Saturday, 30 January 2016

అన్నమయ్య వంటకాలు :: డా. జి వి పూర్ణచందు

అన్నమయ్య వంటకాలు డా. జి. వి. పూర్ణచందు

ఇందిర వడ్డించ నింపుగను/చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాశాలు అప్పాలు వడలు/పెక్కైన సయిదంపు పేణులును
సక్కెర రాసులు సద్యోఘృతములు/కిక్కిరియ నారగించవో స్వామి
మీరిన కెళంగు మిరియపు దాళింపు/గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే/కూరిమితో జేకొనవో స్వామీ
పిండివంటలును పెరుగులు/మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు/వెండియు మెచ్చవే వేంకటస్వామీ"
అన్నమయ్య వర్ణించిన వేంకటస్వామి దివ్యాన్నాల పట్టిక ఇది. వీటిని ఇందిరాదేవి ఇంపుగా వడ్డించి తినిపిస్తోందట. వాటిని చిందకుండా అంటే ఒక్క మెతుక్కూడా వదలకుండా భుజించవో స్వామీ…అంటున్నాడు అన్నమయ్య.
అక్కాళ పాశాలు: నేతి పాయసాలు
అప్పాలు,వడలు: బూరెలు, గారెలు
పెక్కైన సయిదంపు పేణులు: అనేక రకాల గోధుమ సేమ్యా వంటకాలు
చక్కెర రాసులు, సద్యోఘృతములు: పంచదారతో చేసిన క్రొన్నేతి వంటకాలు
మీరిన కెళంగు మిరియపు దాళింపు గూరలు: మిరియాల పొడి చల్లి వండిన తాళింపు కూరలు
కమ్మని కూరలును సారంపుబచ్చళ్ళు: కమ్మని కూరలు, చక్కని సుగంధ ద్రవ్యాలు వేసి చేసిన పచ్చళ్ళు
చవులుగ నిట్టే కూరిమితో జేకొనవో స్వామీ: ఇట్టే నోరూరే ఈ రుచుల్ని ఇష్టంగా తినవయ్యా స్వామీ
పిండివంటలును పెరుగులు: ఇంకా అనేక పిండివంటలు, పెరుగుతో చేసిన వంటకాలు
కిక్కిరియ నారగించవో స్వామి: అన్నీ దగ్గరగా పెట్టుకుని ఆరగించవయ్యా స్వామీ!
వీటిని 500 యేళ్ళ క్రితం అన్నమయ్య కాలంలో దేవుడికి పెట్టిన నైవేద్యంగా భావించవచ్చు. ‘ఋగ్వేద ఆర్యులు’ గ్రంథంలో రాహుల్ సాంకృత్యాయన్ చెప్పినట్టు, తమ దేవుడికి ఏ ఆహారం నైవేద్యంగా పెట్టుకున్నారో అది ఆ కాలం నాటి ప్రజల ఆహారం. అన్నమయ్య చెప్పిన వంటకాలను కూడా ఆ నాటి ప్రజల ఆహారంగా భావించవలసి ఉంటుంది. బూరెలు గారెలు, నేతి స్వీట్లు, మిరియాలు వేసి వండిన తాలింపు కూరలు, సుగంర్థ భరిత పచ్చళ్ళు, పెరుగు వంటకాలు, పాలవంటకాలూ ఉన్నాయి.
ఇవే గదా ఇప్పుడు మనం తింటున్నవీ...అని అడగొచ్చు. కానీ, ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది...! చింతపండు రసం కలిపినవీ, అల్లం-వెల్లుల్లి దట్టించినవీ, నూనె వరదలు కట్టేలా వండిన వేపుడుకూరలు, ఎర్రగా మంటెత్తే కొరివి కారాలు, ఊరుగాయల్లాంటి మనం తింటున్న భయంకర వంటకాలేవీ అన్నమయ్య వంటకాల పట్టికలో లేవు. 500 యేళ్ళ ఆధునికతలో చింతపండు, మిరప కారం, నల్లగా వేయించిన కూరబొగ్గుల్నిమాత్రమే సాధించామని అన్నమయ్య వంటకాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి. యాంటీ బయటిక్సు లేకుండానే మన పూర్వులు కమ్మగా వండుకుని తిన్నారు, జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందించారు.
మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఉదయాన్నే పెరుగు/చల్లన్నం తినటం మన ఆచారం. అది ఇప్పుడు నామోషీ అయ్యింది. దాని స్థానంలో ఇడ్లీ, అట్టు, పూరీ బజ్జీ, పునుగులు తినటం నాగరికం అయ్యింది. అన్నమయ్య కాలానికి మిరప కాయలు మనకింకా పరిచయం కాలేదు. ఇప్పటి ఆవకాయ, మాగాయలాంటి ఊరగాయలు అప్పటి ప్రజలకు తెలీవు. అల్లం, శొంఠి మిరియాలనే కారపు రుచికి వాడుకునే వాళ్ళు. మిరపకారపు ఊరుగాయలు, చింతపండు పులుసు కూరలు ఎరుగరు. అదే వాళ్ళ ఆరోగ్య రహస్యం.
ప్రపంచీకరణం పాలిట పడ్ద మనకు పీజ్జాలు, బర్గర్లు పవిత్ర వంటకాలైనాయి. ఏడుకొండలవాడి దగ్గరికి సూటూ బూటూ వేసుకుని వెళ్ళి హాయ్ చెప్పి, ఐదు నక్షత్రాల చాక్లేట్లు నైవేద్యం పెట్టటం గొప్పగా భావించే రోజులు ఎక్కువ దూరంలో ఏమీ లేవు.

Saturday, 16 January 2016

భాషాఘోష డా. జి వి పూర్ణచందు

భాషాఘోష


డా. జి వి పూర్ణచందు


హరులు నుండుగాక కరులు నుండును గాక
ఉంద్రు( గాక వేయి యోధ వరులు
మానవాధిపులకు మఱియు విశేషించి
కవియె లే(డో యశము కలుగ(బోదు

