Tuesday, 24 June 2014

శ్రీ మండలి బుద్ధప్రసాద్ – అపురూప వ్యక్తిత్వం, అరుదైన కార్యసాధకత

శ్రీ మండలి బుద్ధప్రసాద్ –
అపురూప వ్యక్తిత్వం, అరుదైన కార్యసాధకత
రిశ్రమ, తెగువ, ధైర్యం, బుద్ధి, బలం, పరాక్రమం ఈ ఆరూ ఉన్నవాడికే దైవం సాయపడుతుందని ఆర్యోక్తి. జాతికైనా వ్యక్తికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. తెలుగు జాతి కష్టకాలంలో ఉన్న సమయంలో ఈ ఆరూ ఆరు ముఖాలుగా ఉన్న శ్రీ బుద్ధప్రసాద్ లాంటి షణ్ముఖుల ఆవశ్యకత ఈనాడు ఎంతైనా ఉంది.
తదేకత, ఏకనిష్ఠత, ఏకాగ్రత లాంటి పదాలు పెట్టని కిరీటాల్లా సహజ లక్షణాలుగా భాసించే ఒక అపురూప వ్యక్తిత్వం శ్రీ బుద్ధప్రసాద్ స్వంతం. మహర్షులందరూ ఒక ఎత్తూ, అగస్త్యుడొకరూ ఒక ఎత్తూ అన్నట్టుగా ఈనాటి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థల్లో శ్రీ బుద్ధప్రసాద్ ఒక్కరూ ఒక ఎత్తు. రాజనీతిఙ్ఞత ఆయన ప్రవృత్తి. తెలుగు భాషాసంస్కృతుల అభ్యున్నతి ఆయన మనోధర్మం. ప్రజాభిమానం, దేశాభిమానం, భాషాభిమానం త్రివేణీ సంగమంలా ఆయనలోమూర్తీభవించాయి.  
అపురూప వ్యక్తిత్వం
దార్శనికుడయిన త0డ్రి, సంస్కృతి ప్రతిబింబమైన తల్లి, తెలుగు దనం నిండిన కుటుంబం, గాంధేయ వాదం, గాంధీనాదం ప్రతిధ్వనించే ఇల్లు... పుట్టిన నాటినుండీ పెరిగిన, ఎదిగిన జాతీయతా భావం, అన్నీ కలగలసి రూపొందిన శ్రీ బుద్ధప్రసాద్. శ్రీ మండలి వె0కట కృష్ణారావు గారి ఆలోచనల్లోంచి, ఆచరణల్లోంచి, ఆకా0క్షల్లోంచి అంకురించి, త0డ్రిని మరిపించిన తనయుడిగా ఎదిగారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీ బుద్ధప్రసాద్ 26 మే 1956న కృష్ణాజిల్లా నాగాయలంకలో జన్మించారు. బి.యే. చదివారు. భార్య శ్రీమతి విజయలక్ష్మి,ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
శ్రీబుద్ధప్రసాద్లో విలువలు నిండిన, నిబద్ధత కలిగిన ఒక రాజనీతిఙ్ఞుడు, ఒక దార్శనికుడు కనిపిస్తాడు. అంతేకాదు, ఆయనలో ఒక మంచి విమర్శకుడు తొంగి చూస్తాడు, భాషావేత్త పలకరిస్తాడు, చక్కని వచనం రాసే పత్రికా రచయిత భాసిస్తుంటాడు. చక్కగా విడమరిచి వివరించి చెప్పగల వచోవైభవం ఆయనలో తారట్లాడు తుంటుంది. వీటన్నింటికీ మించి, ఆయనలో ఒక చరిత్రవేత్త ఈ జాతి పుట్టుపూర్వోత్తరాలు తడిమి చూస్తుంటాడు. 
