Tuesday, 19 August 2014

‘సీను’ పండించిన పద్యం :: డా. జి వి పూర్ణచందు

సీను పండించిన పద్యం
డా. జి వి పూర్ణచందు

ఈతడజాత శత్రుడు, మహిం దగ దిగ్విజయంబు చేసె, వి
ద్యాతిశయార్థి, వాసవు మహాసన మైనను నెక్కనర్హు, డు
ద్యోదిత మూర్తి, కౌరవ కులోద్వహు డార్య నికాయ సంతత
ఖ్యాత చరిత్రు, డీ చిఋత గద్దియకుం దగడే?, నరేశ్వరా!
తిక్కనగారి ఈ పద్యానికి టీకా తాత్పర్యాలు అవసరం లేదు. ఇతనికి శత్రువులు ఇంతవరకూ పుట్టలేదన్నంతగా అందరినీ మిత్రభావంతో చూస్తాడు. పెద్ద భూభాగాన్ని గెలిచాడు. బాగా చదువుకున్నాడు. ఇంద్రుడి సింహాసనాన్నైనా ఎక్కగల అర్హతలున్నవాడు. కౌరవ రాజవంశంలో పుట్టాడు. ఎంతో గొప్పవాళ్లు ఈయన్ని పొగుడుతూంటారు.  అంతటి పెద్దాయన నీ ఈ చిన్న సింహాసనాన్ని ఎక్కి కూర్చోవటానికి తగడా? అనడగటం ఇక్కడ కనిపించే ఒక చిన్న సంఘటన.
ఇలాంటి అర్హతలున్న వాడు ధర్మరాజు కాబట్టి, ఇది ఆయన్ని ఉద్దేశించిన పద్యమేనని అర్థం అయిపోతోంది. కానీ, ఇక్కడే అసలు డ్రామా మొదలయ్యింది. తేలికైన తెలుగు పదాలతో పద్యాన్ని వ్రాయటమే కాకుండా అందులో నాటకీయతని తేవటం తిక్కన గారి ప్రత్యేకత. శ్రీమదాంధ్ర మహాభారతం విరాట పర్వం, ఐదవ ఆశ్వాసంలో పద్యం ఇది. విరాటపర్వంలోది కాబట్టి అఙ్ఞాతవాసం చేసిన సందర్భం అనీ, ఇదంతా విరటుడి కొలువులో వ్యవహారం అనికూడా అర్థం అవుతోంది.
నాటకీయతని ఇక్కడే సాధించాడు తిక్కన. అఙ్ఞాతవాసం పూర్తయ్యింది. ఉత్తర కుమారప్రగల్భాల దృశ్యం కూడా అయిపోయింది. అర్జునుడు బయట పడ్డాడు. తిథి వార నక్షత్రాల ఆధారంగా అప్పటికే గడువు తీరిందని భీష్మ ద్రోణాదులు చెప్పటంతో ఉత్తర గోగ్రహణ ప్రహసనం ముగిసింది. ఇంక మిగతా పాండవులు ఒక్కరొక్కరే బయట పడాలి. ఈ బయట పడే క్రమంలో అందరికీ కాకపోయినా ధర్మరాజుకైనా కొంత డ్రామా పెట్టక పోతే సీను పండదనిపించింది తిక్కనగారికి. అందుకోసం ఈ దృశ్యాన్ని ఉపయోగించుకున్నాడు.
అది, విరటుడి సభ. ఆయన ఇంకా సభకు రాలేదు. వచ్చే సమయం కానుండటంతో సభాసదులంతా ఒక్కరొక్కరే వచ్చి ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చుంటున్నారు. పాండవులు కూడ అంతకుమునుపటి వంటలవాడి వేషం, గుర్రాలు కాచేవాడి వేషం ఇలాంటివన్నీ వదిలేసి, రాజకుమారుల్లాగా మంచి బట్టలు కట్టుకుని సభకి వచ్చారు. అప్పటికే అర్జునుడు ఉత్తరుణ్ణి చెట్టెక్కించి తమ ఆయుధాలకట్టని జమ్మి చెట్టు మీంచి దింపించి రథంలో వేసుకుని తెచ్చాడు కాబట్టి, ఎవరి ఆయుధాలు వాళ్ళు చేతుల్తో పుచ్చుకొని ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చున్నారు. పాపం ధర్మరాజుకి, అంటే రాజుగారి ఆటనేస్తుడైన కంకుభట్టుకి ఎక్కడా కూర్చునే చోటు దొరక్క తిన్నగా వెళ్ళి రాజుగారి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ కంకుభట్టుకి మతి పోయిందా... అని అందరూ విస్తుపోయారు.
