కొండమీది కొక్కిరాళ్ళు::డా. జి వి పూర్ణచందు.
పండితులైనవారు దిగువం దగనుండగ నల్పు డొక్క డు
ద్దండత బీఠమెక్కిన బుధ ప్రకరంబుల కేమి యొగ్గగున్?
గొండొక కోతి చెట్టు కొనకొమ్మల నుండగ గ్రింద గండ భే
రుండ మదేభ సింహ నికురుంబము లుండవె చేరి భాస్కరా!
బాపూగారి ఒక సినిమాలో పంచాయితీ ప్రెసిడెంటైన ఓ భూస్వామి తన పాలేళ్ళను టీచర్లుగా చూపించి, లేని స్కూలుి ఉన్నట్టు నడిపిస్తుంటాడు. స్కూళ్ళ ఇన్స్పెక్టరు వచ్చినప్పుడు ఓ పాలేరాయన "నాను నాలుగో కలాస్సు పంతుల్నండీ"అంటాడు. ఇనస్పెక్టర్ గారు అతగాణ్ణి "విశ్వక్సేనుడు" అని పలకమంటాడు. అతగాడు నోరెళ్లబెడతాడు
స్వతంత్రం వచ్చాక తెలుగు నేలని మొదట భూస్వాములే పాలించారు. ఆతరువాత సారా కాంత్రాక్టర్క్ల చేతుల్లోకి పాలన వెళ్ళింది. క్రమేణా రైసుమిల్లర్లు అధికారాన్ని హస్తగతం చేసుకుని కొన్నాళ్ళు రాజ్యం ఏలారు. మధ్యలో మాఫియాలు, కాంట్రాక్టర్లు, ఇండష్ట్రియలిష్టులు, విద్యారంగ ప్రముఖులు రాజకీయరంగ ప్త్రవేశం చేసినప్పటికీ స్వీయ ప్రయోజనాలు తప్ప పాలనా వ్యవస్థ బాగోగుల జోలికి వెళ్లలేదు. ఈ తతంగం వలన రాజనీతిఙ్ఞులు క్రమేణా కనుమరుగై పోయారు.
అధికారం చేజిక్కించుకొనే వరకూ ప్రజలకోసమే నిరంతరంగా జీవించిన పార్టీలు ఎన్నికైన మర్నాటి నుండీ స్వంత ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం ప్రారంభించే రోజులివి. “ఇంతకాలం ప్రతి పక్షంలో ఉన్నాం... మా కార్యకర్తల్ని సంతృప్తి పరచొద్దా...?” అని బహిరంగంగానే అంటూన్న కాలం ఇది.
లేని విశ్వవిద్యాలయాల పేరుతో కొందరు డాక్టరేట్లు పంచేస్తుంటే చాలామంది ‘లా’ ఒక్కింతయు లేని వాళ్ళు డబ్బులు కట్టి డాక్టరేటు పుచ్చేసుకుని సన్మాన సభలు పెట్టుకుంటుంటే మా బోంట్లు కూడా చచ్చినట్టు వెళ్ళి అభినందాల్సిన పరిస్థితి నడుస్తోందిప్పుడు. నిన్నటి దాకా మనతో భుజం మీద చెయ్యి వేసి తిరిగిన వ్యక్తి తెల్లవారేసరికి డాక్టర్ అయిపోతున్నాడు. ఇప్పుడు అలాంటి డాక్టరేట్లు పెట్టుకోవటానికి ఎవరూ సిగ్గు పడట్లేదు. చక్కగా సిగ్గులేకుండా పుచ్చేసుకుంటున్నారు. ప్రజలే ఇలా ఉంటే ప్రభుత్వం చేసే వాళ్ళు ఇంకెలా వుండాలి?
గుళ్ళో కొబరికాయలు అమ్మే ఆయన వెళ్ళి, "అయ్యా! మీ కార్యకర్తని" అంటే చాలు, ఆ గుడి ట్రస్టీగానో, చైర్మన్ గానో నామినేటై పోతాడు. గుడిపాలకులుగా ఫలానా రకం వాళ్ళుండాలనే రూలెక్కడా లేదు. కాబట్టి, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడని అంశాలు. రాను రానూ ఇవి ఇతర రంగాలకూ విస్తరించాయి. ‘మన వాళ్ళలో పదవులు ఇవ్వాల్సిన వాళ్ళెందరు? -ఉన్న పదవులు ఎన్నీ అనే అంచనా లిష్టు తయారు చేస్తారు. పూర్వం రోజుల్లో ఈ రెండు లిష్టుల్నీ క్రాస్ మాచింగ్ చేసే వారు. అంటే ఎవరికి ఏది ఇవ్వచ్చో జతపరచి చూసే వాళ్ళు. ఇప్పుడలాంటిదేమీ లేదు.