          తాతగారు కీ.శే. మండలి వెంకట రామయ్యగారు గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితులు. ఉపాధ్యాయులు. రెండు దశాబ్దాలకు పైగా కృష్ణాజిల్లా భావదేవరపల్లి సర్పంచ్గా పనిచేసారు. తండ్రి కీ.శే. మండలి వెంకట కృష్ణారావు ప్రఖ్యాత గాంధేయవాది, కృష్ణాజిల్లాలో పేరొందిన గత తరం ప్రజా నాయకులు. 1972 జై ఆంధ్రఉద్యమ కాలంలో కరుడుగట్టిన సమైక్యవాదిగా ఎదురీది నిలిచారు. అవనిగడ్డ సమితి ప్రెసిడెంట్గా, కృష్ణాజిల్లా పరిషత్ అధ్యక్షులుగా, లోక్సభ సభ్యుడిగా, అవనిగడ్డ శాసన సభ్యుడిగా, మూడు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా (సాంఘిక సంక్షేమం, విద్య, సాంస్కృతిక, సహకార  శాఖామాత్యునిగా) పనిచేసారు. గాంధీ సిద్ధాంతాల అనుసరణ కోసం గాంధీక్షేత్రం వ్యవస్థాపించారు. 1975 మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1981 మలేషియా రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో వారి సేవలు నిరుపమానం.
బాల్యం లోనే వికసించిన భాషాభిమానం
ప్రజాసేవ, భాషా సాంస్కృతిక సేవా రంగాల్లో శ్రీ బుద్ధప్రసాద్ తండ్రి స్ఫూర్తిని పుణికి పుచ్చుకున్నారు 1997 పెనుతుఫాను బాధితులకు విరామం లేకుండా సేవలందించారు. 25.8.1975న హైదరాబాద్లో ఆనాటి భారత రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ప్రారంభించిన పిల్లల జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆం.ప్ర. బాలల అకాడెమీ ఏర్పాటుకు విశేష కృషి చేశారు. బాలపత్రికసంపాదక మండలిలో ఉన్నారు. 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో పిల్లల సాంస్కృతిక కమిటీ సభ్యుడిగా ఉన్నారు.


సేవా కిశోరం
శ్రీబుద్ధప్రసాద్ 1979లో దివిసీమ దీన జన సంక్షేమ సమితిని వ్యవస్థాపించి కార్యదర్శిగా కొనసాగారు. 1982 నుండి గ్రామీణ యువజన వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగాజాతీయ సమైక్యతా, మత సామరస్య సాధనకై  సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు,నాటకోత్సవాలు నిర్వహించారు. భారత ఫ్రెండషిప్ ఫోరం వారి భారత్ ఎక్స్లెన్సు అవార్డుఅందుకున్నారు.
గాంధేయ సమాజ సేవాసంస్థ (గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్) కార్యదర్శిగా పనిచేశారు. సునామీ బాధితులకు సహాయ పునరావాసాలు కల్పించారు.  జర్మనీ నిథులు తెప్పించి తుఫాను షెల్టర్లను నిర్మింపచేశారు.
తెలుగుభాష అన్ని విధాలా నిరాదరణకు గురై స్తబ్దుగా ఉన్న కాలంలో, తెలుగు భాషోద్యమ నిర్మాణానికి నడుం బిగించి, ప్రజల గు0డె తలుపులు తట్టారు. ఇంటిభాషగా, బడిభాషగా, ఏలుబడి భాషగా తెలుగు అమలు కోసం అనేక పోరాటాలు చేశారు. వేలాది భాషాభిమానుల్ని ముందుకు నడిపించారు, ఇప్పుడు ప్రజలు తెలుగులో మాట్లాడటాన్ని ఒక గౌరవనీయమైన అంశంగా భావించుకుంటున్నారంటే, అది బుద్ధప్రసాదు గారి విజయమే!
·         తెలుగువారి తొలి రాజధాని కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో 2002 నవంబరు 1, 2 తేదీలలో తెలుగు భాషోద్యమ సమాలోచన శిబిరాన్ని నివహించి తెలుగు భాషోద్యమానికి శ్రీకారం చుట్టారు.  