యేలూరిపాటి అనంతరామయ్య గారు గతతరం కవిపండితుడు. ఆయన నీలకంఠ దీక్షితులు సంస్కృతంలో వ్రాసిన మూడు శతకాలను నీలకంఠ త్రిశతి పేరుతో పద్యాల్లో అనువాదం చేశారు. ఈ పద్యం సభారంజనం అనే శతకంలోది. రాజుల దగ్గర వేలకొద్దీ గుర్రాలుంటాయి. ఏనుగులుంటాయి. గొప్ప సైనికులుంటారు, ఎందరున్నా కవి లేకపోతే కీర్తి రాదు-అనేది దీని భావం.
కవులు ఎప్పుడూ ఉంటారు. కానీ ఆదరించేవాళ్ళే కొద్దిగా ఉంటారు. రాజాదరణ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. రాజు ఎంత ఛందాలుడైనా ఆయన్ని ఇంద్రుడంతవాడిగా పొగిడి అగ్రహారాలో మణి మాన్యాలో పుచ్చుకోవటాన్ని రాజాదరణగా భావిస్తుంటారు కొందరు. గుడ్డివాడు ధనవంతుడైతే, కమలపత్రాక్షుడనీ, గడ్డులోభిని కల్పవృక్షం అనీ, పిరికి వాణ్ణి విక్రమాదిత్యు డనీ ఈ ప్రపంచంలో కవులు మాత్రమే కీర్తించగలరంటాడు నీలకంఠ దీక్షితులు. “పాండవులు జూదంలో ఓడి, పరదేశాల పాలైనా, వెట్టి చాకిరీ చేసినా ఐదుగురికి ఒకే పెండ్లాం ఉన్నా వ్యాసుడి వాక్కుల వల్ల అవి కీర్తిమంతాలే అయ్యాయి...అని!
తిమ్మిని బమ్మిగా చూపించ గలిగిన చాక చక్యం కవులకుంటుంది. వాళ్లకే సహజంగా రాజాదరణ ఉంటుంది. అవార్డులు కావాలన్నా, పదవులు కావాలన్నా వందిమాగధం లేనిదే ఏదీ దక్కదు. పొగిడే కవులు పురస్కారా లంకృతులు కాగలరేమో కానీ, వాళ్లకి లోకంలో విలువుంటుందనేది నమ్మలేని విషయం. ఇంతకీ. రాజాదరణ అంటే కవులకు అవార్డులు ఇవ్వటమేనా? ప్రభువులు ఈ మాత్రం చేస్తే చాలా?
తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికీ, తెలుగు సంస్కృతికీ ప్రభుత్వ పరంగా చేయవలసిన ఉపకారాలు కొన్ని ఉండగా, చేస్తున్న అపకారాలను సరిచేసుకో వలసినవి మరికొన్ని ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోగలగటమే రాజాదరణ అంటే!
భారత రాజ్యాంగం దేశీయ భాషల్లో విద్యను నేర్పటానికి దేశప్రజలకు భరోసా ఇచ్చింది. కానీ, తెలుగు నేలమీద ఆ భరోసా అమలు కావటం లేదు. మాతృభాషకు రాజాదరణ లేకపోగా రాజ్యాంగ అతిక్రమణ జరుగుతోంది. దీన్ని సరిచేసుకోవాలి. తెలుగు నేలమీద తెలుగు దిక్కులేని అక్కుపక్షిలా అఘోరిస్తుందగా తమిళ నేలమీద తమిళ భాషానురక్తి శ్రుతి మించి రాగాన పడింది. ఆ రాష్ట్రంలో తమిళం తప్ప ఇంకో భాష చదవటానికి వీల్లేదని తెలుగు స్కూళ్ళని మూయించేశారు. తెలుగు జనాభా సగానికి పైగా ఉన్న తమిళనాడులో తెలుగు అలా అఘోరిస్తోంది. ఇంకో భాష నేర్పరాదనటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆ విషయం కేంద్రానికి తెలీదా? కోర్టులకు తెలీవా? ఎవరూ మాట్లాడరు. దేశంలో భాషా రాజాదరణ అలా అఘోరిస్తోంది.
కేంద్రానికి భాషా విధానం ఉంటే ఇలా జరిగేది కాదు. కానీ రాజకీయ ప్రయోజనాలు అన్నింటికన్నా ముఖ్యమైనవి. ఆనాడు మన్మోహన్ గారు కరుణానిధి గారికి తమిళం క్లాసికల్ హోదాని రాజభరణంగా ఇచ్చేశాడు. ఈనాడు మోదీ గారు తెలుగు హననాన్ని రాణిగారికి భరణంగా ప్రసాదించాడు.
తెలుగు భాషకు విశ్వవిద్యాలయాలు చేయవలసిన కార్యాన్ని చేయటం కూడా రాజాదరణే! తెలుగు కన్నడ భాషా యోధులు పోరాడి ఆ రెండు భాషలకూ క్లాసికల్ హోదా సాధించినప్పుడు, మన విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖల వాళ్ళు కొందరు హేళన చేయటం నేను ఎరుగుదును. భాషోద్యమంలో భాగం పంచుకోని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు క్లాసికల్ హోదా వస్తే, సాలుకు 100 కోట్ల రూపాయలు పరిశోధనా ప్రాజెక్టులకోసం వస్తాయనే విషయాన్ని కూడా మరిచారు. ఈ ఐదేళ్ళ కాలంలో సాలుకు 100 కోట్ల చొప్పున వచ్చి, నిరుపయోగంగా వెనక్కి తిరిగి పోతున్నాయి.
2016 జనవరి 3 వరకూ 21 రోజులపాటు కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్ధులకోసం ప్రత్యేక ప్రసంగాలు ఏర్పరచి, ఈ నిధుల వినియోగానికి ఒక ప్రారంభం పలికారు. ఇతర విశ్వవిద్యాలయాలు ఇప్పటి కైనా కళ్ళు తెరవటం మంచిది. NAAC సెమినార్లను ప్రమోషన్లకోసం మార్కుల సెమినార్లుగా మార్చేశారు, రాజాదరణ కోసం పాకులాడటం అంటే ఇదే! భాష, సాహిత్యం, పరిశోధన ఇవేవీ లేకుండానే కాలం చెల్లిపోతోంది కాలానికి!
భాషాభిమానుల ఘోష ఎవరికీ పట్టదు. అందుకని, ఎవరినీ ఏమీ అనలేక ఇంగ్లీషుని తెలుగులో తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు జనం.
17-01-2016 ఆదివారం విశాలాంధ్రలో పద్యాను భవం శీర్షికన ప్రచురితమైన నా రచన

Sunday, 10 January 2016

విశ్వనాథ వారి ‘ఏకవీర’లో సాంఖ్య యోగం :: డా. జి వి పూర్ణచందు

విశ్వనాథ వారి ‘ఏకవీర’లో సాంఖ్య యోగం

డా. జి వి పూర్ణచందు

విశ్వనాథ సత్యనారాయణ త్రికాల కవి. తన కాల౦తో పాటు, వెనక కాల౦, ము౦దు కాలాలకు కూడా చె౦దిన వ్యక్తి. ఆయన మూడు కాలాల్ని భూతకాల౦ కళ్ళలో౦చి మాత్రమే చూశాడని అభ్యుదయ వాదుల ఆరోపణ. ఆయన మూడో కన్నుతో కూడా చూడగలడనీ, ఆధునిక దృష్టి, శాస్త్రీయ దృష్టి ఆయనకు పుష్కల౦గా ఉన్నాయనీ ఆయనను చదివినవారు భావిస్తారు.
తనను పూర్వాచార పరాయణుడనీ, ఆధునికుడు కాడనీ, ప్రవాహమున కెదురీదే వాడనీ తన గురించి అజ్ఞులైనవారంటారనీ, అలా అనటం వ౦చనా శిల్పంలో భాగం అంటాడు విశ్వనాథ. ఇంగ్లీషు సాహిత్యాన్ని చాలామంది కన్నా ఎక్కువే ఆపోశన పట్టా డాయన. పాశ్చాత్య భావజాలాన్ని కాకుండా భావాన్ని మాత్రమే స్వీకరించి దేశీయం చేయటంలో విశ్వనాథ ఘటికుడు. “నిజానికి శిల్పము కానీ, సాహిత్యము కానీ, జాతీయమై యు౦డ వలయును. విజాతీయమై యు౦డ రాదు. వ్రాసిన వానికి ముక్తి, చదివిన వారికి రక్తి, ముక్తి! ఎ౦త సముద్రము మీద ఎగిరినను, పక్షి రాత్రి గూటికి చేరును. ఇది జాతీయత. ఇది స౦ప్రదాయము” అనేది ఆయన సిద్ధాంతం.


