వేయిపడగలు నవల-సాంస్కృతిక వారసత్వం
పాత్రలు కావవి పడగలే!
డా.జి.వి.పూర్ణచందు
ప్రతి జాతికీ ఒక సంస్కృతి ఉంటుంది. దాన్నే సాంప్రదాయమూ, సామాజిక ధర్మమూ అని కూడా అంటారు. జాతి పురోగమనానికి సహకరించేది సంస్కృతి. కాలానుగుణమైన మార్పులకు లోనయ్యే స్వభావాన్ని ఇది కలిగి ఉంటుంది. మారుతూ, మారుస్తూ సమాజాన్ని మునుముందుకు కదిలిస్తుంది. సంస్కృతి గురించి మాట్లాడటం ఛాందస వాదాన్ని భుజాన మోయటమో, పూర్వాచార పరాయణత్వాన్ని నెత్తికెత్తు కోవటమో, సహగమనాదుల
కోసం నడుం బిగించటమో ఎ0త మాత్రమూ కాదు. వాటికోసం కలం పడుతున్న వారు ఉన్నారనుకో నవసరంలేదు. విశ్వనాథ పైన విమర్శలు వెల్లువెత్తిన కాలానికీ, నేటికీ సాహిత్య పరిశీలనా దృష్టి మారింది. మార్క్సిష్టు, మార్క్సిష్టేతర ముద్రలు వేయించుకోవటానికీ వేయటానికీ ఇప్పుడు ఎవరూ ఇష్టపడటం లేదు. రచయితలంతా అభ్యుదయవాదులే! పద్యాలలో విప్లవభావాలు చెప్తున్న రోజులివి. పద్యకవులను అభివృధ్ధి నిరోధకులనీ, ఛాందసవాదులనీ హేళనచేస్తే, ఒప్పుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఒకప్పుడు సామాన్యులుగా పిలువబడిన వర్గాలలో ఎక్కువమంది ఇప్పుడు మధ్య తరగతిగా జీవిస్తున్నారు. మధ్య తరగతి సమస్యలే నేటి సాహిత్య0లో ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి. ఈ దృష్ట్యా విమర్శ తూకపు రాళ్ళు మారాయి. పాత పడిగట్టు పదాలకు ఇప్పుడు స్పందన లేదు. తెలుగు భాషా సంస్కృతులు ప్రమాదం అంచున పడిన నేపథ్య0లో వాటిని కాపాడు కోవటానికి సాహిత్యాభిమానులు
ఉద్యమిస్తున్న రోజులివి. ఈ నేపథ్యంలో తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే కథలూ, నవలలూ, ప్రబంథాలు వెల్లువగా రావలసిన అవసరం ఉంది.
1972లో యువభారతి ప్రచురించిన మహతిలోనూ, 1974లో ‘విశ్వనాథ కవితా వైభవం’ గ్రంథంలోనూ విశ్వనాథ తన గురించి తాను చెప్పుకొన్న కొన్ని వాక్యాలను ఇక్కడ పరిశీలించటం అవసరం. “నేను ఏమి వ్రాస్తానో నేను తెలిసికొని వ్రాస్తాను కనక, నేను వ్రాసిన దానిలో అనంత విషయములు నేను చొప్పి0చి వ్రాస్తాను కనక, అనాది నుంచీ ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపి0చుకొంటూ వస్తున్నది. ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పి0చి నేను సఫలుణ్ణై వాళ్ళను జ్ఞానవంతులను చేస్తున్నాను అనే భావంనాకున్నది కనక...!”
“అనేక జాతులు0టవి. అన్ని జాతులలో అందరు వ్యక్తులూ ఆర్థికంగా సమానం నిస్స0దేహంగా చేయబడ వలయునే కదా! అందరికీ అన్నోదకము లుండవలసిందే! సర్వజనులకూ అన్నోదకాలు లేకుండా చేసెడి రాజు నాకు విరోధి. నాకూ అన్నోదకములు లేకుండా చేస్తాడు కనక.”
