వినాయక చవితి సందర్భంగా
ఈ రోజు 29-08-2014 విశాలాంధ్ర దినపత్రికలో గణేశ ఆరాధన మూలాల గురించి నేను వ్రాసిన
వ్యాసం ప్రచురితం అయ్యింది. వినాయక రూపాన్ని స్థిరీకరించటంలో ఆంధ్రప్రాంతం వేదిక
కావటం గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇందులో ప్రస్తావించాను. భారతీయ సంస్కృతి
రూపకర్తల్లో ఆంధ్రుల పాత్ర ముఖ్యమైంది. ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాలు తెలుప
ప్రార్థన-
పూర్ణచందు
మొక్కలయ్య మొక్కుల కథ
డా. జి వి పూర్ణచందు
బుద్ధి దేవర, పంటల దేవుడు, మొక్కలయ్య,
చేటల్లాంటి చెవులుగలిగి, జనంగోడు చక్కగా ఆలకించే వాడు, పసుపు రంగులో కనిపిస్తూ,
పచ్చదనాన్ని లోకాన నింపేవాడు, ధాన్యరాశిని ఆసనంగా చేసుకున్న వాడు, నిరాఘాటంగా
వ్రాయగల వ్రాయసకాడు, పర్యావరణ పరిరక్షకుడూ అయిన గణపతి లోకాని కొక శాంతి సందేశంగా
నిలిచాడు. ఆయన పుట్టినరోజున మనం నేటి పర్యావరణం గురించి, రేపటి మన మనుగడ గురించి
ఆలోచించుకునే అవకాశం కలిగించుకోవాలి!
చైనా బౌద్ధులు ‘లాఫింగ్
బుద్ధ’
రూపాన్ని, భారతీయులు వినాయకుణ్ణీ బుద్ధికి అధిదేవతలుగా రూపొందించుకున్నారు. వాస్తు పేరుతో, ఈ బుద్ధ, వినాయకుల బొమ్మల్ని దిష్టి
బొమ్మలుగా పెట్టుకునీ బుద్ధిహీనతను ప్రదర్శిస్తున్నాం. వినాయకుణ్ణి నవ్వులాటకు
తీసుకోవటం, పనికిరాని కార్టూన్లు గీయటం, తొక్కలో వినాయకుడు లాంటి విసుర్లు వేయటం,
ప్రత్యేక హాస్య సంచికలు ప్రచురించటం ఇవి ఆ మహనీయుణ్ణి తక్కువ చేయటమే అవుతుంది. మూషికాలు
పంటల దొంగలు. గణపతి వాటిని అణచి ఉంచటానికి సాక్షాత్తూ పాముతో నడుం బిగించాడు. పంటని
కాచాడు. అలా ఆయన ‘పర్యావరణ
పతి’
అయ్యాడు. ఈ గణపతి కథ ఈ నాటిది కాదు, ఋగ్వేద కాలం నుండీ మొదలౌతుంది.
*** ****** ***
“గణానాంత్వా గణపతిగ్౦ హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం
బ్రహ్మణాం బ్రహ్మణస్పతా నశ్శృణ్యన్నూతిభి స్సీదసాదనం”
ఋగ్వేదం రెండవ మండలంలో (23.01) కనిపించే గణపతి స్తుతి ఇది.
ఇతరులకన్నా ఉన్నతులుగానూ, భిన్నంగానూ తమ గణవ్యవస్థ తమను నిలిపిందని భావించిన ఆర్యప్రజలు
తమ గణపతులందరికీ పతి అయిన మహాగణపతికి హవిస్సులు అపించుకున్నారు. గణానాంత్వా
గణపతిగ్౦= గణాలకు పతి, కవిం కవీనాం= మేథావుల్లో కెల్లా మేథావి, ఉపమశ్శ్రవస్తమం= బాగా వినేందుకు ఉన్నతమైన చెవులు కలవాడు (మొరాలకించేవాడు),
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం= వికాసం కలిగించిన తొలి పరిపాలకుడు, బ్రహ్మణస్పతానః
= మరింత వికాసం పొందేలా చేయగలవాడు, శృణ్యన్నూతిభి
స్సీదసాదనం= మొర వినగానే నూతన ఆలోచనలకు వేదికైనవాడు... హవామహే=
మా హవిస్సులు గైకొనమంటూ వేడికోలు ఇందులో కనిపిస్తోంది.