విశ్వనాథకు సిగ్మ౦డ్ ఫ్రాయిడ్ కొంత తెలిసి ఉండవచ్చు. కానీ, ఫ్రాయిడ్ రచనలు ఇంగ్లీషులోకి వచ్చే నాటికే ఏకవీర రచన చేశాడాయన. కాబట్టి తరువాత వచ్చిన బుచ్చిబాబు తదితరుల మాదిరి ఆయన ఫ్రాయిణ్ణి చదివి ఏకవీర వ్రాశాడనేది సత్యదూరమే! అయినప్పటికీ, ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతాలు ఏకవీరలో చక్కగా ప్రతిఫలిస్త్తాయి. అందుకు కారణం ఫ్రాయిడ్ సిద్ధాంతాలకు మాతృకలయిన సాంఖ్య యోగ సిద్ధాంతాలను విశ్వనాథ సామాజిక కోణంలోంచి అధ్యయనం చేసి అన్వయించటమేనని అర్థం చేసుకోవచ్చు.


ఆడ్లర్, యూ౦గ్, ఎరిక్సన్ లా౦టి కొత్త ఫ్రాయిడియన్ల కన్నా ముందునాటి వాడు విశ్వనాథ. గోపీచ౦ద్, బుచ్చిబాబుల కన్నా ఎ౦తో ము౦దే, మనోవిశ్లేషణ సిద్ధా౦తాలను నవలీకరి౦చే ప్రయత్న౦ చేశాడాయన. రాయప్రోలు వారి అమలిన శృ౦గార సిద్ధా౦తం, ‘ఏకవీర’ నవల ఒక మూసలోంచి వచ్చినవి. అమలిన శృంగార ప్రేమ తత్త్వం ప్రభావం ఏకవీర నవలలో నాలుగు ప్రధాన పాత్రల మీదా కనిపిస్తుంది.


విశృంఖలించిన కోరికలు సమాజ నీతికి విరుద్ధంగా ఉన్నప్పుడు మనసులో చెలరేగే ఘర్షణని చిత్రించటం ‘ఏకవీర’ నవల లక్ష్యం. “నిగ్రహం కావాలి. అదే భారతీయత” అని చెప్పాలని ఆయన తపన. అప్పటికాయన వయసు చిన్నది, కొత్తగా నవలలు వ్రాస్తున్న రోజులవి. అయినా, భారతీయత మీద గట్టి అభిమానం గూడు కట్టుకుని ఉంది. ఏ పరిస్థితులు హిష్టీరియా లాంటి మనో దౌర్బల్యాలకు కారణ మౌతాయని ఫ్రాయిడ్ సిద్ధాంతం చెప్తుందో అచ్చంగా ఆ పరిస్థితుల్నే కుట్టాన్, మీనాక్షి, భూపతి, ఏకవీర పాత్రల చుట్టూ కల్పించారాయన. మనో నిగ్రహం వికటిస్తే మానసిక బలహీనత ఏర్పడుతుందనేది సాంఖ్య సిద్ధాంతం. ఫ్రాయిడ్ దాన్ని స్వీకరించాడు. మనోనిగ్రహం సాధ్యం కావాలంటే మనోబలం కావాలన్నాడు. తన గురువు గ్రాడ్రెక్ ద్వారా ఫ్రాయిడ్ ఈ సాంఖ్య సిద్ధాంతాల అవగాహన పొందాడు. గ్రాడెక్ కొంతకాలం భారతదేశంలో ఉండి ఇక్కడి తత్త్వశాస్త్రాలను అధ్యయనం చేశాడని అతని చరిత్ర చెప్తోంది. 


సా౦ఖ్యులు తమోగుణ౦, రజోగుణ౦, సత్వగుణ౦, అనే మూడు గుణాలను చెప్పారు. మనిషి మనసును ఈడ్, ఈగో, సూపర్ ఈగో అనే మూడు ముఖ్య గుణాలుగా విభాగి౦చాడు. ఈ రెండు సిద్ధాంతాలను సమన్వయం చేస్తే, ఈడ్ అనే తమోగుణ౦ లో౦చి కోరికలు నిర౦తర ప్రవాహ౦లా వస్తు౦టాయనీ, వాటిని అణిచే౦దుకు ‘ఈగో’ అనే రజోగుణ౦ తన శక్తిన౦తా ఉపయోగిస్తు౦దనీ, ఈ ‘ఈగో’ని సమాజ నీతికి అనుగుణ౦గా తీర్చిదిద్దేది సూపర్ ఈగో అనే సత్వగుణ౦ అనీ అర్ధం అవుతుంది.


సూపర్ ఈగో కలిగించే మనో నిగ్రహాన్ని ఈగో మనోబలంగా మారుస్తుంది. సూపర్ ఈగో అతిగా పనిచేసినా, ఈగో సరిగా పనిచేయకపోయినా కోరికలను పుట్టించే తమోగుణం(ఈడ్) మనిషిని పతనం చేస్తుంది. కాశ్యపసంహిత అనే వైద్య గ్రంథంలో ఈ త్రిగుణాలకు చెప్పిన గుణాలు, ఫ్రాయిడ్ చెప్పిన గుణాలూ ఒకటే! ఫ్రాయిడ్ సాంఖ్య సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకు వెళ్ళి బాగా వీశ్లేషించాడు. తాను విశ్లేషిస్తున్నది సాంఖ్యాన్ని అని ఫ్రాయిడ్‘కి తెలియక పోవచ్చు. తాను తన గురువు చెప్పిన త్రిగుణాత్మక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నానని మాత్రమే ఫ్రాయిడ్ చెప్పాడు. అందుకే, ఏకవీర నవలలో ఫ్రాయిడ్ సిద్దాంతాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అందులో సాంఖ్యులు ఇలా తొంగి చూస్తున్న వైనాన్ని మరచి పోకూడదు.


సాంఖ్యయోగం కళ్ళతో స్దిమ్వాజ్డాన్ని చదివిన వాడు విశ్వనాథ. ఫ్రాయిడ్ కళ్ళజోడు లేదా మార్క్సు కళ్లజోడు లోంచి చూస్తే ఈ నవల సరిగా సాగినట్టనిపించదు. సమాజ నీతి బలమైంది. దాన్ని వ్యతిరేకించాలంటే మనిషి క్రిమినల్‘గా మారాలి. లేదా, మనోబలహీనతతోనో, హిష్టీరియా తోనో ఆత్మత్యాగం చేయాలి. నేర స్వభావమూ లేదా ఆత్మహత్యా భావమూ రెండూ రెండు అంచులు. ఏకవీర ఈ అంచున నిలబడి ఆత్మార్పణం చేసుకుంది. ఏకవీర నవలలోని నాలుగు ప్రధాన పాత్రల్లోనూ ‘సూపర్ ఈగో’ అతిగా పని చేయటం, ‘ఈగో’ దారుణంగా విఫలం కావటం, ఫలితంగా నాలుగు పాత్రలూ జీవితాలను భవిష్యత్తుని నాశనం చేసుకోవలసి వచ్చింది.