·         రాష్ట్రంలోని అన్ని పాఠశాలలలో ఏ మాథ్యమంలో ఏ పాఠ్యప్రణాళికని అనుసరిస్తున్నప్పటికీ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తెలుగుతప్పనిసరిగా నేర్పించాలని కోరుతూ 21-3-2003న శాసనసభ్యుడిగా శ్రీ బుద్ధప్రసాద్ అసె0బ్లీలో ఒక అనధికార తీర్మానాన్ని ప్రవెశపెట్టారు. నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించటంతో  జీవో నెం. 86 విడుదల అయ్యింది. అక్షరాభ్యాసం ను0చి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోథనాంశంగా ఉండాలనేది ఈ 86వ జీవో సారాంశం. భాషోద్యమ నిర్మాతగా ఇది శ్రీ బుద్ధప్రసాద్ అధిగమించిన ఒక మైలురాయి.
·         2008, శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్య రచనకు శ్రీకారం చుట్టిన మంటపాన్ని పునర్నిర్మింపచేసి, అందులో కృష్ణదేవరాయలు నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేశారు.
·         హైదరాబాదులో తెలుగుతల్లి విగ్రహంమీద తెలుగుతల్లి అని తెలుగులో రాయకపోవటం, సెక్రెటేరియట్ లో రాష్ట్ర సచివాలయం అని తెలుగు అక్షరాల్లో ఎక్కడా లేకపోవటం, ఏ ఊళ్ళోనూ ఏ దుకాణం మీదా తెలుగు బోర్డులు అరుదై పోవటం ఇలా తెలుగు అనేది నిర్లక్ష్యానికి గురౌతున్నదని ఆయన చేసిన ఆందోళన ఫలిత0గా ఎల్లెడలా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి.
·         2006 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భ0గా శ్రీ బుద్ధప్రసాద్ ప్రేరణతో తెలుగు భాషోద్యమ సమాఖ్య హైదరాబాదు ఇందిరా పార్క్ దగ్గరున్న సత్యాగ్రహచౌక్ లో సాహితీ వేత్త లతో సామూహిక సత్యాగ్రహం నిర్వహించి, తెలుగుభాషకు క్లాసికల్ హోదా, పాలనాభాషగా తెలుగు అమలు లాంటి విషయాల గురించి ఉద్యమించినప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రబాబుతో సహా అన్ని రాజకీయ పార్టీలవారూ వచ్చి తమ సంఘీభావం ప్రకటి0చారు. ఫలితంగా తెలుగుభాషకు క్లాసికల్ హోదా ఇవ్వాలని  కే0ద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో  ప్రభుత్వమే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పరచిన టాస్క్ఫోర్సులో సభ్యునిగా క్లాసికల్ హోదా సాధనలో శ్రీ బుద్ధప్రసాద్ ప్రముఖ పాత్ర పోషించారు.
·         కృష్ణాజిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడిగా ఆ సంస్థ పక్షాన 2006లో జాతీయ తెలుగు రచయితల మహాసభలు,  2007లో మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, 2011లో రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, తెలుగు భాషను కంప్యూటీకరించే అంశంపైన, తెలుగు యూనీకోడ్ లిపిని అభివృద్ధి గురించి ఒక జాతీయ సదస్సు, తెలుగు భాష ప్రాచీనత నిరూపించే జాతీయ సదస్సు, సింధు నాగరికతకు సమాంతరంగా తెలుగు నేలపైన వర్ధిల్లిన నాగరికతను తెలుగు నాగరికతగా వ్యవహరించాలని కోరుతూ పురావస్తు పరిశోధకులతో ఒక జాతీయ సదస్సులను నిర్వహింపచేశారు. న్యాయ స్థానాలలో తెలుగు అమలు పైన న్యాయమూర్తుల్తో జాతీయ సదస్సు ఏర్పరచి, తెలుగులోనే తీర్పులు వెలువరించాలనే ఒక ప్రేరణను న్యాయమూర్తులకు కలిగించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం వెలువరించిన తెలుగుపసిడి, వజ్రభారతి, తెలుగు మణిదీపాలు, తెలుగు భాష విశిష్ట ప్రాచీనత, తెలుగు మణిదీపాలు, తెలుగు పున్నమి, కృష్ణాజిల్లా సర్వస్వం మొదలైన ఉద్గ్రంథాలకు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు.
