కప్పలపెళ్ళి
డా. జివిపూర్ణచందు
“అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి
యో/పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నావంకకు వచ్చి, రాక్షస వివాహమునన్ భవదీయ
శౌర్యమే/యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొని పొమ్ము! వచ్చెదన్”” ఇది పోతన గారి పద్యం. ప్రపంచం లోనే తొలి ప్రేమలేఖగా విశ్లేషకులు భావించే
రుక్మిణి ‘ప్రేమలేఖ’లో ముఖ్యమైన పద్యం ఇది.
శ్రీకృష్ణుడికి యాక్షన్ ప్లానుతో లేఖ వ్రాసి ఓ పెద్దాయన చేతికిచ్చి పంపిస్తుంది
రుక్మిణి.“ “పద్మనాభుడవూ, పురుష సింహానివీ అయిన ఓ
కృష్ణా! నా ప్రతిపాదనకి నువ్వు అడ్డు చెప్పేందుకు ఏమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగ బలాల్తో వచ్చి, శిశుపాల జరాసంధుల్ని ఓడించి, రాక్షస వివాహ పద్ధతిలో నన్ను
పరిగ్రహించు. నేను నీ వెంట వస్తాను”” అంటుంది. కానీ, మూలభాగవతంలో
తనను రహస్యంగా వచ్చి తీసుకెళ్ళాలని రుక్మిణి కోర్తుంది. పోతనగారికి
అది నచ్చినట్టు లేదు. చతురంగ బలాల్తో బాహాటంగా వచ్చి తనను గెలుచుకోవాలనటం వలన ఆమె
ఔన్నత్యం నిలబడింది.
పెద్దనగారు తన కావ్యనాయిక వరూధినికి ఈ విధమైన గౌరవాన్ని ఇవ్వలేకపోయాడని కొందరు
పండితుల్లో అసంతృప్తి ఉంది. వరూధిని ప్రవరుడి మీద పడి గోలగోల చేసింది. వనితలు వలచి
వస్తే లోకువా... అని ఈసడించింది. అల్లరి చేసి,
తను అల్ల రయ్యింది.
వీణనో, అద్దాన్నో పుచ్చుకుని వయ్యారాలు పోవటం, చిలక నెత్తుకుని ఆడిస్తూ దానితో పనికిరాని ఊసులాడటం తప్ప
పెద్దనగారి కాలానికి చెందిన కావ్యనాయకులకు రుక్మిణికున్నంత తెగింపు కనిపించదు. పైగా క్షత్రియ
వీరుడితో నడపాల్సిన కథని పెద్దన భూసురోత్తముడితో నడిపించాడు. దాంతో, ‘డామిట్! కథ అడ్డం తిరుగు’తుంది.
కావ్య నాయికల విషయంలో ఇలాంటి అసంతృప్తులు లేకుండా జాగ్రత్త పడాలని తెనాలి
రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం కావ్యంలో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాడు. “కందుకము
గాదు కేళీశుకంబు కాదు,
పల్కువీణియ గాదు,
దర్పణము గాదు, వర్షపిశునంబు బట్ట బల్వరుస
జనిరి చంచలాక్షులు చపల ప్రచారలెందు”అనే పద్యంలో నర్మగర్భంగా కావ్య
నాయికలను ఎద్దేవా చేయటం కూడా కనిపిస్తుంది.
షుమారుగా 70,80 యేళ్ళ క్రితం వరకూ కూడా పెళ్ళికాని ఆడపిల్లల్ని ఓ ‘హార్మోనియంపెట్టె’ముందు కూర్చోబెట్టి ఫొటోలు తీయించే వాళ్ళు. మధ్యతరగతి
మందహాసాలలో ఈ ‘‘హార్మొనీ పెట్టె ఫోటో’’ఒకటి! కంప్యూటరు ముందు
కూచున్న ఫోటోల్లాగానే ఆ రోజుల్లో ‘‘హార్మోనియం పెట్టె ఫోటో’’లుండేవి. పెళ్ళికి సిద్ధంగా ఉన్న పిల్ల ఫోటో’ అని చూడగానే స్ఫురిస్తుంది.