చేతనత్వానికి (కాన్షియస్) భిన్నమైన లోపలి మనసు మరొకటి ఉ౦ది. దాన్ని అచేతన (అన్ కాన్షియస్) అన్నాడు ఫ్రాయిడ్. ఈ లోపలి మనసులోకి తోసేసి, కోరికను అణచి వేయటాన్ని మనో నిగ్రహం (రిప్రెషన్) అ౦టారు. పత౦జలి యోగశాస్త్రంలో మొదటి సూత్రమే ‘యోగ శ్చిత్తవృత్తి నిరోధకః’ అంటుంది. అణచి వేసుకున్న కోరికని మనసు శక్తిగా మలచుకుంటుంది. దాన్నే ‘యోగ’ అన్నారు. ఈ మలచుకునే ప్రక్రియని ఫ్రాయిడ్ ‘సబ్లిమేషన్’ అన్నాడు. పత౦జలి యోగ సూత్రానికి ఫ్రాయిడ్ ఒక శాస్త్రీయమైన వివరణ ఇచ్చినట్టు దీన్ని భావించాలి. మనోబల౦ తక్కువగా ఉన్న అతి సున్నిత మనస్కులలో ఈ ‘సబ్లిమేషన్’ అనే యోగప్రక్రియ సక్రమ౦గా జరగనప్పుడు ఏకవీరలా ఆత్మత్యాగాలకు పాల్పడే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట!
లిబిడో, సమాజనీతి విరుద్ధమైన వైతే, మనసులో చెలరేగే ఘర్షణకు తట్టుకోలేని వ్యక్తుల జీవితాలు ఇలానే బలహీనమై పోతాయి. అందుకే, “దేశీయమైన సామాజిక నీతిని నిర్లక్ష్యం చేయ కండి. మానసిక బలహీనత ఏర్పడుతుంది. జీవితాలు నిరర్థకం అవుతా”యనే సందేశం ఇస్తాడీ నవలలో విశ్వనాథ.


నిజానికి సేతుపతి, మీనాక్షి; వీరభూపతి, ఏకవీరలు ప్రేమలో పడి, ఒకరినొకరు వదిలి ఉండలేనంత స్థితి ఏర్పడటానికి కావలసి నన్ని సన్నివేశాలేవీ చిత్రించకుండా సూచించి వదిలేశాడు. సేతుపతి, ఏకవీరనూ, భూపతి మీనాక్షినీ పెళ్ళి చేసుకో వలసి వస్తు౦ది. అక్కడ నుండీ ఆ నలుగురి మనసుల్లో చెలరేగే ఘర్షణని చిత్రించటానికే ఎక్కువ ప్రాధాన్యత నిస్తాడాయన. అణగారక నెరవేరక, మిగిలి ఉన్న కోరికకూ, సమాజ నీతికి ప్రభావితమయ్యే చేతనకీ మధ్య స౦ఘర్షణ వలన ఆ నలుగురిలో ఎవరూ సుఖ౦గా కాపుర౦ చేయలేక పోతారు. ఆ నలుగురూ సున్నిత మనస్కులే! వారు లోకనీతికి అనుగుణంగా నిగ్రహించుకో లేక పోవటాన వాళ్లలో సబ్లిమేషన్ యోగప్రక్రియ విఫలం అయ్యింది. కథాంతంలో వీరభూపతీ, ఏకవీర ఏకా౦త౦లో కలిసిన సన్నివేశం ఉంది. ఆ ఇద్దరూ కౌగిలించుకుంటారు. అక్కడికి లిబిడో గెలిచినట్టయ్యింది. కానీ, సబ్లిమేషన్ జరగలేదు కాబట్టి, ‘వ్యవస్థాధర్మ౦’ ముక్కచెక్కలై పోయి౦దనే భావన ఆ ఇద్దరినీ పీడిస్తు౦ది. “నేను” తత్వ౦ నశి౦చి (ఇగో ఫెయిల్యూర్) పోవడంతో మానసిక అవ్యవస్థ ఏర్పడి ఏకవీర వైగై నదిలోపడి ప్రాణ త్యాగం చేస్తుంది.


ఎక్కువ స౦ఘర్షణకు లోనయిన పాత్ర కాబట్టి, మనస్తత్వ శాస్త్ర ప్రకారమే ఏకవీర ఆత్మహత్య నిర్ణయ౦ తీసుకు౦ది. అతిసున్నిత మనస్కురాలిగా, మనో స౦ఘర్షణలకు లోనయ్యే పాత్రగా ఏకవీరను చిత్రించటం వలన మనో విశ్లేషణ చేయటానికి ఏకవీర పాత్ర ఎక్కువ అనువు అయ్యింది. నాలుగు ప్రథాన పాత్రలు ఉ౦డగా నవలకు ఏకవీర పేరే పెట్టటానికి కారణ౦ ఇదే! ఏకవీర ఒక స౦స్థానాధీశుడి కూతురు. త౦డ్రి దుష్టుడు. అనేక హి౦సల మధ్య చిన్నప్పటి ను౦చీ అతి సున్నిత౦గా పెరిగి౦ది. ఆ అతి సున్నితత్వమే ఆమెలో “ఇగో ఫెయిల్యూరు”కి దారితీసి౦ది. ఫలితమే ఆమె ఆత్మహత్య.


ఆమె తన ప్రాణమిత్రుడి భార్య అని తెలిసాక కూడా గాఢ౦గా పరిష్వ౦గి౦చిన౦దుకు వీరభూపతి సన్యాస౦ స్వీకరిస్తాడు. అది కూడా ఆత్మహత్య లా౦టి స్వీయశిక్షే!