“నేను పూర్వాచార పరాయణుడను; ఆధునికుడను కాను; ప్రవాహమున కెదురీదును- ఈ మాటలు నన్ను గూర్చి అజ్ఞులైనవారు చెప్పుదురు. ఆ చెప్పుట వంచనా శిల్పములోని భాగము. ఆ విద్యలో వారు అందెవేసిన చేతులు... నిజానికి శిల్పము కానీ, సాహిత్యము కానీ, జాతీయమై యుండవలయును. విజాతీయమై యుండరాదు. వ్రాసిన వానికి ముక్తి, చదివిన వారికి రక్తి, ముక్తి. ఎ0త సముద్రము మీద ఎగిరినను,
పక్షి రాత్రి గూటికి చేరును. ఇది జాతీయత. ఇది సంప్రదాయము.”
“నా పద్య ప్రపంచక మెటువంటిదో,
నేను నిర్మించిన గద్య ప్రపంచకము నట్టిదే! ఎ0గిలి కూడు లేదు, నా జాతి, నా తెలుగువాళ్ళు. తెలుగు భాష నాది. వాళ్ళు-నేను తెలుగువాణ్ణి కాదు, నేను భారతీయుణ్ని కాదు అంటే, నేను చేసేది లేదు కాని, వాడు ఈ రెండూ కాకపోతే మాత్రం, శ్రమ లేకుండా నానవలలు చదివి మనో జ్ఞానమును సంపాదించ వచ్చు. నేను వ్రాసిన సుమారు అరువది నవలలలో ఏవిషయాన్నిగూర్చి వ్రాయలేదు? పాశ్చాత్యుల సైన్సుయొక్క చరిత్రలోవిషయాలు ఉంటవి. వాళ్ళ ఫిలాసఫీ యొక్క విషయాలు ఉంటవి. వాళ్ళ సాహిత్యములోని రహస్యాలు ఉంటవి. వాళ్ళ శాస్త్రాలలోని మహావిషయాలన్నీ ఉంటవి, వృక్షశాస్త్రము, పశుశాస్త్రము, చివరకు మనీ (money)మారకం - అవసరమయితే ఇది ఉంటుంది అది ఉండదని ఉండదు. ఇలా చూస్తే వేదాలు, ఉపనిషత్తులు, భాష్యాలు, తర్కాలు, వ్యాకరణాలు-అటు చూస్తే పాశ్చాత్య విజ్ఞానములలో నేను నిద్రాహారాలు లేకుండా సంపాదించిన విజ్ఞానమంతా నా నవలలలో, నా పుస్తకములలో ఉంటుంది”
వేయిపడగలు గ్ర0థానికి ముందుమాటగా ఈ ఏరిన వాక్యాలను చదువుకొంటే, ముందుగానే ఏర్పరచుకున్న అపోహలు పోతాయి. విశ్వనాథ సమర్థకులు ఆయనను పూర్వాచార పరాయణుడు కాబట్టే గౌరవిస్తున్నారు.
విశ్వనాథ వ్యతిరేకులు ఆయన పూర్వాచార పరాయణుడు కాబట్టి ని0దిస్తున్నారు. తాను పూర్వాచార పరాయణుడని అనే వాళ్ళ0తా వంచనా శిల్పులని ఆయన అంటున్నారు. ఇప్పుడు తేల్చుకోవలసి0ది విజ్ఞుడైన పాఠకుడే! “లోకమింత మారుతూ ఉంటే వీడె0దుకు మారడు?” అని ప్రశ్ని0చుకొని, “కొండలు, నదులు మారవు” అని సమాధానo చెప్పగల గడుసరి విశ్వనాథ. 1934లో ఆనందవాణి పత్రికలో శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి
విశ్వనాథను ‘దేశంపట్టని కవి’ అని ప్రస్తుతి0చారు. ఆయన విమర్శకులు ఆయనకు దేశం పట్టదంటారు. అపోహలతొ,
అపార్థాలతో, ఆరోపణలతొ విశ్వనాథ ఎదుర్కొన్న దాడి ఆధునిక యుగ0లో మరే పద్య గద్య కవిప0డితుడూ ఎదుర్కో లేదనే చెప్పవచ్చు.
“వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి/ కాటందుకున్నది కలలోన రాజును” అనే చరణాలతో వేయిపడగలు నవల ప్రారంభమై, “అవును నీవు మిగిలితివి. ఇది నాజాతి శక్తి. నాయదృష్టము. నీవు మిగిలితివి” అనే ధర్మారావు మాటలతో ముగుస్తుంది. నవల ప్రారంభంలో ధర్మరావు లేడు. అతను నమ్మిన ధర్మాలున్నాయి. నవల ముగింపులో ధర్మారావు ఉన్నాడు. అతను చెప్పిన ధర్మాలు లేవు. మారిన కాలం ఉన్నది. మారినవి ధర్మాలనుకునే వాళ్ళు కొందరు. అవి ధర్మాలు కావనే వాళ్ళు మరికొందరు. పురుషసూక్త0 లోని ‘సహస్రశీర్ష’ని వేయిపడగల స్వామిగా భావించారు విశ్వనాథ. నడుస్తున్న కాలానికి ప్రతీక ఈ వేయిపడగల పాము. ఆ పడగలు చేతనా చేనత్వాలకు, దాని వేయి కాట్లు లోకంలోని వ్యవస్థలకూ, అవ్యవస్థలకూ ప్రతీకలు. అయితే, కాలక్రమంలో పడగలన్నీ నశించి పోయి, రె0డే మిగిలాయి. అంతేగానీ,
వేయిపడగలు పదివేల పడగలై విస్తరించినట్టు ఈ నవలను విశ్వనాథ ముగించలేదు. అలా ముగించి ఉంటే కొందరు భావించినట్టు చా0దసవాదం ప్రస్ఫుటమై ఉండేది. నశించిన వాటిలో పురోగాములూ, తిరోగాములూ ఇద్దరూ ఉన్నారు. గడిచి పోవటం, గతి0చి పోవటం కాలస్వభావాలు.
“లోక మంతయు నూత్నత్వము శక్తి యనుకొనుచున్నది. నూత్నత్వము నూత్నత్వమే కాని శక్తి యెట్లగును?
క్రొత్తలో గాడిద పిల్ల కూడ కోమలముగానే యు0డును”
అంటాడు ధర్మారావు! హరిజన దేవాలయ ప్రవేశ సందర్భ0లో “దేవాలయముల లోనికి వారిని రానిత్తుమందురా? వ్యయము లేని పనిగదా? ఊరి మీద నూరు పడినను, కరణము మీద గాసు పడదు- చెడిన, దేవాలయములోని దేవుడు చెడుగాక. మనకేమి?” అని మాట్లాడే పాత్ర ధర్మారావుది. శ్రీనాథుడి కారణంగా సీసపద్య0 పాడయిందని అతను అన్నప్పుడు (7వ అథ్యాయం-పేజీ 115) రాఘవరావు లాగి చెంపదెబ్బ కొడతాడు. సాంఘిక మానవుడు వేరు, అంతర మానవుడు వేరు. సంఘం కోసం పైకి ఎలా జీవిoచినా అంతరాంతరాల్లో ఎలా జీవిస్తాడో ముఖ్య0. ఆ లోపలి మనిషికే ఈ చెంప దెబ్బ. “నేనును బ్రవాహ గామినే గాని యెదురీడెడి వాడను గాను. యెదురీదియు బ్రవాహము వె0ట పోవుచు0టిని(పేజీ 605) అని ధర్మారావు పాత్ర తన గురించి చెప్పుకొంటుంది. పూర్వాచార పరాయణుడయిన ఈ ధర్మారావుని విశ్వనాథవారికి ప్రతిరూప0గా బాగా ప్రచారం చేశారు. ధర్మారావులోని అభ్యుదయ నిరోథకతనంతావిశ్వనాథకు అంటగట్టి ఆయన పైన వ్యక్తిగత దాడి చేసే0దుకు ఇది అవకాశం ఇచ్చి0ది. ఈ రకమైన విమర్శ వలన మనుషులు విభిన్న పరిస్థితుల్లో విభిన్న రీతుల్లో ప్రవర్తి0చే వాస్తవాన్ని పక్కదారి పట్టి0చటం అయ్యి0ది.
వేయిపడగలు నవలలో చెప్పిన సుబ్బన్నపేట విశ్వనాథవారి స్వగ్రామమయిన కృష్ణాజిల్లా నందమూరేననీ, రామేశ్వరశాస్త్రి విశ్వనాథవారి త0డ్రి శోభనాద్రిగారనీ, ధర్మారావు పూర్తిగా విశ్వనాథవారే ననీ ఇ0కా నాయని సుబ్బారావు,
కొడాలి ఆoజనేయులు, కోపల్లె హనుమంతరావు,
ముట్నూరి కృష్ణారావుగారి భార్య ప్రభృతులంతా ఈ నవలలోని ఇతర పాత్రలనీ విశ్వనాథ సమర్థకులు పోల్చి చెప్తు0టారు. నిజానికి, ఇలా పోల్చటం కవికి అపకారమే చేస్తుంది. విశ్వనాథవారి విషయంలో చేసి0ది కూడా!
