రేపటి
రాజధాని
డా.
జి.
వి.
పూర్ణచందు
తగ
గోట దాచిన
మగమానికంబుల/తెలిరంగు
లెపుడు వెన్నెలలు
గాయ
మేడలపై
నాడు మెలతలు
దెఱగంటి/కొమ్మలు
నే ప్రొద్దు
గూడి తిరుగ
జిలువ
చామ లగడ్త
వలినీటిపై దేలి/యెరిమతో
ననయంబు నోలలాడ
మేలిమి
బంగారు మేని
పచ్చల చాలు/మిసిమి
మింటికి నెల్ల
బసిమి యొసగ
జదల
రాసిన కొమ్మల
చాలు కతన
మీద
రారాక యల
ప్రొద్దు మెఱుగు
దేఱు
గవనులనె
రాక పోకలుగా
మెలంగ
దనరు
బుడమి బ్రతిష్ఠాన
మనగ వీడు
రాజధాని అంటే ఇలా ఉండాలి. అంతటి రాజధానిని ఆ రోజుల్లో కట్టటానికి మయుడు అనే గొప్ప సివిలు ఇంజనీరు మన పురాణేతిహాసాల్లో ఉండేవాడు. ఆ తరువాత ఆయన తన సంతతితో సహా మెక్సికో వెళ్ళి స్థిరపడ్డాడని కొందరు, లేదా మెక్సికో నుండే వచ్చాడని కొందరు వాదిస్తూ ఉంటారు. భిక్షూ చమన్‘లాల్ అనే పరిశోధకుడు ‘హిందూ అమెరికా’ అనే గ్రంథంలో మెక్సికోలోని ‘మయా’ జాతి ఆదిమ రెడ్డిండియన్లకు భారతీయ నేపథ్యం ఉందన్నాడు. సరే, అది వేరే కథ.
ప్రతిష్ఠానపుర రాజధాని నగర వర్ణనలోకి వద్దాం. `తగ
గోట దాచిన
మగమానికంబుల తెలిరంగు
లెపుడు వెన్నెలలు
గాయ’ ఆ నగరంలో రాజుగారి కోట ఉండేది. కోట అంటే సెక్రెటేరియట్, అసెంబ్లీ, గవర్నరుగారుండే రాజభవన్, ముఖ్యమంత్రిగారి క్యాంపు ఆఫీసు, నివాసం, ఎమ్మెల్యేల ఇళ్ళు, మంత్రుల పేరోలగాలు, వీటన్నీంతోపాటు అన్నీ దొరికే ఆరో ఏడో నక్షత్రాల హోటళ్ళు… వగైరా ఉండే చోటు. ఇవన్నీ ఒకే చోట ఉంటేనే అది రాజధాని అవుతుంది. ఆ కోట గోడలకు మగమాణిక్యాలు తాపటం పెట్టించారట. మణులకు లింగభేదం ఏవిటా అనుకోవద్దు, మగమాణిక్యాలంటే శ్రేష్ఠమైన మణులు. వాటి తెలిరంగులు తళతళలాడుతూ పగలే వెన్నెలలు కాయిస్తాయిట.
కోట లోపల, కోట బయట అన్నీ మేడలే… మేడంటే మేడ కాదు…ఒక్కోటీ ఆకాశాన్నంటేంత గొప్ప మేడ. విమానాలు కూడా తన ఎత్తు పెంచుకుని ఈ నగరం మీంచి ఎగరాలన్నంత ఎత్తైన మేడలు.
మేడలపై నాడు
మెలతలు దెఱగంటి
కొమ్మలు నే
ప్రొద్దు గూడి
తిరుగ
వాటి
పైన మెలతలు అంటే చక్కనమ్మలు ఆడుకుంటున్నారట.
తెరగంటి కొమ్మలు-కన్నార్పకుండా చూడగల నేర్పరులైన
అప్సరసలతో ఈ మెలతలు ముప్పొద్దులా కలిసి తిరుగుతారట. మేడల మీదే ఎందుకు తిరుగు తారంటే కింద నేల మీద తిరగటానికి జాగా లేదు కాబట్టి! గజం స్థలం ఉంటే అక్కడొక మేడ కట్టేయాలన్నంత పరిస్థితి! ముప్పై వేల ఎకరాలు ఏ మూలకి? ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత రాజధాని కదా! ఆడవాళ్ళు ఆడుకోవాలన్నా, మార్నింగు వాకులు చేయాలన్నా అన్నీ టెర్రేసుల మీదే!
