Saturday, 9 May 2015

తక్కువ పాపికే ఓటు:: డా. జి వి పూర్ణచందు

తక్కువ పాపికే ఓటు
డా. జి వి పూర్ణచందు

ఒకటికి రోయకుంట గను మున్నవియున్, దృపదుండు మారణే
ష్టికి( బసిజూపి వేడ- మునిసింహు డొకండు తమన్న వేల్చు( బం
దొక డపవిత్ర భూమి గని యే జనదా గ్రహించె రో
యకొనియె, గాన నట్లెఱుగనౌ జను, సర్వము(గా నశక్యమె?”
వీడు మంచివాడా? చెడ్దవాడా? ఎలాంటి నీచానికైనా దిగజారతాడా? అని ఆ వ్యక్తి గురించి తెలుసు కోవాలంటే ఉన్నవి తెలుసుకోవాలంటాడు కృష్ణదేవరాయలు. ఆయన గొప్ప రాజుగారు. మూడు సముద్రాలూ ఆయన అధికార పరిధిలో ఉండేవి. ఆ స్థాయిలోఉన్నవాళ్లకి ప్రతి ఒక్కడి ప్రొఫైలూ విడివిడిగా పరిశీలించి, ఎవడెలాంటి వాడో నిర్ధారించటం సాధ్యం కాదు. అందుకని, వ్యక్తులు చేసే చిన్నపనుల్నిబట్టి, వాళ్లని అంచనా వేయాలన్నాడు. ఉన్నవి తెలుసుకోవటం అంటే అది!
ఒకటికి రోయకుంట గను మున్నవియున్అంటే, అసహ్యమైన పని చేయటాన్ని అసహ్యించు కోకుండా చేసే తత్వం ఉన్న ఒకడికి ఉన్నవేమిటో (బుద్ధులు)తెలిసిపోతుంది. ఎలాగంటావా…? ఒక ఉదాహరణ చెప్తాను
దృపదుండుమారణేష్టికి(బసిజూపివేడ- మునిసింహుడొకండుఒకప్పుడు దృపద మహారాజు (ద్రౌపదితండ్రి) మారణేష్టి అనే యఙ్ఞం తలపెట్టాడు. తన శత్రువు లందరూ చచ్చి పోవాలనే కోరికతో చేసే యఙ్ఞం అది! ఇప్పటి రోజుల్లో అయితే ధికారంలో ఉన్నవాడు సి బి ఐని ఉపయోగించుకున్నట్టే అప్పటి రాజులు ప్రతిపక్షం మీదకు ఇలాంటి య్ఙ్ఞాలను ప్రయోగించే వారన్నమాట!  శత్రూ మారక యఙ్ఞాన్ని చేయించటానికి బ్రాహ్మలెవరూ ముందుకు రాలేదు. వందల సంఖ్యలో ఆవులు ఇస్తానని ఆశ చూపించాడు. కానీ, ఎవరూ కదల్లేదు. చివరికి ఎక్కడో అడవుల్లో తపస్సు చేసుకుంటున్న ఓ మునిసింహంగురించి విని వెదుక్కొంటూ వెళ్ళాడు.
మునిసింహుడొకండుతమన్నవేల్చు( బందొక డపవిత్ర భూమి గని యే జన దా గ్రహించె రోయకొనియె ఆ మునిసింహం దృపదుడి కోరిక వింటూనే అసహ్యించుకున్నాడు. ఇలాంటి ఆలోచనలున్న వాడివి కాబట్టే, నీకు అంతమంది శత్రువులు ఏర్పడ్డారు. శత్రు భయం నిన్ను పీడిస్తోంది. అందువలనే ఇలా కోరుతున్నావు. మంచి తనంతో శత్రుత్వం తగ్గించు కోవాలి గానీ, శత్రువు లందరూ చచ్చి పోవాలి అని కోరుతో యఙ్ఞం చేయా లనుకోవటం నీచాతినీచం అని మందలిస్తాడు. రాజు బతిమాలుకుంటే అప్పుడు చెప్పాడు: మా అన్న ఒకడున్నాడు…  వెళ్ళి ఆయన్ని కలుసుకో! వాడైతే ఇలాంటివి అవలీలగా చేయిస్తాడుఅంత గ్యారంటీగా ఎలాచెప్తున్నా నంటావా…? ఒకసారి మేవిద్దరం కలిసి వెడుతున్నాం.  అప్పుడు ఒక పండు చెట్టుమీంచి రాలి పడింది. ఆ సమయంలో ఇద్దరికీ బాగా ఆకలిగా ఉంది. చెరి సగం తినాలనుకున్నాం. తీరాచూస్తే, ఆ పండు అశుద్ధం పైన రాలింది. నాకొద్దులే అని చెప్పి నేను వెళ్ళిపోయాను. మావాడు ఆ పండునే తుడుచుకుని తినేశాడు. వాడికి ఉఛ్ఛనీచాలు లేవు. ఎంత నీచానికైనా రోయడు. ఛీ అనుకోడు. నువ్వు అడిగింది చేయటానికి వాడే సమర్థుడు…” అని!