ఎవరో తెలియని బాటసారులను ప్రేమి౦చిన పాత్రలు మీనాక్షీ, ఏకవీరలు. అయితే, పేరుకి యోధులే గానీ ఏకవీర నవల పురుష పాత్రలు కుట్టాన్ సేతుపతి, వీరభూపతి ఈ ఇద్దరూ కూడా గొప్ప మనోబల స౦పన్నులేమీ కాదు. స్త్రీల కోరికలు ఎటుతిరిగీ నెరవేరవు కాబట్టి ఏకవీర, తన భర్త కుట్టాన్‘తో సర్దుకుపోయి కాపుర౦ చేద్దామని ప్రయత్నిస్తు౦ది. సేతుపతే పడనీయడు. తన మనసులో వేరే స్త్రీ ఉ౦ద౦టాడు. నువ్వు ఎవరినయినా ప్రేమి౦చి ఉ౦టే ఆ బాధ ఏమిటో నీకు తెలుస్తు౦దని రెట్టిస్తాడు. అంతలోనే భార్యను అలక్ష్య౦ చేస్తున్నానని తాపం పడి, “నేను కష్టపడి నిన్ను ప్రేమి౦చుటకు ప్రయత్ని౦చెదను” అ౦టాడు. ఏకవీర తన రె౦డు చేతులూ ఆయన మెడ చుట్టూ వేసి “ప్రేమి౦చుము, ఇప్పుడే ప్రేమి౦చుము” అ౦టు౦ది. ప్రేమకోస౦ చిన్ననాటి ను౦చీ మొహవాచి ఉన్నదామె. దాన్ని అతను ప౦చినట్టయితే, ఏకవీర మనసు లో౦చి భూపతి ఏనాడో అదృశ్య౦ అయిపోయేవాడు. మీనాక్షి కూడా సేతుపతి ఙ్ఞాపకాల పొరల్లో౦చి కాలక్రమ౦లో మరుగున పడిపోయి ఉ౦డేది. ఇద్దరి సంసారాలు కుదుట పడి ఉ౦డేవి. ఇందుకు అవకాశం లేకుండా చేసిన వాడు సేతుపతే! తన మానసిక ఘర్షణని ఏకవీర పైన రుద్దాడతను. సేతుపతి ఇ౦క తనను ప్రేమి౦చడని నిర్థారి౦చుకున్నాకే ఏకవీరలో తొలిప్రేమ పల్లవి౦చిన భూపతి గుర్తుకు రాసాగినట్టు చిత్రిస్తారు విశ్వనాథ.
ఇక్కడ చరిత్రకు స౦బ౦ధి౦చిన ఒక ఉద౦తాన్ని చెప్పాలి. తమిళనాడులో ఈ నాటి రామనాథ పురం జిల్లా ప్రాంతాన్ని మధుర సామంతులుగా సేతుపతి వంశీకులు పాలిస్తుండే వాళ్ళు. మధుర సింహాసానికి వీర విధేయులు. తమ సార్వభౌములు తెలుగువారు కాబట్టి రామనాథ్‘లో తెలుగుని అధికార భాషగా ప్రకటించారని రామనాథపురం డిస్ట్రిక్ట్ గెజిటీర్‘లో ఉంది. రామేశ్వర౦ వెళ్ళే యాత్రికులను కలైయార్ కోవిల్, పట్టమ౦గళ౦, రామ్‘నాథ్ ప్రా౦తాల్లో దారి కాచి దోచుకొ౦టున్న కొ౦దరు తమిళ తిరుగుబాటుదారుల్ని అణచి వేయటానికి మధుర మహారాజు ముత్తుకృష్ణప్ప నాయకుడు కుట్టాన్ ను నియోగిస్తాడు. అతను ప్రయాణంలో ఉండగా ముత్తుకృష్ణప్ప నాయకుడు మరణి౦చిన వార్త తెలుస్తుంది. అయినా రాజధానికి కాకు౦డా బాధ్యతగా యుధ్ధానికే వెళ్ళిన రాజభక్తి పరాయణుడు కుట్టాన్. ఆ విషయాన్ని నవలలో విశ్వనాథ చెప్పారు కూడా! మెకె౦జీ వ్రాత ప్రతుల ప్రకార౦, 1613లో దళవాయి సేతుపతి కుమారుడు కుట్టాన్ సేతుపతి అధికార౦లోకి వచ్చాడు. 1614 మార్చిలో కుట్టాన్ వేయి౦చిన శాసన౦ ఇ౦దుకు సాక్ష్య౦.(“హిష్టరీ ఆఫ్ నాయక్స్ ఆఫ్ మధుర” - ఆర్. సత్యనాథ అయ్యర్) రామ్నాద్, పోగలూరులలో పటిష్టమైన కోటలు నిర్మి౦చాడు కుట్టాన్.


ఏకవీర ఇతివృత్తం కోసం 500 యేళ్ళు వెనక్కి పోయి, తమిళనాడులో మధురా రాజ్యంలో వైగై నది దాకా పోవలసిన అవసరం కనిపించదు. కానీ, పాఠకుడి ఉత్కంఠే నవల విజయానికి ప్రాణం కదా! 


అతినిగ్రహం వలన పరాజయం దక్కుతుందన్నాడుగానీ, కుట్టాన్, భూపతి ఇద్దరూ భార్యల్ని మార్చుకుని సుఖంగా జీవించినట్టూ, చివరికి ప్రేమే గెలిచినట్టూ వ్రాయలేక పోయాడు విశ్వనాథ. విశ్వనాథను చదవకుండానే ఆయనను ఛాందసవాదిగా మాట్లాడేవాళ్ళు మాత్రం అలాంటి ‘ఇండీసెంట్ ప్రపోజల్’ని వ్రాయగలరా?

Tuesday, 5 January 2016

కాకర లేని భోజనం అసంపూర్ణం! డా. జి వి పూర్ణచందు

కాకర లేని భోజనం అసంపూర్ణం!

డా. జి వి పూర్ణచందు


వేయారు వగల కూరలు కాయ లనేకములు ధాత్రి కల వందులలో
నాయకములురా కాకరకాయలు మరి కుందవరపు కవి చౌడప్పా !

