రెండర్ధాల కవిత్వం
డా. జి వి పూర్ణచందు
“సుబలతనయ గుణమహిమన్
ప్రబలి తనకు దార ధర్మపాలనలీలన్
సొబగొంది వన్నెదేగా
విబుధస్తుతు(డన్విభుండు వెలసెన్ ధరణిన్”
సినిమాకళలోనూ. చిత్రకళలోనూ లేని అందాలను
ఉన్నట్టు చూపించ గలిగే చాతుర్యం ఉంటుంది. పద్యాలలో కూడా అలాంటి గమ్మత్తులు,
జిమ్మిక్కులూ చేసిన మహా కవులున్నారు. తన ప్రతిభను చాటుకోవటానికి ప్రతి కవీ సహజంగా
తాపత్రయ పడతాడు. కొందరికి ఈ తాపత్రయం కొంచెం ఎక్కువ పాళ్లలో ఉండవచ్చు కూడా!
ఒకే మాటని రెండర్థాల్లో ప్రయోగించటం ఒక
చాకచక్యం. కానీ ఒకే పద్యాన్ని అటు రామాయణం అర్థంలోనూ, ఇటు భారతం అర్థంలోనూ చెప్పటం
అంటే చాలా ప్రతిభ కావాలి. అలాంటి పద్యాలతోనే రెండర్ధాల కావ్యం మొత్తం చెప్పటం అంటే
అది మామూలు కసరత్తు కాదు. గొప్ప సర్కసు ఫీటేనని చెప్పాలి. ఇలాంటి కావ్యాలను
ద్వ్యర్ధి కావ్యాలంటారు. పింగళి సూరన
ద్వ్యర్ధి పద్యాలను అవలీలగా వదలగలడని ప్రసిద్ధి పొందాడు.
ఇలాంటి పద్యాలు రాయాలంటే, భావుకతతో పాటు ‘పదాలగారడీ’
విద్యని కూడా బాగా సాధన చేసి ఉండాలి. ఒక పదం చివరి అక్షరానికి రెండోదాని మొదటి అక్షరానికి
గొళ్ళెం పెట్టి గొప ప్రయోజనం సాధించాడీ కందపద్యంలో కవి.
దీనికి రామాయణ పరమైనలో అర్ధం ఇలా
వస్తుంది.
సుబలత=చాలా బల సంపన్నత కలిగిన
నయగుణ మహిమ= నయగుణం అంటే మంచీ చెడుల
విచక్షణతో తన బలాన్ని ఉపయోగించ గలగటం
ఉదార ధర్మ పాలన= రాజ్యపాలనా ధర్మన్ని
సక్రమంగా నెరవేర్చగలిగిన వాడు.
విబుధ స్తుతులు: దేవతలు తమకు సాయం
చేసినందుకు కృతఙ్ఞతగా పొగుడుతూ ఉండగా...
దశరధుడు గొప్ప బలశాలి. సుబలత కలిగినవాడు.
ఆయన తనబలాన్ని మంచికి మాత్రమే ఉపయోగ పడాలనే నయగుణం కలిగినవాడు. అందుకే దేవాసుర
సంగ్రామంలో దేవతలకు సహాయంగా యుద్ధానికి వెళ్ళి గెలిపించి వచ్చాడు. దేవతలు
కృతఙ్ఞతగా చేస్తున్న పొగడ్తల మధ్య ఆయన భూమ్మీద కొచ్చాడట.
ఇదే పద్యం భారతం అర్ధంలో మరోలా
కనిపిస్తుంది:
సుబలతనయ: ధృతరాష్ట్రుడు కళ్ళులేని
బలహీనుడు ఆయన భార్యకు కళ్ళున్నాయి. కానీ, వాటిని ఆమె గంతలు కట్టుకుని మూసేసుకుంది.
కాబట్టి, ఆ ఆడకూతురుని సుబలతనయ అన్నాడు కవి.
గుణ మహిమతో: గాంధారికి పాతివ్రత్య ధర్మం
బాగా తెలుసు. తన పాతివ్రత్య మహిమతో
దారధర్మ పాలన లీలన్: భార్యా ధర్మాన్ని
గొప్పగా నిర్వహిస్తూ ఉండగా
విబుధ స్తుతు డవ్విభుండు వెలసెన్ ధరణిన్:
అలాంటి పతివ్రత భార్యగా కలిగిన ధృతరాష్ట్రుడు దేవతల చేత కీర్తించ బడ్తున్నాడని
భారతార్ధం.అంటే అయ్యగారి మహాత్మ్యం అంతా భార్య పాతివ్రత్యం మీదే ఆధారపడి
ఉందన్నమాట!
ఈ ‘కందపద్యం’ లో సూరనగారు చేసిన
చెమక్కులు రెండున్నాయి.
‘సుబలతనయ గుణమహిమన్’, అని భారతార్ధంలోనూ,
‘సుబలత నయగుణమహిమన్’ అని రామాయణార్ధంలోనూ
అలాగే, “తనకు దార ధర్మ పాలనలీలన్”అని భారతార్ధంలోనూ, “తన
కుదార ధర్మ పాలన లీలన్” అని రామాయణార్థం లోనూ విడగొట్టుకుని చదివే నేర్పు
పాఠకుడిక్కూడా ఉండాలి. ఇలా వ్రాయటాన్ని ‘సభంగ శ్లేష’ అంటారు.
సభంగశ్లేష
పండాలంటే కవి ఒక పదాలభండారం కావాలి. ఆ సమయానికి తగిన పదం తట్టాలి. అందుకు సాధన
కావాలి. ఇదంతా శ్రమే! మేథో శ్రమ! ఒక పద్యం రాసి జనం మీదకు వదలటానికి ఇంత కసరత్తు
చేయాలా...అనడిగితే, ఇతరుల కన్నా భిన్నంగా చెప్పాలనే తపన ఉన్న కవెప్పుడూ కసరత్తు
చేయాలనే చూస్తాడు కదా...అనేది సమాధానం! ఆ రోజుల్లో వ్యాప్తిలో ఉన్న కవితా రీతిలో
ఒకడుగు ముందుకు వేసే ఒక ప్రయత్నం అది!
ఒక పద్యంలో
రెండర్థాల పదాలు వేసే వారొకరైతే, ఒకే పద్యంలో రెండు వేర్వేరు భావాలు పలికిచే వారిం
కొకరైతే వీరందరి కన్నా ఘనులుగా. మూడర్ధాల త్యర్థి కావ్యాలు కూడా రాసిన మహాకవులున్నారు.
కుస్తీపట్టాలే గాని, భావచతుర్థిని పండించ గలగటం కూడా సుసాధ్యమే! అది జరగాలంటే
కవికి తెలుగు భాష మీద పట్టుండాలి! అది పద్య కవికే కాదు, వచనకవిక్కూడా అవసరం. ఎలా
రాయాలో ఎందుకు రాయాలో తనకు తానే నిర్ణయించు కోగలగటానికి నేటి కవులు ప్రాచీన
సాహిత్యాన్ని చదవటం అవసరం కూడా! ఎలా రాయకూడదనే విషయంలో ఒకప్పటి తూనిక రాళ్ళు
ఇప్పుడు మారిపోయాయి. పాత సాహిత్య పునాదుల్లోంచి కొత్త సాహిత్య భవనాలు నిర్మాణం
కావాలి!
No comments:
Post a Comment