“జిలువ
చామ లగడ్త
వలినీటిపై దేలి/యెరిమతో
ననయంబు నోలలాడ…”
ఆ కోట చుట్టూ పెద్ద అగడ్త ఉంది. రాజధానికి భూము లివ్వనన్న వాళ్ళూ, భూములు బలంగా లాక్కోవటాన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష శత్రు మూక కోటలో ప్రవేశించకుండా చుట్టూ తవ్వించిన లోతైన కందకం అది! ఆ అగడ్త వలినీళ్ళలో చిలువ చామలు అంటే నాగకన్యలు పాతాళం నుండి వచ్చి ఒరిమ(అందంగా)తో అనయంబుగా (ఎల్లవేళలా) తేలి ఆడుతూ ఉంటారట. మన ఊరునుండి భూమిలోపలికి తిన్నగా తవ్వుకొంటూ పోతే ఆ చివర అమెరికాలో ఎక్కడో ఒక చోట తేలతాం. అందుకని అమెరికాని పాతాళ లోకంగా భావిస్తారు పండితులు. ఆ పాతాళం పాములకు పుట్టిల్లు. అందమైన పాములు ఈ రాజధాన్ని చుట్టుకుని తేలియాడుతుంటాయి.
“మేలిమి
బంగారు మేని
పచ్చల చాలు/మిసిమి
మింటికి నెల్ల
బసిమి యొసగ”
మేలిమి బంగారంతో కోట శిఖరాల్ని తాపటం చేశారట. ఆ బంగారు రేకులమీద గరుడపచ్చలు పొదిగారట. ఈ రెండింటి ‘చాలుమిసిమి’ అంటే తళతళలతో ఆకాశం అంతా పచ్చరంగులోకి మారిపోయింది. ఎక్కడ చూసినా ‘పసుపురంగు’ తాండవిస్తోందట.
“చదల
రాసిన కొమ్మల
చాలు కతన
మీద రారాక
యల ప్రొద్దు
మెఱుగు దేఱు’ కోట కొమ్మల చాలు అంటే కోటశిఖరాలు లేదా , బురుజుల శ్రేణి. అవి చదల రాసుకొంటో్న్నాయట. చదలం అంటే, ఆకాశానికి అచ్చతెలుగు పేరు. ఈ చదలంతో కోట బురుజులు రాసు కుంటున్నాయిట. నేలనే కాదు, ఆకాశం అంతా రాజధాని కోటలూ మేడలే ఆక్రమించటంతో సూర్యుడి రధచక్రాలకు అవి తగుల్తున్నాయి. దాంతో సూర్యుడు రాలేకపోయాడు. ఇంక ‘చంద్ర’ కాంతికి తిరుగులేకుండా పోయిందని భావార్ధం. చేసేది లేక “చంద్రన్న’’కి తలవంచి నేల మీద ఆరులైన్ల రహదారుల పైన తిరుగుతున్నాట్ట సూర్యుడు. అందుకని వీధులన్నీ వెలిగి పోతున్నాయి.
ఈ పుడమి మీద ప్రతిష్ఠానం పేరుతో ఒక వీడు తనరారుతోందంటాడు పొన్నెగంటి తెలగన్న! ఈ కవిగారు 16వ శతాబ్దిలో గోల్కొండ ప్రభువు ఇబ్రహీం కుతుబ్ షా (మల్కిభరాముడు) దగ్గర అమీనాగా పనిచేసేవాడు. ఈయన తెలగన్న కాదు తెలుగన్నే! అచ్చ తెలుగు పదాలతో ‘యయాతి చరిత్ర’ వ్రాశాడు. అందులోది ఈ పద్యం.
కవిగారు గతంలోకి చూసి ఈ వర్ణన చేశాడో లేక భవిష్యత్తులోకి తొంగి చూసి రేపటి రాజధాని గురించి వ్రాశాడో తెలియదు. ఈ రాజధానిలో సామాన్యులు ఎక్కడ, ఎలా నివసించారో ఆయన చెప్పలేదు. వారిని రాజధాని లోపలికి రానీయకుండా గ్లోబల్ పాములు అడ్డుకున్నాయా?
No comments:
Post a Comment