Monday, 13 July 2015

మానవ చకోరాలు :: డా. జి వి పూర్ణచందు

మానవ చకోరాలు
డా. జి వి పూర్ణచందు

పొగిలెద వొంటిపాటున ‘గువూకువు’ యంచు బ్రతిక్షణమ్ము బై
కెగసెదు, పల్కెలంకులకు నేగెదు సైకతభూమి దారి నె
వ్వగ మెడ వ్రేలవైచెడు భవచరిత్రమ్ము విచిత్రమయ్యె నీ
మగువను వీడి కాదుగద మా కెరిగింపుము చక్రవాకమా?

చక్రవాక చకోరాలు అపురూప పక్షిరాజాలు. అవి ఉన్నాయో లేదో తెలీదు. ఎవరో వచ్చి ఏదో ఇచ్చి పోతారని ఎదురు చూసే వాళ్ళని ఈ పక్షులతో పోలుస్తారు... అవి కూడా వానకోసమో మరి దేని కోసమో ఎదురు చూస్తూనే ఉంటాయెప్పుడూ!

సామాన్యుడి సంగతి సరే, ఈ దేశంలో సగటు మేథావి మాత్రం చేస్తున్నదేముంది, ఎదురు చూడటం తప్ప! రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలోనూ, సంపన్నులు ఆదాయం పన్ను కట్టే సమయంలోనూ, సామాన్యులు ‘నిత్యావసరాల’ కోసం మాత్రమే ఎదురు చూస్తారు. అవి తీరితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. కానీ మేథావులు మాత్రం, ఒకణ్ణి దింపి ఇంకొకడు ఎక్కే వరకూ ఎదురుచూస్తారు. ఆ ఇంకొకడు ఎక్కాక వాడు దిగేవరకూ మళ్ళీ ఎదురు చూస్తారు. నిరంతర చకోరాల్లా ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళ కళ్ళు కాయలు కాసి ఉంటాయి. చేతులు మాత్రం పట్టుకుంటే పువ్వుల్లా కంది పోతూ ఉంటాయి.

ఒకసారి నదీతీరంలో ఇసుక నేలల్లో మెడ వ్రేలాడవేసి కుప్పకూలి ఉన్న ఓ చక్రవాకం పింగళి, కాటూరి కవుల కళ్ళలో పడింది. అది ఎవరి ఆసరా కోసమో ఎదురు చూస్తోన్న దానిలా కనిపించింది వాళ్ళకి… “అహో! చక్రవాకమా! అపురూపమైన పక్షిరాజమా! వంటరిగా ఇలా ఈ ఇసుకనేలలో కూలబడి పొగిలి పొగిలి ఏడుస్తున్నావు? కుహూ కుహూ అంటూ ఎగురుతూ తిరిగే వాడివి కదా...? నీ ప్రియురాలి కేమైనా అయ్యిందా? ఇది వియోగ దుఃఖం కాదుగదా!” అని ఆ పక్షిని పలకరించారు.

 “ఎడబాటు” అనే ఖండకావ్యం లోదీ పద్యం. ‘కోకిల’-‘ఎడబాటు’ ఈ రెండు ఖండ కావ్యాలనూ కలిపి ఒకే పుస్తకంగా తెచ్చారు. ఈ పద్య కావ్యానికి వందేళ్ళ వయసుంది. అవి సత్తెకాలపు రోజులు. ప్రకృతి, వికృతిగా మారకుండా పదిలంగా ఉన్న ఆ రోజుల్లో `అమలిన శృంగారంఒక సిద్ధాంతంగా ప్రబలి ఉండేది. కాబట్టే పింగళి - కాటూరి ఆ అక్కుపక్షిది వియోగ దుఃఖంగా ఊహించారు. ఈ వందేళ్ళ ఆకలిరాజ్యంలో వియోగాలు త్యాగాలు కావ్యాల్లోంచి కనుమరుగయ్యాయి. ‘అమలినానికి బదులు మలినం, వియోగానికి బదులు సంయోగం, త్యాగానికి బదులుఅయితే నాకేంటిధోరణులు కావ్య లక్షణాలైనాయి. 
ఇప్పుడు, నదీతీరంలో ఇసుకనేలల్లో ఓ కవిగారికి అలాంటి దృశ్యమే కనిపించింది! ‘పంటభూములన్నీ ఇసుక, ఇటుక, ఇనుముతో ఇరుకై పోయిన ఈ కాంక్రీటు అడవిలో నేల కూలిన చకోరమా! ఒక్కడివే కూలబడ్డావు, నీ రాణి ఏమైంది? నీ గూడు ఏమైంది? నీ కూడు ఏమైంది? నీ కుటుంబం చెట్టుకొకరు, పుట్టకొకరూ అయిపోయారా...? అనడిగాడు కవిగారు.

దానికి ఆ చకోరం గుర్రుగా చూసి, “మొక్కలన్నీ చెక్కలై పోయిన ఈ రాజ్యంలో చెట్టులూ, పుట్టలూ ఎక్కడున్నాయని వాటిని పట్టుకు తిరుగుతామూ...” అని నిలదీసిందాయన్ని.

మరి, నీ ఎదురు చూపులు ఎవరి కోసం…?” సందేహంగా అడిగాడు కవిగారు.

 “కొత్తగా కట్టే ఊళ్ళో కొట్టేసిన మొక్కకి బదులు మొక్కనీ, నరికేసిన అడవికి బదులు అడవినీ, తవ్వేసిన భూమికి బదులు భూమిని ఇస్తారట! ఎక్కడో, ఎప్పుడో, ఎవరో నాటబోయే మొక్క కోసం, పెంచబోయే అడవి కోసం, చదును చేసే భూమి కోసం ఎదురుచూస్తున్నాఅంది చకోరం.

అరవై యేళ్ళ స్వాతంత్ర్యానంతర దేశీయ చరిత్రలో ‘గరీబీ హటావో’ నుండి ‘గరీబోం కో హటావో’ దాకా ఏలుబడి వారు మాట వెంబడి నిలబడిన దాఖలా లేదని తెలిసినా చకోరాలు అలా ఎదురు చూస్తూనే ఉంటాయి. ఎదురు చూపుల్లో ప్రశాంతత ఉంటుంది. ప్రపంచ శాంతి ఉంటుంది. అంతేగానీ, గుడ్లురిమితే ఏముంటుందీకళ్ళ మంటలు తప్ప!

మానవ చకోరాల్లారా? మీ మానాన మీరు అలా మట్టి పిసుకుతూఎన్నాళ్ళు బతుకుతారు? దర్జాగా కాలుమీద కాలు వేసుకుని పడక కుర్చీలో కూర్చుని ఎదురు చూస్డంత్డూ బతకండి! రాబోయే పదేళ్ళలో ఇక్కడ చైనా-జపాన్ వాళ్ళు మయసభ, ఇంద్రసభ, యమసభ, ద్యూతసభ ఒకటేమిటీ... మీరు ఏది కోరితే అది కట్టించి ఇస్తారు. ఎదురు చూడండి! ఎదురు చూడండి!



No comments:

Post a Comment