Tuesday, 30 September 2014

రకరకాల రోగాలూ - సెక్సు బలహీనతలూ::డా. జి వి పూర్ణచందు



రకరకాల రోగాలూ - సెక్సు బలహీనతలూ
డా. జి వి పూర్ణచందు
లైంగిక పరమైన ఇబ్బందుల్ని చాలామంది నరాల బలహీనతగా భావిస్తారు. శరీర శక్తికి, మానసిక శక్తికీ సంబంధం లేని శారీరక బాధల్ని రోగులు నరాల బలహీనతగా డాక్టర్లదగ్గర చెప్పుకుంటారు. ఒక్క మాటకి వైద్యులు చాలా విషయాలు అర్థం చేసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా లైంగిక విషయాలను సూటిగా చెప్పుకునేందుకు తగిన భాష మనకు లేదు. ఇంగ్లీషులోనూ సమస్య ఉన్నప్పటికీ కొన్ని పదాలను స్వేఛ్ఛగా వాళ్ళు వాడినట్టు మన వాళ్ళు వాడలేరు. వైద్యుడికి ఎలా చెప్పాలో తెలియక వ్యాధిని లోపలే దాచుకునే వాళ్ళే ఎక్కువమంది.
ఇంగ్లీషులో న్యూరోలాజికల్వ్యాధి అంటే  నాడులు(nerves) దెబ్బతిన్నందుకు వచ్చే వ్యాధి అని స్పష్టమైన అర్థం కనిపిస్తుంది. మెదడు సంకేతాలు శరీరానికీ అలాగే, శరీరం చెప్పే విషయాలు మెదడుకీ చేర్చే సమాచార వ్యవస్థ దెబ్బతినటాన్ని న్యూరోలాజికల్ వ్యాధిగా చెప్తారు. పక్శవాతం, పార్కిన్సోనిజం, వెన్నుపాములోపల నరాలు నలిగి వచ్చే వ్యాధులు, మెదడుకు బలమైన దెబ్బతగలటం వలన వచ్చే వ్యాధులూ ఇవన్నీ నరాల వ్యాధులే. వ్యాధుల్ని వ్యాధులుగానే చూస్తాం గానీ, అవి లైంగిక జీవితాన్ని విధంగా ప్రభావితం చేస్తాయో గమనించటానికి మనకు సభ్యతా పరమైన సమస్యలు అడ్దం వస్తాయి. సెల్సు అనేది ఉచ్చరించటానికి వీల్లేని పదంగా ఇంకా భావించబడుతోనే ఉంది. శరీరంలో విధమైన అనారోగ్యం కలిగినా దాని ప్రభావం అంతో ఇంతో సెక్సు మీద ఉంటుంది.  ఆఖరికి అజీర్తి చేసినా లైంగిక సమర్థత తగ్గిపోతుంది. అలాంటప్పుడు సెక్సుని కేవలం జననాంగపరమైన సౌఖ్యం అనే అర్థం లోనే చూడాలనుకోవటం సబబు కాదు.
శరీరం సహకరించని వ్యాధులతో బాధపడే వాళ్ళకోసం విదేశాల్లో వైబ్రేటర్లవంటి సౌకర్యాల వాడకం ఎక్కువగా ఉంటుంది. మన సమాజంలో ఇంకా అటువంటి వాడకాలకు అలవాటు పడలేదు. చాలావ్యాధులు మానసిక కారణాలవలన పెరుగుతున్నాయి. చాలా వ్యాధులకు మానసిక కారణాలే అసలు ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి. వాటిలో లైంగికపరమైన అంశాలు ముఖ్యమైనవి కూడా అయినా మనం వ్యాధులకూ, సెక్సు పరమైన అసంతృప్తికీ  గల సంబంధాన్ని పట్టించుకోవటం లేదు. రోగానికి మందులిచ్చే విధానమే గానీ, రోగకారణాన్ని వెదికే తీరిక వైద్యుకు గానీ. ఆ ఆసక్తి రోగులగ్గానీ లేకుండా పోవటం కూడా ఇందుకు ముఖ్య కారణాలే!
