Thursday, 9 January 2020

దొరతనం


దొరతనం
డా. జి వి పూర్ణచందు
అందలం బెక్కుట నవనిఁ బ్రశస్తమా!
మ్రానెక్కి నిక్కదే మర్కటంబు
తొడవులుఁ దొడుగుట దొడ్డ సౌభాగ్యమా!
కడు సొమ్ములూనదే గంగిరెద్దు
విత్తంబుఁ గూర్చుట విమల ప్రచారమా!
బహునిధుల్ గావఁడే భైరవుండు
ప్రజల దండించుట పరమ సంతోషమా!
ప్రాణుల నెల్ల నేపఁడె జముండు
దొరతనంబున కివిగావు వరుస లరయ
సాహసౌదార్య ఘన పౌరుషములుఁ గాని
భూనుత విలాస! పీఠికాపుర నివాస!
కుముద హితకోటి సంకాశ! కుక్కుటేశ!
(కుక్కుటేశ్వర శతకం:కూచిమంచి తిమ్మకవి)
భూనుత విలాస! పీఠికాపుర నివాస!కుముద హితకోటి సంకాశ! కుక్కుటేశ! అనే మకుటంతో కూచిమంచి తిమ్మకవి ఈ శతకాన్ని వ్రాశాడు. 1715-1760 మధ్య కాలాలలో వీరి రచనలు అనేకం వెలువడ్డాయి. అచ్చ తెలుగులో రామాయణం వ్రాశాడు. కుక్కుటేశ్వర శతక రచన వీరి జీవితంలో చివరి ఘట్టాలలో చేసినది కావచ్చని పండితుల భావన.
గోల్కొండ సుల్తానుల కాలంలో తెలుగు నేలమీద పాలనా యంత్రాంగానికి పట్టు లేకపోవటం, గోల్కొండ నుండి సనదులు తెచ్చుకుని కొందరు వ్యక్తులు జమీందారులై తామే ప్రభువుల్లా వ్యవహరించటం, ప్రజలకు సుఖజీవనం కరువైన రోజులవి. కళాసాహిత్య రంగాలకు చెందిన వ్యక్తులు అంతో ఇంతో తెలుగు దనం మిగిలి ఉన్న తంజావూరు, మధుర రాజ్యాలకు తరలిపోయారు. తెలుగు నేలమీద ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో సాహితీ సారస్వత పోషణ అడుగంటి పోయిన కాలం అది.
పాలనా వ్యవస్థకు సాంస్కృతిక విధానం లేకపోతే ఏ యుగంలోనయినా ఇదే జరుగుతుంది. రాయని భాస్కరులుగా కవులు మిగిలిపోతారు. అందువలన జాతికి అపకారం జరుగుతుంది.
తిమ్మకవి పిఠాపురం జమీందారుల దగ్గర రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసినా తన రచనలను జమీందారులకు కాకుండా పిఠాపుర కుక్కుటేశ్వరస్వామి మీద భక్తితో ఆ దేవదేవుడికే అంకితాలిచ్చుకున్నాడు. సన్యశించి,   ఆలయంలోనే శేష జీవితం గడుపుతున్న సమయంలో ఈ శతక రచన జరిగింది. కానీ, శతకంలోని భావజాలాన్ని, పదజాలాన్నీ గమనిస్తే, ఒక స్వామీజీ వ్రాసినట్టుగా కాకుండా, ఒక పోరాట యోధుడు వ్రాసినట్టు కనిపిస్తుంది. సాధుజీవులక్కూడా కడుపు రగిలేలా పాలనా వ్యవస్థ నడుస్తోన్న కాలం అదని, స్థానిక పరిస్థితులు ఆ విధంగా తగులడ్డాయనీ అర్థం అవుతుంది.
సారస్వత పోషణ చేసిన పాలకులు కృష్ణదేవరాయులై చిరకాలం వర్థిల్లారు. చేయని వాళ్ల గురించి చరిత్ర ఇలానే తగలెట్టినవారని చెప్తుంది. చరిత్రలో ఎలా నిలిచిపోవాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. కొత్తగా ఏమీ చేయకపోయినా ఫర్వాలేదు, ఉన్నదాన్ని తగలెట్టవద్దనే ఎవరైనా కోరుకునేది.
అందలం అందరికీ అందేది కాదు. దానికోసం అర్రులు చాచేవారు కూడా కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఎవరో ఒకరికే అవకాశం దక్కుతుంది. ఏనుగొచ్చి మెడలో దండవేసి రాజుని చేస్తుందనేది ఒక పగటి కల. ఇతరులకు సాధ్యం కాని అధికారాన్ని ఒక్కడే దక్కించుకోగలగటానికి కఠోరమైన పరిశ్రమ కావాలి. అందలం ఎక్కి దానిని నిలబెట్టుకోవటానికి అంతకు మించిన విఙ్ఞత కూడా అవసరం అవుతుంది. పదవి ద్వారా ప్రజల్ని దండించే అధికారం దక్కి, దాన్ని చెలాయించాలని చూడటాన్ని మదం అంటారు. మైకం వలన కలిగేది మదం. ప్రభువైన వాడికి ఇవి ముఖ్యాలు కావని, సాహసం, ఔదార్యం, ఘనమైన పౌరుషం కావాలని తిమ్మకవి భవిష్య పాలకులకూ వర్తించే విధంగా సూచించాడీ శతకంలో!
అందలం ఎక్కటమే గొప్ప. అన్ని గొప్పలకన్నా అదే గొప్ప అనుకోకూడదు. ఎత్తయిన చెట్టెక్కి కూర్చున్న కోతి కూడా తాను అందలం మీదే ఉన్నానని అనుకుంటుంది. ఒళ్లంతా నగలు దిగదుడుచుకోవటం సౌభాగ్యం అనుకోవద్దు. గంగిరెద్దుక్కూడా అలంకారం చేస్తారు. డబ్బు దాచుకోవటమే గొప్ప అనుకోవటం కూడా అలాంటిదే! కుక్కకూడా డబ్బుకి కాపలా కాస్తుంది. అందువలన దానికి ఒరిగేదేం ఉంది? అధికార మదంతో అర్థంలేని నిర్ణయాలు చేసి, ప్రజల్ని ఏడిపించటం పరమ సంతోషం అనుకోవద్దు. ప్రాణుల్ని యముడు కూడా వేపుకు తింటూ ఉంటాడు. దొరతనానికి ఇవి కావు పేరు తెచ్చిపెట్టే విషయాలు. చరిత్రలో నిలిచిపోవాలంటే సాహసం, ఔదార్యం, ఘన పౌరుషం కావాలి... అన్నాడు కూచిమంచి తిమ్మకవి.
ఒక్క రోజు పాలించి దిగిపోయినా మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీప్రధాని అనే అంటారు. ఆ ఒక్కరోజు చాలు చరిత్ర సృష్టించటానికి! కృష్ణదేవరాయలు పాలించింది స్వల్పకాలమే అయినా త్రిసముద్రాధీశుడిగా నిలిచి, భాషా సారస్వత మూర్తిగా వెలిగాడు. చరిత్ర సృష్టించేవాడికి కావలసిన లక్షణం అది!
 (జనవరి 1 ఆదివారం విశాలాంధ్ర అనుబంధంలో నా పద్యానుభవం శీర్షికలో ప్రచురితం)

No comments:

Post a Comment