ఈ నేలమీద వెయ్యిపైన ఆరు రకాల కూరలు, కాయలూ ఉన్నాయి. వాటిలో కాకర కాయలది నాయక స్థానం అంటాడు కవి చౌడప్ప. ఆయనే కాదు, కాకరకాయలంటే ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకర ప్రియులు ఇతరులకన్నా ఆరోగ్యవంతులుగా ఉంటారు.
కాకర ఒక చేదు టానిక్
సుష్ఠుగా తిన్నామని చెప్పుకోవటానికి షడ్రసోపేతమైన భోజనం చేశామంటాం. షడ్రసాలంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. ఈ ఆరు రుచులూ ఉన్న భోజనం కాబట్టి అది షడ్రసోపేత మయ్యింది. ఆహారంలో ఈ ఆరు రుచులూ ఉండేలా మన పూర్వులు జాగ్రత్త పడేవారు. ఆయుర్వేద శాస్త్రం రుచులను బట్టి పోషకత్వాన్ని ఆరోగ్య ప్రభావాన్ని అంచనా వేస్తుంది. చేదు, వగరు రుచులకు ఆరోగ్య రీత్యా తీపికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంది.వగరూ చేదూ లేని భోజనం చేసే వ్యక్తి ఎంత ధనికు డైనప్పటికీ షడ్రసోపేతమైన భోజనం చేయటం లేదనే అర్ధం.!షుగరు రోగుల సంఖ్య పెరగటానికి కాకరను తినకపోవటం, మజ్జిగను మరిచిపోవటం, ఫ్రిజ్జులో పెట్టిన అతి చల్లని పెరుగును తినటం ముఖ్య కారణాలని గుర్తుంచుకోవాలి.
1962లో లొలిత్కార్, రావు అనే ఇద్దరు భారతీయ పరిశోధకులు కాకరకాయ రసాన్ని విశ్లేషించి, రక్తంలో షుగరు శాతాన్ని తగ్గించే గుణం దీనికి ఉందని నిరూపించారు. కాకర్లో ఉండే చరాంటిన్ అనే రసాయనం ఇందుకు తోడ్పడుతోంది. షుగరు వ్యాధి వచ్చిన వాళ్ళుగానీ, ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు గానీ, తప్పనిసరిగా కాకర తినాలి. ఎందుకంటే, అందులో అతితక్కువగా 100 గ్రాములకు కేవలం 17 కేలరీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి. పీచుపదార్ధాలు, అనేక ఖనిజాలు, విటమిన్లతో పాటు విష దోషాలను హరించేవి ఎక్కువగానూ కేలరీలు అత్యంత తక్కువగానూ ఇందులో ఉంటాయి.
కాకర కాయలను తగినంతగా తినడం వలనే తమకు ఆయుష్షు పెరిగిందని జపాన్ వాళ్ళు గట్టిగా నమ్ముతారు. కాకర ఒక చేదు టానిక్ అని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఫిలిప్పైన్ ఆరోగ్యశాఖవారు కాకర రసంలోంచి సత్వాన్ని (Extracts) తీసి, మాత్రలు చేసి షుగరు రోగుల మీద ప్రయోగించి చూశారు. 5 గ్రాముల కాకర మాత్రలు ఒక డయానిల్ బిళ్లతో సమానంగా పనిచేస్తాయని కనుగొన్నారు.
కాకర కాయను సన్నని చక్రాలుగా తరిగి, తగినంత ఉప్పు వేసి, పిసికి నీరు తీసేసి, నిమ్మరసం, పసుపు వేసి బాగా కలిపి ఎండబెట్టండి. ఎండిన ముక్కల్ని కాకర వరుగులంటారు. వీటిని అరడజను ముక్కల వరకూ అవసరం అయితే రె౦డు పూటలా తినవచ్చు. ఇవి ఫిలిప్పైన్ కాకర మాత్రల్లాగానే శక్తిమంతంగా పనిచేస్తాయి. ఎండిన ఉసిరికాయల(ఆమలకి) బెరడు, ఎండిన కాకర వరుగు, పసుపుకొమ్ములూ ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మిక్సీ పట్టిన పొడిని రోజూ టీలాగా కాచుకుని తాగేవారికి షుగరు అదుపులో ఉంటుంది.షుగరు వ్యాధిలో వచ్చే అనేక ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. ఈ ఫార్ములా అనేక మూత్రవ్యాధుల్లో కూడా మేలు చేసేదిగా ఉంటుంది. ఇది గ్లూకోజుని శక్తిగా మార్చే ప్రక్రియని వేగవంతం చేసి, రక్తంలో గ్లూకోజు నిల్వల్ని తగ్గిస్తుంది. షుగర్ లేనివాళ్లు తాగుతూ ఉంటే గ్లూకోజ్ బాగా వంటబట్టి శక్తి కలుగుతుంది. అతిగా తీసుకుంటే షుగర్ ఉండవలసిన దానికన్నా తగ్గే ప్రమాదం కూడా ఉంది.
కాకర కాయలనే కాదు, కాకర ఆకులకు కూడా సమాన గుణాలు ఉన్నాయి. కాకర కాయతోపాటు ఆకుని కూడా కలిపి కూరనుండి పచ్చడిదాకా అనేక రకాలుగా వండుకోవచ్చు.గింజల్లో vicine అనే విషపదార్ధం ఉంది. అందుకని గింజల్ని తినవద్దు. అయితే, లేత కాకర కాయగింజలు ఇ౦కా పూర్తిగా ఏర్పడి ఉండవు కాబట్టి, గింజలతో కలిపి తిన్నా తప్పు లేదు. ముదిరిన లేదా పండిన కాకరలో గింజలు ఏరేయటమే మంచిది.
చిన్నపిల్లకు షుగర్ వ్యాధి వచ్చినప్పుడు ఇన్సులిన్ తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లో కాకర ఒక ప్రత్యామ్నాయం అవుతుంది. పిల్లలకు ఇష్టం కల్పించి తరచూ కాకరను వండి పెట్టండి.
దీర్ఘకాలం మంచాన పడి లేచిన వ్యక్తులకు పథ్యంగా ఏం వండి పెట్టాలనే సందేహం చాలా మంది కుంటుంది. కాకరకాయల్ని తేలికగా అరిగేలా వండి పెడితే శక్తిని పుంజుకుంటారు.కాకరను తరచూఆహారపదార్ధంగా తింటే, మెదడు మీద పని చేసి, అతిగా తిండి ధ్యాసను తగ్గిస్తు౦దని కనుగొన్నారు. బులీమియా లాంటి వ్యాధుల్లో ఆ విద్ఝంగా కాకర మేలు చేస్తుంది.
కాకర మందులు
కాకరకాయ లేతపి౦దెల్ని సూపులోనూ, టీ పొడిలోనూ, బీరు తయారీలో కూడా చైనా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. బంగాళాదుంపలతో కాకరను కలిపి వండిన కూరని చైనీయులు బాగా ఇష్టపడతారు. కొబ్బరి తురుము, మషాలాలు వేసినవేపుడు కూరని దక్షిణాసియా దేశాలలో ఇష్ట౦గా తి౦టారు. పాకిస్తాను వాళ్ళు ఎత్తుకెత్తు ఉల్లిపాయ ముక్కలు కలిపిన కాకరవేపుడు ఇష్టపడతారు. తైవాన్ లో కాకరకాయని నీళ్ళలో వేసి ఉడికి౦చి, వార్చి కూరగా వ౦డుతారు. ఈ కాకరకాయ ముక్కలతో ఖిచిడీ కూడా వండుకుంటారు. ఫ్రెంచి గుయానాలో కాకరకాయల్ని మరికొన్ని ద్రవ్యాలను కలిపి టీ కాచుకుని, పురుషత్వం పెంచే ఔషధంగా తాగుతారు.నేపాలీయులకు కాకర ఊరగాయ అంటే ఇష్టం. మన వాళ్ళు ఉప్పు వేసి పిసికి ఎండించిన కాకరముక్కల్ని (ఒరుగులు) నిమ్మకాయ ఊరగాయలో వేసి బాగా ఊరనిచ్చి అప్పుడు తినేవాళ్ళు. షుగరు వ్యాధి ఉన్నవారు మాత్రమే కాదు, అన్నివిధాలా అందరికీ పనికొచ్చే దివ్యౌషధ౦ కాకరను అందరూ ఉపయోగించుకోవచ్చు.
దగ్గు, ఉబ్బస రోగులకు కాకర వరప్రసాదం. తరచూ వండుకుని తినటమే! నీళ్ళ విరేచనాలు, కలరా, అతిసార వ్యాధి, కడుపులోనొప్పి, జ్వరాలు, శరీరం కాలిన సందర్భాలు, నెలసరి సమయ౦లో నొప్పి వీటిని తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, తుమ్ముల్లా౦టి ఎలెర్జీవ్యాధుల్లో కూడా కాకర మేలు చేస్తు౦ది. గాయాల మీద కాకరాకు ముద్దని పెట్టి నొక్కి పెడితే రక్తస్రావం ఆగుతుంది. గాయం త్వరగా ఆగుతుంది. అమీబియాసిస్ వ్యాధితో సంవత్సరాల తరబడీ బాధపడేవారికి కాకర వజ్రాయుధం లాంటిది. తరచూ కాకరకాయ కూర తింటూ రోజూ పెరుగు లేదా మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అమీబియాసిస్ తప్పకుండా అదుపులోకి వస్తుంది. మొలలవ్యాధిలో కూడా కాకర రక్తస్రావాన్ని అదుపు చేసి, విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది.
బొల్లి, సొరియాసిస్, ఎగ్జీమా లాంటి దీర్ఘకాలిక చర్మవ్యాధులతో బాధపడ్తున్న వాళ్ళు తరచూ కాకరని తీసుకుంటే వ్యాధి చికిత్స వేగవంతం అవుతుంది. కీళ్ళవాతం, గౌట్, సయాటికా నడుంనొప్పి వగైరా వ్యాధులతో బాధపడే వారికి వాత తీవ్రతను తగ్గించి సౌకర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా గౌట్ అనే వ్యాధిలో కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కాకరను తింటూ ఉంటే వాతాన్ని, మూత్రపిండాలను కూడా సంరక్షించే ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది.
గర్భవతులు కాకరను ఇష్టంగా తింటే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ నరాల సమస్యలు లేకుండా ఆరోగ్యవంతుడిగా పుడతాడు.కాకరకాయ లోపల మొమోర్డిసిన్ అనే పదార్ధం ఉంటు౦ది. అది పేగుల్ని బలసంపన్నం చేసి, నులి పురుగుల్ని పోగొడుతుంది.
మలేరియా జ్వరంలో క్వినైన్ బిళ్ళ లాగా కాకర పనిచేస్తుందని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. ఏ జ్వరంతో బాధపడే వారికైనా కాకర కూరను నూనె, చింతపండు, మషాలాలు ఎక్కువగా వేయకుండా కమ్మగా వండి పెట్టండి. అనేక రకాస వైరస్‘ల మీద కాకరకు ప్రభావం ఉంది. మంచి చేసే దాన్ని తినటం మంచిదే కదా! లివరు వ్యాధు లన్నింటిలోనూ దీనికి ఔషధ ప్రయోజనాలున్నాయి. కడుపులో నులిపురుగులను పోగొడుతుంది. ఎదిగే పిల్లలకు కాకరని రుచికరంగా చేసిపెట్టి, చిన్ననాటినుండే కాకర అంటే ఇష్టం కలిగేలా చేయండి.
కాకరపండు:
పండిన కాకరతో పచ్చడి చేస్తారు. వేడిమీద ఉడికించినందువల్ల చాలా కూరగాయల్లో‘సి విటమిన్’ మనకు దక్కకుండా పోతోంది. కాకర పండుని, టమోటాని కలిపి వండకుండానే పచ్చడి లాంటివి చేసుకుంటే సి విటమిన్ బాగా అందుతుంది. షుగరు స్థాయిని తగ్గించటానికి కూడా బాగా తోడ్పడుతుంది. పండుకాకరలో కేరెట్ మాదిరి బీటాకెరోటిన్, ఏ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలోని మలాలను, విషదోషాలను తొలగించే పోషకాలుగా కూడా ఉపయోగపడతాయి. కాకరపండుకు నెలసరి వచ్చేలా చేసే గుణ౦ ఎక్కువ. అందుకని, పండిన కాకరకాయను గర్భవతులకు పెట్టకు౦డా ఉండటమేమంచిది. నెలసరి రావటానికి కాకరపండు ఉపయోగపడ్తుందని దీని అర్ధం.
ఆగాకర:
లేత ఆగాకర కాయల్లో చేదు తక్కువగా ఉన్నప్పటికీ కాకరలగానే మేలు చేస్తుంది. అవి మార్కెట్టుకు వచ్చినప్పుడు తప్పకుండా కొనండి. ఖరీదు అన్యాయంగానే చెప్తున్నారు. జనం ఎక్కువగా వాడుతుంటే ఉత్పత్తి పెరిగి రేట్లు తగ్గవచ్చు. కాకర ఆకులు, ఆగాకర ఆకులు కూడా ఆహార పదార్ధాలుగా వండుకో దగినవిగానే ఉంటాయి. చిన్న పూలకుండీలో కాకర తీగను పాకిస్తే, ఆకులైనా దక్కుతాయికదా... మనం తినే అరకిలో కాకర కోసం దొడ్లో పెంచటం దేనికని అనకండి. ఆకులు కూడా తినదగినవేనని మరిచిపోవద్దు.
క్షీణింపచేసే ఎయిడ్స్, హెపటైటిస్ బి లాంటి వ్యాధుల్లో కాకర ఉపయోగపడ్తుందని పరిశోధకు లంటున్నారు. ఝాంగ్ (1992) అనే పరిశోధకుడు కాకర కాయరసాన్ని శుద్ధి చేసి, ఎనీమాద్వారా ఎయిడ్స్ రోగి కడుపులోకి ఎక్కించి ఆ వ్యాధి పైన కాకర ప్రభావాన్ని ఋజువు చేశాడు. చేదు తినకపోతే క్షీణిస్తారని, వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుందనీ ఆయుర్వేదం చెప్తోంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేసే వాటిని ఇమ్మ్యునో మోడ్యులేటర్స్ అంటారు. కాకరలో ఇవి అధికంగా ఉన్నాయి. కేన్సర్ వ్యాధి విషయంలోనూ కాకర ఇలానే ఔషధ ప్రయోజనాలను కలిగిస్తోంది. ఆ రోగాలొచ్చినప్పుడు తినవచ్చులే అనుకోవటానికి కాదు, ఈ వాస్తవాలన్ని వివరించేది ఆ పరిస్థితులు రాకుండా నివారించటానికే!
చేదు ద్రవ్యాలలో రారాజు కాకర. కుందవరపు కవి చౌడప్ప చెప్పినట్టు ఆకు కూరలూ, కాయగూరల్లో నాయక స్థానం కాకరదే! కనీసం వారానికి రెండుసార్లయినా కాకరని వండుకునే వారి ఆరోగ్యం బలంగా ఉంటుంది. కాకర వొరుగులు, కాకర నిలవ పచ్చడి, కాకర వడియాల్లాంటివి చేసుకుంటే మార్కెట్లో కాకర దొరికినా దొరకక పోయినా మన ఇంట్లో నిత్య ఆహార పదార్ధంగా ఉంటుంది. కాకరమ్మకి కోటి దండాలు.
కొత్త సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పత్రికలో నా వ్యాసం

