Sunday, 20 November 2016

నోట్ల రద్దు:: డా. జి వి పూర్ణచందు

నోట్ల రద్దు:: డా. జి వి పూర్ణచందు
అదను దలంచి కూర్చి ప్రజనాదర మొప్ప విభుండు కోరినన్
గదిసి పదార్ధ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌఁ బొదుగు మూలము గోసిన బాలు వచ్చునే
పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా !
సూర్యుణ్ణి దేవుడిగా భావించి మయూరుడు సూర్య శతకం వ్రాస్తే, సూర్య వరప్రసాదియైన మారవి వెంకయ్య కవి ‘భాస్కరా’ అనే మకుటంతో భాస్కరశతకాన్ని వ్రాశాడు. 1550-1650 కాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, ప్రాంతాల్లో నివశించిన ఈ కళింగ కవి అరసవిల్లి సూర్యభగవానుణ్ణి స్తుతిస్తూ భాస్కర శతకం వ్రాశాడు. 
“భాస్కరా ! రాజు ప్రజారంజకుడైతే, ప్రజలు డబ్బు అడిగినా ఉదారంగా ఇచ్చే స్తారు. అట్లా కాకుండా వాళ్లని కొట్టి తెమ్మని పీడిస్తే మొదటికే మోసం వస్తుంది. పశువుల పొదుగు పిదికితే పాలు వస్తాయి. పొదుగు కోస్తే రావు” అంటాడి పద్యంలో కవి. 
ప్రజల అవసరాల కొద్దీ ప్రభువు పాలిస్తుంటే, ఆ ప్రభుత్వ ప్రయోజనాలకోసం ప్రజలు కష్టాలు భరించి సహకరిస్తారు. “నేను అర్థరాత్రి నిర్ణయం తీసుకున్నాను. దీనివలన ప్రజలారా! మీకు కష్టాలు కలుగుతాయి. భరించి సహకరించండి... అని ఏ రాజు గారైనా అంటే ఆయన పాలన ప్రజారంజకం అయినప్పుడు ప్రజలు కొన్నాళ్ళు తప్పకుండా భరిస్తారు. సహకరిస్తారు! 
రైలురేట్లు ఘనంగా పెంచిన ఒక రైల్వే మంత్రిగారు అదేమిటండీ అనడిగిన వాళ్ళని, “మీకు రైల్వేలు బాగు పడాలని లేదా?, దేశం బాగు పడాలని లేదా?” అనడిగితే, ప్రజలు భరించారు. ప్రభుత్వ భాషలో సహకరించారు. ప్రజలు సహక రించడం అంటే ఏమిటీ...? వేసిన పన్నుల్నీ, పెంచిన రేట్లనీ, చేసిన తప్పుల్నీ ఔదల దాల్చటం. కుయ్యో మొర్రో అని మూలక్కుండా బాధే సౌఖ్యమనే భావనలో జీవించటం ....అంతేకదా! 
రేట్లు పెంచినా ప్రజలు రైళ్ళెక్కుతున్నారు కాబట్టి, ప్రజలు ఆమోదించి సహకరించినట్టే! నోట్లు రద్దు చేసినా బ్యాంకు వాళ్ళ ఛీత్కారాలను భరిస్తూ క్యూలో నిలబడి వంటా వార్పు మానుకుంటున్నారు. కాబట్టి, ప్రజల ఆమోదానికి, మోదానికి అది సంకేతంగా ప్రభువులు భావిస్తారు. 
