Language, Literature, Culture and Food heritage of Telugu People.-------- Susruta Ayurvedic Hospital, 1st Floor, Satnam Towers, opp. Buckinghampet Post Office Governorpeta, Vijayawada – 520002 9440172642, Email ID: purnachandgv@gmail.com,
Sunday, 15 May 2016
తెలుగు భాషాసాంస్కృతిక సమ్మేళనం ఆహ్వాన పత్రిక

Monday, 2 May 2016
కవిత్వంలో సంక్షిప్త శబ్ద చిత్రాలు::డా. జి వి పూర్ణచందు
కవిత్వంలో సంక్షిప్త శబ్ద చిత్రాలు
డా. జి వి పూర్ణచందు
“దండిగ చీమలెన్నొ తన దాపుకు జేరగ మధ్య శర్కరాఖండము నిల్చియున్న గతి గాంచెను వానరమూర్తి రాక్షసీ
తండక మధ్యమందు కల తల్లిని, కప్పల దొర్వులో తిరం
బుండిన తామరాకు, నెగడోదిన చక్కని నీటి బొట్టునున్”
నీళ్ళున్న చోట కప్పలు చేరినట్టు, బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు, సంపదలున్నచోట బంధుజనులు చేరటం సహజం. కానీ, ఈ పద్యంలో పరిస్థితి వేరు. రావణుడు సీతను ఎత్తుకొచ్చాడు. ఆవిడ చుట్టూ కొందరు స్త్రీలను కావలి పెట్టాడు. వాళ్ళు బెల్లం చుట్టూ చీమల్లా ఆమె చుట్టూ చేరారని శ్రీ పదచిత్ర రామాయణంలోని ఈ పద్యంలో కవి శ్రీ విహారి చెప్తున్నారు.
ఆధునికుల్లో విశ్వనాథ మాదిరే పద్యాల్లోనూ, వచనంలోనూ రామాయణాన్ని వ్రాసిన వారంతా తమ ఆనందం కోసం, తమ తృప్తి కోసం, తమ భక్తి కొద్దీ వ్రాస్తున్నట్టే పేర్కొన్నారు. కానీ, శ్రీ విహారి తాను పదచిత్ర రామాయణం వ్రాయటానికికారణాన్ని భిన్నమైన పద్ధతిలో చెప్పుకున్నారు. మనో భావాలను కవిత్వీకరించకుండా, అందరూ రాసేశారుగా అని మౌనంగా తాను ఉండలేక ఈ పదచిత్ర రామాయణం వ్రాస్తున్నా నంటారాయన, “కేవలం మోనమోల కవికిం దగునే ఇది?” అనడుగుతాడు. లోలోపల్లోంచి ఉబికి వస్తున్నఆలోచనా స్రవంతిని మౌనంగా దిగమింగుకోగలడా కవి...? అని!
శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ‘విహారి’గా ప్రసిద్ధుడు. విమర్శకుడిగా, కథకుడిగా, నవలాకారుడిగా, కవిగా, విశ్లేషకుడిగా, ఆయన ఈ తరం పాఠకులకు బాగా తెలిసినవాడు. శాలివాహనతో జంటగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి పొందారు. ఎన్నో అభ్యుదయ కావ్య రచనలు, కథా రచనలు, నవలలు వ్రాసినప్పటికీ, అవి అన్నీ ఒక ఎత్తుగా రామాయణ రచన ఒక్కటీ ఒక ఎత్తుగా ఆయన కృషి చేశారు. విహారి రామాయణంలో రామభక్తి కన్నా తన ప్రతిభతో కథను కళ్లకు కట్టించే కవితాతృష్ణ ఎక్కువగా కనిపిస్తుంది.