సాయణభాష్యంలో గణానాం అంటే
దేవాది గణాలనీ, గణేశ అంటే వేద మంత్రాది స్తోత్రాలతో స్తుతించే వారి నాయకుడని అర్థం.
ఈ విశేషణాలన్నీ ఋగ్వేద కాలంలో ఇంద్రుడిని ఉద్దేశించినవి! అప్పటికి ఇంద్రుడే గణపతి.
మాక్స్‘ముల్లర్
క్రీ. పూ. 2,500-1800 నాటి ఋక్కుగా దీన్ని భావిస్తే, తిలక్ క్రీ.పూ. 6,000 నాటిదని, ఇతరులు క్రీ.
పూ ౩,౦౦౦
నాటిది కావచ్చుననీ అన్నారు.
తరువాతికాలంలో, గణపతిని
రుద్రుడి రూపంగా యజుర్వేదం భావించింది. నమకం చమకంలో “నమో గణేభ్యో గణపతి
భ్యశ్చవో నమః - దేవగణాల రూపం ఉన్న నీకు నమస్కారం, దేవగణాలకు
పతివైన నీకు నమస్కారం” అంటుంది. దేవగణాలూ, దేవగణపతి ఇద్దరూ ఒక్కరే అయిన ఈ మహాగణపతి
రుద్రుడి రూపంగా కనిపిస్తాడు. ఋగ్వేద కాలంలో ఇంద్రుడూ, తరువాతి
యుగంలో రుద్రుడూ గణపతులుగా వ్యవహరించి ఉంటారు. ఇది క్రీ.పూ.1,000
నాటి సంగతి కావచ్చునని మాక్స్‘ముల్లర్ భావన.
హేరంబ, గణనాయక, గణేశ, ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి, వక్రతుండ, కపిల, చింతామణి, డుంఠి(పద్మపురాణం), పిళ్ళారి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర, అంబాసుత, సిద్ధి వినాయక
(సంగీత శాస్త్రాల్లో), సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప,ధూమకేతు, గణాధ్యక్ష, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, స్కందపూర్వజ (నిత్య పూజా విధానంలో) ఇలాంటి అనేక పేర్లతో, వాటికి తగిన
లక్షణాలతో గణేశుడు వివిధ కాలాలలో కనిపిస్తాడు.
*** ****** ***
పరిణామ క్రమంలో పాత దేవతల స్థానే,
కొత్త దేవతలు చేరటం సహజ పరిణామం. తొలుత ఇంద్రుడిదే ఆధిపత్యం. తరువాత రుద్రుడు ఆ
స్థానంలో కనిపిస్తాడు. అతణ్ణి శివుడి రూపంగా చెప్పుకున్నారు. రుద్రుడు, శివుడూ
ఒక్కరేనన్నారు. పంచ భూతాలలో ఆకాశానికి విష్ణువు, వాయువుకు సూర్యుడు, అగ్నికి శక్తి
(అంబ), భూమికి
శివ, జలాలకు
గణేశ అధిదేవతలుగా చేసిన వర్ణనలు ఉన్నాయి. బహుశా జలాధిదేవత కావటం వలనే గణేశ
ఉత్సవాలలో నిమజ్జనానికి ప్రాముఖ్యం వచ్చింది. కానీ, ఇది రాను రానూ అతి ధోరణిగా
మారి చివరికి ఈ నిమజ్జనం అనేది జిప్సం, పీవోపీ, విషపు రంగులతో జలకాలుష్యానికి దారి
తీస్తోంది. ఇది వినాయక ద్రోహం అని గట్టిగా చెప్పగలగాలి.
మనుస్మృతిలో, “విప్రానాం దైవతం శమ్భుః క్షత్రియాణాం
తు మాధవాః / వైశ్యానాం తు భవేద్ బ్రహ్మా శూద్రానాం గణ నాయకాః - బ్రాహ్మణులు సాంబుని, క్షత్రియులు
విష్ణువుని, వైశ్యులు బ్రహ్మని, శూద్రులు
గణనాయకుణ్ణి దేవతలుగా కొలవటం గురించి ఉంది. మనువు కాలానికి దేవగణాధిపతి అయిన గణపతి
శూద్రుల దేవుడిగా ఎందుకు మారిపోయాడనేది ప్రశ్నే!
