Monday, 2 November 2015

శాకపాకాల్లో మాంసకృత్తులు :: డా. జి వి పూర్ణచందు

శాకాహారం ఒక మానవతా యత్నం - 2
శాకపాకాల్లో మాంసకృత్తులు :: డా. జి వి పూర్ణచందు
ఆహారాన్ని మనం రుచి కోసం తింటున్నాం. బలం కోసం తింటున్నాం, ఆరోగ్యం కోసం తింటున్నాం. కానీ, వీటిలో మొదటి దానికే ప్రాధాన్యత నిస్తున్నాం. రుచిగా ఉన్నవన్నీ బలకరంగా ఉండాలని లేదు. బలకరంగా ఉండేవన్నీ ఆరోగ్యదాయకమూ కావాలని లేదు. మాంసాహారం రుచికరం. బలకరం కూడా! కానీ, దాని ఆరోగ్యకరమైన గుణాలగురించి ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. మాంసాహారమే కాదు, శాకాహారానికీ ఈ సూత్రం వర్తిస్తుంది.
ఆరోగ్యకరంగా ఆహారం ఎలా ఉండాలో తెలుసుకోవటం మన బాధ్యత, అవసరం కూడా!
మనకన్నా పాశ్చాత్యులు ఎక్కువ మాంసాహార ప్రియులు. వాళ్ళకి గొడ్డు మాంసం, పందిమాంసం లాంటి సెంటిమెంట్లు లేకపోవచ్చు. కానీ, అక్కడా ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధు లున్నాయి. ప్రొటీన్లను మాంసం ఒక్కటే కాదు, అనేక కూరగాయలు, పప్పు ధాన్యాలు కూడా అందిస్తున్నాయి. కేవల మాంసం వలన అపకారం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రొటీన్ల కోసం ఎక్కువ మాంసం తినాలనటం కూడా శాస్త్రీయం కాదని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. కేవల శాకపాకాలతో కోడి రామ్మూర్తులు తయారౌతారు. ఆయన సంగతి తెలుగు వాళ్ళు మరిచిపోయారు.
గ్రీకు భాషలో ప్రొటియోస్ అంటే ప్రాధమికమైనది లేదా మూలకారకమైనది అని అర్ధం. జీవకణాలలో నిర్మాణాత్మకంగా క్రియాత్మకంగా ఈ ప్రొటీన్లు తమవంతు పాత్రని పోషిస్తున్నాయి.
వేరుశనగ పప్పు లాంటి పప్పు ధాన్యాల్లో నూనె పదార్ధాలుంటాయి కాబట్టి మంచిది కాదంటారు గానీ, మాంసంతోపాటుగా మనకడుపులోకి వెళ్ళే కొవ్వు పదార్ధాలతో పోల్చినప్పుడు అది తక్కువే!
ఒక కొత్త కణం పుట్టటానికీ, ఆ కణం పై పొర(cell membrane) దృఢంగా ఏర్పడటానికీ, కణజాలాలు (Tissues), అంగ ప్రత్యంగాలు(Organs) ఆరోగ్యవంతంగా ఏర్పడటానికి, వాటికి మరమ్మతులకు, రక్త వ్యవస్థను నిర్వహించటానికి, జీవనక్రియలన్నీ సక్రమంగా జరగటానికి, హార్మోన్లు, ఎంజైములు తయారవ టానికి, వాటి రవాణాకు, వాటివాటి విధుల నిర్వహణకు, శారీర రక్షణ యంత్రాంగానికి కావలసిన యాంటీబోడీలు ఉత్పత్తికీ, శక్తి ఉత్పత్తికీ, మాంసకృత్తులు అవసరం అవుతాయి. మాంసం గానీ, మాంసకృత్తులు కలిగిన ఇతర పప్పు ధాన్యాలు గానీ తగినంతగా మనం తీసుకో గలగాలి.