లైంగిక ఆసక్తి తగ్గిపోవటం, అంగ స్తంభనాదులు బలహీనంగా ఉండటం, రతి సమయం మరీ కుదించుకు పోవటం, సంతృప్తి కలగక పోవటం అనేవి కొన్ని శరీర వ్యాధుల్లో జరిగే అవకాశం ఉన్నవి కాగా, ఇలాంటి అంశాలు అనేక శరీర వ్యాధులు పెరగటానికి కారణం అవుతుంటాయి కూడా!
Viagra (sildenafil), Cialis (tadalafil), Levitra (vardenafil). లాంటి ఔషధాలు అంగ స్తంభనాన్ని త్వరగా జరిగేలాగా ఎక్కువ సేపు నిలబడి ఉండేలాగా సహకరోచేందుకు ప్రపంచ వ్యాప్తంగా వాడిస్తున్న ఔషధాలు. కానీ, అవి వాడిన సమయానికి మాత్రమే ఉపయోగ పడేవి గానీ, లైంగిక సమతుల్యతని కలిగించేవి, సంతృప్తినీ, సమర్థతనీ పెంపొందించేవీ కావు. రాజూ పేద సినిమాలో జేబులో బొమ్మ పాట గుర్తుందికదా! జ్బులో బొమ్మ ఉన్నంత సేపూ వాడు చెలరేగిపోయే వీరుడు. ఆ బొమ్మ లేకపోతే ఎందుకూ కొరగాడు. ఇలాంటి ఔషధ సేవన కూడా జేబులో బొమ్మ లాంటివే! మర్నాడు ఈ బొమ్మ లేకపోతే కథ వెనక్కే నడుస్తుంది. కాబట్టి, లైంగిక అసమర్థత అనేది పైకి చెప్పుకోలేని ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. చికిత్స కూడా అరచేతిలో వైకుంఠం చూపించగలైగే సెక్సు స్పెషలిష్టులకు సొమ్ము సంతృప్తినిచ్చేవే గాని, లైంగిక సంతృప్తిని తెచ్చి ఇచ్చేవి తక్కువ!
పార్కిన్సన్ వ్యాధిలో లైంగిక అసమర్థత ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేద మార్గాన ఈ వ్యాధికి ఇచ్చే ఔషధాలు ముఖ్యంగా దూలగొండి(దురదగొండి)విత్తులు లైంగిక సమర్థతని పెంచే వాటిలో ముఖ్యమైనవిగా గుర్తించబడ్డాయి. నాడీ వ్యవస్థను బలసంపన్నం చేయటానికి ఆయుర్వేదీయ పద్ధతిలో ఉపయోగించే వనమూలికలన్నీ లైంగిక శక్తిని పెంచేవిగానే ఉంశ్డటాన్ని గమనించవచ్చు. అందుకే రోగి నరాల నిస్సత్తువ వచ్చిందంటున్నాడంటే కాళ్ళూ చేతులూ చచ్చుబడిపోయాయని మాత్రమే అనుకోకూడదు. లైంగిక వ్యవస్థ చచ్చుబడి పోయిందని చెప్పటం ఆ రోగి ఉద్దేశం కావచ్చు. అది వైద్యులు అర్థం చేసుకోవాల్సిన విషయం.
సెక్సనేది భార్యాభర్తలిద్దరికీ సంబంధించిన విషయం కాబట్టి ఒకరికొకరు సహకరించుకునే విధానాన్ని ఉపదేశించి. లైంగిక తృప్తిని పెంపొందించుకునేలాగా ప్రోత్సహిస్తే, చాలా వ్యాధుల్లో చికిత్స త్వరగా ఫలించే అవకాశం ఉంటుంది.
లోలంబ రాజీయం అనే వైద్య గ్రంథంలో విరహజ్వరంతో బాధపడేవాడికి  మందులు వెదుకుతావెందుకు వైద్యుడా...? కోరిన స్త్రీతో దృఢమైన ఆలింగనం, అధరచుంబనాలను పథ్యంగా చెప్పు అంటాడు. ఇది చాలా సందర్భాల్లో, విరహ జ్వరాలకేకాదు, ఇంకా చాలా వ్యాధులకు వర్తించే విషయం.