పంచాంగ ముహూర్తం ప్రకారం స్వాతంత్ర్యం అర్ధరాత్రి వచ్చిందే గానీ, నిర్ణయం అర్ధరాత్రి తీసుకున్నది కాదు. నోట్ల రద్దూ అంతే! అది సరికొత్త అద్భుత ప్రయోగం కూడా కాదు. 1973లో జనతాపార్టీ పెద్దనోట్ల రద్దు ప్రయోగం చేసింది. కానీ, దాని ఫలితాల మీద విశ్లేషణ లేదు. అ అనుభవాన్ని పరిగణనలోకి ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు, అప్పటికన్నా ఇది ఏ విధంగా మెరుగైనదో తెలీదు. ఇప్పుడు పాతనోట్లు పోయి కొత్త నోట్లు అంతకన్నా పెద్ద డినామినేషన్లో వస్తున్నాయి. ఇవి నల్లబాబుల చేతుల్లో నలక్కుండా నేలమాళిగల్లోకి చేరవన్న హామీ ప్రభుత్వం అధికారికంగా ఇవ్వలేదు. 
1968-నూజివీడు హైస్కూల్లో చదువుకునే రోజుల్లో మహాకవి దుర్గానంద్ గారితో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. వారబ్బాయి అంబికానాథ్ నా సహాధ్యాయి. అంతర్గోళాలు, చిరంతన, భీతాంగన లాంటి రచనలు చేశారాయన. చిరంతన ఖండకృతి వ్రాస్తున్నప్పుడు వారిదగ్గరే ఉన్నాను. నాలో సాహిత్య పిపాస కలగటానికి ఆయన ప్రథమ కారకుడు. 
అద్భుతమైన సిద్ధాంతాలు అనేకం ప్రతిపాదించేవారాయన. అవి కనీసం యాబై యేళ్ళ తరువాత గానీ జనానికి అర్ధం కానివిగా ఉండేవి. 1960ల్లోనే ఆయన ‘డేటెడ్ కరెన్సీ’ ఉండాలని, నల్లధనాన్ని అరికట్టాలంటే అది చాలా అవసరం అనీ వ్రాశారు. ఆయన సూచించిన పద్ధతిలో మూడేళ్ళ వరకే ఈ నోట్లు చెల్లుతాయని, 1920 వరకే చెల్లుబాటు అని ఎక్స్‘పైరీతేదీతో నోట్లను ముద్రించి జనవరి 1 నుండీ అమల్లోకి తెస్తే సామాన్యుడికి ఇబ్బంది కలగని రీతిలో తీవ్రవాదుల దగ్గర దొంగ నోట్ల చెలామణీని అరికట్టగలిగి ఉండేవారు. మూడేళ్ళకు మించి డబ్బుని ఎవరూ నేలమాళిగల్లో నిలవచేసే అవకాశం ఉండదు. 
యూపీ, పంజాబు ఎన్నికలయ్యాక, ఈ నోట్ల రద్దు నిర్ణయం వలన దేశానికి ఆర్ధికంగా ఇంత ఆర్ధిక ప్రయోజనం కలిగిం దని ప్రధాని ప్రెఅకటిస్తే, ప్రజలు కష్టాలు పడినందుకు ఫలితం దక్కింది లెమ్మని సంతోషిస్తారు. భాస్కర శతక కర్త కూడా తనమాట నిజమైందని సంతోషిస్తాడు.
గేదె పాలిచ్చినంత సేపూ అది తన మహిమే నంటాడు. దాని పొదుగు కూడా కోయాలని చూసిన రోజు పాడిగేదె తన ప్రతాపం చూపిస్తుంది. అందాకా భూమాతలా భరిస్తుంది. 
దేశంలో నల్లబాబులెవరో చిన్న పిల్లవాణ్ణడిగినా చెప్తారని ప్రధానే స్వయంగా అన్నారు. ఆ నల్లబాబులు 2017లో కూడా అధిక ధనవంతుల జాబితాలో కొనసాగితే, మన నాయకులంతా ఇదే పద్ధతిలో ధన రాజకీయాలు కొనసాగిస్తే, యథాప్రకారం కొండచిలువ మాదిరి రేట్లు పెరుగుతూ పోతుంటే, నోట్ల రద్దు అనేది కొత్త మిలీనియంలో పెద్ద ప్రహసనమే అవుతుంది.

No comments:

Post a Comment