మధ్యయుగాల్లో కావ్యనాయికలు వీణవాయిస్తూన్నట్టూ, గోడకో, స్తంభానికో ఆనుకుని ఒక కాలు వెనక్కి ఆన్చి ఒక చిలుకని పట్టుకొని
వయ్యారంగా నిలబడ్డట్టు, ‘చేతిఅద్దం’లో చూస్తూ ముంగురులు సరిచేసుకుంటున్నట్టు, తామర పూవు పుచ్చుకుని
సుతారంగా ఛాతీ పైన ఆన్చి ఎదురు చూపులు చూస్తున్నట్టు ...ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా
కనిపించేవి! గిరిక, వరూధిని లాంటి నాయికలు
మధురంగా వీణ వాయించగల నేర్పరులు. రతి సంసిద్ధతనీ, ప్రేమను చెప్పుకోవటానికీ వాళ్ళు వీణను
ఉపయోగించేవారు. తెలుగు సినిమాల్లో మనసుమాట తెలిపేందుకు వీణపాటలు బాగానే
ఉపయోగపడ్డాయి.
తెనాలి రామకృష్ణ ఒక భిన్నమైన నాయికని సృష్టించా లనుకున్నాడు. అందుకోసం పాండురంగ
మహత్మ్యం కావ్యంలో అయుతుడి కథని సృష్టించాడు. అయుతుడు శాపవశాత్తూ ఒక కప్పగా మారిపోతాడు.
ఆ కప్పని పట్టుకోవాలని కన్యాకుబ్జ రాకుమారి, ఆమె చెలికత్తెలు ప్రయాస పడుతుంటారు. కావ్యనాయిక ఒక కప్పని చేత్తో పట్టుకుని
విలాసంగా నిలబడ్డట్టుగానో, కందుక క్రీడలాడినట్టుగానో
వర్ణిస్తే పరమ అసహ్యంగా ఉంటుంది. అది, చేతిమీదకు ఎక్కించుకునే చిలుక గానీ, వాయించేందుకు పనికొచ్చే పలుకుతేనెల వీణ గానీ, నిమిషానికోసారి ముఖం చూసుకునే ‘చేతిఅద్దం’గానీ కాదు! అద్దం పట్టుకున్న ఆడవాళ్ళకి కప్పని పట్టుకోవటం
సాధ్యమా...అని తెనాలి కవి యద్దేవా అదే!
ఇప్పటిలాగా ఫేస్‘బుక్కులూ, ట్విట్టర్లూ లేని ఆ రోజుల్లోహంసలూ,
చిలకలూ, కాకులూ, గబ్బిళాలూ ప్రేమ సందేశాలకు
సాధనాలుగా ఉపయోగపడ్డాయి. పలుకుతేనెల వీణ కూడా అటువంటిదే! దూరంగా వినిపిస్తున్న ‘కూనిరాగం’ ‘రమ్మనే సంకేతంగా ప్రియుడు గ్రహించేట్టు గాథాసప్తశతి కాలం నుంచీ కవులు
వ్రాస్తున్న విషయమే! అందుకని, తెనాలి కవి,
తననాయిక చేత ఒక
కప్పని ప్రేమించేలా చేశాడు. నాయిక తనూ శాపం పొంది కప్పలాగా మారిపోతుంది. కప్పనాయకుడు,
కప్పనాయికా చూడముచ్చటగా ఏకం అవుతారు. రుక్మిణికన్నా,
వరూధినికన్నా, ఈ కప్పనాయికలో ఎక్కువ తెగింపు కనిపిస్తుంది!
భర్త అడవులకు పోవాల్సి వస్తే, భార్య కూడా అడవులకు
పోయినట్టే, ప్రియుడు కప్పగా మారితే ప్రియురాలూ కప్పగా మారి పెళ్ళాడటం ఆదర్శవివాహం! వరూధిని ప్రేమ కన్నా, ఫేసుబుక్కు ప్రేమ కన్నాఈ
‘కప్పప్రేమ’గొప్పది!
No comments:
Post a Comment