ఉదాహరణకు ధర్మారావు త0డ్రి రామేశ్వరశాస్త్రి ఈ నవలలో పరమ కాముకుడైన ఒక మేథావి. అవకాశం దొరికితే చాలు ఆడపిల్లలను లేవదీసుకుపొయే రకం. చాతుర్వర్ణ వ్యవస్థ
గౌరవార్థం నాలుగు కులాల స్త్రీలకూ తాళి కట్టాడు. అదనంగా ఒక భోగా0గన కూడా ఉంది. అయినా విశ్వనాథ సమర్థకులు “రామశాస్త్రిగారి బహు వివాహాలు మినహాయిస్తే ఆపాత్ర ముమ్మూర్తులా శోభనాద్రి గారే” అన్నారు. “లోకం దృష్టిలో నీ వివాహములు ఆయన కాముకతయు బ్రవాద హేతువులైననూ, రామేశ్వరశాస్త్రి గారి ఔదార్య గుణ సముద్రములోనవి మునిగి పోయెను” అని కథా క్రమంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా, రామేశ్వర శాస్త్రిని ఇలా సాక్షాత్తూ కవిగారి త0డ్రితోనే పోల్చారు. సమాజాన్ని కమ్ముకున్న వేయిపడగల్లో ఈ రామేశ్వర శాస్త్రి ఒక పెద్ద పడగ. అన్నదాత,
విలుకాడు, దివాన్ పదవిలో ఉన్నాడు కాబట్టి గొప్పవారి గోత్రాలు ఎలా0టివైనా ప్రజలు ధర్మాలన్నీ ముద్దగట్టిన మూర్తిగానే ఆయనను భావించటం సహజ0. విస్సన్నచెప్పి0దే ఆ ప్రజలకు వేదం. ఆ పాత్రని అలానే చిత్రి0చారు విశ్వనాథ. రామేశ్వర శాస్త్ర క్షత్రియోచిత0గా విలువిద్య నేర్చాడు. వైశ్యోచిత0గా వ్యవసాయం చేశాడు. శూద్రోచిత0గా పొలాలకు కావలి ఉన్నాడు. నాలుగువర్ణాల ధర్మాలనూ నెరవేర్చాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలకు చె0దిన అమ్మాయిలను పెళ్ళాడి, ఇ0కో అదనపు సానినుంచుకొని చాతుర్వర్ణ ధర్మానికి ప్రతీకగా తననుతాను చిత్రి0చుకున్నాడు. తను చెప్పినట్టు వినలేదని జమీందారుతో గొడవపడి దివాన్ గిరీ వదులుకున్నాడు. అంతిమ దశలో అష్టకష్టాలు పడి కుక్క చావును వరించవలసి వచ్చి0ది. ఈ పాత్రని విశ్వనాథవారి త0డ్రితో ఎలా పోల్చగలిగారో అర్థ0కాదు.ఆ రామేశ్వర శాస్త్రి కుమారుడు ధర్మారావు. త0డ్రి వ్యక్తిత్వానికంటే భిన్నమైనవాడేమీ కాదు. భార్య అరు0థతి చనిపోగా, నలభై యేళ్ళ వయసులో పదమూడేళ్ళ బాలికను పెళ్ళి చేసుకొంటాడు. “చనిపోయిన అరు0థతి ఆత్మ ఈ పసిమేనులో నొదిగెను” అని సమర్థి0చుకొంటాడు. “దేవాలయాలలోని పూజారులకన్నా ప0చములకు తక్కువ గుణాలేమున్నాయని ప్రశ్నిస్తే, పశువులందావులు,
బర్రెలు, మేకల వలె బ్రాహ్మణులు తదితర వర్ణములవారు భిన్నమైన వర్ణముల వారని సమాధానం చెప్తాడు “అందరూ ఒక్కటే యను సిద్ధా0తము బశువులన్నియు నొక్కటియే యను సిద్ధా0తము వంటి”దని అడ్డ0గా వాదిస్తాడు. స్త్రీలకు నిగ్రహ శక్తి కలదు కాబట్టి, భర్త చనిపోయినా, మళ్ళీ పెళ్ళి చేసుకో నక్కరలేదని, పురుషులకు నిగ్రహ0 తక్కువకాబట్టి వాళ్ళు మరో పెళ్ళి చేసుకొవచ్చనీ, పదేళ్ళకే ఆడపిల్లలకు లై0గిక విషయాలన్నీ తెలిసిపోతాయి కాబట్టి,
చిన్ననాడే పెళ్ళిళ్ళు చేసేయాలనీ వాదిస్తాడు. ఉతికిన బట్టకన్నా మడిబట్ట మంచిదని వాదించే మనిషి. కానీ, అనునిత్య0 బ్రాహ్మణుల్ని ‘పెడితే పెళ్ళి పెట్టకపోతే శ్రాద్ధం’ అన్నట్టుగా వ్యవహరిస్తారని ని0దిస్తూ ఉంటాడు. ఇలా0టి వాదనలు నమ్మిన చిన్న అరుంథతి ధర్మారావును తప్ప మరెవరినీ పెళ్ళాడనని భీష్మించుకొంటుంది.
