Monday, 30 November 2015

సింహంగారి భార్య :: డా. జి వి పూర్ణచందు

సింహంగారి భార్య

డా. జి వి పూర్ణచందు

“అగ్నిని నూరేండ్లు అర్చన సల్పియును
అర్చకుండీల్గడే యందు దాబడిన”


“వందేళ్ళపాటు అగ్నిని అర్చించినంత మాత్రాన అర్చకుడు పొరబాటున ఆ అగ్నిలో పడితే మాడి, మసి కాకుండా ఉంటాడా?” అనేది ప్రశ్న. దేని స్వభావం దానిది. కాలే గుణం అగ్నిది. అర్చించే గుణం మనిషిది. కాల్చే ముందు “అయ్యో వీడు నన్ను పూజిస్తున్నాడుగా...అనే మీమాంస అగ్నికి ఉండదు. మనిషీ అంతే! పొరబాటున పట్టుకుంటే కాలకుండా ఉంటుందని అగ్నిని అర్చించటం లేదు. స్వభావం తెలుసుకుని మసలు కోవటంలో యుక్తి ఉంది. అది అగ్నికి లేదు. మనిషికి ఉంది. మనిషి ఆ యుక్తిని ఎవ్త మేర ఉపయోగించ గలుగుతున్నాడో సందేహమే!

“సింహానికి బానిసలా సేవ చేయటాన్ని దేనికి కోరుకున్నావు...” అని సివంగిని అడిగితే అది గొప్ప లోక సత్యాన్ని చెప్తుంది. సింహం తిని వదిలిన మాంసాన్ని నేను తింటున్నాను. కష్టపడి వేటాడాల్సిన అవసరం నాకు లేదు. సింహం శౌర్యప్రతాపాల ఆశ్రయంలో ఉంటున్నాను. అదే నాకు, నా పిల్లలకూ రక్ష....” అంటుంది. “అంత విశ్వాస పాత్రంగా సింహానికి సేవ చేస్తున్నావు గానీ, దానికి దగ్గరగా తిరక్కుండా దూరం దూరంగా ఉంటావేమిటీ?” అనడిగితే సివంగి ఈ ద్విపద చెప్తుంది... “అగ్నిని నూరేండ్లు అర్చన సల్పియును/అర్చకుండీల్గడే యందు దాబడిన” అని! 

సింహం ఎంత మొగుడైనా, వాడికి ఎంత సేవ చేసినా వాడి కోపాగ్నికి అబల బలికాక తప్పదు. లోకంలో మగాళ్ళంతా ఇంట్లో సింహాలై గర్జిస్తారు. అందుకే ఇల్లాళ్ళు ఈ సివంగిలా తమ జాగ్రత్తలో తాము అంటీ ముట్టనట్టు ఉంటారన్నమాట.

ఈ ద్విపద సౌదీ దేశానికి చెందిన ఒక మహాకవి వ్రాసిన “గులిస్తాన్” అనే పారసీ కావ్యానికి కవికోకిల దువ్వూరి రామిరెడ్డి “గులాబీ తోట” పేరుతో చేసిన అనువాద్ కావ్యంలోది. వచనం, పద్యం, వ్యాఖ్యానం మిశ్రమంగా ఈ కావ్యం సాగుతుంది. కొండంత లోక వ్యవహారాల్ని చిన్నచిన్న సాదృశాలతో వివరించిన ప్రయత్నం ఇది. 

“ఇంతటి ప్రాఙ్ఞత ఎవరి దగ్గర నేర్చుకున్నావని లక్మాను అనే ఙ్ఞాని నడిగితే, “గుడ్డివాణ్ణి చూసి! ఎందుకంటే అంధుడు నేల తడువుకోకుండా కాలు పెట్టడు కాబట్టి” అని సమాధానం చెప్తాడు. ఇలాంటి అపూర్వ సాదృశాలు, కవితలు, కథలు, పూర్వ కాలపు సౌదీ రాజుల స్వభావాలు అన్నింటినీ గుదిగుచ్చిన గులాబీలమాల ఈ “గులాబీ తోట”పుస్తకం. ఇందులో ప్రతి అంశం చాలా ఉత్సాహకరంగానూ, నేటి సమాజానికి అన్వయించేదిగానూ ఉంటుంది. మచ్చుకు కొన్ని చూద్దాం