మనం ఆహారం తీసుకోగానే ముందుగా జలవిశ్లేషణ (Hydrolysis)జరుగుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని రసధాతువు ఏర్పడటంగా చెప్తారు. మన ఆహారంలోని ప్రొటీన్ పదార్ధాలు ఈ రసధాతువులో పెప్టైడ్లుగా మార్తాయి. తరువాత అమైనో ఆమ్లాలుగా విడిపోతాయి. ఈ అమైనో ఆమ్లాలు రక్తం ద్వారా శరీరంలోని ప్రతీ కణానికీ చేరతాయి. అక్కడి నుండి మాంసం, ఎముకలు, ఎముకల్లోని మజ్జ, చివరికి Vital Energy (శుక్రధాతువు)గా పరిణమిస్తాయి.
చిన్నపిల్లలకు 10గ్రాముల ప్రొటీన్ సరిపోతుంది. హైస్కూల్ స్థాయి వరకూ 19-34 గ్రాముల ప్రొటీన్ కావాల్సి ఉంటుంది. యవ్వనంలో 50గ్రాముల వరకూ కావాలి. పెద్దవాళ్ళకు వాళ్ళ బరువును బట్టి 80 కిలోల వరకూ ఇంకో 10గ్రాముల ప్రొటీన్ అవసరం కావచ్చు. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు మరికాస్త ప్రొటీన్ ఇవ్వవలసి ఉంటుంది. ఇదంతా మాంసం ద్వారానే లభిస్తుందనుకోవటం పొరబాటు. శాకాహారం కూడా దీటుగానే ప్రొటీన్లను అందిస్తుంది.
100 గ్రాముల కందిపప్పులో 22.3గ్రా, పెసరపప్పులో 24.5 గ్రా, శనగపప్పులో 17.1 గ్రా, మినప్పప్పులో 24 గ్రా, సోయాలో 43.2 గ్రా, వేరుశనగ గింజల్లో 26.7 గ్రా. ప్రొటీన్లుంటాయి. మునగాకు, తోటకూర, పుదీనా, మెంతి ఆకు వీటిలో 7 గ్రా. వరకూ ప్రొటీన్లుంటాయి. యాలకులు:10.2గ్రా. మిరప కారం:15.9గ్రా, ధనియాలు: 14.1గ్రా, జీలకర్ర: 18.7గ్రా, మెంతులు:26.2గ్రా, వాము17.1గ్రా, నల్ల మిరియాలు11.5గ్రాముల ప్రొటీన్లున్నాయి. పాలు, పెరుగు, మజ్జిగ వీటిలో 3-4% ప్రోటీన్లుంటాయి. గొడ్డుమాంసం లాంటి పాలిచ్చే జంతువుల మాంసంలో కూడా ఎక్కువలో ఎక్కువ 30-36% ప్రోటీన్లే ఉంటాయి.
తక్కిన సుగంధ ద్రవ్యాలతో పోలిస్తే అల్లం వెల్లుల్లి మిశ్రమంలో ప్రొటీన్లు తక్కువ కాబట్టి, వాటికి ప్రాధాన్యత తగ్గించి తగుపాళ్లలో ధనియాలు, మెంతులు, మిరియాల్లాంటివి కలుపుకుంటే సమతుల్య ఆహార పదార్ధం తయారవుతుందన్నమాట. శాకాహారులు వంటకాలను కలగూరగా వండుకున్నట్టే, మాంసాన్ని కూడా కూరగాయలతోనూ ప్రొటీన్లు బాగా ఉన్న సుగంధ ద్రవ్యాలతోనూ కలిపి వండుకోవటం మంచి అలవాటు.
రోజువారీ భోజనంలో కూర, పప్పు, పచ్చడి, పులుసు(రసం), పెరుగు/మజ్జిగ ఇలా కనీసం నాలుగు రకాల వంటకాలు ఉన్నప్పుడు ప్రొటీన్లు తగినంతగా శరీరానికి అందుతాయి. తెలుగువారి శాకాహార విధానం శాస్త్రీయమైంది. ఇది 2,500 యేళ్ళ క్రితం చరక సుశ్రుతులు సూచించిన భోజన విధి! నలుగురున్న ఒక ఇంట్లో కిలో మాంసం వండితే గానీ కావల్సిన ప్రొటీన్లు అందవు. కలగూరగా అంటే, వివిధ కూరలమిశ్రమంగా వండినప్పుడు తక్కువ మాంసంతో ఎక్కువ ప్రొటీన్లను తీసుకోగలుగుతాము. విదేశీ వంటకాలకూ, మన వంటకాలకూ ఉన్న తేడా ఇదే!
ఇంకా ఉంది

No comments:

Post a Comment