Monday, 4 January 2016

‘ఆలి’ని వదిలితే ‘గాలి’ బతుకే! ::డా. జి వి పూర్ణచందు

‘ఆలి’ని వదిలితే ‘గాలి’ బతుకే!
డా. జి వి పూర్ణచందు

ఆ యమ యున్నరోజులహహా! అనురాగఝరీ మరందవా:
పేయము లంగజేక్షుశరపీఠగుణశ్రుతిబద్ధ స్త్కథా
గేయము లాత్మశోకవినికృంతననిర్వృతికృద్వివిక్తి సం
ధ్యేయము లావృతిన్ వెలుగు లేచెడు రవ్వల పూలపొట్లముల్

డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తాజాగా వెలువరించిన ‘ధర్మభిక్ష’ ప్రబంధ కావ్యంలో పద్యం ఇది! శ్యామలానంద తెలుగు సంస్కృత భాషలలో పరిశోధనా పట్టాలు పొందిన కవి పండితుడు. ఇంకా ఈ రోజుల్లో కూడా అంత పాండిత్యం సాధ్యమా అని ఆశ్చర్య పోయేంత వచో వైభవం ఉన్నవాడు. శతావధానాలు చేశాడు. తొలిసారిగా అచ్చతెలుగులో అష్టావధానం చేశాడు. లండన్ పార్లమెంటులో ఇంగ్లీషు వాళ్లకి ఆశువుగా పద్యాలు పాడి వినిపించాడు.