సరిగ్గా ధర్మారావుకు వ్యతిరేక మనస్తత్వం ఉన్న పాత్ర జమీందారు రంగారావుది. మూడు తరాల సుబ్బన్నపేట జమీందారులలో రె0డోతరం జమీందారయిన ఈ రంగారావు తన అధికారం తగ్గినప్పటికీ, ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నాడు. గు0డేరుకు ఆనకట్ట కట్టి0చాడు. నీటి కుళాయిలు పెట్టి0చాడు. మెట్టభూములన్నీ మాగాణి అయ్యాయి. స్వయoగా ఒక కాలేజీ పెట్టగా క్రైస్తవ మిషనరీలు మరొక కాలేజీని తెచ్చాయి. హాస్పిటల్ పెట్టాడు రోడ్లు వేయించాడు. వీధులలో విద్యుద్దీపాలొచ్చాయి. ఊరికి రైలు తెచ్చాడు. సుబ్బన్నపేట పట్టణీకరణం చె0దింది. కానీ, పట్టణ నాగరికత అవలక్షణాలు కూడా ప్రవేశించాయి. సాక్షాత్తూ రంగారావే పాశ్చాత్య నాగరికతా వ్యామోహ0లో పడి పోయాడు. ఆంగ్లవనితను తెచ్చుకున్నాడు. తల్లినీ,
భార్యనీ, సంతానాన్నీ అశ్రద్ధ చేశాడు. గవర్నర్లకూ అధికారులకూ పార్టీల కోసం ఖర్చు చేశాడు. ఎస్టేట్ అప్పుల్లో కూరుకుపోయింది. మూడోతరం జమీందారు కృష్ణమనాయుడు ధర్మారావు శిష్యరికంలో జమీందారీని కులటలకు, నటులకు,
సభ్యేతరవాద
చు0చువులకు, స్తనభారానమితలైన యోషితలకు, విటులకు ప0చకుండా ఆస్తి జాగ్రత్త
చేసుకున్న ప్రభువుగా ఈ నవలలో కనిపిస్తాడు.
మబ్బుల్లోనీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నట్టు, నీటికుళాయిలు నమ్ముకొని చెరువుల్ని పాడుపెట్టుకొంటే ఊరు తగులబడితే ఆర్పే0దుకు నీటి చుక్క లేకుండా పోతుందనీ, పశువులకు నీటి కరువు ఏర్పడుతుందనీ హెచ్చరించాడీ నవలలో విశ్వనాథ. గ్రామీణ నాగరికతని ధ్వ0సం చేసుకోవటం కూర్చున్న కొమ్మని నరుక్కోవటంగా చిత్రించటాన్ని ఆరోజుల్లో చా0దసవాదం అన్నారు. కానీ, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడు కోవటమే మంచిదనే అభిప్రాయం ఇప్పుడు చాలామందిలో కలుగుతో0ది. విశ్వనాథతో మనం ఏకీభవిస్తామో లేదో వేరే సంగతి. ఆయన లేవననెత్తిన వందలాది విషయాలను మాత్రం ఆలోచి0చ గలుగుతాము. ఎలా ఆలోచి0చకూదదో మనకు మనమే నిర్ణయించుకో గలిగేలా చేస్తుంది వేయిపడగలు నవల
No comments:
Post a Comment