అధికార మదం
డా. జి
వి పూర్ణచందు
“అభ్రమండలి మోచునందాక నూరక/పెరిగినట్లౌ మేను నరవరేణ్య
యవధి భూధర సానువందాక నూరక/పరచినట్లౌ మేను పార్థివేంద్ర
యబ్జ భూభువనంబునందాక నూరక యెగసినట్లౌ మేను జగధీశ
యహిలోకతల మంటు నందాక నూరక/పడినయట్లౌ మేను ప్రభువతంస
యఖిల జగములు మ్రింగునంతాకలియును
నబ్దులేడును జెడగ్రోలు నంత తృషయు
నచల చాలన చణమైన యదట గలిగె
నసురభావంబు నను జెందు నవసరమున”
ఆల్కాహాల్ సేవించిన వాడిలో కలిగే లక్షణాన్ని ‘మదం’ అంటారు.
మదం వలన చెలరేగి ప్రవర్తించటాన్ని ‘మదాత్యయం’ అంటారు. అప్పటిదాకా `ఏవండీ’ అన్నవాడు కాస్తా, రెండు చుక్కలు పడగానే ‘ఏరా’లోకి దిగిపోతాడు. “మదం ఎక్కిందా?’’ అని మందలించడం తెనాలి రామకృష్ణుడు “కల్లు జవి గొన్నావా? లం…” అని తిట్టిన తిట్టు లాంటి దన్నమాట.
మందుకొట్టాక, మదం ఎక్కగానే కొన్ని లక్షణాలు పేట్రేగుతాయి. ఆకాశం దాకా పెరిగిపోయి దాన్ని
ఆక్రమించా నను కుంటాడు. భూమికి ఆ అంచునుంచీ ఈ అంచుదాకా అంతా తనదే పొమ్మంటాడు. కింద
పాతాళం కూడా తన ఆధీనం లోదే నంటాడు. అన్ని లోకాల్నీ కబళించేయాలన్నంత ఆకలి, సప్త సముద్రాలనూ తాగేయాలన్నంత దాహమూ కలిగి, అది తీరక మళ్ళీమళ్ళీ మదిర
సేవిస్తుంటాడు.
ఇలా లోకాల్ని కబళించే కలలు తియ్యగా కనటాన్ని పామర భాషలో ‘కిక్కు’
అనీ, పండిత భాషలో ‘మదం’ అనీ అంటారు. తను తలుచుకుంటే ఈ కొండని ఒక్క తన్ను తన్ని
సినిమాలో లాగా అవతలికి విసిరి కొట్ట గలననుకునే వింత తత్వమే మదం. చివరికి ఏ
మురుక్కాలువ పక్కనో పడున్నాడని తెచ్చి తెలిసినవాళ్ళు అప్పచెప్తుంటారు. మదం తెచ్చి పెట్టే
ప్రమోదమూ,
ప్రమాదమూ ఇలా ఉంటాయి.
‘మదం’ మందు కొట్టటం వలన మాత్రమే కలగాలని లేదు, ‘అధికార మదం’ అంతకన్నా ఎక్కువ కిక్కు ఇస్తుంది. పదవిలోకి వచ్చీరావటమే ‘ఐ. వీ. ఇంజెక్షను’లా వెంటనే అధికారమదం తలకెక్కిపోతుంది. చిటికెలో కిక్కెక్కే
గుణాన్ని ‘యోగవాహి’ అంటారు. అంతటి శక్తి ఒక్క ‘అధికార పదవి’కి మాత్రమే ఉంది. పదవి
రాగానే పైన ఆకాశం దాకా,
కింద పాతాళం దాకా, చుట్టూ ఆకొన నుండి ఈ కొన
దాకా మొత్తం తన కబ్జా లోనే ఉండా లంటాడు. లోకాలన్నింటినీ కబళించేస్తాననీ, సప్త సముద్రాల్ని తాగేస్తాననీ అంటాడు.
