Wednesday, 9 July 2014

ముంచుకొస్తున్న పెను నపుంసకత - :: డా. జి వి పూర్ణచందు


ముంచుకొస్తున్న పెను నపుంసకత - గే సంస్కృతి
డా. జి వి పూర్ణచందు
బిడ్డ పుట్టగానే పురుషావయవం ఉంటే మగపిల్లాడనీ, స్త్రీ జననాంగం ఉంటే ఆడపిల్ల అనీ నిర్థారించి చెప్పేస్తారు. ఈ బిడ్డ పెద్దయ్యాక నపుంసకుడో, లేక స్వలింగకాముకుడో అవుతాడని ముందుగానే ఎవరూ నిర్థారించలేరు. స్త్రీ జననాంగం ఉండి, మగాడి పద్ధతిలో  పెరిగి నప్పుడు ఆ వ్యక్తిని నపుంసకుడుఅని పిలుస్తారు
కొందరు పురుషావయవంతోనే ఉండి,  స్త్రీ పోకడలు పోయే పురుషులూ ఉంటారు. వీళ్ళలో చక్కగా సంసారం చేసి సంతానాన్ని పొందగలిగిన వారూ ఉన్నారు. అయినా ఆడంగి రేకుల వాడనీ, బృహన్నల అనీ పిలిచేట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.
కొందరు స్త్రీ జననాంగం కలిగిన పురుషులు పైకి నిఖార్సయిన మగవాడిలాగే కనిపిస్తారు. కానీ, మరొక పురుషుడి ద్వారా కామాతురత తీర్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ జననాంగ పరమైన విషయాలు. వారి వారి రూపలావణ్యాలను బట్టి స్త్రీ లాగో పురుషుడిలాగో తయారై జీవించే నపుంసకులు. సమాజం గౌరవభావంతో, వీళ్ళని శారీరక వికలాంగులుగా ప్రకటించి గౌరవ ప్రదమైన జీవితం ప్రసాదించాలని ప్రభుత్వాలను సామాజిక వేత్తలు కోరుతున్నారు.
ఈ నపుంసకుల్లో శారీరక నపుంసకులు, మానసిక నపుంసకులు ఇద్దరూ ఉన్నారు. పుంసత్వం లేని పురుషులు, స్త్రీత్వం లేని స్త్రీలు నపుంసకులుగా కనిపిస్తారువీళ్ళని చాలావరకూ చూడగానే గుర్తుపట్టవచ్చు కూడా! కానీ, ఇటీవలి కాలంలో ఒక కొత్త జాడ్యం కొందరు మనుషుల్లో బయల్దేరింది. నిజానికి ఈ జాడ్యం పాతదే అయినప్పటికీ అది ఉధృతం అయి, ఇప్పుడు  పెద్ద ఉద్యమ స్థాయికి చేరుకుంది. ఆడవాళ్ళను ఆడవాళ్ళు, మగవాళ్లని మగవాళ్ళు అనుభవించటం ద్వారా సుఖప్రాప్తిని పొందటం, దానికి చట్టబద్ధత ఇచ్చేదాకా పరిస్థితులు వెళ్ళటం తాజా పరిణామాలుగా చెప్పవచ్చు. ఇద్దరు పురుషుల మధ్య, లేదా ఇద్దరు స్త్రీల మధ్య లైంగిక సంబంధం, వివాహ బంధం, సంసార బంధం అన్నీ ఏర్పడటమే ఈ కొత్త పరిణామం.
వివాహంతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుషులిద్దరూ కలిసి జీవించటానికి సహజీవనం అని పేరు పెట్టి, అది పెద్దింటి వాళ్ళ అలవాటుగా, పెద్దగా తప్పు లేనిదిగా భావించే స్థితి క్రమేణా మన దేశంలోకూడా ప్రవేశించింది. అమెరికా లాంటి దేశాల్లో వివాహ బంధంలేని సహజీవనం తీవ్రాతితీవ్రమైన నేరం. కానీ, భారత దేశంలో దాని గురించి పట్టించుకొనే స్థితి లేని కారణంగా ఈ సహజీవన వ్యవస్థ ఇక్కడ బాగా వ్రేళ్ళూనుకుంటోంది. ఇది విస్తరిస్తున్న దశలో మూలిగే నక్క మీద టాటి పండులాగా  గే సంస్కృతిదేశాన్ని చుట్టుముట్టడం మొదలవటంతో సామాజిక వేత్తలు అవాక్కవుతున్నారు. 
