ఆహారంలో పురుగుమందులు-మన జాగ్రత్తలు
డా. జి వి పూర్ణచందు
9440172642
పురుగు మందులు లేకుండా మనుషులం బ్రతకగలమా? ఈ ప్రశ్నకు మన
దగ్గర సమాధానం లేదు.
పురుగులతో
నిండిన ఆహారమా...? లేక పురుగు మందులా...?
ఏవి కావాలని అడిగినా మన దగ్గర సమాధానం లేదు. బ్రతకటానికి పురుగుమందులు ఒక అవసరం, ఒక ఆటంకం కూడా! పురుగులకు మాత్రమే
విషం, మనుషులకు అమృతం అనదగిన పురుగు మందులు మనకి దొరికే దాకా పరిస్థితి ఇంతే!
భారతదేశంలో ఆహార ద్రవ్యాలలో
పురుగుమందుల శాతాన్ని నియంత్రించేందుకు CIBRC, FSSAI అనే సంస్థలున్నాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ
ఆధీనంలో సంస్థలు ఇవి. ఇంకా హార్టీకల్చర్ బోర్డ్, స్పైసెస్ బోర్డ్ లాంటి చాలా
సంస్థలు మన ఆహారపరిరక్షణ కోసం ఉన్నాయి. రైతులకు శాస్త్రీయంగా వ్యవసాయం చేయటం
తెలియదని, ఇష్టారాజ్యంగానూ,అనవసరంగానూ పురుగు మందులు వాడేస్తున్నారని వ్యవసాయాధికారులు
నేరాన్ని రైతులమీదకు నెడుతున్నారు. ఎక్కువ ఉత్పత్తి సాధించాలనే యావ ఈ విధంగా
పురుగుమందుల అతి వాడకానికి కారణం అవుతోందనేది వారి ఆరోపణ.
నాణ్యమైన ఎరువులు, పురుగుమందుల సరఫరా
జరిగేలా వ్యవసాయాధికారుల నియంత్రణ ఉండటం లేదని, ఏ పంటకు ఎంత పురుగు మందులు, ఎన్ని ఎరువులు వాడాలో అంతే వాడుతున్నామనీ,
కల్తీ మందుల కారణంగా పురుగులు చావక పోవటం వలన మళ్లీ మళ్లీ మందులు వాడాల్సి వస్తోందని రైతులు
చెప్తున్నారు. ఆ మాటకొస్తే, పురుగుమందుల విషానికి మొదటగా బలి అవుతోంది రైతులు,
రైతుకూలీలే!
మొక్కల పూలు,కాయలు, ఆకులు, కాండాలూ,
వేళ్లూ, నేల, నీరు ఇవన్నీ ఆహారంలో పురుగుమందుల్ని చేర్చే వాహకాలుగా మారిపోతాయి.
సమస్త జీవరాశులకూ ఇది అపకారం చేసేదే అవుతుంది.
ఇది ఇండియాలోనే కాదు. భూతలస్వర్గం అని
మనం వెర్రిగా వ్యామోహపడే దేశాల్లో కూడా పరిస్థితి ఇంత కన్నా మెరుగ్గా ఏమీ లేదు.
ఇక్కడంతా కల్తీ అనీ, అక్కడ నాణ్యమైన వ్యాపారులుంటారని మనలో ఒక అపోహ ఉన్నమాట నిజం.
లేకపోతే, బార్ కోడ్ స్టిక్కర్ అతికించగానే వెనకాముందూ చూడకుండా పది రూపాయల యాపిల్
కాయని పాతిక పెట్టి ఎందుకు కొంటున్నాం?
ఆహారంలో పురుగుమందుల అవశేషాలే ఇంత
ఆందోలనకరంగా ఉంటే, ప్రత్యక్షంగా
పురుగుమందుల్నే
ఆహార పానీయాల్లో
తెచ్చి కలుపుతున్నారు.
