Wednesday 2 June 2021

మనం అట్టేపెట్టుకున్న అట్టు:: డా. జి వి పూర్ణచందు

 మనం అట్టేపెట్టుకున్న అట్టు:: డా. జి వి పూర్ణచందు

                                                            చమ్మచక్క.. చారడేసి మొగ్గా..

                                                            అట్లుపొయ్యంగా.. ఆరగించంగా..

                                              (బాలక్రీడా విశేషం)

          పండగలు పబ్బాలప్పుడే కాదు, నలుగురు బాలికలు ఎప్పుడు కలిసినా చమ్మచక్క ఆటని ఎదురు బొదురుగా నిలబడి, చేతులు చాచి, ఒకరి చేతులు మరొకరికి తాటిస్తూ, ఎగురుతూ, గెంతుతూ, వెనకకు ముందుకూ వూగుతూ పాడుతారు. ఈ చేతులు తట్టడంలోనే ఉన్నది కథంతా!

          చమ్మచక్క ఏమిటీ? చారడేసి మొగ్గేమిటి? ఆ తరువాత అట్లుపోయడమేమిటీ? అట్లను హాయిగా ఆరగించటానికి ముందు ఎంత శ్రమ ఉంటుందో, అమ్మ ఎంత కష్టపడితే వంట తయారౌతుందో పిల్లలకు తెలియాలికదా! పెద్ద వాళ్లను పిల్లలు అనుకరిస్తారని ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. అమ్మ వంటింట్లో ఏం చేస్తుందో ఇక్కడ పిల్లలు అదే చేస్తున్నారు.

          చమరు లేదా చమురు అంటే అరచేతుల్తో తట్టటం (To give a slap with the palm) అని! గోధుమ పిండిని మర్దించి ఉండగా చేసి, బిళ్ళలా నొక్కి రెండు అరచేతుల మధ్య ఉంచి చమరుతూ అంటే తడుతూ ఉంటే అది గుండ్రంగా చక్రంలా సాగుతుంది. చమరి చక్రంలా తట్టింది చమ్మచక్క”. చక్రానికి చక్క అనేది పిల్లల భాషా రూపం.

          ఇలా చమ్మచక్కకొడితే అది చారెడంత అవుతుంది. దాన్ని పిల్లిమొగ్గలు, నెమలిమొగ్గలు వేయించి గిర్రున తిప్పుతుంటే ఆ చక్రం మరింత పెద్దదిగా సాగుతుంది. చారెడేసి మొగ్గలుఅనే మాటకు బహుశా ఇదే భావం కావచ్చు!! 

          రుమాల్ రోటీలు చేసేవాళ్లను ఎప్పుడైనా గమనించి చూడండి. అరచేతుల్లో ఆ పిండిని గిర్రున తిప్పుతూ పైకెగరేస్తూ అనేక మొగ్గలు వేయిస్తుంటారు. చారడేసి మొగ్గలతో అలా అట్టు (రోటీ) తయారౌతుంది.

          అట్అంటే తడి ఆరిపోయేలాగా పొడిగా (dry) కాల్చటం, శుష్కింపచేయటం అనే అర్థాలున్నాయి. అడుఅంటే పూర్తిగా పొడిగా అయ్యేలా చేయటం. అన్నం అడుగంటింది అంటే తడి అంతా ఆవిరైపోయిందని! అట్టగట్టింది అంటే, ఎండి, మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా అయ్యిందని! ఇంకా ఉంచితే మాడుతుంది. తమిళంలో కూడా అటు’, ‘అటువ్’ ‘అట్ట్అనే పదాలు వండటం, కాల్చటం, వేయించటం, ఉడికించటం అనే అర్ధాల్లోనే ఉన్నాయి. అటుక్కలై, అట్టుంబల, అడకల=వంట గది; అట్టు=తీపి రొట్టె.. అట్టము=ఆహారం. ఇలా అట్టుఅనే పదం ఆహార పదార్ధం అనే అర్ధంలోకి పరిణమించింది.

          అట్టుని దోసె అనే అర్థంలోనూ, చపాతీ, పుల్కా అనే అర్థంలో కూడా వాడుతున్నాం. పెనం లేకుండా నేరుగా నిప్పుల సెగ మీద కాల్చిన అట్టుని తెలుగులో నిప్పట్టు’ (నిప్పు+అట్టు) అంటారు. తండూరీ ప్రక్రియ ఇది. అరటి లేదా పనస ఆకుమడతల మధ్య ఉంచి కూడా కాలుస్తారు. నిప్పటి, ఇపటి, నిపటి (DEDR3670) అనే పేర్లూ ఉన్నాయి.

          గుండ్రని ఆ చమ్మచక్కల్ని మధ్యకు మడిచి, రెండు రెండు పొరలు మీద వత్తితే దౌపాతి, మూడు మడతల మీద త్రిపాతి, నాలుగు మడతల మీద చపాతీ అయ్యింది. పుల్కాకీ చపాతీకీ పిండి ఒకటే అయినా పొరకీ పొరకీ మధ్య నెయ్యి లేదా నూనె ఎక్కించటం వలన రుచి మారిపోతోంది.

          అట్టు మనదే! మనం అట్టే పెట్టుకున్నదే! బొబ్బట్లు, నిప్పట్లు, నీరట్లు, చాపట్లు...ఇలా చాలా అట్లు మనకున్నాయి. తండూరీ రోటీలు మనకూ ఉన్నాయి. తప్పాల చక్కలు లేదా మండెగలు అనేవి మన ప్రాచీన అట్టుకు మిగిలున్న సాక్ష్యాలు. వాటిగురించి మరోసారి చర్చిద్దాం. 

No comments:

Post a Comment