ఒక రాజుగారు అన్యాయంగా శిక్ష వేశాడని ఓ విదేశీ ఖైదీ తనభాషలో రాజుని తిట్టటం మొదలెట్టాడు. వాడి మాటలకు అర్ధం ఏమిటని రాజు అడిగాడు. మంత్రుల్లో ఒకడు లేచి “ప్రభూ! దీనుల్ని కనికరించే వాణ్ణి దేవుడు కరుణిస్తాడని అంటున్నాడు” అని చెప్పాడు. ఈ మంత్రికి విరోధి అయిన మరో మంత్రి లేచి, అదంతా అబడ్ఢం అంటూ, ఆ ఖైదీ ప్రభువుని ఏమేం తిట్టాడో అవన్నీ బిగ్గరగా చెప్పేశాడు. అప్పుడు రాజు అంటాడు... “ఆ మంత్రి చెప్పిన అబద్ధమే నువ్వు చెప్పిన నిజం కన్నా నన్ను ఎక్కువ సంతోష పెట్టింది. ఆ అబద్ధం మంచి ఉద్ధేశంతో. నీ నిజం అతని మీద అసూయతో...” అని!.

“ఓ అమాయకుడికి అందమైన అమ్మాయినిచ్చి రహస్య మందిరంలో సమస్త సౌకర్యాలూ కల్పించి తలుపులు వేసి ఏకాంతం కలిగించారనుకుందాం. పళ్ళు పుష్కలంగా కాసిన తోటకు కాపలాదారుడు లేనట్టు అంతా అనుకూలంగా ఉన్న ఆ పరిస్థితుల్లో అతను తన బుద్ధి బలంతో చిత్త చాంచల్యానికి లోను కాకుండా తనను తాను రక్షించుకోగలడా?” అని అడుగుతాడు రాజు. దానికి ఓ పండితుడి జవాబు: “ఒకవేళ అతను కామోద్రేకం నుండి తప్పించుకున్నా పరనిందా పరాయణుల నుండి తనను తాను కాపాడుకోలేడుకదా! సాధ్యమౌ దనమతి శాసించి నిలుప/ నయిన లోకుల నాల్కల నరికట్టదరమే” అంటాడు.

ఓ ఆసామికి అంద వికారమైన కూతురుంది. ఎన్ని సంబంధాలు చూసినా కుదరక పోయే సరికి ఓ అంధుడికిచ్చి పెళ్ళి చేశాడు. పెళ్ళయ్యాక ఆ ఊరికి గుడ్డివాళ్లకు కళ్ళు తెప్పించే ఓ వైద్యుడు వచ్చాడు. “మీ అల్లుణ్ణి కూడా ఆ వైద్యుడికి చూపించ వచ్చు కదా!” అనడుగుతారు. ఆసామి పెద్ద మీమాంసలో పడ్తాడు... అల్లుడికి కళ్ళొస్తే, తన కూతురి అందవికారాన్ని చూసి ఇబ్బంది పెడ్తాడేమో...” అని. 

గులాబీ తోట కావ్యం పారసీ మూలం (గులిస్తాన్) వెయ్యేళ్ళ నాటిదైనా, దానిలో భావాలు నేటికీ వర్తించేవిగానే ఉన్నాయి. అమీబా నుండి ఆర్మ్‘స్ట్రాంగ్ దాకా సాగిన ఈ సృష్టి పరిణామ క్రమంలో అభివృద్ధి ఎంతో కనిపించవచ్చు. కానీ మౌలికమైన స్వభావాల్లో ఏ మాత్రం మార్పులేదనేది సత్యం. వానరుడు నరుడైనా కోతి లక్షణాలు కోతివే! నరుడు మానవుడౌటమే దుష్కరం.

తేట తెలుగులో సాగిన దువ్వూరి రామిరెడ్డిగారి గులాబితోట కావ్యం పునర్ముద్రణ పొందటం అవసరం.

No comments:

Post a Comment