Monday 22 December 2014

దీర్ఘవ్యాధులపైన రామబాణం - అగ్నితుండీవటి :: డా. జి వి పూర్ణచందు. సెల్: 9440172642

దీర్ఘవ్యాధులపైన రామబాణం అగ్నితుండీవటి
డా. జి వి పూర్ణచందు. సెల్: 9440172642
ఒక చెట్టు మీద పది పిట్టలున్నాయి.వేటగాడు బాణం వదిలాడు. ఒక పక్షి చనిపోయింది. ఇంకా ఎన్ని పక్షు లుంటాయి అనేది ప్రశ్న, ఒక్కటి కూడా ఉండదు, అన్నీ లేచిపోతాయి... అనేది సమాధానం. అది బాణం మహాత్మ్యం. ఔషధం కూడా అలా బాణంలా వెళ్ళి, రోగం మూలకారణానికి తగలాలి. దెబ్బతో చుట్టుకున్న కొసరు బాధలు కూడా పటాపంచలు కావాలి, అలాంటి ఒక గొప్ప ఔషధం అగ్నితుండీవటి. వ్యాధికి చికిత్స చేస్తున్నా అగ్నితుండీవటి సహకారం తీసుకుంటే పొడవైన ప్రిస్క్రిప్షన్లు రాసే శ్రమ డాక్టర్లకు తప్పుతుంది. 
అగ్ని తుండీ వటిలో రసాయనాలు, మూలికలూ కలగలసి ఉంటాయి కాబట్టి దీన్ని మిశ్రయోగంగా చెప్తారు. ఇందులో క్షారాలు ఉన్నాయి కాబట్టి, ఇతర మందులవలన కలిగే ఎసిడిటీ బాధలు తగ్గుతాయి. ఉబ్బరం పోతుంది. జీర్ణశక్తి పెరిగి ఆహారమూ, ఇతర ఔషధాలు కూడా చక్కగా వంటబడతాయి. కాబట్టి అల్లోపతి మందులు వాడ్తున్న వారైనా సరే దీన్ని సహ ఔషధంగా (co-priscription) వాడుకోవచ్చు. అమీబియాసిస్, టైఫాయిడ్, కలరా, అతీసారం మొదలైన జబ్బుల్లో  అగ్నితిండివటిని వాడిస్తే పేగుల్లో సూక్ష్మజీవులు  త్వరగా నశిస్తాయి.
ఇది గుండె మీద వత్తిడిని తగ్గిస్తుంది. వాతాన్ని పోగొడుతుంది. అందుకని, కీళ్ళవాతంలో వచ్చే గుండె జబ్బుల్లో (రుమాటిక్ హార్ట్ డిసీజ్)లో మంచి ఫలితాలిస్తుంది. దీనిలోని శుద్ధి చేసిన విషముష్టి గుండె కొట్టుకునే తీరును సమస్థితికి తెస్తుంది. వాత దోషాన్ని పోగొడుతుంది. అన్ని రకాల కీళ్ళనొప్పుల్లోనూ, గౌట్ వ్యాధుల్లో కూడా ఇవ్వదగినదిగా ఉంటుంది. కాళ్లలోనూ, చేతుల్లోనూ  చిన్న చిన్న కీళ్ళలో విపరీతమైన నొప్పి, జ్వరం, గుండేల్లో బలం చాలనట్టు అనిపించటం, ఒకచోట నొప్పి వేరొక చోటుకు నడుస్తున్నట్లనిపించే వారికి
వాయువిడంగాలు ఈ ఔషధంలో కలిసి ఉన్నాయి కాబట్టి, మాత్రలు స్థూలకాయాన్ని నిరోధించటానికి కూడా ఉపయోగపడతాయి. సర్వరోగ కులాంతక యోగం, కాలాగ్నిరుద్రరసం లాంటి పేర్లతో మరి రెండు ఔషధాలు ఉన్నాయి. అయితే  మూడింటిలో కలిసే ద్రవ్యాలు ఇంచిమించు ఒకటే కావటాన వీటిలో ఏది వాడినా ఒకటే ఫలితం కలుగుతుంది.
అగ్నితుండీవటిని వయసును బట్టి 1-2 మాత్రల వరకూ వేసుకోవచ్చు. ఈ మాత్ర వేసుకుని అల్లం రసం(అవసరం అయితే తీపి కలుకుని) తాగితే అజీర్తి, తగ్గుతుంది. మలబద్ధత పోయి, విరేచనం ఫ్రీగా అవుతుంది.
