Friday, 17 October 2014

మిలిటరీ సాంకేతిక తెలుగు పదాలు డా. జి వి పూర్ణచందు



మిలిటరీ సాంకేతిక తెలుగు పదాలు
డా. జి వి పూర్ణచందు
వంకదారులు(జేరి వాకిటి దద్దడం/బులు సెర్చి, కొమ్మల మ్రోకు వైచి,
ప్రాకి లోపలజొచ్చి పలుగాడి దెఱచిన/పంతగార్లకు మున్న, బ్రద్దపరులు
తోన నిచ్చెన లెక్కి లోని కొత్తళములో(/బురణీంచి చొచ్చిన పోటు మగల
వా(డి మెచ్చక, యాళువరి మీ(ద బాళెల/వారి(దా(కించిన  వాసి బిరుదు
లచ్చెరువు నొంద, మేడలు సొచ్చి, యూర్చు
దొద్దకార్లచే(బఱి వోయె(దూర్పుదిక్కు;
ఱాల వాటుల, నేటుల, ఱంతు మిగిలి,
తఱిమి రచ్చటి బలము(గొందఱు గడంగి
ఉత్తర హరివంశం తృతీయాశ్వాసంలో పద్యం ఇది! యాదవుల కోటమీద నడిరాత్రివేళ పౌండరీకుల దాడి వర్ణన ఇది! కోటను స్వాధీనం చేసుకుని ఊరుని దోచుకున్నారు. తూరుపు పగిలినట్టు భళ్ళున తెల్లవారింది. ఇదీ ఈ పద్యంలో సారాంశం.
ఇందులో( మనం మరిచి పోయిన వెయ్యేళ్ళ నాటి గొప్ప తెలుగు పదాలున్నాయి.
వంకదారలు(జేరి: మొదట వంకదారల్లోంచి శత్రు సైన్యం కోటను చేరిందట. వంకలంటే వాగుల్లాంటివి. బహుశా కోట లోపలికి నీరు రావటానికి నదిలోంచి వచ్చిన ఒక కాలువ ద్వారా ప్రవేశించారని అర్థం కావచ్చు కానీ, ఇది వంకదారి కాదు, వంకదార. కోట వాకిటి ముందర వంకదారలు అనే అర్థంలో ఇతర కవుల ప్రయోగాలు కూడా ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపలి వైపు గడియ వేశి, దిగువ భాగంలో చిన్న ద్వారం  వంగి లోపలకు వెళ్ళేలా ఉంటుంది. బహుశా అది వంకదార (wicket) కావచ్చు. శత్రు సైనికులు మూకుమ్మడిగా రాకుండా  ఇది కొంతవరకైనా ఆపుతుంది కదా!  
వాకిటి దద్దడంబులు సెర్చి: వాకిట్లో అంటే కోటకు బయటి భాగంలో దద్దడం లేదా దద్దళం అంటే బోడిమిద్దె. కోట బురుజు. సెర్చి అంటే దాన్ని చెరిచి, ధ్వంసం చేసేశారు.
కొమ్మల మ్రోకు వైచి ప్రాకి లోపలజొచ్చి: కొమ్మలంటే కోటమిద్దెల మీద ఉండే దిమ్మలు. వాటికి మోకు విసిరి ఉచ్చు వేసి పైకి ఎగబాకి కోట పైకి చేరారు.
పలుగాడి దెఱచిన పంతగార్లకు మున్న: పలుగాడి అనేది చిన్నదర్వాజా లాంటిది. పలుగాడి తలుపులు అంటే, చిన్నద్వారం లేదా రహస్య ద్వారం తలుపులు. ఇంతకు మునుపు వంకదార లోంచి మోకులేసి పాక్కుంటూ వచ్చి, బురుజు పైన ఈ పలుగాడి తలుపులు తెరిచి పంతగార్లు(శత్రు మూక)ముందుగా కోట నెక్కారట!
