Tuesday, 14 October 2014

అనువాదంలో తెలుగు దనం :: డా. జి వి పూర్ణచందు


అనువాదంలో తెలుగు దనం
డా. జి వి పూర్ణచందు
“మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!”
                సాగర మథనం జరుగుతోంది. సురాసురు లిద్దరూ పోటాపోటీగా మథనం చేస్తున్నారు. చల్లకవ్వంగా ఒక కొండ, కవ్వం తాడుగా ఒక పాము… అట్నుండి దేవతలు, ఇట్నుండి రాక్షసులు కలిసి చెరోవైపూ నిలబడి రాగుంజులాట, పోగుంజులాట లాగా చిలకగా చిలకగా హఠాత్తుగా అమృతానికి బదులు హాలాహలం పుట్టింది. అది సముద్రాన్ని దాటి పొంగి పొరిలి లోకాల్ని నాశనం చేయసాగింది.
రాక్షసులకు నిలువెల్లా విషమే కాబట్టి హాలాహలానికి వాళ్ళు పెద్దగా భయపడలేదు కానీ, దేవతలు బాగా వణికి పోయారు.
వాళ్ళ భయం వాళ్ళ గురించి కాదు. ఎందుకంటే దేవతలకు చావుపుట్టుకలూ, ఆకలిదప్పులూ ఉండవు కదా…! లోకం గురించే వాళ్ళ ఆందోళన. లోకక్షేమం గురిచి ఆలోచించేవాడు దేవుడు, లోక సంక్షోభ కారకుడు రాక్షసుడు. అందుకని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకొన్నారు. దేవదానవుల గొడవలో తలకాయ దూర్చని శివుడు విష ప్రభావం వలన విశ్వం యావత్తూ అల్లకల్లోలం అవుతోంది కాబట్టి లోకాన్ని కాపాడటానికి ముందుకొచ్చాడు. ఆ హాలాహలం మొత్తాన్ని తాగేస్తానని ప్రకటించాడు! తాగేముందు ఒకసారి తన భార్య పార్వతి వంక చూశాడు.
మామూలు ఇల్లాలైతే భర్త విషం తాగుతానంటే ఎలా స్పందిస్తుందో వేరే చెప్పనవసరం లేదు. కానీ, పార్వతీ దేవి చిర్నవ్వు నవ్వి “హలాగేనండీ” అన్నదట! ఈ పద్యంలో పోతనగారు ఒకే ఒక వాక్యంలో ఇలా చెప్తారు: “మేలని ప్రజకున్ మ్రింగుమనె సర్వమంగళ” అని!
ఆవిడ ధైర్యం అంతా ఆవిడ మంగళ సూత్రమేనట. తన తాడు గట్టిది కాబట్టి, దాన్ని మహాదేవుడు కట్టాడు కాబట్టి,  అది తేలిగ్గా తెగేది కాదు కాబట్టి, జనం మేలు కోసం విషమైతేనేం తాగేయవయ్యా… అని చెప్పిందట. తన మాంగల్యం గట్టిని నమ్ముకున్నదనే సూచన కోసం ఆమెను ‘సర్వమంగళా…’అంటాడు పోతన! మ్రింగేది గరళం అయినప్పటికీ మ్రింగేవాడు తన భర్త కాబట్టి, ప్రజలందరికీ మేలు కలుగు తుంది కాబట్టి, ఆ సర్వమంగళ తన మనసులో మంగళ సూత్రాన్నే ఎంతగానో నమ్ముకుని, శివుడికి తన అంగీకారం తెలిపిందని దీని భావం. భర్త లోకోపకారం చేస్తున్నప్పుడు, ఏ తెలుగమ్మాయైనా స్వంత లాభ నష్టాలను చూడదన్నమాట! ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందన్న ఆంగ్ల సామెతకి ఇది నిదర్శనం.
వీరతిలకాలు దిద్ది భర్తల్ని యుద్ధాలకు పంపిన వీర నారీమణులు, భర్త యుద్ధం లోంచి పారిపోయి వస్తే పసుపు నీళ్ళు పోసి తలంటి, రెచ్చగొట్టి మళ్ళీ యుద్ధానికి పంపిన మహా పతివ్రతలూ ఈ దేశ సంస్కృతికి వారసులు. పార్వతి వాళ్లందరినీ ఒక్క క్షణం గుర్తుకు తెస్తుంది ఈ పద్యం ద్వారా!
శుకమహర్షి ఈ హాలాహలం కథ చెప్పినప్పుడు పరీక్షిత్తుమహారాజుకు  సందేహం వచ్చి, “మహర్షీ! ఎంత మహాదేవుడైతే మాత్రం, ఆయన గరళం తాగుతుంటే పార్వతి ఏమీ అనలేదా?” అని అడిగాడట. అప్పుడు శుకమహర్షి చెప్పిన సమాధానమే ఈ పద్యం.
మూలభారతంలో, శివుడు పార్వతి వంక తాగమంటావా అన్నట్టు చూశాడని, ఆమె చిర్నవ్వుతో ఒప్పుకుందనీ, వర్ణించారు. పోతనగారు ఆంధ్రమహా భాగవత రచన కదా చేస్తోంది… అందుకని, పార్వతిని తెలుగమ్మాయిని చేసి, “నా తాడు గట్టిది!” అనిపిస్తాడు.
తాళి బొట్టుకు తెలుగు మహిళ ఎలాంటి ప్రాధాన్యత నిస్తుందో, ఈ ఒక్క మాట ద్వారా చెప్పేశాడు పోతన. అదీ కవిసమయం అంటే!
నిబద్ధత కలిగిన అనువాదకుడు తను తెలుగులోకి తెస్తున్న కథలో తెలుగుదనం నింపకుండా ఆపుకోలేడనటానికి ఇదే సాక్ష్యం.

తెన్నేటి సూరి రెండు మహానగరాలు నవలను ఆంగ్లం లోంచి తెలుగులోకి తెస్తూ, “సంగీతంలో సాపాసాలు తెలీని వాడు నేను పాడిన బిళహరి రాగాన్ని వెక్కిరిస్తే నా కేవిటీ…?” అని వ్రాస్తాడు. అందుకే ఆ నవల గొప్ప అనువాద నవలగా వాసికెక్కింది.

No comments:

Post a Comment