వాటి సంగతేమిటీ? ఈ
శతాబ్ది తొలిపాదంలో ‘డౌన్ టు ఎర్త్’ అనే పత్రిక మరికొన్ని వైఙ్ఞానిక పత్రికల
ద్వారా కూల్ డ్రింకుల్లో పురుగు మందులను కలుపుతున్నారనే రహస్యం వెలికివచ్చాక
భారతదేశంలో అలజడి పెరిగింది. కానీ, ఎవరెంత ‘గీ’పెట్టినా, ప్రజలు లెక్కచేయకుండా
యథేచ్చగా పురుగుమందులు కలిసినా సరే, కూల్ డ్రింకుల వాడకాన్ని ఈనాటికీ ఆపలేదు.
2003లో ఈ పురుగుమందుల వాడకం గురించి
చర్చించేందుకు ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించారు. ఈ కమిటీ వారు
పురుగుమందులు ఎంత కలపాలనే విష్జయంలో కొన్ని మార్గదర్శక సూత్రాలు సూచించారు. దాని
ఫలితంగా అనుమతించబడిన
మోతాదులో పురుగుమందుల్ని కలిపినట్టు సీసా లేబులు మీద వ్రాస్తున్నారు. ఇలా పురుగు
మందులు కలిసిన డ్రింకులు,
జ్యూసులతో సహా
నీళ్లు, పాలు కలిసిన ఇతర పానీయాలన్నింటినీ నాగరీకులు రోజూ
కనీసం నాలుగైదయినా పుచ్చుకుంటూ ఉంటారు. ఈ నాలుగైదారు లన్నింటిలోనూ కలిపి,
అనుమతించబడిన పురుగుమందులన్నీ
కలిస్తే రోజు
మొత్తం మీద ప్రమాదకర
స్థాయిని మించి విషాలను కడుపులోకి
పంపినట్టవుతుంది.
ఇదంతా పురుగు మందులు కలిపే వారికీ,
ప్రభుత్వానికీ మధ్య వ్యవహారంగా మాత్రమే పరిగణించబడుతోంది. మధ్యలో వినియోగదారుదు అనబడే సామాన్యుడు
ఏమైపోయినా ఎవరికీ పట్టలేదు.
అమెరికన్ ప్రభుత్వం కూడా ఇలానే
మార్గదర్శకాలు రూపొందించి ఒక్కో డ్రింకు సీసాలో కలిసిన పురుగుమందులు చాలా
స్వల్పమేననీ, అవి మనుషుల ప్రాణానికి
ఏమాత్రం హానికరం కావనీ తేల్చింది. కానీ, నాలుగు బాటిల్స్ తాగితే ప్రమాదం కాదనలేదు. ప్రభుత్వంలోకి రావటానికి
ప్రజలు కావాలి.
ప్రభుత్వం నిలబడటానికి వ్యాపారులు కావాలి. కాబట్టి, ఏ దేశంలో ఏ ప్రభుత్వం
వచ్చినా వ్యాపారుల ప్రయోజనాలే నెరవేరటం సహజం. ప్రజలు గద్దె
నెక్కేందుకు పనికొచ్చే మెట్లు, వారిని ఊడ్చి తడిగుడ్డతో తుడుస్తారంతే!
కలుపు మొక్కలను చంపే glyphosate, atrazine, metolachlor-S,
దున్నేప్పుడు
చల్లే ఎలికపాములను చంపే మందు dichloropropene
వీటిని నిలవుండే
కూల్
డ్రింకులు, బీరు, ఇతర మాదక పానీయాలు, పండ్ల రసాలు, మంచినీళ్ళ బాటిల్స్ లాంటి
ద్రవ్యాలలో కలుపుతున్నారని 2017లో అమెరికన్ ప్రభుత్వం వెల్లడి చేసింది. ఎందుకంటే
ఫంగస్ లాంటివి ఆ పానీయానికి
పట్టకుండా వీటిని
కలుపుతారట.