గాన నట్లెఱుగనౌ జను, సర్వము(గాన శక్యమె?”వాడు చేసేపనిని బట్టి బుద్ధి ఎలాంటిదో తెలుసు కోవాలేగానీ, మొత్తం జీవితం అంతా చూసి తెలుసు కోవాలంటే కుదరదుఅంటాడు. ఇది ఆముక్తమాల్యద కావ్యంలో రాజనీతి బోధించే సందర్భంలో చెప్పిన పద్యం. తన రచనలో వీలైనంత మేర స్వీయాను భవాల్ని చెప్పుకోవాలనే తపన రచయితకి సహజంగా ఉంటుంది! అందుకని, యమునాచార్యుడిచేత కుమారుడికి రాజనీతిపాఠాలు చెప్పించే సన్నివేశాన్ని సృష్టించుకున్నాడు కృష్ణదేవరాయలు.
ఆముక్తమాల్యద 600 యేళ్ళ నాటి కావ్యం. అవి సత్తెకాలపు రోజులు. ఇప్పు డలాంటి సీను లేదు. పేడ మీద పడ్డవి ఏరుకు తినేవాణ్ణి తెచ్చి అందలం ఎక్కించటానికి వెనుకాడని కాలం మనది! నీతి కూడు పెడుతుందా? నిజాయితీ ఐశ్వర్యాన్ని ఇస్తుందా? ఆదర్శం అందలం ఎక్కిస్తుందా? అని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్ళూ వాళ్లు తిన్నారు, ఇప్పుడు నేను తింటే తప్పొచ్చిందా? అని బహిరంగం గానే అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు ప్రజల దగ్గర సమాధానం లేదు.
తాగిన మైకంలో అర్ధరాత్రి ఇష్టారాజ్యంగా కారు నడుపుతూ ఒక డ్రైవరు, ఫుట్పాత్ మీద అలిసి పడుకున్న వాళ్లపై నుండి దూసుకు పోయాడు. ఒకడు చనిపోయాడు. కొందరికి గాయాలయ్యాయి. ఆ డ్రైవరు మామూలు మానవుడైతే, పందొమ్మి దేళ్ళు విచారణ లేకుండా జైల్లోనే ఉంచేవాళ్లు. కానీ, అదే నేరాన్ని ఒక సినిమా నటుడు చేశాడు. దాంతో సీను మారింది.
భారత దేశంలో సినీనటులు దైవాంశ సంభూతులు కదా! ఈ నేరాలూ శిక్షల చట్రంలో వాళ్లను తెచ్చి బిగించి, వాళ్ళగురించి ఉన్నవి వెలికి తీసి, అపకారం చేయాలని చూస్తే అంతకన్నా అపచారం ఇంకొకటి ఉండదు. అందుకే, తీర్పు వ్యతిరేకంగా వచ్చినా, ఘడియలూ విఘడియలూ గడవ కుండానే అసాధారణ రీతిలో జైలు తప్పించి బైలు ఇప్పించి, ఈ దేశంలో అంతటి అపచారం జరక్కుండా పై కోర్టులు కాపాడాయి! దేవుడి లాంటి మనిషి జైల్లో పడకుండా దేశం పరువు నిలబెట్టాయి.

రాయలవారు తన రాజనీతి పాఠాల్లో ఉన్నవి తెలుసుకోఅని చెప్పాడు గానీ, తెలుసుకుని ఏం చేయాలో చెప్పలేదు. రాజకీయ, సామాజిక, వాణిజ్య, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన సెలెబ్రిటీ లనదగిన వారిలో ఇలాంటి ఉన్నవి చాలా ఉంటాయి. తెలిసీ... తెలిసి తెలిసీ... ఎక్కువ పాపికన్నా తక్కువ పాపి మేలనే భావనతో ఓట్లేసి ఊరక చూచుచుండటం తప్ప జనం చేసేదేమీ లేదని ఆయనకు తెలుసు కాబట్టి! 

No comments:

Post a Comment