ఆర్యులతో ఆర్యేతర ప్రజల సంపర్కం
జరిగినట్టే, వైదిక దేవతలూ, ఆర్యేతరుల
దేవతల మధ్య కూడా సంలీనాలు జరిగాయి. మానవ జాతి చరిత్రని సంలీనాలే నిర్మించాయి గానీ,
సంఘర్షణలు కాదు. సంఘర్షణల తరువాత గెలిచిన వారికి ఓడిన వారు బానిసలౌతారు.
గెలిచినవారి ద్వారా ఆ బానిసలు సంతానాన్ని కంటారు. ఆ సంతానానికి రెండు జాతుల సంలీన
లక్షణాలు ఏర్పడతాయి. ఇద్దరి ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, ఆహార వ్యవహారాలు,
ఆరాధనాపద్ధతులు కూడా మిశ్రితమై ఒక కొత్త జాతి ఏర్పడుతుంది. వారి వారి దేవతలు కూడా
సంలీనమై కొత్త దేవతలు ఆరాధనా క్రమంలోకి వస్తారు. ప్రధాన ఆర్యదేవతలైన శివుడు
విష్ణువు బ్రహ్మ గార్లకు తోడు గణేశ, కుమారస్వామి
హనుమాన్ లాంటి పరివార దేవతలు అలా వైదిక దేవతలుగా వ్యాప్తిలో కొచ్చారు.
ఒకప్పుడు పంచాయతన పూజ ఉండేది. ‘ఆదిత్యం,
అంబికం, విష్ణు, గణనాథం మహేశ్వరం’ - అంటూ
సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, శివుడు ఈ అఈదు దేవతల అర్చననీ పంచయతన పూజ
అన్నారు. శకరాచార్యుడు (క్రీ. శ. 9వ
శతాబ్ది) కుమారస్వామిని అదనంగా చేర్చి ‘షణ్మత
స్థాపనాచార్యుడు’గా
ప్రసిద్ధుడైనాడని డా. పి వి కాణే మహాశయుడు పేర్కొన్నారు.
ఆర్య ఆరాధనా విధానంలోగానీ,
ఆర్యేతరుల ఆరాధనా విధానాలలో గానీ తొలిరోజుల్లో జంతుబలి ప్రధానాంశంగా ఉండేది.
మాన్పించే లక్ష్యంతో శంకరాచార్యులవారు షణ్మతాన్ని ప్రవేశపెట్టారు. ఉగ్రరూపులైన ఈ
దేవతలను శాంతి దూతలుగా మార్చేందుకు కృషి చేశారు. గ్రామదేవతగా ఉన్న బెజవాడ దుర్గమ్మ
విగ్రహం దగ్గర శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి అమ్మవారిని శాంతమూర్తిగా చేశారని
చెప్తారు. పశువుల తలలు నరికి ఆరాధించే విధానానికి బదులుగా కొబ్బరికాయ కొట్టి హారతి
ఇవ్వటం, రక్తమాంసాల స్థానంలో మోదకాలు( తీపి వంటకాలు), నైవేద్యం పెట్టటం, షడ్రసోపేతమైన
భోజనాన్ని మహానివేదన పెట్టటం, కల్లు సారాయికి బదులుగా పాయసాలు, పానకాలు తాగటం లాంటి
పద్దతులు అమలుకు తెచ్చాడని చరిత్రకారుల భావన. ఈ ఘనత ఎవరిదైనా అది నిజంగా
ఘనతే! అందువలన ఆరాధనా విధానం అహింసాత్మకం
అయ్యింది. శాంతికోసం ఆరాధన అనేది ఒక అలవాటయ్యింది.