సహజీవనం అనేది సాంఘిక అనాచారమే గానీ, మానసిక అనాచారం కాదు. కానీ, ఇద్దరు పురుషులు స్త్రీ పురుషుల్లా సెక్సు జీవితాన్ని గడఫటం అనేది శారీరక, మానసిక, సాంఘిక అనాచారంగా శాస్త్రవేత్తలు  భావిస్తున్నారు.
ఇద్దరు స్త్రీలు లేక ఇద్దరు పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చనీ. అది చట్టబద్దమేననీ 20 డిసెంబరు, 2013న అమెరికాలోని ఉటా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది ఆ డిస్ట్రిక్ట్ వరకూ పరిమితం. దీనిపైన అటార్నీ జెనెరల్ స్టే ఇచ్చాడు. దానిపైన సర్క్యూట్ కోర్టుకు అప్పీలుకు వెడితే ఆ కోర్టు విచారణకు స్వీకరించింది. స్వలింగ సంసారాలు (Same-sex marriages) తప్పు లేనివనే తీర్పు రాగానే స్టే వచ్చే లోపు వారం రోజుల్లో ఉటా అధికారులు 900 స్వలింగ వివాహాలు జరిపించేశారు. అలా పెళ్ళి చేసుకున్నా వారిలో ఉటా నుంచి ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ జిమ్ డబాకీస్ అనేవాడు కూడా ఉన్నాడు. ఇతరుల సంగతి ఎలా ఉన్నా రోమన్ కేథలిక్ డయోసీస్ మాత్రం స్టే పట్ల హర్షం వెలిబుచ్చింది.
కానీ సాధారణ ప్రజల్లో అవును! వాళ్ళిద్దరూ ఇష్ట పడ్డారు! పెళ్ళి చేసుకుంటున్నారు! మధ్యలో ఇతరుల కొచ్చిన ఇబ్బందేవిటన్నట్టు ఎక్కువమంది ఆలోచిస్తున్నారు.
దీన్ని గృహసంబంధమైన భాగస్వామ్యం (Domestic partnership)గా మరికొందరు భావిస్తున్నారు. ఈ మేరకు 2005లో mutual dependence benefits contracts పరస్పర ఆధారిత ప్రయోజనాల కాంట్రాక్టుగా ఒక వ్యవస్థని సృష్టించటానికి రిపబ్లికన్ సెనేటర్లు కొందరు ప్రయత్నించారు. వివాహంతో నిమిత్తం లేకుండా ఆడామగలు గానీ, గే తత్త్వం కలిగినవారుగానీ సహజీవనం సాగించటానికి అనుమతించే ప్రయత్నాలు కూడా అమెరికాలో జరిగాయి. అయితే అవి చట్టరూపం దాల్చలేదు. అక్రమంగా జీవించటం లేదు, పెళ్ళి చేసుకుంటున్నాం కదా... కాబట్టి, తప్పేవిటీ అని అడుగుతున్నారు ఈ గే తత్వం ఉన్నవాళ్ళు.
ఈ రకం తత్వం ఉన్నవాళ్లని నాలుగురకాలుగా  వర్గీకరించవచ్చు. ఈ నల్గురినీ కలిపి LGBT అంటారు.  (LGBT- Lesbian, gay, bisexual, and transgender).  పెళ్ళికి పరమార్థం ఉల్లాసం కలగటమే (pleasure) అయినప్పుడు తమ పెళ్ళిని అనుమతించాల్సిందేనని ఎల్జీబీటీలు కోరుతున్నారు. మనో వికారాలను ప్రాథమిక హక్కులుగా ఎలా గుర్తిచుతామని న్యాయస్థానాలు సందిగ్ధంలో ఉన్నాయి. ప్రజలకూ, ప్రభుత్వానికీ ఎలాంటి నష్టమూ లేనప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఏవిటని గే సంఘాలు అడుగుతున్నాయి.