పురుగు మందుల్ని, రసాయన ఎరువుల్ని
చల్లటం వలన, గాలి ద్వారా వాటి ప్రభావం చల్లేవారిని వ్యాధుల్లోకి నెడుతుంది. ఆ
మొక్కల పూలు,
ఆకులు, కాయలు, గింజలు, వ్రేళ్లుఇ, దుంపలతో సహా అన్నీ కలుషితం అవుతాయి. అవి చర్మం
ద్వారా, గాలిలో కలిసి, ఊపిరితిత్తులను తాకుతాయి. వాటిని తినటం వలన కడుపులోకి ప్రవేశించి రక్తంలో
చేరి శరీరం మొత్తానికీ హాని చేస్తాయి.
ఏ మార్గాన ప్రవేశిస్తే ఎంత హాని
అనేదాని మీద ఎలాంటి పరిశోధనా లేదని అమెరికన్ ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇవి ఏ విధంగా
శరీరంలోకి ప్రవేశించినా పునరుత్పాదక
అవయవాల మీద
చెడు కలిగిస్తాయనీ, కేన్సరు లాంటి వ్యాధులకు కారణం అవుతాయని ప్రకటించింది. మోతాదు మించి వీటి తాకిడి
వలన తలనొప్పి, తల తిరుగుడు, వికారం, విరేచనాలు, నిద్రపట్టకపోవటం, గొంతులో మంట,
కళ్లు బయర్లు కమ్మటం, వాంతులు, గుండె దడ, శరీరం మీద కాలినట్టు బొబ్బలు, దద్దుర్లు,
స్పృహ తప్పటం, ఊపిరాడకపోవటం, గాలి మార్గాలకు కఫం అడ్డుపడటం లాంటి లక్షణాలు
కనిపిస్తాయి.
ఉన్నంతలో నయం అనదగిన కొన్ని
ద్రవ్యాలున్నాయి. తీపి మొక్కజొన్న కండెలు, పైన్ యాపిల్, బొప్పాయి, తేగలు, వంకాయలు,
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లిపాయలు, కుక్కగొడుగులు ఇలాంటి కొన్ని ఆహార ద్రవ్యాలను
ఎక్కువ ప్రమాదకరం కానివిగా అమెరికన్ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ మాత్రమే దొరికే
అవొకాడో, కీవీ పండ్లు, కాంటాలోప్, బ్రొకోలీ లాంటివి ముఖ్యమైనవి.
సింథటిక్ ఎరువులు, పురుగుమందులు,
నేలను సారవంతం చేసే రసాయనాలు, జన్యుపరంగా మార్పిడి చేసిన బిట్ వంకాయల్లాంటి
ద్రవ్యాల వాడకాన్ని నిషేధించటం అనేది ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. అయితే,
సాంప్రదాయక వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభింపచేయటం ఒక్కటే జరగాలి. పశుసంపదని తెలుగు
రైతులు నాశనం చేసుకున్నారు. చెరువుల్ని పూడ్చుకున్నారు. చదువుకున్నవారు మట్టి
పిసకటాన్ని నామోషీగా భావించుకున్నారు. రైతులు ఒకరిని చూసి ఒకరుగా రెచ్చిపోయి
విషరసాయనాల్ని
వాడేస్తున్నారు. నిజానికి ప్రభుత్వ పర్యవేక్షణ మనదేశంలో నామమాత్రంగానే ఉంది.
అమెరికాలోనే అది అసాధ్యంగా ఉన్నదని నివేదికలు చెప్తున్నాయి. పచ్చిరొట్ట ఎరువులు,
జంతువుల పేడ
మొదలైన వాటితో తయారైన ఎరువులు ఇప్పుడు ప్రత్యామ్నాయం. కానీ వాటిని పొందగలిగే
పరిస్థితి లేదు.
