తెలుగువారి అరిసెలు
డా|| జి. వి. పూర్ణచందు
అల్లుడొచ్చా డొల్లకాడు అరిసె లొండా
నొల్లకాడు
ఒడ్డూ పొడుగూ ఒల్లకాడు ఒక్క ముక్క
ముట్ట డొల్లకాడు
ఆడేం తిన్నాడా డొల్లకాడునేనేం
పెట్టా నా వొల్లకాడు!
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు
సేకరించిన ఆడపిల్లల పాటల్లో ఇదొకటి.
ఆ వచ్చిన వాడు డొల్లకాడు, అంటే లోపల
సరుకులేనివాడని!
నొల్లకాడు అంటే నోట్లోవేలేసుకుని
చప్పరించేవాడు.
అతని కోసం అరిసెలు వండిందట,
‘ఒల్లకాడు’ అంటే సన్నగా
పొడవుగా గడబొంగులా ఉంటాడట. కానీ ఒక్క అరిసెని కూడా పూర్తిగా తినలేక పోయాడట.
వాడేం తిన్నాడు వట్టి డొల్లకాడు.
నేనేం పెట్టాను నా వల్లకాడు”
అంటుందీ పాటలో మరదలు పిల్ల.
కొత్తల్లుడు పెద్దపండక్కి వస్తే, అరిసెలు
వండిపెట్టటం సంప్రదాయం. కొత్త అల్లుణ్ణి ఆడపిల్లలు ఆటపట్టించటం ఓసరదా!
కథాసరిత్సాగరంలో ‘అపూపికాముగ్ధు’డనే అమాయకుడి కథ
ఉంది. వాడు ఓ పణం పెట్టి 8 అరిసెలు కొని,
6 తిన్నాడు. ఏడోది తినేసరికి కడుపు నిండింది. ఈ ఎనిమిదోది ముందే తిని ఉంటే
వృధా అయ్యేది కాదు కదా... అనుకున్నాడట ఆ అమాయకుడు. అతనిపేరే అపూపికా ముగ్ధుడు.
అంటే స్వీట్లు తిని సంతోషపడేవాడని.
అన్నమయ్య వెంకటేశ్వర శతకంలో ”అరిసెలు నూనె
బూరెలును నౌఁగులు జక్కెరమండెఁగల్ వడల్”
అంటూ అరిసెలతో మొదలుపెట్టి నైవేద్యపు వంటకాల పట్టిక ఇచ్చాడు.
"అలివేణి నీ చేతి యతిరస రుచి
రసజ్ఞానుదమాయె నేమనగ వచ్చు”
అన్నాడో ప్రాచీన కవి.
వరిబియ్యాన్ని `అరిసి’ అంటారు. అరి
అంటే వేరుచేయబడినది అని! వరి గి౦జలపైన ఊక,
తవుడు, చిట్టు
వగైరా తీసేయగా వచ్చిన తెల్లబియ్యాన్ని అరి,
అరిసి, అరిచి
పేర్లతో పిలిచేవారని తిరుమల రామచంద్రగారు వ్రాశారు.
‘అరిసి’తో చేసింది
అరిసె. “అరి” ద్రావిడ భాషా
పద౦!
“వరి” అనేది
ఆస్ట్రోనేషియన్ “ము౦డా” భాషాపదం
కావచ్చని మైకేల్ విజ్జెల్ లా౦టి పండితుల అభిప్రాయం. వరిని ధాన్యం (paddy) అనే
అర్థంలోవాడుతున్నాం. “నివ్వరి” అనే ధాన్య౦ కూడా
ఉన్నాయి.
‘అరి’ అనేది తమిళపదం
అనీ, అరిసెలు
తమ వంటకమేననీ తమిళులు వాదిస్తుంటారు. ఇది అర్థసత్యమే!
