విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో పద్యానుభవం పేరుతో ధారావాహికగా వ్రాస్తున్నాను.
ఈ వారం వచ్చిన పద్యం ఇది.
పద్యంలో కరకరలు
డా. జి వి పూర్ణచందు.
“నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి వెలసె, కరిభి ద్గిరిభి
త్కరి కరిభి, ద్గిరి గిరిభిత్
త్కరి భిద్గిరి భిత్తురంగ కమనీయంబై”
మన సినిమాల్లో
హీరోలు రెండు మూడు దెబ్బలు తిన్నాక కిందపడి పెదవి చిట్లి ఆ నెత్తురు చూసుకున్నాక అప్పుడు
పౌరుషం తన్ను కొచ్చి ఎగిరెగిరి తన్నినట్టు చూపిస్తారు. కవి వీరులు అలా చెయ్యరు.
ఎవరి ఆయుధాలు వాళ్లకుంటాయి. తెనాలి రామలింగ కవికి పదాలే ఆయుధాలు. అవతలివాడు
కళ్ళుతిరిగి కిందపడి గిలగిలాడేలా వాటిని ప్రయోగించటమే ఆయనకు తెలిసిన విద్య.
నోరున్నవాడిదే రాజ్యం అని నిరూపించిన కవి తెనాలిరామలింగడు.
వంటొచ్చిన మొనగాడు
మాత్రమే వండగలిగిన కరకర వంటకం ఈ పద్యం. ఇందులో ఆయన కరినీ గిరినీ ఎంచుకున్నాడు
రెండో అక్షరం “ర” ఉండేలాగా పదాలు పేర్చుకోవాలి. కృష్ణరాయలుతో పద్యం మొదలు
పెట్టాలి. ‘ర’కారం రెండో అక్షరం కావాలంటే కృష్ణరాయలి బంధు మిత్రువుల పేరుచెప్పి
వారికి బంధువైన కృష్ణరాయా.. అని రాయాలి. లేదా శత్రువా అని సంబోధించాలి. బాగా
వెదికాడు. కృష్ణరాయలు తండ్రిపేరు నరసరాయలు. తమిళులకు తండ్రి పేరు ముందు చెప్పుకునే
సాంప్రదాయం ఉంది. రామస్వామి వెంకటరామన్ అంటే రామస్వామిగారి కొడుకు వెంకటరామన్ అని!
మన తెలుగురాజులు కూడా గౌతమీ పుత్ర శాతకర్ణి... ఇలా తండ్రుల పేర్లో తల్లుల పేర్లో
ముందు చెప్పుకునే సాంప్రదాయాన్ని పాటించారు. తెనాలి రామలింగడు నరసింహ కృష్ణరాయా!”
అంటూ ఈ పద్యాన్ని మొదలుపెట్టాడు. ఆయన చేతికి అరుదైన కీర్తి దక్కిందంటాడు.
ఇంక అక్కణ్ణించీ ఈ
పద్యంలో కేవలం పదాల కరకరలే తప్ప భావాల ఘుమాయింపు లేవీ ఉండవు. తను వండదల్చిన లడ్డూ
తినడానిక్కాదు, ఎదుటివాడి పళ్ళూడగొట్టటానికి కదా...!
వర్ణించేది కృష్ణరాయలి
కీర్తిని! అది అరుదైంది. ఆ కీర్తి తెల్లగా ఉందని చెప్పాలి. అందుకని తెల్లని అరుదైన
విషయాల్ని ఎంచుకున్నాడు.
కరిభిత్= గజాసురుణ్ణి
చంపినవాడు శివుడు. ఆయన తెల్లగా ఉంటాడు.
గిరిభిత్కరి=
పర్వతాల రెక్కల్ని తన వజ్రాయుధంతో నరికిన ఇంద్రుడి ఏనుగు ‘ఐరావతం’ తెల్లనిది.
కరిభిద్గిరి=
గజాసురుణ్ణి చంపిన శివుడి కొండ ‘కైలాసం’. అది తెల్లగా ఉంటుంది.
కరిభిద్గిరి
భిత్తురంగ కమనీయం= ఇలా కరిభిత్తు, గిరిభిత్కరిభిత్తు అయినశివుడి తురంగం అంటే వాహనం
నంది. అది తెల్లగా ఉంటుంది. అది కమనీయం. కమనీయమైనవి ఉత్సవ శోభని కలిగి తెల్లగా
ఉంటాయి.
కృష్ణరాయల కీర్తిని
అరుదైన తెల్లని విశేషాలతో పోల్చి అంతటిది అని చెప్పటమే కవి ఆశించిన ప్రయోజనం.
ఆపాత మధురం అంటే
వినంగానే గొప్పగా ఉందని అనిపించటం! వినంగానే బావుందని పిస్తుందిగానీ, బాగా వినగా
వినగా అందులో గొప్పగా లేనివి చాలా కనిపిస్తున్నాయనే వ్యంగ్యం కూడా ఇందులో ఉంది. ఈ
పద్యం కూడా ఆపాతమధురం. ఆపాతం అంటే, అప్పటికప్పుడు ముంచుకొచ్చినట్టు వెల్లువలా
రావటం. అది మధురంగా ఉన్నదని పించటం. పకోడీలు కరకరమంటూ ఆపాతమధురంగా ఉంటాయి. ఆ
తరువాత కదా వాటి అసలు సంగతి తెలిసేది! కరిభిత్, గిరిభిత్కరి గురించి తెలిశాక
తెల్లబోవటమే మనవంతు అవుతుంది!
No comments:
Post a Comment