మానసిక కారణాలవలన వచ్చే మైగ్రేన్ తలనొప్పి, సొరియాసిస్, అకారణ నడుం నొప్పి లాంటి వ్యాధుల్లో లైంగిక అసంతృప్తిని ప్రధాన సమస్యగా చాలా మందిలో గుర్తించటం జరిగింది. ఈ అసంతృప్తి స్థానంలో సంతృప్తిని చేర్పించటమే అసలు మందు. ఈ మందుని రోగి స్వయంగా కల్పించుకోవాల్సి ఉంటుంది. మరింత యుక్తిమంతంగా లైంగిక విషయాల్లో వ్యవహరించాలని రోగికి తప్పకుండా చెప్పాలి.
లైంగిక కార్యాన్ని సృష్టి కార్యం అనేది ఇందుకే! పిల్లల్ని సృష్టించే కార్యం అనే అర్థానికి పరిమితం చేసే మాట కాదిది. ప్రాపంచిక జీవనంతో పాటుగా వ్యక్తి వ్యక్తిగత జీవితం కూడా ఈ సృష్టికార్యం చుట్టునే తిరుగుతుంది. వ్యక్తి చుట్టూ ఉన్న ప్రపంచం, వ్యక్తి లోపల ఆవరించి ఉన్న ప్రపంచాలు రెండిండిటి మధ్యా సమన్వయం, సమతుల్యతలు దెబ్బతింటే వ్యక్తి శారీరక బాధలు తెచ్చుకుంటాడు. లైంగిక అసంతృప్తులు ఈ బాధల్ని మరింత పెంచుతాయి.

Friday, 26 September 2014

ఓ ముక్కుపద్యం కథ డా. జి వి. పూర్ణచందు



ఓ ముక్కుపద్యం కథ
డా. జి వి. పూర్ణచందు
“నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లానన్నొల్లదటంచు గంధఫలి బల్కాకన్ దపంబంది యో
షా నాసాకృతి దాల్చి సర్వ సుమనః సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్”
          ఇది రామరాజభూషణుడి వసుచరిత్రలో కనిపించే ఒక చమత్కార భరిత పద్యం.
రామరాజభూషణుడి అసలు పేరు భట్టుమూర్తి. కృష్ణదేవరాయల కాలానికి అతను చాలా చిన్నవాడు. క్రీ.శ. 1510-1585 మధ్యకాలంలో జీవించి ఉంటాడని భావిస్తున్నారు. ఇతను కృష్ణదేవరాయలి అల్లుడు అళియరామరాజు ఆస్థానంలో కవి అయి ఉంటాడనీ, భువనవిజయం అష్టదిగ్గజాలలో ఒకడు కాకపోవచ్చనీ పరిశోధకుల భావన! అతను కూడా రాజకవే!
సారంగం అంటే తుమ్మెద. అది నానా సూన వితాన వాసనల్ని అంటే రకరకాల పూల సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆ తుమ్మెద స్పర్శతో పువ్వుపడుచు పులకించిపోవటం అనేది గాఢాలింగనం వలన కలిగే పులకింతతో సమానంగా భావించటం ఒక చక్కని ఊహ. ఈ ఊహతోనే, చలం కూడా తుమ్మెద స్పర్శతో పులకించే పువ్వు మీద గొప్ప కథ రాశారు. అన్ని పువ్వుల మీదా వాలే గండుతుమ్మెద తన దగ్గరకు రాదేమిటని సంపెంగ పువ్వుకు బాధ కలిగింది. వాటిలాగే తనూ సుగంధాన్నిఇస్తున్నప్పటికీ  తనకు లేనిదేవిటో మిగిలిన వాటికి ఉన్నదేవిటో... గండుతుమ్మెద తనని ఒల్లనంటుందేవిటో... ఆ గంధఫలి(సంపెంగ)కు అర్ధం కాలేదు. దాంతో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది:
 బల్కాకన్ దపంబంది- మండు వేసవి ఎండలో కూచుని దేవుడికోసం తపస్సు చేసింది. దేవుడు వచ్చి కనిపించాడు. కోరిన వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావంతో...
యోషా నాసాకృతి దాల్చి... అందమైన ఆడపిల్ల కొనదేలిన ముక్కు లాంటి ఆకారాన్ని అది పొందింది.
