సౌందర్యశాస్త్ర గ్రంథం ‘హరమేఖలా’
తిరుమల రామచంద్రగారి అనువాద ప్రతిభ
డా||జి. వి. పూర్ణచందు,B.A.M.S.,
అందంగా
ఆకర్షణీయంగా ఉండాలనే తపన. మనిషికే ఉంటుంది. జంతువులకు ఉండదు. మనిషికీ జంతువుకూ
మౌలికమైన తేడాలలో ఇది ముఖ్యమైంది. ఏ కుక్కా, ఏ కోతీ, ఏ గేదే, ఏ ఆవూ, తాను అందంగా
అలంకరించుకుని తిరగాలనుకోవు.
సౌందర్య పిపాస
మనిషి ప్రాథమిక లక్షణం. ఈరోజున సౌందర్య శాస్త్రం (cosmetology)
అనేది పెద్ద శాస్త్రంగా రూపొందింది. సౌందర్య సాధనాలను
తెలుసుకొని వాటిని నైపుణ్యతతో వాడుకోవటం నేర్పేది సౌందర్య శాస్త్రం. modification of
beauty అనేది దీని లక్ష్యం. కానీ, ఈ శాస్త్రానికి మూలాలు
భారతదేశంలోనే ఉన్నాయి. మూలాలు మాత్రమే కాదు, ఆధునిక కాస్మటాలజీలో లేని అనేక
విశేషాంశాలు కూడా మన శాస్త్రాలలో ఉన్నాయి.
వేదాలతో
మొదలుపెట్టి, మన ప్రతీ సాహిత్య గ్రంథాలన్నీ ‘సౌందర్యపరివర్తనం’ గురించి అంతో ఇంతో
ప్రస్తావించాయి. ఆయుర్వేద శాస్త్రం ఈ విద్యకొక ప్రతిష్టను కల్పించింది. అంజనాలు,
గంథాలు, లేపనాలు, కల్కాలు, కషాయాలెన్నో ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తాయి.
కస్తూరి తిలకం,
కౌస్తుభ హారాలు, ముత్యాల ముక్కుపుడకలతో, కంగనాలతో, హరిచందన చర్చితాలతో దేవతల్ని
అలంకరించి, ఆరాధిస్తూ, తమ సౌందర్యపిపాసను భారతీయులు చాటుకున్నారు. నీలాంజన సమాభాసం
అని శని దేవతని, గుడాకేశి అని శివుణ్ణి ఇలా సౌందర్యపరమైన ఉపమానాలతో
కొలుచుకున్నారు.
ఆధునిక
సౌందర్యశాస్త్రం అందంగా కనిపింపచేయటానికి
మాత్రమే ప్రాధాన్యత నిస్తాయి. hairstyling, skin care, cosmetics,
manicures/pedicures, రోమాలను తొలగించేందుకు waxing, threading vagairaa విధానాలే
ప్రధానంగా కనిపిస్తాయి. కానీ పెదాలు ఎర్రగా కనిపిస్తే చాలదు,
నోటి దుర్వాసన లేకుండా ఉండాలి. శరీరం పసిడి రంగులో
మిసమిసలాడితే సరిపోదు, చెమట దుర్గంధం లేకుండా ఉండాలి.
శారీరక, మానసిక స్వాస్థ్యాలను కూడా దృష్టిలో పెట్టుకుని
మన సౌందర్య శాస్త్రాలు రూపొందాయి.
వేద యుగంలో
చ్యవనుడు తన యవ్వనాన్ని తిరిగిపొంది సుకన్యనను పెళ్ళాడిన కథ ఉంది. యవ్వనాన్ని
తిరిగి ఇచ్చిన ఆ ఔషధాన్ని చ్యవనుడి పేరుతో చ్యవనప్రాశ అంటారు. దీనిని రసాయన
చికిత్స అంటారు. ఇది సౌందర్య శాస్త్రంలో భాగమే! వేదయుగాలలో మధువిద్య అనేది ఒకటి ఉండేది. రసాయన
చికిత్సలు ఈ విద్యలోంచే అభివృద్ధి చెందాయని చెప్తారు.
ప్లాష్టిక్
సర్జరీ చేసిన తొలి వైద్యుడు సుశ్రుతుడు. రైనోప్లాష్టీ అంటే తెగిన ముక్కును సరిచేసే
చికిత్స చేశాడాయన. ఆలేపం, పరిషేకం, ఉత్సాదనం, పాండుకర్మ, రోమ సంజననం లాంటి
చికిత్సావిధానాలను ఆయుర్వేద శాస్త్రం అందించింది. సంహితా యుగాల తరువాత కౌటిలీయ
అర్థశాస్త్రం, వాత్స్యాయన కామశాస్త్రం, అనంగ రంగ, కొక్కోకం లాంటి గ్రంథాల్లో
సౌందర్య శాస్త్రాపరమైన అంశాలు ఎన్నో కనిపిస్తాయి.
