Thursday, 25 August 2016

మాజీనది-జీవనిధి ::డా. జి వి పూర్ణచందు

మాజీనది-జీవనిధి

డా. జి వి పూర్ణచందు


నది కృష్ణ...
ఇరుగట్టుల మడతమంచం మీద
చీకటి దుప్పటి కప్పుకుని
అనంత శయనంలా!
దుప్పటి కంతల్లోంచి
చుక్కలు
తళతళ లాడుతూ...
నది ఒడ్డున తాడిచెట్టు
అనంత శయనుడి
నాభిలో పుట్టిన కమలంలా...
పైన పద్మాసనంలో చంద్రుడు
తెలుగులీనుతో
కమలపు రేకుల్లో కర్ణికలా...
నదినిండా మొక్కలే
మొక్కులు తీర్చుకునే
పరివార దేవతల్లా...
జెముళ్ళు, కలబందలు
కలలు బందు చేసే
ఎడారి మొక్కల సందోహం...
నదిమీద సాలీడుగూళ్ళ అల్లిక
ఏ కవి అల్లగలడు
అంత సీసమాలిక
చంద్రుడి వెలుగురాగాలు
నదిలో కనిపించిన రోజులు
అప్పుడు! అప్పుడప్పుడు!!
గట్టును గట్టిగా తగలకున్నా
నీళ్ళ జాడలుండేవి అప్పుడు...
మల్లెల్లూ పండేవి అప్పుడప్పుడు...
చీకటి దుప్పట్లో దూరాక
నీళ్ళైతే ఏమిటీ...
ఇసుక దిబ్బలైతే ఏమిటీ...
నది మిధ్య
నీళ్ళు గతం
బీళ్ళు ఎండకు అంకితం
నదికి నీలం రంగు పులిమి
నీళ్ళని భ్రమిస్తున్నాం
కాళ్ళని తడిపిస్తున్నాం...
నదికే తెలుసు
మమతలు లేని
మనుషుల మనసు
నీళ్ళున్న రోజున
దానిది సత్త్వగుణం
అది అప్పుడప్పుడూ...
వరదలెత్తిన రోజున
దానిది రజోగుణం
అది ఎప్పుడో ఒకప్పుడు...
నీళ్ళెండిన రోజున
దానిది తమో గుణం
అది ఇప్పుడు! ఎప్పుడూ...!
ఎగువన వరదలొస్తే
దిగువున తృష్ణ తీర్తుంది
ఇది కృష్ణ వాక్కు
తగువున గెలిచి తెచ్చినా
దిగువకు నీళ్ళు
వలచి వచ్చునా?
ఇది మాజీనది కృష్ణ వాక్కు
ఇది ఎగువ నాజీలు
అప్ హరించిన కృష్ణ హక్కు
నదిని బంధించే వృత్రాసురుడు
యుగానికొక్కడు ప్రతిసారీ
ఎగువకు నీటిని మళ్ళిస్తూ మితిమీరి!
పదండి ముందుకని తోసుకుని...
నీళ్ళు పాటెత్తుకుంటే,
నీళ్ళు పోటెత్తుతుంటే...
చలనాన్ని ఆనకట్టలా ఆపేది?
చైతన్యాన్ని
మాయకట్టులా మాపేది...?
నది ఆగనిది!
నది దాగనిది!
నది జీవనిధి!