Monday, 28 March 2016

ఏరు దాటిన వాగ్దానాలు :: డా. జివి పూర్ణచందు

ఏరు దాటిన వాగ్దానాలు 

డా. జి వి పూర్ణచందు

“దాయమెత్తనో యీ సారె దాక నీక/కట్టి గెలిచెద నిదె పాసికలను వచ్చి
పట్టునో భూతమిందేమి ముట్టగలదొ/పొందవచిన వ్రాలకు బోవు గాక”

కృష్ణుడు తన దేశానికి పాలకుడు. లోకపాలకుడు, విశ్వలోక పాలకుడు కూడా! ఆయనకు సత్యభామతో పాచికలాడే తీరిక దొరికింది. ఆటలో సత్యభామది పైచెయ్యి అయ్యింది. ఒక నిష్కంతో మొదలు పెట్టి, నాలుగు ఎనిమిది, పన్నెండు, పదారు ఇలా వరుసగా పందేన్ని రెట్టిస్తూ గెలుస్తోందామె!. కృష్ణుడి నిలవ సొమ్ము మొత్తం ఆమె మూలధనంలోకి చేరి పోతోంది. కృష్ణుడు లోలోపల కుతకుతలాడిపోతున్నాడు.
సరిగ్గా ఆ సమయంలో పురప్రముఖులు గగ్గోలు పెట్టుకుంటూ వచ్చారు. పౌండ్రకుడిని చంపినందుకు ప్రతీకార చర్యగా కృత్య అనే భూతాన్ని కాశీరాజు ద్వారక మీదకు పంపాడని, అది జనాన్ని చంపుకు తింటోందనీ మొత్తుకున్నారు. ‘ఆకొన మృత్యువులా, వెలిబ్రాకిన లయకాల రుద్ర ఫాలాగ్నిలా ఉన్నదా భూతం’ అని చెప్పుకున్నారు.
కృష్ణుడు వినీ, విననట్టే కూర్చున్నాడు. పలక చెరిగిపోతుంది ఇంకో ఎత్తు వెయ్యమంటూ ఆమెను రెచ్చగొడుతున్నాడు. వాళ్ళేమో “విన్నపం బంగారు దేవా” అంటున్నారు. ఆమె పాచికలు ‘దాలించి’ వేస్తోంది... ఇదీ సందర్భం. నాచన సోముడి ఉత్తరహరివంశంలో తృతీయాశ్వాసంలోది ఈ పద్యం.
సత్యబామ పాచికలు తాలించి వేసిందట. తాలించటం అంటే చేతిలో అటూ ఇటూ పొర్లించటం. కూర. పప్పు, పచ్చడి, పులుసు, చారు, ఇలాంటి వంటకాలను వండి నప్పుడు చివరలో తాలింపు పెడతారు. పోపు పెట్టటం, సాతాళించటం అని కూడా అంటారు. ఒక ఇనుప గరిటలో పోపు గింజల్ని లేదా సంబారాల్ని నూనెతోనో, నేతితోనో దోరగా వేయించి ఆ గరిటతో సహా తెచ్చి, వండిన వంటకంలో బోర్లించి అటూ ఇటూ కలియపెడతారు. అందుకనే “తిరుగబోత” పెట్టటం అనే మాట కూడా వ్యాప్తిలోకి వచ్చింది. సత్యభామ పాచికల్ని చేతిలో తాలించింది అనటంలో వంట చేసే చెయ్యి పాచికల ఆటలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోందనే వ్యంగ్యం ధ్వనిస్తోంది.
పురజనం భూత భయంతో వణికి పోతున్నారు. సత్యభామ తటపటాయిస్తోంది. కృష్ణుడు పాచికలు వెయ్య మంటున్నాడు. ఈ సారి పందెంలో ఇప్పటిదాకా నువ్వు గెలిచిందంతా తిరిగి నేను గెలిచేస్తాను...అన్నాడు. ఇంకోసారి నీకు పాచికలు ముట్టుకునే అవకాశం లేకుండా గెలుస్తానన్నాడు. ఆ భూతం వచ్చి ఈ పాచికల్ని ఎత్తుకెడుతుందా ఏంటి అని కూడా అనేశాడు. ఊరు జనం బిక్కచచ్చి పోతున్నారు.