లింగపురాణం శివుడి అంశతో గణపతి పుట్టినట్టు
చెప్తుంది. మత్స్యపురాణంలో పార్వతి నలుగుబొమ్మ కథ కనిపిస్తుంది. ఇంకో కథ కూడా
ఉంది. పార్వతి నలుగు పెట్టుకుని ఆ మాలిన్యాన్ని నీటిలో కలిపిందనీ, ఆనాటిని తాగిన
మాలిని అనే రాక్షసి వెంటనే గర్భం దాల్చి గణపతిని ప్రసవించిందనీ, పార్వతి ఆ బిడ్డను
తీసుకువచ్చి పెంచిందట. బహుశా ఇలాంటి కథల వలన విఘ్నాలు కలిగించే డెమన్‘గా విఘ్నేశ్వరుణ్ణి కొందరు ప్రజలు భావించి ఉండవచ్చు. అంతకు
మునుపు విఘ్నాలు కలిగించే శక్తి తరువాత కాలంలో విఘ్నాలు నివారించి, విజయాన్ని,
మేథా సంపత్తి, ఆహారాన్నీ, ఆరోగ్యాన్నీ ఇచ్చే శక్తిగా మార్పు పొందాడు.
“ప్రేతన్భూతగణాన్శ్చన్యేయజన్తే తామస జనాః” అంటే భూతప్రేతాది
తామస జనులకు నాయకుడిగా వినాయకుడు కనిపిస్తాడు. దిష్టిబొమ్మగా వినాయకుణ్ణి పెట్టటం
వెనుక ఈ విధమైన ఆలోచన ఒక కారణం కావచ్చు. కీర్తిముఖాలు గోడలకు తగిలించే ఆచారం ఇంకా
కొనసాగుతోంది. ఇవి క్రీస్తుశకం తొలి శతాబ్దినాటి ఆలోచనలు. భూత ప్రేత పిశాచాదులు ఆయన అనుచరులే కాబట్టి
ఆయన్ని మంచి చేసుకుంటే వాటిని అదుపులో పెట్టి మనల్ని కాపాడతాడని నమ్మకం.
మోదః అంటే ఆనందం. తిన్నవారిని ఆనందింప
చేస్తాయి కాబట్టి వీటిని మోదకాలు అన్నారు. తీపి ఉండ్రాళ్ళే కాదు, లడ్డూలవంటి
స్వీట్లన్నీ మోదకాలే! వినాయకుడికి వాటిని
పెట్టి ఆయనను మంచి చేసుకోవాలనే భావన కూడా చాలామందిలో ఉంది.
నారాయణోపనిషత్తు (క్రీ, శ. 550?) “తత్పురుషాయ విద్మహే/వక్రతుండాయ ధీమహి/తన్నో దన్తి
ప్రచోదయాత్” అనే మూడు పాదాల
మంత్రం చెప్పింది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల వక్రగతిని చెప్పటానికి ఉపయోగించే ‘వక్ర’ శబ్దాన్నీ గజాననుడి
వక్రతుండానికి అన్వయిస్తారు పండితులు. వక్ర అంటే moving backwards అని! జపాన్‘లో దొరికిన గణేశ విగ్రహంలో అసలు ముఖం వెనకవైపుకు ఉంటుంది.
అంటే, వినాయకుడు ద్విముఖుడు కావచ్చునన్నమాట. వెనకవైపునకూడా దృష్టి కల రక్షకుడు
వినాయకుడు.
“బోధాయన గృహ్య శేష సూత్ర” “బోధాయన ధర్మ
శాస్త్రం”లో చెప్పిన ప్రకారం, విఘ్న, వినాయక, వీర, స్థూల, వరద,
హస్తిముఖ, వక్రతుండి, ఏకదంత, లంబోదర, మొదలైన పేర్లతో వేర్వేరు దేవతలు కనిపిస్తారు.
బహుశా తరువాతి కాలంలో వీళ్ళందరినీ సంలీనం చేసి, ఒక మహాగణపతిని ప్రతిష్టించుకుని
ఉంటారు. హాలుడి గాథాసప్తశతిలోనూ, అమరకోశంలోనూ, బృహత్సంహితలోనూ, హర్షుడి
నలచరిత్రలోనూ, దశకుమారచరిత్రలోనూ గజాననుడి ప్రస్తావన ఉంది. కాబట్టి గజాననుడు
కీస్తుశకం తొలి శతాబ్దాలలోనే రూపొంది ఉండాలి.
గణపతి ప్రస్తుత రూపం గుప్తుల కాలంలో
స్థిరపడిందని ప్రఖ్యాత చరిత్రవేత్త డి. చటోపాధ్యాయ అన్నారు. కార్డింగ్టన్ తన
ఏనిషియంట్ ఇండియా గ్రంథంలో ప్రచురించిన గణేశ విగ్రహం క్రీ.శ. 5వ శతాబ్ది నాటిదన్నారు. ఆచార్య
కుమారస్వామి కూడా గుప్తులకన్నా పూర్వంనాటి విగ్రహం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
కాణే మహాశయుడు “the well known characteristics of Ganesa and
his worship had become fixed before the or sixth century of the Christian era…”అని వ్రాసారు.