మహాభారతంలో ద్రౌపది
‘సైరంధ్రి’ పేరుతో అఙ్ఞాతవాసంలో లేడీ బ్యూటీషియన్ పాత్ర పోషించింది.
మైలసంతలో
బహిరంగంగా స్త్రీలు ‘సుసరభిత్తి’ అనే ఒక ఔషధాన్ని అమ్మినట్టు వల్లభరాయుడి
క్రీడాభిరామంలో ఉంది. సుసర అనే పువ్వు ‘ఆస్ట్రేలియన్ పుష్పం’గా ప్రసిద్ధి, రెడ్డి
రాజుల కాలంలో అవచితిప్పయ్యశెట్టిగారు తెచ్చిన విదేశీ ద్రవ్యాలలో అది కూడా ఉన్నదేమో
తెలీదు. అమితమైన చల్లదనాన్నిస్తుంది. దాని నిర్యాసాన్ని స్త్రీల మర్మావయవం పైన
లేపనం చేస్తే యోనిదోషాలు పోతాయని దాన్ని వాడేవారు. ఇలా తెలుగువారి సౌందర్య, శృంగార
ప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలను సాహిత్యాధారాలు అనేకం మనకు అందిస్తున్నాయి.
సౌందర్యశాస్త్ర పరమైన
అంశాలన్నింటినీ ఒక చోట గుదిగుచ్చి పాఠ్యగంథంగా వెలువరించిన గ్రంథం హరమేఖల. శివుడి
మాల అని దీని భావం. క్రీశ. 9వ శతాబ్దిలో
ప్రాకృత భాషలో ఈ గ్రంథరచన జరిగింది. ధరణీవరాహ రాజ్యం తనదని, మాధవుడు తన
తండ్రి అనీ ఈ గ్రంథంలో మాహుకుడు చెప్పుకున్నాడు. హరమేఖల అనే పేరుని బట్టి రచయిత
మాహుకుడు శివయోగి అని అర్థం అవుతోంది. ఇందులో ప్రాకృత శ్లోకాలను ‘ఛాయ’ లంటారు.
వీటికి సంస్కృతంలో టీకలు దొరుకుతున్నాయి.
మొదట దీని
ప్రతిని కొట్టాయంలోని నారాయణభట్టతిరి సంపాదించారు. 1938లో ట్రావెంకోర్ మహరాజా
సహకారంతో కె. సాంబశివ శాస్త్రిగారు పరిష్కరించగా ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్
లైబ్రరీ వారు 4వ అధ్యాయం వరకూ మొదటి భాగంగానూ, 5వ అధ్యాయాన్ని రెండవ భాగంగానూ
ప్రచురించారు.
వేటూరి శంకర
శాస్త్రిగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి సోదరుడౌతారు. ప్రసిద్ధ ఆయుర్వేద
వైద్యుడు, చరిత్రకారుడు కూడా! ముక్త్యాల రాజావారి ఆస్థాన వైద్యుడాయన. వైద్యకళ మాసపత్రిక నడుపుతుండేవారు. ఆయన ఈ
గ్రంథాన్ని సంపాదించి తెలుగులోకి అనువదించే విషయమై శ్రీ తిరుమల రామచంద్రగారితో
సంప్రదించారు. ప్రాకృత శ్లోకాలకు, సంస్కృత టీకకు కొన్ని చోట్ల పొంతన కుదరటం లేదని ప్రాకృతం
సంస్కృతం సమానంగా తెలిసిన రామచంద్ర గారి సహాయం అర్థించారాయన. ఆ ఇద్దరూ కలిసి చేసిన
అనువాదమే తెలుగు ‘హరమేఖల’.
ధర్మార్థ
కామమోక్షాల ఙ్ఞానం కలిగిన వారిని విదగ్ధులు అంటారు. అలాంటి వారికోసమే ఈ
విదగ్ధానురాగ కృతిని ప్రయోగమాలగా వెలువరిస్తున్నట్టు మాహుకుడు పేర్కొన్నాడు.