తెలుగులో వరిపంట మీద విధించే
పన్నుని కూడా అరి అనే అంటారు. పన్ను కట్టే రైతు అరికాపు! భూ యజమానిని అరుసు
అంటారు. తిమ్మరుసు కన్నడిగుడు కాదు, తెలుగువాడే!
అరి(పన్ను) కట్టడానికి గడువు అడగటం
లేదా అప్పు చేయటాన్ని ‘అరువు’ అంటారు. జన
వ్యవహారంలో ఈ అరువు చేబదులు అనే అర్థంలోకి మారింది. ఇప్పుడు తాకట్టుతో సహా అన్ని
అప్పుల్నీ అరువు అనే అంటున్నారు.
తమిళులకు సంక్రాంతి పొంగలి పండుగ
కాగా, తెలుగు
వారికి అరిసెల పండుగ! అరిసె మనది కాదనే అపోహతో తెలుగువాళ్లు కూడా ‘హేపీపొంగల్’ అంటుంటారు.
అరిసె లేకుండా మనకు సంక్రాంతి
వెళ్లదు. గ్రామాల్లో అరిసెల్ని సామూహికంగా వండుకొంటారు. అరిసెలు మానవ సంఘజీవనానికి
అద్భుత సంకేతం. పాపాయి నిలబడి అడుగులేస్తోందంటే సంబరంగా అరిసెలు పంచుతారు.
అరిసెలమీద నడిపిస్తారు. ఇంగ్లీషు వాడికి కేక్ వాక్, క్యాట్ వాక్
ఉన్నాయి. తెలుగు వారిది అరిసె నడక! అరిసె తెలుగింటి వైభోగానికి తీపి గుర్తు.
అరిసెలు చేసేప్పుడు బియ్యప్పిండిని
పాలు పోసిముద్దలా చేస్తే దోషాలను తగ్గించి బలకరంగా ఉంటాయి.
"దుగ్దా లోడిత గోదూమ శాలి
పిష్టాది నిర్మితా: వాతపిత్తహరా భక్ష్యా హృద్యా శ్నుక్ర బలప్రదా:” అని యోగరత్నాకరం
వైద్యగ్రంథంలో ఉంది.
బెల్లపు అరిసెలు కష్టంగా పంచదార
అరిసెలు తేలిగ్గా అరుగుతాయని ఈ గ్రంథం పేర్కొంది. నేతి అరిసెలు మరింత మేలైనవి
కూడా!
అరిసె ఆరునెల్ల రోగాల్ని బయట
పెడ్తుందని మనవాళ్లలో భయం ఉంది. అరిసెలు కష్టంగా అరిగేవి కాబట్టి, జీర్ణశక్తి
తక్కువగా ఉన్నవారు తింటే అజీర్తి లక్షణాలను కలిగించటం సహజం. అజీర్తి రోగులకు
కష్టంగా అరిగేది ఏది తిన్నా చెడే చేస్తుంది. పర్వతాల్ని ఫలహారం చేయగల వాళ్లని
అరిసెలు ఏమీ చేయవని దీని భావం.
అరిసెలు తిన్నాక అరగవనే భయం ఉంటే, ధనియాలు, జీలకర్ర, శొంఠి
సమభాగాలుగా తీసుకొని దంచి తగినంత ఉప్పు చేర్చి గ్లాసుమజ్జిగలో కలుపుకుని తాగితే
అరిసెలు తేలికగా అరుగుతాయి.
అరిసెల్ని అతిరసాలని, నిప్పట్లని కూడా
పిలుస్తారు.
తెలుగులో ‘అరిసెం’ లేదా ‘అరసం’ అంటే అలరు, ఎలమి, వేడుక అని!
అరిసె మనకి వేడుకే! ఒకప్పటికన్నా
శారీరక శ్రమ తక్కువ, మానసిక
శ్రమ ఎక్కువగా జీవిస్తున్నాం. మన పూర్వులకన్నా మన జీర్ణశక్తి స్థాయి చాలా తక్కువ
కాబట్టి, అరిసెల్ని ఆచితూచి తినటం అవసరమే!