మానసిక శాస్త్ర ప్రకారం స్వలింగ కాముకతని mental illnessగా చాలామంది అంగీకరించటంలేదు. కొందరు శాస్త్రవేత్తలు prenatal hormones అంటే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే హార్మోన్ల దుష్ప్రభావాన ఈ గేతత్త్వం ఉన్న వ్యక్తులుగా ఎదుగుతారని చెప్తారు.   సామాజిక కారణాలు ఈ గే తత్త్వాన్నిమరింత పెంచి పోషించేవిగా ఉంటాయి. వీటి గురించి ఆలోచించకపోతే ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన ఈ అనాచారం భారత దేశంలోకి పాకటానికి ఎక్కువ సమయం పట్టదు. ఇలాంటి వ్యాధులు దేశాల్ని బట్టి ఉండకపోవచ్చ్వు. కానీ, అక్కడి సామాజిక పరిస్థితులు గే తత్వాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు దాని ప్రభావం ఇక్కడి సామాజిక వ్యవస్థ మీదకు ప్రసరించటానికి ఎక్కువ సమయం పట్టక పోవచ్చు.
జన్యుపరమైన కారణాలు (genetic), హార్మోన్లకారణాలు (hormonal), పరిసరాలప్రభావం (environmental influences)ఇవన్నీ మనిషిని గే తత్త్వం ఉన్నవారిగా మారుస్తున్నాయి. సామాజిక సాంస్కృతిక కారనాలు కూడా ఇందుకు దోహదపడటం వలన పశ్చిమ దేశాలలో ఇది త్వరగా వ్యాప్తిలోకి వచ్చింది భారత దేశంలో కూడా ప్రవేశించి అల్లంత దూరాన ఆగి ఉంది. పిల్లల్ని హాష్టళ్ళకు అప్పగించి. తల్లిదండ్రులు ఇంట్లో టీవీలకు అంకితమయ్యే మన కుటుంబ వ్యవస్థ గే సంస్కృతి పెరగటానికి ప్రధాన కారణం అవుతోంది.
పిల్లలకు ఇల్లు కన్నా, ఇతరులకన్నా హాష్టలు విద్యార్థులే ప్రపంచంగా కనిపిస్తారు. అక్కడ నేర్పే చదువుల గురించి అలా పక్కన పెడితే, సెక్సువల్ అనాచారాలకు ఈ హాష్టళ్ళు ఎంతవరకూ ఉపయోగ పడుతున్నాయో గట్టి అజమాయిషీ లేకపోవటం కూడా ఒక కారణమే! అయినా, ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల పెంపకంలో లేకుండా బిడ్డల్ని హాష్టళ్ళకు తరలిస్తే జరిగే అపకారాల గురించి, ఆ పిల్లల్లో కలిగే మానసిక వత్తిళ్ళ గురించి, అక్కడ పెట్టే తిళ్ళ వలన వాళ్లకు కలిగే అనారోగ్యాల గురించి పెద్దలు పెద్దగా పట్టించుకోక పోవటం దురదృష్టకరమే! పిల్లలమీద పరిసరాల ప్రభావం అనేది ఇక్కడే మొదలౌతోంది. పిల్లల్లో మానసిక పరిపక్వత వచ్చే వరకూ వాళ్ళ పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవటం అనేది మానవ హక్కుల క్రింద చేర్చవలసిన విషయం అవుతుంది.
మనుషుల మనోభావాల్లో చోటు చేసుకుంటున్న ఈ మార్పుల్ని తొలిదశలో గుర్తించకపోతే మనకు మనం చాలా అపకారం చేసుకున్నవాళ్లం అవుతాం. కుటుంబవ్యవస్థని మన స్వంత ప్రయోజనాలకోసం విఛ్ఛిన్నం చేసుకున్నాం. విద్యా, వైద్య వ్యవస్థల్ని వాణిజ్య వ్యవస్థలుగా మార్చేసుకున్నాం. గురువు పట్ల గురు భావాన్ని వదిలేసుకున్నాం. ఫ్యామిలీ డాక్టరు అనేవాడు లేకుండా చేసుకున్నాం. రెండు రోజుల జ్వరాని పాతికవేలు ఖర్చుపెట్టి రీ ఎంబర్సుమెంటు సౌకర్యం ఉన్న ఘనతని చాటుకోవాలనుకుంటున్నాం. వీటన్నింటికీ మనదే ప్రధమ బాధ్యత. మనం అంటే, మీరూ నేనూ అందరమూనూ! రేపు ఈ గే సంస్కృతికి భారతదేశంలో చట్టబద్ధత వస్తే ఆ పాపం ఎవరిదని వెర్రిగాలి అడక్కుండానే వెళ్ళిపోతుంది.



No comments:

Post a Comment