అనేకవిధాల పరిణామాలు చెందిన గణేశరూపం, గణేశ ఆరాధనా విధానం పదిహేను వందల యేళ్ళ
క్రితం ఒక రూపానికి వచ్చాయని కాణే ప్రభృతులు తేల్చి చెప్పారు.
*** ****** ***
సంస్కృత మహాభారతం అనుశాసక
పర్వం(150-25)లో “ఈశ్వరస్సర్వ భూతానాం గణేశ్వర వినాయకాః” అని ఉంది. ఇది కీ,. శ. తొలి శతాబ్ది నాటి రచన అని
చరిత్రకారుల అభిప్రాయం. అప్పటికే, వినాయకుడి గజముఖ వృత్తాంతం వ్యాప్తిలో ఉంది.
గణేశ్వర, వినాయక గజానన, వక్ర తుండ, మహాకాయ, లంబోదర, శూర్పకర్ణ లాంటి పిలుపులన్నీ
అప్పటికే ఉన్నాయి. విఘ్నాలు సృష్టించటానికీ, వాటిని జయించి విజయం సాధించటానికీ ఈ
విఘ్నేశ్వరుడే కారకుడైనాడు. గణపతి ఆరాధనని గాణాపత్యం అంటారు. గాణాపత్యం ద్వారా
గణపతి, వినాయక, విఘ్నేశ్వర, గజానన మూర్తులన్నీ కలగలిపి మహా శక్తిమంతమైన
దేవతగా, ప్రథమ పూజనీయుడిగా
రూపొందించుకున్నారు.
ద్రవిడాలజిష్టులు వినాయకుడు ద్రావిడుల దేవుడనే భావిస్తున్నారు. జాతుల సంలీనం, తద్వారా దేవతల
సంలీనాల వలన వైదిక దేవతలతో ఈ ద్రావిడ గణపతి సంలీనం జరిగి ఉండవచ్చు. ఇందుకు తెలుగు
నేల ఒక వేదికను కల్పించి ఉండవచ్చు కూడా. హాలుడి ‘గాథాసప్తశతి’ క్రీ పూ. చివరి
లేదా క్రీ. శ మొదటి శతాబ్దాల కాలంలో వెలువడిన రచన. ఇందులో గజాననుడి ప్రస్తావన
ఉన్నదంటే, ఆంధ్ర ప్రాంతంలో ఇప్పటికి రెండువేల యేళ్ళక్రితమే వినాయకుడి ఆరాధన ఉందని
అర్థం అవుతోంది. వి రామసుబ్రహ్మణ్యం అనే పరిశోధకుడు Bulletin of the Institute of Traditional Cultures- Madras, (యూనివర్సిటీ ఆఫ్
మద్రాస్, 1971)లో” గణపతి-, వినాయక- గజానన’ అనే వ్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “నా తమిళ సోదరులు తొల్కాప్యం సంగమ సాహిత్యాలను క్రీస్తు
పూర్వానికి తీసుకు పోవాలని చూస్తున్నారు. అలాంటి వారికి ఇది రుచించకపోవచ్చు” అంటాడు. క్రీస్తుశకం తొలినాటి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు
హాలుడి “గాధాసప్తశతి”, గుణాఢ్యుడి ‘బృహత్కథ’లు గొప్ప ఆధారాలు.
వాటినే గాసట బీసట గాథలంటారు.
గాథాసప్తశతిలో గజాననుడి ప్రస్తావన రాగా, తమిళంలో క్రీ. శ. ఆరవ శతాబ్ది వరకూ
గణపతి గురించిన ప్రస్తావనే లేదని రామసుబ్రహ్మణ్యం గారు స్పష్టంగా చెప్పారు.
