపైన ఒక వ్యాసంలో(difficult to control because difficult to report)  వ్రాసింది. భారతదేశంలో ఏ భార్య అయినా పోలీసు స్టేషనులో రిపోర్టిచ్చే సన్నివేశాలు అరుదుగా కనిపిస్తాయి. ఇచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా తక్కువే! అందుకే, ఎడంకాలి దెబ్బని మించింది లేదంటాడు నంది తిమ్మన. 



No comments:

Post a Comment