విదేశీ పర్యటనలు
1990లో మారిషష్, 2002లో చైనా, మలేసియా, సింగపూర్, దక్షిణకొరియా, థాయిలాండ్, 2008లో అమెరికా, 2009 మరియు 2010లో యునైటెడ్ కింగ్డమ్, 2012లో లండన్ నగరాల్లో పర్యటించారు.
లండన్ నగరంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలకు అధ్యక్షత వహించారు. తమిళనాడులోని మారు మూల ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడి తెలుగువారి స్థితిగతులను పరిశీలించి, మనోధైర్యాన్ని కలిగించారు. తంజావూరు సరస్వతీ గ్రంథాలయం, తమిళ విశ్వవిద్యాలయంలో తెలుగు కోసం నిథుల కేటాయించటానికి నాటి ముఖ్యమంత్రిని అంగీకరింపచేశారు. 
విలువలతో కూడిన రాజకీయాలు-విజయాలు
శ్రీ బుద్ధప్రసాద్ గాంధేయవాది. జాతీయ సమైక్య వాది. కుటుంబ వారసత్వంగా ఆయనకు సంక్రమి0చిన అంశాలివి. 1977 నుండి  1990 వరకూ కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీకి  వివిధ హోదాలలో సేవలందించారు. 11యేళ్ళ పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. 1992 నుండి2014 కాంగ్రెస్ పార్టీకి రాజీనామా వరకూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
1999 మరియూ 2004 సార్వత్రిక ఎన్నికలలో అవనిగడ్డ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2004 లో అసెంబ్లీ  పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, 2005 లో అసెంబ్లీ డీలిమిటేషన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.
2007 నుండి 2009 వరకూ ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖామాత్యులుగా సేవలందించారు. అక్టోబర్ 2012 నుండి  మార్చి 2014 వరకూ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో పనిచేసి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు.
మే 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి, శాసనసభ్యునిగా గెలుపొందారు.
          కృష్ణాడెల్టా ఎండిపోతున్న సమయంలో డెల్టా రైతా0గాన్ని సమకూర్చుకొని లక్షలాది జనవాహినితో ప్రకాశం బ్యారేజీ పైన వారంరోజుల పాటు చేసిన దీక్ష, కృష్ణానదిపైన పులిగడ్డ పెనుమూడి వంతెన (మండలి వెంకట కృష్ణారావు వారధి) మరియు పులిగడ్డ -  విజయవాడ నది గట్టు రహదారి నిర్మాణ పనుల మంజూరు, కృష్ణా డేల్టా ఆధునీకరణ పనులను ఎంతో పోరాడి సాధించారు. పెనుమూడి వారథి నిర్మాణం కోసం తన శాసన సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి, వంతెనని సాధించటం, నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వారధి శంకుస్థాపన చేయటం దివిసీమ వాసుల చిరకాల వాంఛను నెరవేర్చినట్టయ్యింది. రాష్ట్ర పశు సంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల మంత్రిగా శ్రీ బుద్ధప్రసాద్ పశుక్రాంతి పథకం ప్రవేశపెట్టి వివాదాల కతీతంగా అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని ఫిషరీస్ పోలిటెక్నిక్ని కొత్తగా ఆలోచన చేసి దివిసీమలో నెలకొనేలా చేశారు. మూగజీవాల మంత్రిగా ఆయనని చూసినప్పుడు, మూగ జీవిని సేదతీర్చిన వాడికే గాయపడిన హంస మీద హక్కుంటుందని, వేటాడిన కిరాతకుడికి ఉండదనీ వాదించిన గౌతమ బుద్ధుడిలా ఆయన వ్యవహరించారు.