సర్వ సుమనః సౌరభ్య సంవాసియై- సృష్టిలోని పువ్వులన్నింటి గుభాళింపుకు అది నెలవయ్యింది! అప్పటివరకూ ఎలాంటి ఆకర్షణా లేక ఎవ్వరి మెప్పూ పొందక అల్లాడిపోయిన ఆ సంపెంగకు రూపలావణ్య సుగంధాలు వరప్రసాదాలయ్యాయి.
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్... ముక్కు ఆకారంలోని ఆ సంపెంగకు ఇర్వంకలా -రెండు వైపులా-మధుకరీ పుంజాలు- గండు తుమ్మెదల బారులు, పూనెన్- పొందటం, ప్రేక్షణ- రోజూ కనిపించే దృశ్యం అయ్యిందట. ఇదీ సంపెంగపూవు పట్టుదలతో సాధించిన ఒక విజయం.
వేసవిలో సంపెంగలు పూయవు. అందుకని వేసవిలో తపస్సు చేసిందనటం ఒక చమత్కారం. తేనెటీగలు వాసనకోసం కాక తేనె కోసం పువ్వులమీద వాల్తాయి. అందుకని కవులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. గండు తుమ్మెదలు మాత్రం ఝుమ్మని నాదం చేస్తూ కాలేజీ కుర్రాళ్ళ మాదిరి పూలచుట్టూ తిరుగుతుంటాయనటం ఇంకో చమత్కారం. కుర్రాళ్ళు సహజంగా కొంచెం నదురుగా కనిపించే అమ్మాయిల చుట్టూ ఎక్కువ తిరుగుతారు. అందుకని సంపెంగ పువ్వు తనకు సువాసన కన్నా చక్కని రూపాన్ని ఎక్కువ కోరుకున్నదనటం మరో చమత్కారం. చివరికి అది అందమైన ఆడపిల్ల కొనదేలిన ముక్కులాంటి రూపాన్ని వరంగా పొందటం, తుమ్మెదల బారు ఒక నిత్య కృత్యం కావటం ఇదంతా గమ్మత్తయిన ఊహ!
తనకు ఉన్నదానితో సంతృప్తి చెందటాన్ని బలమైన కెరీరు కోరుకునే వాళ్ళు సరయిన సిద్ధాంతంగా అంగీకరించరు. ఉన్నదేదో చాలనుకుంటే ఉన్నత శిఖరాలెక్కేవాళ్ళెవరుంటారు...? ఈ కథలో సంపెంగలాగా ఎవరికివాళ్ళు తపస్సు(కృషి) చేసి ఎవరికీ దక్కనిది తనకు మాత్రమే దక్కేలాగా శ్రమించాల్సి ఉంటుందనేది కవి సందేశం. అబ్రహాం లింకన్ అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయాడు. చిట్టచివరి సారిగా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికై చరిత్ర సృష్టించాడు. కాబట్టి పట్టుదల వీడకూడదనే నీతి ఇందులో కనిపిస్తుంది.
లోకం చుట్టు తిరిగితే కాళ్ళరుగుతాయి గానీ ఫలితం ఉండదు. లోకాన్ని తన చుట్టూ తిప్పుకొనే చాతుర్యం కావాలి. అది అదృష్టం కొద్దీ దక్కదు. కృషీ, దీక్షా, పట్టుదలలు కావాలి.
వసుచరిత్రలోని ఈ పద్యాన్ని ‘ముక్కుపద్యం’ అని గమ్మత్తుగా పిలుస్తారు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోమని చెప్పే ముఖ్య పద్యం ఇది!