ఎన్నో నియమాలూ, ప్రమాణాలూ వ్రాసి ఉన్న వైస్ ఛాన్సర్ల లాంటి పోష్టులకే ‘మనాళ్ళు’ అనేది “స్వీయప్రమాణం” అవుతుంటే, ఇంక మామూలు పదవుల గురించి మాట్లాడేదేముంది...? న్యాయమూర్తుల నియామక విషయంలోనూ ఈ ‘మనోళ్ళు’ సిద్ధాంతం నడుస్తోందని, కొలీజియం అభాసు పాలౌతోందని అత్యున్నత న్యాయస్థానమే గగ్గోలు పెట్టే స్థితి నడుస్తోంది.
ఒక పార్టీ అని కాదు, ఒక ప్రభుత్వం అని కాదు, ఒక రాష్ట్రం ఒక సందర్భం అనీ కాదు, ఢిల్లీ నుండి జిల్లా దాకా అంతా ‘మనోళ్ళ’ని ‘వేనోళ్ళ’తో తిననిచ్చే ప్రక్రియ నడిచి పోతోంది. ప్రభుత్వ పదవులు కార్యకర్తల కోసమే ననేది తిరుగులేని సత్యం. వీటిలో కొన్ని ధనాదాయాన్ని సమకూర్చేవి కాగా, కొన్ని పలుకు బడి పెరగటానికి, మరికొన్ని విజిటింగ్ కార్డుల మీద వేసుకోవటానికి పనికొస్తాయి. వీళ్ళంతా వారి వారి స్థాయిల్లో సామాజిక పీఠాధిపతులు. అంటే ఎవరి పీట వాళ్ళు వేసుకుని కూర్చుని ఎవరికి వారే వడ్డించేసుకునే బాపతు. ప్రభుత్వం అనేది ఒక బఫే భోజన శాల. అంతా స్వయం సేవే! ఎవరికి వారే స్వయంగా వడ్డించుకుని తినే వ్యవస్థ!
వీళ్ళు పెట్టుబడీ దారీ మాఫియా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కాదు, ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థలో కూడా ఉన్నారు. మృఛ్ఛకటికం నాటకంలో రాజశ్యాలకుడు (రాజుగారి బామ్మర్ది) లాంటి వాళ్ళు ప్రతీ యుగంలోనూ ఉంటారు.
అలాంటి వాడి గురించి పై పద్యం గొప్పగా వ్యాఖ్యానిస్తుంది. ఇలాంటి వాడు ఓ సాహిత్య సభకో, సంఘానికో అధ్యక్షుడిగా కూర్చున్నాడనుకోండి, మహాకవి పండితులు కింద కూర్చోవాల్సి వచ్చిందని ఏమీ చింతించ కండి!. గండ భేరుండ మదేభ సింహ నికురుంబములు చెట్టు కింద కూర్చుంటే, ఒక కోతి చెట్టు చిటారుకొమ్మ మీద కూర్చుని ఉంటుంది. అంత మాత్రాన కింద కూర్చున్న కవి పండితులకు లోటు జరిగిందేమీ లేదని ఊరడిస్తాడు. ఈ పద్యం ఇంత అచ్చు గుద్దినంతగా నేటి కాలానికి అమరి ఉండటం విశేషం. దీనికి ఇంతకన్నా అర్ధ వివరణలు అక్కర లేదు
భాస్కర శతకం వ్రాసిన మారయ (మారవి) వెంకయ్య కవి 1550-1650 మధ్యకాలంలో వాడు. శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో నివశించిన కళింగ కవి. ఆ ప్రాతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుడిని సంబోధిస్తూ భాస్కర శతకము వ్రాశాడు. అందులోని నీతి బోధలవల్ల, కవిత్వ సౌందర్యము వల్లా ఈ శతకము బాగా ప్రాచుర్యం పొందింది.
కవి ఏ కాలానికి చెందిన వాడైనా రేపటి యుగానిక్కూడా వర్తించే విధానంలో సార్వకాలీనంగా వ్రాసిన వాడు చరితార్ధుడు. అందుకే 500 యేళ్ళ తరువాత కూడా ఈ వెంకయ్య కవిత గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది.
No comments:
Post a Comment