అంతలో రాజుగారు సభలోకి వచ్చేశారు. వందిమాగధుల స్తుతి స్తోత్రాలన్నీ జరిగిపోతున్నాయి. దూరం నుంచే తన సింహాసనం మీద ఎవరో ఆగంతకుడు కూర్చున్న సంగతి రాజుగారు గమనించి ఉండకపోవచ్చు. తన సింహాసనానికి ఢోకా లేదనే ధైర్యం కూడా కావచ్చు. మిగతా భద్రతా సిబ్బంది చూసికూడా ఎందుకు మౌనం వహించారో తెలీదు. బహుశా రాజుగారు లోపలికి రావటం, కంకుభట్టు సింహాసనం ఎక్కటం ఒకేసారి జరిగి ఉండవచ్చు.
రాజుగారు సింహాసనం దాకా వచ్చేశారు. సభాసదులు అందరూ లేచి నిల్చుని కరతాళ ధ్వనులతో రాజుగారికి స్వాగతం పలుకుతున్నారు. కానీ కంకుభట్టు లేచి నిల్చోలేదు. విస్తుపోయాడు విరటుడు. తను వచ్చాక లేచి నుంచుని చప్పట్లు కొట్టని వాడు, ఏకంగా తన సింహాసనమే ఎక్కి కూచున్నవాడు, రాజవందనాలు చేయకుండా తనముందే కూచుని తననే చిరునవ్వుతో పలకరిస్తున్నవాడు, ఎవరితనూ...? తేరిపార చూశాడు. ఇంకెవరూ కంకుభట్టు...!
ఏయ్! కంకుభట్టూ! నీకేమైనా మతి పోయిందా, ఆ కిరీటం ఏవిటీ...?. నీ చేతిలో ఆయుధాలేమిటీ...? ఈ రాజు వేషం ఏవిటీ...? పైగా వచ్చి నా సింహాసనం ఎక్కావేమిటీ...? అనడిగాడు. అంతకు మించి ఓవర్ యాక్షన్ చేయలేదు. అదీ తిక్కన నాటకీయతలోని సంస్కారం.
బృహన్నల అప్పటికే అర్జునుడని బయటకు తెలిసిపోయింది కాబట్టి, ఆయన చిన్నగా నవ్వి ఈ పద్యాన్నిచెప్పాడు. ఇలాంటి రహస్యాల్ని, ముఖ్యమైన విషయాల్నీ చెప్పవలసి వచ్చినప్పుడు ఏ వార్తాహరుడి చేతనో చెప్పించినా కథా గమనానికి వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. కానీ, తిక్కన కథ చెప్పటానికి పరిమితం కాలేదు. కథను అందమైన పూలసజ్జలాగా అల్లి అందులో సుగంధభరితమైన పూలు పెట్టి పాఠకులకు అందించా లనుకున్నాడు, అదీ ఒకే ఒక పద్యంలో! ఇది మరొకరు రాస్తే హాస్య సన్నివేశం అయిపోతుంది. అందువలన కథనంలోని ఔచిత్యం, ఔన్నత్యం దెబ్బతిని ఉండేవి.

పురాణ ప్రవచనాలకన్నా హరికథలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటాయి. హరికథల్లో డ్రామా బాగా పండుతుంది. బుర్రకథ ఇంకా ఎక్కువ ఉత్తేజితం చేస్తుంది. తెలుగింట ఈ ప్రక్రియలు ఎక్కువ ఆదరణ పొందటానికి తెలుగువారి నాటకీయ ప్రియత్వమే కారణం. కథా నవలా రచయితలందరికి ఇది తిక్కనగారి గొప్ప సందేశం.

No comments:

Post a Comment