Monday, 22 September 2014

‘శీలావి’ కి బాపూరమణల పురస్కారం



 ‘శీలావి’ కి బాపూరమణల పురస్కారం
2014, సెప్టెంబరు, 21న మచిలీపట్టణంలో ‘సరసభారతి - ఉయ్యూరు’ సంస్థ కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన సభలో ప్రసిద్ధ చిత్రకారుడు, కవి, అక్షరశిల్పి  శీలా వీర్రాజు గారినీ, కవయిత్రి  శ్రీమతి శీలా సుభద్రా దేవి గారినీ ఘనంగా సత్కరించి బాపూ రమణ పురస్కారం అందించారు. అమెరికాలో ఉంటున్న సాహిత్యాభిమాని శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు పదివేల రూపాయిల ఈ పురస్కారాన్ని అందించారు. జిల్లా జడ్జి శ్రీ రామ శేషగిరిరావుగారూ, గుత్తికొండ సుబ్బారావుగారూ, శ్రీ సవరం వెంకటేశ్వర రావుగారు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్‘గార్లతో పాటు నేను కూడా పాల్గొనే అవకాశం కలిగింది.




S






నేటికాలపు వేస్టు చదువులు
డా. జి వి పూర్ణచందు
బెంచీలక్కరలేదు, గేమ్సు మొదలౌ ఫీజుల్ వినన్ రావు, పొ
మ్మంచు న్నిర్థను(దోసి పుచ్చరు గురుల్, ప్యాసైననే లాభ మిం
దంచున్నేమము లేదు, మీ చదువునందాలోక మీలోకమున్
గాంచన్ వచ్చెడి నార్యులార! మ్రొక్కంజెల్లు నెక్కాలమున్.
తిరుపతి వేంకట కవుల కాలానికి, చాందసవాదం, భూస్వామ్య వాదం, బూర్జువాయిజం లాంటి పదాల వ్యాప్తి లేదు. వాటి గురించిన అవగాహన కూడా కవులకు లేదు. ఆనాటి మేథావులు మానవతా వాదానికి పరిమితంగా ఉండేవాళ్ళు అలాగని అంటరాని తనాన్ని వ్యతిరేకించటం లాంటి విచక్షణాపూర్వక అంశాలను పెద్ద స్థాయిలో ఖండించిన సందర్భాలు కూడా అరుదు. బ్రహ్మసమాజం లాంటి సంస్థలు సామాజిక సంస్కరణలను కోరాయిగానీ, అస్పృశ్యత లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించదు. వీరేశలింగంగారు కూడా విధవాపునర్వివాహం లాంటి సంస్కరణలకే పరిమితం అయ్యారు.
1920 లలో గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న బెజవాడ కాంగ్రేస్ కార్యవర్గ సమావేశంలో అంటరాని తనం నిర్మూలనను ఒక కార్యక్రమంగా చేపట్టాలని నిర్ణయించారు. తనకన్నా ముందే ఆంధ్రులు హరిజన సేవా కార్యక్రమాలు చేపట్టారని గాంధీగారు స్వరాజ్య పత్రికలో రాసుకున్నాడు కూడా! ఇరవయ్యవ శతాబ్ది తొలినాటి పరిస్థితి అది!
మొత్తం మీద జాతీయతా వాదం బలపడ్తున్న ఆ రోజుల్లో ఆంగ్లేయులు తెచ్చిన ఆధునికతను సిద్ధాంత రీత్యా వ్యతిరేకించిన సంస్కర్తలే ఎక్కువ. తిరుపతి వెంకట కవులు తమ కాలంలో విస్తరించిన ఇంగ్లీషు చదువుల గురించి తమ వ్యతిరేకతను పై పద్యంలో చాటుకున్నారు. ఒక అడుగు ముందుకు వేసి గురుశిష్య పరంపర పద్ధతిలో చదువు కొనసాగిస్తే క్లాసురూములూ వాటిలో బెంచీలూ అక్కరలేదనీ, గేమ్సు మొదలైన వాటికి ఫీజులు కట్టాలనే మాటలే వినరావనీ, ఫీజు కట్టలేక పోయిన నిర్ధనుణ్ణి క్లాసులోంచి వెళ్ళి పొమ్మనటం లాంటివి ఉండవనీ, ప్యాసైతేనే పైక్లాసులోకి వెళ్ళటం లాంటి నియమాలేవీ ఉండవనీ అంటారు ఈ పద్యంలో తి. వేం. కవులు.