ఆంధ్రుల దగ్గరకు వైదిక ధర్మాలు వరదలా
వచ్చి ఇక్కడి ప్రజలతో సంలీనం కావటం వలనే ఇది సాధ్యం అయ్యింది. ఇందుకు శాతవాహనుల కన్నా
ముందునాటి ఆంధ్రరాజులను ఆర్యులు ఆశ్రయించటం గురించి పద్మినీ సేన్ గుప్తా పేర్కొన్న
విషయాలు గొప్పవి. Everyday life in Ancient
India గ్రంథంలో ‘క్రీ. పూ. చివరి
శతాబ్దాల కాలంలో ఉత్తరాది నుండి వలస వచ్చిన ఆర్యులకు ఆంధ్రులు ఆతిధ్యం ఇచ్చి
ఆదరించా’రంటూ ఆమె ఇలా వివరించారు. “Builders, Artists, Artisans and Craftsmen went South
because of the invasions in the North, Trade Flourished and Aryans found a
welcome home in the Andhra Kingdom which stretched from the bay of Bengal to
the Arabian Sea and afforded a stable civilized empire where the immigrants
could take shelter” ఇలా వలసలు ఆంధ్ర
సామ్రాజ్యంలోకే ఎక్కువగా జరగటానికి ఇక్కడ సుస్థిరమైన పాలనా వ్యవస్థ ఉండటమే కారణం!
వేల సంఖ్యలో ఆర్యులు వచ్చి ఇక్కడి తెలుగు ప్రజలతో సంలీనం కావటం వలన తెలుగు వారి
దేవతలూ, వైదిక దేవతలూ బంధుత్వాలు కలుపుకున్నట్టు మనకు అర్థం అవుతోంది. అందుకే
శాతవాహనులకాలానికే గజాననుడి ప్రస్తావన గాథా సప్తశతిలో మనకు కనిపిస్తోంది. ఆతర్వాత
గుప్తులూ, చివరికి శంకరాచార్యుడు గణేశ ఆరాధనను స్థిరీకరించారు.
మహాయాన బౌద్ధాన్ని ప్రవర్తింప చేసినవారు
ఆంధ్రులు. వీళ్ళే గణపతిని విదేశాలకు తీసుకువెళ్ళి ప్రచారం చేశారు. ‘మహాయానం టిక్కెట్టు మీద గణపతి విదేశీ యానం చేశా’డని రామసుబ్రహ్మణ్యం గారు చమత్కరించారు. ‘లాఫింగ్ బుద్దా’, ‘లంబోదర వినాయక’ రూపాల మధ్య
సామ్యతకు తెలుగు బౌద్ధులు కారణం కావచ్చనేది నమ్మదగిన ఊహే! అమరావతి శిల్పాలలో
కన్పించే యక్షుల శరీరాకృతిని పోలి ఉంటాడు గణపతి. గజముఖం తగిలించుకున్న తెలుగు
యక్షరూపం ఆయనది!
గణపతిని బుద్ధికి, విఙ్ఞానానికీ,
పాండిత్యానికీ, మేథాసంపత్తికీ, శాంతి సౌభాగ్యాలకు, పచ్చదనానికి. పాడిపంటలకూ
అధిదేవతగా ఆంధ్రులు భావిస్తారు. ప్రపంచ శాంతిని కాంక్షించే తత్త్వం ఉన్నవారు
మొక్కలయ్యకు మొక్కులు తీర్చుకునే ఆరాధనా విధానాన్ని రూపొందించు కోవటంలో ఆంధ్రుల
పాత్ర ముఖ్యమైంది.
వినాయక చవితిని ప్రపంచ శాంతి, పర్యావరణల
ప్రాముఖ్యతని తెలియజెప్పే విధంగా జరుపుకుని ఆనందించ గలిగినప్పుడే సార్థకత
కలుగుతుంది
ఇది ఆంధ్రులు దేశానికి అందించిన పెద్ద
పండుగ. మొక్కల పండుగ. ఇండో యూరోపియన్ మూలభాషలో అంధ్ అంటే మనిషి, ఒక మొక్క అనే
అర్థాలు కనిపిస్తాయి. అంథ్ లోంచి ఆంథ్రపాలజీ (మానవ శాస్త్రం) పదం ఏర్పడింది. ఆంధ్ర
శబ్దానికీ మూలం ఇదే! ఆంధ్ర అంటే మనిషి. ఆంధ్ర అంటే మొక్క. ఆంధ్రుల దేవుడు మొక్కల
దేవుడయ్యాడు. మొక్కులు తీర్చేవాడయ్యాడు.
No comments:
Post a Comment