పుత్తలిక పేరుతో చేతబడుల మంత్రాలు, వశీకరణ, విఘటన, తాంత్రిక యోగాలు కూడా ఈ
గ్రంథంలో ఉన్నాయి. కొన్ని నేటి కాలమానపరిస్థితులకు అసాధ్యమైన యోగాలు, అంశాలు కూడా
ఉండటంతో వాటిని పరిహరించి, సాధ్యమైనంత అందుబాటులో ఉన్న యోగాలను మాత్రమే ఈ గ్రంథంలో
చేర్చటం జరిగింది. మొదటి అధ్యాయం అంతా వేశ్యలకు సంబంధించిన విషయాలు కావటంతో దాన్ని
వదిలేసి, రెండవ అధ్యాయం నుండే తెలుగు హరమేఖలను మొదలు పెట్టారు. గ్రంథాంతంలో కొన్ని
ద్రవ్యాల అకారాది పట్టికని ‘హరమేఖల నిఘంటువు’ పేరుతో అనుబంధంగా ఇచ్చారు.
ఈ గ్రంథంలో
ఇప్పటి తరంవారు గృహవైద్యంగా చేసుకోదగిన కొన్ని యోగాలకు తిరుమల రామచంద్రగారు
శ్రమించి చేసిన అనువాదాలను కొంత పరిచయం
చేస్తాను.
బాగా పండిన
మారేడు గుజ్జును తలకు పట్టించి బెల్లంపాకంతో తలంటితే అట్టలు కట్టిన కేశాలు
మెత్తబడి చిక్కు విడతాయి.
మామిడి టేంకలోని
జీడిని త్రిఫలా చూర్ణాన్ని, తామరకొలను దగ్గరి నల్ల బురదని, మెత్తగా ఉండే
ఇనుపరజనుని కలిపి గుంటకలగరాకు రసంతో నూరి, సమానంగా బియ్యపు గంజిని కలిపి తలకు
పట్టిస్తే నెరిసిన వెంట్రుకలు తుమ్మెద గుంపులా నల్లబడతాయి.
జాజికాయ,
జాపత్రి దాల్చినచెక్క, మరువం ఈ నాల్గింటిని మెత్తగా దంచి, కుంకుడు గింజంత మాత్రలు
కట్టి ఆరబెడితే గట్టి పడతాయి. ఒక్కమాత్రని బుగ్గనపెట్టుకుని చప్పరిస్తుంటే నోటి
దుర్వాసన పోతుంది.
ఏలకులు, అగరు
అనే సుగంథ ద్రవ్యం, గంధం,బిరియానీ ఆకు, కలువ పూరేకులు వీటిని దంచిన పొడిని
పావుచెంఛా మోతాదులో గ్లాసునీళ్లలో కలిపి కొంతసేపు నాననిచ్చి తాగితే శరీరంలోంచి
పరిమళం బయటకు వస్తుంది.
సున్నం ఎక్కువై
తాంబూలం వలన నోరు పొక్కితే నువ్వుల నూనె గానీ, చల్లని గంజిగానీ నోట్లో పోసుకుని పుక్కిలిస్తే పొక్కడం, నోటిపూత
తగ్గుతాయి.
రేగు గింజల్ని
మెత్తగా దంచి బెల్లం, తేనె, వెన్న కలిపి ముఖానికి లేపనం చేస్తే మంగు లేదా శోభి
మచ్చలు పోతాయి.
నేలతాటిగడ్డల
చూర్ణాన్ని గేదె వెన్నతో కలిపి ఒక పాత్రలో ఉంచి, ధాన్యపు రాశిలో వారం రోజులపాటు
మాగనిచ్చి, దాన్ని చెవులకు పట్టిస్తే చెవి తమ్మలు పెరుగుతాయి. స్తనాలకు పట్టిస్తే
స్తన పరిమాణం పెరుగుతుంది.
దానిమ్మకాయల
బెరడుని నీళ్లలో వేసి బాగా నూరి వడగట్టి, ఆ నీటికి సమానంగా తెల్లావాల నూనె కలిపి
నీరంతా ఇగిరిపోయే దాకా మరిగించి తయారు చేసిన తైలాన్ని చెవులు, స్తనాలు,
పురుషాంగాలమీద మర్దిస్తే అవి గట్టిపడి
జారిపోకుండా ఉంటాయి.
జిల్లేడాకుల్ని సైంధవలవణంతో
నూరి పుటం పెట్టి చేసిన భస్మాన్ని నీళ్లలో కలిపి తాగితే అసాధ్యమైన లివర్ జబ్బులు
తగ్గుతాయి.
అరిటాకుల్ని
నూరి పుటపాకం పద్ధతిలో భస్మం చేసి ఒక చెంచాపొడిని నీళ్లలో కలిపి తాగితే లివర్
స్ప్లీన్ వ్యాధులు తగ్గుతాయి.
పసుపుకొమ్ములు
మెత్తగా దంచిన పొడిని తేనెతో తీసుకుని ఉసిరికాయల రసంతో రోజూ తాగితే షుగరు వ్యాధి,
ఇతర మూత్ర వ్యాధులు తగ్గుతాయి.