ఇంకో పద్యంలో చెప్పులకాళ్ళు, క్రాఫింగ్ చేయించిన తలకాయలు, ముఖాన విబూది రేఖల్లేని శూన్య లలాటం, గొప్ప బడాయి వేషాలు, కుచ్చుల పాగలు (చెప్పులు, బూట్లూ)కోట్లు,కంఠంమందొప్పెడి పట్టముల్(టై), ఇలాంటివేషాలతో కనిపించే గురువులు, శిష్యులూ నీకు లేరుకదా...తండ్రీ చిరాయువై బ్రతుకు, అమ్మా! ఓ వేదమాతా నీకు మొక్కుతున్నాను... అంటాడు. ఇలా ఆధునిక విద్యలు గురుశిష్య సంబంధం చెడగొట్టాయనే ఆవేదన వాళ్ళ పద్యాలలో కనిపిస్తుంది.
గురువు తనకొచ్చిందంతా శిష్యుడికి నేర్పేవాడు. గురువు దగ్గర సరుకున్నంత మేర విద్యార్థి ఆయన దగ్గరే ఉండేవాడు. శిష్యుడికి అన్నం పెట్టి చదువు చెప్పేవాడు గురువు. ఈ రోజుల్లో అలాంటి చదువులు అసాధ్యం అంటారు గానీ, సంగీత నృత్యాది కళలు నేర్పించే వారి దగ్గర, వేదాధ్యయనం చేయించే వేద పాఠశాలల్లోనూ, మోటారు మెకానిక్కుల దగ్గర, వడ్రంగం మేస్త్రీలదగ్గరా ఇతర వృత్తి విద్యలు నేర్పేవారి దగ్గరా ఇంకా ఈ నాటికీ గురు శిష్య పరంపర కొనసాగుతూనే ఉంది. కంప్యూటర్కు సంబంధించిన జావా, ఒరాకిల్, డీటీపి లాంటి విద్యల్ని ప్రైవేట్ సంస్థల్లోనే నేర్చుకుంటున్నారు. నిజానికి ఇలా నేర్పే వాటిలో చాలాభాగం విద్యాసంస్థలు కావు. మామూలు టైపు ఇన్స్టిట్యూట్ లాంటివే! కాబట్టి గురుశిష్య సంబంధం అలాంటి చోట్ల కొనసాగుతూనే ఉంది.
తెల్లదొరల మెకాలే విద్యావ్యవస్థ నుండి, నల్లదొరల  కార్పోరేట్ విద్యావ్యవస్థ వరకూ సాగిన ఈ నూట యాబై యేళ్ళ కాలంలో గురువును ఫీజులు కట్టే విద్యార్థికి బానిసను చేయటం, డబ్బు పారేస్తాం, ఎంత చెప్తావో చెప్పమనే ధోరణి రావటం విద్యారంగానికి మేలు చేసేవని అభ్యుదయవాదులెవరూ అనుకోరు.
ఆనాడు, గురుకులం పద్ధతిలో చదువులు అగ్రవర్ణాల వారికే పరిమితంగా ఉండటం వలన అందరికీ విద్య కోసం పాశ్చాతుల విద్యా పద్ధతుల్ని అనుసరించక తప్పలేదు. కానీ, విద్య ఇలా వక్రమార్గాన పడటం కూడా ఇబ్బందికరమైన విషయమే! గురుకుల వ్యవస్థను ఆనాడు భూస్వామ్య అనుకూలవాదం, ఫ్యూడలిజం అవశేషాలుగా భావించారు. కానీ, విద్యారంగ ఆధునీకరణ ఇంతగా పాశ్చాత్యీకరణం చెందకుండా గట్టి పోరాటాలు జరిపి ఉంటే బావుండేదనిపిస్తుంది.
ఫీజుల్లేని చదువులూ, డిగ్రీలు లేని పాండిత్యంతో ప్రసిద్ధులైన మల్లంపల్లివారిలాంటి మేథావులు వ్రాసిన గ్రంథాలను దాటి అదనంగా మన విశ్వవిద్యాలయాల ఆచార్యులూ, ప్రాచార్యులూ వ్రాసింది తక్కువ. మేథా సంపత్తికి డిగ్రీలూ, ఉద్యోగ హోదాల్ని  కొలబద్దగా తీసుకునే దౌర్భాగ్యం పోవాలి.