బ్రద్దపరులు తోన నిచ్చెన లెక్కి:  బ్రద్దపరి అంటే ఒక విధమైన పేనుతో చేసిన డాలు. ఇప్పటి రిజర్వ్ పోలీసులు కూడా రాళ్ళ దాడులు జరుగుతున్నప్పుడు పేనుతో అల్లిన పొడవైన రక్షణకవచాన్ని వాడతారు. ఈ డాలు పుచ్చుకున్న సైనికులు నిచ్చెన లెక్కుతుంటే కోట[పైన ఉన్న సైనికులు రాళ్ళు విసిరి, కోటమీంచి ఎగబ్రాకే వాళ్ల ను అడ్డుకుంటూ ఉంటారు. రాళ్ళూ తగలకుండా బ్రద్దపరి అవసరం ఉంటుంది.
లోని కొత్తళములో( బురణించి( చొచ్చిన పోటు మగల వా(డి మెచ్చక: కొత్తడం లేదా కొత్తళం అంటే కోట బురుజు మీద నడిచేందుకుండే దారి. పురణించటం అంటే శత్రువు పురోగమించటం, చొచ్చిన అంటే దూసుకొచ్చిన,, పోటూమగలు= వీరసైనికులు, వాడి మెచ్చక= ఇంత గొప్పగా కోటని ఆక్రమించేందుకు దాడి కొచ్చిన వీరుల్ని లెక్కచేయకుండా,
యాళువరి మీ(ద బాళెల/వారి(: ఆళువరి, ఆలంగం, కొత్తడం ఇవి బురుజుల్లాంటివే! ఒక్కో నిర్మాణానికి, ఒక్కో పేరు ఉండి ఉంటుంది. మన కోటలన్నీ ధ్వంసమైనవే కాబట్టి వాటిని గుర్తించ లేకపోతున్నాం. పాళెలు అంటే, పాలెగార్లు,
దా(కించిన  వాసి బిరుదు లచ్చెరువు నొంద :- తాకించిన-యుద్ధంలో చావగొట్టిన, వాసి బిరుదులు గొప్ప పేరున్న యోధులు, అచ్చెరువు నొంద- ఆశ్చర్యపడేలాగా
మేడలు సొచ్చి:- అంటే నగరం లోకి ప్రవేశించి ప్రజల ఇళ్ళ మీదడాడి చేశారు. ఆర్చు- పెద్దగా అరచు, అరిచి హడావిడి చేశారు. దొడ్డకార్ల చేన్- దొడ్డకార్లంటే కొల్లగొట్టటానికి వచ్చిన వాళ్ళతో
బఱి వోయె(దూర్పుదిక్కు:- తూర్పుదిక్కు పగిలిపోయిందట (the dawn broke). అంటే సూర్యోదయం అయ్యింది. అప్పటి దాకా అంతా విధ్వంసమే కాబట్టి, చీకటి పోయి వెలుతురు రావటాన్ని తూర్పుదిక్కు పగిలిందంటాడు కవి!
ఱాల వాటుల, నేటుల, ఱంతు మిగిలి, తఱిమి రచ్చటి బలము(గొందఱు గడంగి:- ఇళ్ళు కూలగొడ్తుంటే తగిలిన దెబ్బలకీ, దాడి చేయటం వలన తగిలిన దెబ్బలకీ జనం గగ్గోలు (ఱంతు) పెడుతుండగా మిగిలిన యాదవ వీరుల్ని అక్కడినుంచి తరిమేసినప్పుడు భళ్ళున తెల్లవారిందట. ఇక్కడ ఱంతు అంటే కలకలం. రంతు అంటే రతి సంబంధమైన అని అర్థం. ఖచ్చితమైన అర్థం కావాలంటే ఱ (శకట రేఫ-బండి ర) వర్ణం ఉండాల్సిందే! ఇప్పుడు ఆ పదాన్ని మనం వాడకపోయినా ఒకప్పుడు వాడిన దాన్ని చదవటానికైనా వర్ణం ఉండాలి కదా!
ఈ మొత్తం పద్యంలో వంకదార, దద్దడం, పలుగాడి, బ్రద్దపరి, ఆళువరి, ఆలంగం, కొత్తడం, పంతగారు ఈ పదాలన్నీ మిలటరీ సాంకేతిక పదాలు. మనం మరిచిపోయినవి.యుద్ధానికి, కోటలకు పరిమితంగానే ఇన్ని తెలుగు పదాలున్నాయంటే లోతుగా అధ్యయనం చేస్తే ఎన్ని దొరుకుతాయో కదా!   యాళువరిమీద పాళెలుచక్కని పదాల కూర్పు. పాలెగార్లు రెడ్డిరాజుల కాలంలోనే ఉన్నారని కూడా అర్థం అవుతోంది.

No comments:

Post a Comment