అరచెంచా
పిప్పళ్ల పొడిని నెయ్యి, తేనె చేర్చి, గ్లాసుపాలలో కలిపి తాగితే కరోనాలంటి
విషజ్వరాలను ఎదుర్కొనేశక్తి శరీరానికి వస్తుంది. “పిప్పలీ చూర్ణం ఘృత మధు
మిశ్రితం,క్వథిత దుగ్ధ సంయుక్తమ్ పీతమ్ విషమజ్వర కాస హృద్రోగాన్ వినాశయతి” అంటూ మాహుకుడు చెప్పిన ఈ
చిన్న ఔషధం నిజమైన ఇమ్యూనిటీ బూష్టర్‘గా ఈ కరోనా సమయంలో పనిచేస్తుంది.
పిప్పళ్ళపొడికి
సమానంగా త్రిఫలా చూర్ణం కలిపిన పొడిని ఒక చెంచా మోతాదులో తీసుకుని తేనె కలిపి తిని
ఆతరువాత భోజనం చేస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది, కఫం దరి చేరదు. కరోనా వ్యాధి
నివారణకు ఇది కూడా మంచి ఉపాయం.
బార్లీ గింజల్ని
నువ్వుల నూనెలో నల్లగా మాడేలా మూడుసార్లు వేయించి దంచిన మసిని వెన్నపూస కలిపి
లేపనం చేస్తే కాలిన పుండ్లు, గాయాలు అసాధ్య వ్రణాలు త్వరగా తగ్గుతాయి.
పసుపు
కొమ్ముల్ని చింతాకుని కలిపి నూరి, ఒక చెంచామోతాదులో కాసిని నీళ్లలో కలిపి తాగితే
ఆటలమ్మ వ్యాధి, పొంగు లాంటి వైరస్ వ్యాధులు తగ్గుతాయి.
ఒక భాగం
నల్లనువ్వులు, రెండుభాగాలు బావంచాలను (psoraline seeds) కలిపి మెత్తగా దంచి తేనెతో
కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని 1-2 మాత్రలు రోజూ ఉద్యాన్నే తీసుకుంటూ ఉంటే
బొల్లి వ్యాధి త్వరగా తగ్గుతుంది.
బావంచాలను చిక్కటి పాలలో వేసి తోడు పెట్టి, ఆ
పెరుగుని బాగా చిలికి తీసిన వెన్నని తేనె కలిపి తింటే బొల్లి తగ్గుతుంది. 1-2 చెంచాల
మోతాదులో తీసుకోవచ్చు.
ఈ గ్రంథంలో 5వ
అధ్యాయంలో ఎక్కువగా సౌందర్య సాధనాల విషయలు కనిపిస్తాయి. కచ్చూరాలు, జటామాంసి,
దాల్చిన చెక్క, ప్రియాంగువు వీటిని మెత్తగా దంచిన పొడిని నీళ్ళలో వేసి కాస్తే ఆ
నీరు పన్నీరులా సుగంధభరితంగా ఉంటుంది. దానితో స్నానం చేస్తే శరీర పరిమళం
పెరుగుతుంది. ఈ పొడికి సమానంగా పెసర పిండి లేదా శనగపిండి కలిపి నలుగు పెట్టుకుని ఈ
స్నానం చేస్తే మంచిది.
ఈ విధంగా
వందలాది యోగాలను మాహుకుడు 1100 సంవత్సరాల క్రితం మానవాళి వినియోగార్థం హరమేఖలా
గ్రంథంలో అందించాడు. చరక సుశ్రుత, వాగ్భాటాలకు 10 వశతాబ్ది తరువాత వ్యాఖ్యానాలు
వ్రాసిన రచయితలు మాహుకుణ్ణి చాల సందర్భాలలో ఉటంకించారు.
ఈ గ్రంథాన్ని
తెలుగు చేయటంలో సంస్కృతానువాదాల లోపాలను మూల ప్రాకృత ఛాయలతో సరి చూసుకుంటూ
వ్రాయటానికి రామచంద్రగారు చాలా శ్రమపడవలసి వచ్చింది. సంస్కృత పండితులైనంత మాత్రాన
ఆయుర్వేద సంస్కృత శ్లోకాలు అంత తేలికగా పట్టుబడవు. అందుకు ఆయుర్వేదానుభవం కావాలి.
వేటూరి శంకరశాస్త్రిగారు ఆ లోపం లేకుండా సహకరించటంతో ప్రామాణికమైన అనువాద గ్రంథంగా
హరమేఖల రూపొందింది.
No comments:
Post a Comment