లోకానికి హాని చెయ్యడం కోసం మనిషి లోపలికి ఓ రాక్షసుడు
ప్రవేశిస్తాడు. ఆ రాక్షసుడు అతన్ని ఆక్రమించి నప్పుడు అతనిలో కలిగే ఇలాంటి లక్షణాల్నే
‘మదం’ అంటారు. ‘మందు మదం’ భ్రమను కల్పిస్తే, ‘పదవి మదం’ దాన్ని నిజం చేస్తుంది.
పైన చెప్పిన పద్యం అల్లసాని పెద్దనగారి ‘మనుచరిత్ర’ లోది. తనకు
వైద్యం నేర్పటానికి బ్రహ్మదత్తుడనే ముని ఒప్పుకో లేదని, ఇందీవరాక్షుడు ఆయన వైద్య
పాఠాలు రహస్యంగా విని వైద్యం నేర్చేసుకుని, తిరిగి ఆ ముని దగ్గరకే వెళ్ళి
వెక్కిరిస్తాడు. ఒళ్ళు మదం ఎక్కి కొట్టుకోవటం అంటే ఇదే! దాంతో ముని అతన్ని
రాక్షసుడివై పొమ్మని శపించాడు. ఆ క్షణంలో అతన్ని ఒక రాక్షసుడెవరో ఆవహించినట్టు తాను
భూమ్యాకాశ పాతాళాల దాకా పెరిగిపోయిన భావన పొందినట్టు, లోకాల్ని కబళిస్తు న్నట్టు, సముద్రాల్ని
తాగేస్తున్నట్టు అన్పించిందని, ఇందీవరాక్షుడు స్వారోచిషుడికి
చెప్పటం ఈ పద్యంలో కనిపిస్తుంది.
ప్రతి మనిషిలోనూ ఒక సైతాన్ ఉంటాడు. మనసులోని సత్వగుణం ఈ
సైతాన్ని అణచి ఉంచాలని చూస్తుంది. సత్వం గెలిస్తే మనిషి మానవుడు అవుతాడు. సైతాన్
గెలిస్తే మనిషి పొలిటికల్ మాఫియా అవుతాడు. ఇది ఎవరో
పుణ్యాత్ముడు ఇచ్చే శాపం వలనే జరగాలని లేదు. మనిషి
మనసులో సాత్వికాంశ పలచ బడే కొద్దీ సైతాను తనకు తానుగా విజృంభిస్తుంటాడని ఫ్రాయిడ్
సిద్ధాంతం. “నాది దుందుడుకు స్వభావం. కోపం వస్తే కొడతాను. తప్పేంటి?” అని ఒక నేత బహిరంగంగా అన్నాడంటే, పాపాలకు శాపాలు కారణం కాదనీ, అవి భస్మాసుర వరాలేననీ అర్ధం అవుతుంది.
వెనకటికి ఒక బామ్మగారు “నీ ఇంట కోడి కాల్చా” అని శపిస్తే, శుభం అన్నాడట పక్కింటాయన రొట్టలేస్తూ! ఈ రోజుల్లో బ్రహ్మదత్తుడు వచ్చి దుర్మార్గం
చేసిన వాణ్ణి ‘బ్రహ్మ రాక్షసుడివైపో’ అని శపిస్తే, వెంటనే సదరు దుర్మార్గుల వారు ముని గారికి ఆజన్మాంతం ఋణపడి ఉంటా నంటాడు. జన్మజన్మలకూ
రాక్షసుడిలాగే ఉండనివ్వాలని, శాప విమోచనం వద్దనీ అంటాడు.
‘Drive the Devi out-నీలో సైతాన్ తరిమేయ్’ అనేది
పాత పాట! “Keep the Devil in-నీలో సైతాన్ని దాచేయ్-దోచేయ్”
అనేది నేటి మేటి నీతి.
No comments:
Post a Comment