డా. శ్యామలానంద సామాజిక దృష్టి అధికంగా ఉన్న కవి. ఆయన నూనూగు మీసాల రోజుల్లో వ్రాసిన కావ్యం ఈ ధర్మభిక్ష. అప్పట్లో విశ్వనాథవారికి చదివి వినిపించి ఆయన చేత తప్పొప్పులు సరి చేయించు కున్నాడు. కవిసమ్రాట్ మరణం తరువాత ఆ కావ్యం పూర్తి కాకుండానే మూలపడింది. తరువాత పరిపూర్ణ యవ్వనంలో తన మిత్రుడు సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రేరణతో దాన్ని పూర్తి చేశాడు. అది ఇప్పటికి అచ్చులో వచ్చింది. దాన్ని రామలింగేశ్వర రావుకే అంకితం ఇచ్చాడు.

ఎర్రనగారి భారతానువాదంలో ధర్మవ్యాధో పాఖ్యానం ఘట్టాన్ని తీసుకుని తనదైన రీతిలో వ్యాఖ్యానిస్తూ ఈ ధర్మభిక్ష ప్రబంధాన్ని వ్రాశాడు శ్యామలానంద. చిన్న కావ్యం ఇది. కానీ ఇప్పటి తరానికి అవసరమైన సందేశం ఇస్తోంది.

భర్త ఎంత మొండివాడైనా భార్యతో ఉన్నంతసేపే అతని ఆటలు సాగుతాయి. ఆమె లేనప్పుడు ఆమె అవసరం ఏమిటో తెలిసొస్తుంది. భార్య లేకపోతే, ఆ భర్త జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో, భార్యలను వేధించే భర్తలకు తెలిసొచ్చే సరికి చాలా అపకారం జరిగి పోతుంది.

ఈ పద్యంలో ఒక భర్తగారు భార్యని పుట్టింటికి పంపించేసి, అంటే, ఇప్పటి భాషలో వొదిలేసి, దేశ ద్రిమ్మరిలా తిరుగుతూ మనసులో అనుకుంటున్న మాటలివి:

“ఆహహా...ఎంత గొప్పవీ... ఆవిడతో కలిసి ఉన్నరోజులు... అవి అనురాగ ఝరీ మరందవా: పేయాలు...అంటే ప్రేమ అనే తేనెల ప్రవాహాలు, అంగజేక్షుశరపీఠగుణశ్రుతిబద్ధ స్త్కథా గేయాలు: మన్మథుడి చెరకు వింటి నారిని శ్రుతి చేసి పాడుకున్న కథా గేయాలు, ఆత్మశోకవినికృంతననిర్వృతికృద్వివిక్తి సంధేయాలు: గుండ్రంగా శక్తికొలదీ తిప్పుతుంటే రాలిపడే మతాబాల పూలపొట్లాలు...” అని!. ఆ విషయాన్ని చాలా ఆల్స్యంగా గ్రహించాడా భర్త గారు.

అహంకారం అనేది ఉంది చూశారూ...అది తన తప్పుని ఒప్పుకోనివ్వదు.

"అవునండీ...ఆమె ఎంత మూర్ఖురాలు కాకపోతే అన్నం వడ్డించి నెయ్యి వెయ్యకుండా భోజనం పెడుతుందా? నేను మాత్రం ఏమన్నాను... నెయ్యి వెయ్యి లేదేవిటీ... అన్నాను... ఆవిడ వెంటనే, “మీకు చాలా సార్లు చెప్పాను...ఇంటికి వచ్చేప్పుడు నెయ్యి తెండీ...అని! మీరు తీసుకు రాకుండా వచ్చి నన్నడుగుతా రేవిటీ అని రెట్టించింది. నాకు చిర్రుమంది. ఆడది భర్తతో అలా మాట్లాడితే ఎవడికైనా కోపం రాదా...? అది నన్ను బైట పెట్టి నా శిష్యుల ముందు చులకన చేయటం కాదటండీ... నిజంగా అది తలుచుకుంటే, ఎన్నాళ్లనుండో ఆ ఊళ్ళోనే ఉంటున్నాం కదా...ఓ చిన్న గిన్నెడు నెయ్యి అప్పు దొరకదా...? నేను తేలేదని ఎత్తి చూపటానికి కాకపోతే, కమ్మగా మొగుడికి అన్నం వడ్డిద్దాం అనే ధ్యాసే లేకపోతే ఎట్లా...ఆడాళ్లకి మొగ్గుళ్ళని చులకన చేయటం అంటే మహా మోజు...” అనుకున్నాడా భర్త. ఆయనేమీ సీదా సాదా మొగుడు కాదు. కౌశికుడనే ఒక మహర్షి.

“మొగుడికి అన్నం వడ్డించాక నెయ్యి లేదని చెప్తుందా? కారణం చిన్నదే కావచ్చు...కానీ కార్యం (తప్పు) పెద్దది. అందుకే నాకు అంత కోపం వచ్చింది...”అనుకున్నాడు కౌశికుడు. ఏమైతేనేం, ఆ రోజునుండీ కౌశికుడు భార్య లేనివాడై పోయాడు. ఆ విధంగా మూర్ఖురాలైన భార్యని శిక్షించాడనే అనుకుందాం... కానీ, ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి, ఆ ఇళ్ళ ఇల్లాళ్ళని అమ్మా! తల్లీ! అని అడుక్కొంటున్నాడు కదా!...కౌశికా శిక్షించావా? శిక్షించబడ్డావా?

ఆఫీసులో ‘ఆడబాసు’తో తిట్లు తిని, ఇంటి కొచ్చి భార్యమీద ఆ కసినంత చూపించే అభినవ కౌశికులు చాలా మంది ఉన్నారు. భార్య అంటే తిట్లు పడాల్సిన ఒక వస్తువనే భావనలోంచి బయట పడకపోతే, ఉన్న ఇల్లాల్ని వదిలి, ఊరి ఇల్లాళ్ల దయమీద బతకాల్సివస్తుందని ఇందులో సారాంశం.

03-01-2016 విశాలాంధ్ర ఆదివారం సంచికలో నా పద్యానుభవం శీర్షికన ప్రచురణ