ఆయన మొదటగా ‘శ్రీ పదచిత్ర రామాయణం’ బాలకాండ ప్రకటించినప్పుడు ఈయన రామాయణం వ్రాశారేమిటా అని ఎరిగిన వారంతా ఆశ్వర్య పోయారు. ఒక రచనను కవి తన అనుభూతి కొద్దీ మాత్రమే చేయ గలుగుతాడు. పదచిత్రాలతో కావ్య రచన చేయాలనేది విహారి సంకల్పం. బలమైన ఇతివృత్తం కాబట్టి, అందుకు రామాయణాన్నిఎంచుకున్నారు. కథ అందరికీ తెలిసిందే కనుక దృశ్యాలను కళ్ళ ముందు సాక్షాత్కరింప చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘చీమ సైత మొక భూజమునెక్కు ప్రయాస మోర్చుచున్’ చీమ కూడా ప్రయాసతో ఒక మహావృక్షాన్ని ఎక్కాలని ప్రయత్నిస్తుంది కదా!” అంటాడాయన. తన రామాయణ రచనా ప్రయాస శక్తికి మించిన దనటానికి, తన శక్తికి మించిన బరువును భుజాన వేసుకుని బాహుబలిలా ‘చెట్టునెక్కే చీమ’ దృశ్యం కళ్లలో మెదిలేలా చేసారాయన.
చీమలంటే ఆయనకు కొండంత సానుభూతి. అశోకవనిలో పటికబెల్లం చుట్టూ మూగిన చీమల్లా ఉన్నారట శోకమూర్తిలా ఉన్న సీతకు కావలి ఉన్న రాక్షస స్త్రీలు! త్రిజట లాంటి స్త్రీలంతా అక్కడ పేరుకు రాక్షసులే గానీ, వాళ్ళకన్నీ చీమల లక్షణాలే! యజమాని ఆఙ్ఞను పాటించాలి కాబట్టి, కావలి ఉన్నారు. యజమాని దోషాలన్నీ ఔదల దాల్చి ఆయన్ని భరిస్తున్నారు. ఆయన అటు తిరగ్గానే సీతకు ఎలాంటి అపకారం తలపెట్టకుండా కప్పల్లా పక్కకు దూకేస్తారు. అలాంటి కప్పల చెరువులో స్థిరంగా ఉన్న తామరాకులా కూర్చున్న సీతను చూశాడట హనుమంతుడు. రావణుడి హుంకారాల్లా తామరాకు మీద నీటిబొట్టులా నిలిచేవి కావు కదా! అందుకని, కప్పల దొరువులో స్థిరంగా ఉన్న తామరాకుతో సీతను పోలుస్తున్నాడు కవి. పదచిత్రం అంటే ఇది. దృశ్యం కళ్లకు కట్టాలి. అది సంక్షిప్త శబ్దచిత్రంలా మన కంటికీ, చెవులకు, మనసుకూ ఒకేసారి తాకాలి.
రావణుడి రాజ్యంలో ప్రజలకు రావణ దుశ్చర్యల పట్ల ఏహ్యభావమే ఉంది. విభీషణు డొక్కడు ధైర్యం చేసి ‘తప్పన్నా!’ అనగలిగాడు గానీ, తక్కిన వాళ్ళు నోరు మెదపలేక పోయారు. వాళ్ళు చీమల్లా తమ శక్తికి మించి దుష్ట చక్రవర్తిని భరిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆరున్నర దశాబ్దాలుగా మనం చేస్తున్నదీ అదే!
“బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే! సుమతీ!” అని సుమతీ శతకకర్త అన్నాడు. కానీ, ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే...?’ అనేదే ప్రశ్న! సద్వినియోగం చేసుకున్నా చేసుకోక పోయినా మనకు ఓటు అనే ఆయుధం అయినా ఉంది. రావణరాజ్యంలో అది కూడా లేదు.
పార్టీలు మారే ఈనాటి కుతంత్రం గాళ్ళని విభీషణుడితో పోల్చటం అఙ్ఞానం. విభీషణుడి మాదిరే ఇతర రావణ వ్యతిరేకులు కూడా ఎదురు తిరిగి ఉంటే రావణుడి కథ వేరుగా ఉండేది. మనమూ అంతే, చీమల్లా ప్రయాసను మోస్తున్నాం గానీ, ప్రశ్నించం. ఐదేళ్ళ పాటు తప్పులు చేయనివ్వాలని మనకు మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది కదా!
1-5-21016 ఆదివారం విశాలాంధ్రలో నా పద్యానుభవం శీర్షికలో రచన

Subscribe to:
Posts (Atom)