మిరియాలు, బెల్లం కలిపి కాచిన పాలు తాగితే కఫం, దగ్గు, జలుబు, తుమ్ములు తగ్గుతాయి. ఉబ్బసం నెమ్మదిస్తుంది. రోజూ ప్రొద్దునపూట ఒకటీ లేక రెండు మాత్రలు ఇలా మిరియాల పాలతో తాగుతూ ఉంటే ఎలెర్జీ వ్యాధి తీవ్రత బాగా తగ్గుతుంది. వైరల్ జ్వరాల్లో ఇది బాగా పనిచేస్తుంది. తొందరపడి యాంటీ బయటిక్స్ వాడకుండా అగ్నితుండీవటిని వాడి సాధారణ జ్వరాల్లోంచి బయట పడటానికి ప్రయత్నించండి. యాంటీ బయటిక్స్, స్టిరాయిడ్స్ ఇవన్నీ ప్రాణాపాయ స్థితికి వాడుకోవటానికి అట్టే పెట్టుకోవాలి. అయినదానికీ, కానిదానికీ వీటిని వాడేస్తుంటే ఎమెర్జెన్సీలో అవి పని చేయకుండా పోతాయని మరిచిపోకండి.
ఉదయాన్నే అగ్నితుండీవటి మాత్ర వేసుకుని ఆవు పాలు తాగుతూ ఉంటే నరాల బలహీనత తగ్గుతుంది. ఆ పాలలో అశ్వగంథ చూర్ణం కలుపుకుని బాగా కాచి తాగితే నరాల వ్యాధులన్నింటిలోనూ మంఛి ప్రభావాన్ని చూపిస్తుంది.    
అగ్నితుండీవటి ఒక మాత్ర వేసుకుని ద్రాక్షారిష్ట తాగితే  గుండె జబ్బుల్లో మంచి ఫలితం కన్పిస్తుంది. రోజూ తాగవచ్చు. ద్రాక్షారిష్టని 2-3 చెంచాల మోతాదులో తీసుకుని కొద్దిగా నీళ్ళు కలిపి తాగండి. వాడకం అలవాటయితే ఆహారానికి కొద్దిగా ముందు ఖాళీ కడుపున వేసుకోవచ్చు.
అగ్నితుండీవటి 1-2 మాత్రలు వేసుకుని లేత ములగాకు జ్యూసు రోజూ తాగుతూ ఉంటే, కీళ్ళ వాతంలో వాపులు త్వరగా తగ్గుతాయి. శొంఠి పొడిని తగినంత ఉప్పు చేర్చి మజ్జిగలో కలుపుకుని తాగితే కీళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి.
అగ్నితుండీవటి 1-2 మాత్రలు తీసుకుని, శొంఠీ, మిరియాలను సమానంగా తీసుకుని మెత్తగా దంచిన పొడిని తేనెతో గానీ, పాలలో కలిపిగానీ, మజ్జిగలో కలిపిగాని తాగితే మాటిమాటికీ తిరగబెట్టే జ్వరాలు ఆగుతాయి.
అగ్నితుండీవటి 1-2 మాత్రలు ఉదయాన్నే వేసుకుని పొడపత్రి ఆకు పొడి అర చెంచా నుండి చెంచా మోతాదులో ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగేయండి. షుగరువ్యాధిలో న్యూరోపతి లాంటి ఉపద్రవాలు త్వరగా తగ్గుతాయి. దీర్ఘకాలం వాడుకుంటూ ఉండవలసిన ఔషధం ఇది.  

అగ్నితుండీవటి రామబాణంలాగే వ్యాధులన్నింటినీ పారద్రోలే శక్తివంతమైన ఔషధం. దీన్ని వాడకూడని లేదా వాడనవసరం లేని జబ్బంటూ లేదు. ఈ మాత్రతో పాటు తీసుకునే అనుపాన ద్రవ్యాన్నిబట్టి ఇది వివిథ వ్యాధులమీద ఔషధంగా పనిచేస్తూనే,  ఆ అనుపానం శరీరంలో ఏ భాగంలో పని చేయాలో ఆ భాగం మీదకు దాన్ని తీసుకెళ్ళి అక్కడి వ్యాధిని త్వరగా తగ్గేలా చేస్తుంది. ఇలా ఒక కెటలిష్టుగా పనిచేస్తుండి కూడా. ఔషధం పనిచేయవలసిన స్థానానికి వేగంగా చేర్చటాన్ని ఆయుర్వేద పరిభాషలో యోగవాహి అంటారు. అగ్నితుండివటి పెద్ద పిల్లలనుండీ వయో వృద్ధులవరకూ అందరూ వాడదగిన ఔషధం. 

No comments:

Post a Comment