          రాజకీయ నాయకులలో అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ప్రజలే కాదు, అధికారులు ప్రభుత్వం కూడా ఆయనను సంస్కృతీ సంప్రదాయలకు ప్రతినిధిగానే సంభావిస్తారు. రాజకీయ నాయకులకు ప్రవేశంలేని చోటుకి కూడా సగర్వంగా తలఎత్తుకొని వెళ్ళగలిగే ఉన్నత వ్యక్తిత్వం ఆయనది. నేటి నేతలకు ఆయనొక ఆచరణీయ ఆదర్శం.
రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ, శ్రీ మండలి బుద్ధప్రసాద్ వ్యక్తిత్వ పరిశీలనకు ఇవి కొన్ని
పరిచయవాక్యాలు మాత్రమే! ఇందులో చోటు చేసుకోని అసంఖ్యాకమైన కార్యక్రమాలెన్నో ఉన్నాయి.
          హోసూరులోనూ, బ్రహ్మపురంలోనూ, చెన్నైలోనూ, ముంబాయిలోనూ, బెంగుళూరులోనూ... ఇంకా ఎన్నో చోట్ల తెలుగు సభలు. తెలుగు ఉత్సవాలు, తెలుగు జానపద కళల ప్రదర్శనలు  నిర్వహణలొ ఆయన ప్రత్యక్ష ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది.
          కృష్ణాజిల్లా చారిత్రక వైభవం సదస్సు ప్రారంభోత్సవానికి కొద్ది నిమిషాలముందు సుడిగాలులతొ కూడిన భయంకరమైన వాన రావటంతొ ఎక్కడివారక్కడ చెల్లా చెదురైపొయారు. అప్పటికప్పుడు వేదికని మరొక సురక్షిత స్థావరానికి మార్చి మంత్రిగా ఉన్న శ్రీ బుద్ధప్రసాదు స్వయంగా బల్ల ఎక్కి తన చేతులతో బ్యానరు కట్టిన దృశ్యం కళ్ళను చెమరుస్తుంది.
          స్వదేశీ విశ్వవిద్యాలయాలు, అనేక ఇతర మహత్తర సంస్థలు చెయ్యలేని, చెయ్యని పనులెన్నింటినో ఒంటి చేత్తో చేసి చూపించారు శ్రీ బుద్ధప్రసాద్. భాషాభివృద్ధిలో మనకన్నా ఎంతో ముందున్న తమిళులను అధిగమించి తెలుగు భాషను ఆధునీకరించటంలో దేశంలోనే అందరికన్నా ముందుండేలా ఆయన చేసిన కృషి జాతి మరువ లేనిది, మరువరానిది కూడా!
నిరాడంబర జీవితాన్ని గడపటం, నిష్కలంక రాజకీయ జీవితాన్ని కొనసాగించడమే ప్రధాన ధ్యేయంగా కలిగి వుండటం, అప్పగించిన బాధ్యతలను పట్టుదలతో అంకితభావంతో పూర్తిచేయటం, మృదు స్వభావంతో, చిరు దరహాసంతో అందరినీ ఆకట్టుకోగలగటం, అరుదైన వ్యక్తిత్వ వికాస లక్షణాలతో పార్టీ విధానాలను ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్ళే శక్తి సామర్థ్యాలను కలిగి వుండటం బుద్ధప్రసాదుగారిలో కనిపించే ప్రత్యేకతలు.
విలువలు నిండిన రాజకీయ జీవితమూ, నిబద్ధత కల్గిన సామాజిక సాంస్కృతిక జీవితమూ బుద్ధప్రసాదు గారిని ఒక కారణ జన్ముణ్ణి చేశాయి.   
శ్రీ బుద్ధప్రసాద్ గారి ప్రస్తుత చిరునామా:          ఫ్లాట్ నంబరు 5ఎ, ధనలక్ష్మి టవర్స్, ధరంకరణ్ రోడ్, అమీర్ పేట్, హైదరాబాద్ 500 016, ఫోన్: 04023733754, సెల్ : 98487 80872. శాశ్వత చిరునామా: గాంధీ క్షేత్రం, అవనిగడ్డ, కృష్ణాజిల్లా 521 121, ఫోన్: 08671-272056 (కార్యాలయం), 08671-272232 (ఇల్లు)


No comments:

Post a Comment