‘ఈ ఎత్తులో ఎవరికి లాభం రానుందో ఎవరికి తెలుసు... నువ్వు పాచికలు వెయ్యి’ అంటున్నాడు. సత్య పాచికల్ని తాలిస్తోంది.
‘త్వరగా వెయ్యి... పోయిన సొమ్మంతా గెలుచుకుని వెళ్ళి ఆ భూతం పని పడతాను...” అన్నాడు. ఆ మాత్రం భరోసా ఇచ్చాడు...చాలనుకుని సంతృప్తి పడ్డారు పౌరులు.
కష్టాలు, తుఫాన్లు, భూతాలు చెప్పిరావు. ముందుగా పసిగట్టి, రాకుండా అడ్డుకోగలిగే సమర్ధత కలిగిన యంత్రాంగం లేనప్పుడు, జనం పోలీసులతోనూ, పోలీసులు మంత్రి తోనూ, మంత్రి ముఖ్యమంత్రితోనూ మొరపెట్టుకుంటారు, సదరు పెద్దాయన భార్యతో ఏకాంతంగా ఉడి, ‘కాసేపాగి వస్తాలే! ముందు మీరు పదండి...’ అనే అంటాడు.
ప్రజలకు పెనుముప్పు ముంచు కొచ్చిందంటే కచ్చితంగా ముందుగా పసిగట్టడంలో తాని విఫలమయ్యానని ప్రభుత్వం నడిపేవాడు అంగీకరించినట్టే లెక్క!
ఇప్పుడే వచ్చేస్తాను అన్నాడంటే కామరాజుగారి పార్‘కలామ్... ‘చూద్దాం’ సిద్ధాతాన్ని పాటిస్తున్నట్టే లెక్క.
అయ్యా మీరొచ్చి కాపాడండీ అని ప్రజలు వచ్చి మొరపెట్టుకోవలసి వచిందంటే అయ్యగారి పాలన అంతంత మాత్రంగానే ఉన్నటు లెక్క! చిట్ ఫండ్ కంపెనీవాళ్ళు బోర్డెత్తేసి పారిపోతుంటే, ‘ఎవ్వరైనా కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకుంటాం’ అని పోలీసు వారన్నట్టే ఉంటుంది ఇది. తీరా కంప్లైంట్ ఇచ్చాక ‘చూద్దాం’ సిద్ధాంతమే అమలౌతుంది. "అయ్యా! నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఆసుపత్రిలో చేర్చాలంటే, "కానీ, చూద్దాం" అనే యజమానులూ ఉంటారు.
ఎన్నికలైపోయాక ఏరు దాటిన తెప్ప తగ్గలేసినట్టు, చూద్దాం చేద్దాం అనేవి ప్రభువుల ఊతపదాలుగా మారి పోతాయి.
భార్యతో జూదం ఆడుతూ, ఉన్నదంతా పందెంలో పోగొట్టుకుని, చూద్దాం చూద్దాం అంటూనే ఆఖరు ఎత్తు వేసి, పోయిందంతా గెలుచు కున్నాకే భూతాన్ని చంపటానికి వెళ్ళాడు కృష్ణుడు
భూతం అక్కడ కొచ్చి ఆగడాలు చేయక మునుపే దాని రాకను పసిగట్టే సామర్ధ్యం ఉంటే, జనం భయభ్రాంతు లయ్యే వారు కాదు కదా! అయినా, అంతిమ విజయం తరువాత తొలి కష్టాలను ప్రజలు పూర్తిగా మరిచిపోతారు, ఎన్నికల నాటికి ప్రభువుల పూర్వ పాపాలన్నీ జనం మరిచిపోయినట్టు!

No comments:

Post a Comment