ప్రజల్లో ఈ ఆందోళనను సొమ్ము
చేసుకునేందుకు తయారుగా ఉన్నవారిలో కొందరు నిజాయితీ పరులున్నప్పటికీ, బజార్లో
దొరికే ఆర్గానిక్
ఆహారాన్ని జనం నమ్మలేకపోటున్నారు. పది రూపాయల వస్తువుని పాతిక రూపాయలకు అంటగట్టే విధానమే
చాలా చోట్ల కనిపిస్తోంది. ప్రభుత్వ సంస్థలు గానీ, స్వఛ్చంద సంస్థలుగానీ, వ్యవసాయ
విశ్వవిద్యాలయాలుగానీ, మన దేశంలో ఆర్గానిక్ ఆహారం పేరుతో అమ్ముతున్న ద్రవ్యాలలో
పురుగుమందులు, రసాయన ఎరువుల అవశేషాలు లేవని నిర్థారించే ప్రయత్నాలు చేసి
వాటిని అమ్మేవారిని నియంత్రించే విధానం ఉంటే బావుంటుంది. వాటిలో
పురుగుమందుల అవశేషాలు
ఉన్నాయని తేలితే అమ్మిన వారికి
కఠిన శిక్షలు అమలు జరగాలి. ప్రజల ప్రాణాలతో చెరలాడేవారిని ఉపేక్షించటం కూడా
అన్యాయమే కదా!
కాయలు పెంచి, వాటిని కోసేంతవరకు పడే
శ్రమ ఒక ఎత్తయితే, వాటిని పండ్లుగా మార్చే ప్రక్రియ ఇంకో ఎత్తు. మామిడి, అరటి,
సపోటా లాంటి పండ్లను చూడాలంటేనే భయం వేస్తోంది. అవి తెల్లవారేసరికి పండిపోయి,
వ్యాపారులకు డబ్బులుగా
మారిపోవాలంటే
వాటిని విషరసాయనాలతో పండించి పండ్లను విషపూరితం చేస్తున్నారు. మామిడి కాయల
సీజన్ సమయంలో మాత్రమే అప్పుడప్పుడూ
అధికారులు “ఆయ్!” అని అదిలిస్తుంటారు. ఆ తరువాత కథ మామూలే! పండ్లు వాటి సహజమైన రుచిని కోల్పోయి,
విషపూరితం అవుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇలాంటివి మాకు వద్దని జనం
అన్నప్పుడు కదా...ఇ విషప్రక్రియ ఆగేది!
2012లో కనెక్టికట్ వ్యవసాయ ప్రయోగ
కేంద్రం వారు ప్రచురించిన ఒక నివేదికలో కూరగాయల్ని, ఆకు కూరల్ని, ద్రాక్ష, యాపిల్,
స్ట్రాబెర్రీ, జామ, టమోటా, వంకాయ,
చిక్కుళ్ళు, ఇంకా ఇతర ధాన్యపు గింజల్నీ
చిల్లుల బుట్టలో పెట్టి పంపుకింద ఉంచి ఎక్కువసేపు కడిగితే, పైన అట్టగట్టి అంటుకుని
ఉన్న 12 రకాల పురుగుమందుల అవశేషాలు కొట్టుకుపోయినట్టు గుర్తించారు. కనీసం రెండు మూడు సార్లు ఇలా గట్టిగా కడగాలి. మంచి వస్త్రంతోగానీ,
పేపర్ టవల్స్‘తోగానీ తుడవాలని
సూచిస్తున్నారు. ముఖ్యంగా బియ్యం, గోధుమలు, కందులు,
మినుములు, పెసలు, ఉలవలు, అల్చందల్లాంటి ధాన్యాలను ఎక్కువసేపు కడగటం అవసరం కూడా!
తొక్కతీసి
వండుకోవటానికి లేదా తినటానికి వీలైన కూరగాయలు, పండ్లను జాగ్రత్తగా తోలు వలిచి,
మరొకసారి కడగటం మంచిది. బీర, సొర, దోస లాంటి కొద్దిరకాల కాయల్ని మాత్రమే మనం తొక్కలు వలిచి
వండుకొంటున్నాం. మిగతా కూరగాయల విషయంలో కూడా తొక్కలు వలిచేందుకు సాధ్యం అవుతుందేమో
ప్రయత్నించండి. కూరగాయల్ని, ఆకుకూరల్ని పంపు నీళ్లలో తప్ప డెట్టాల్ లాంటి రసాయనాలు
లేదా సబ్బు నీళ్లతో కడగాలని చూడకండి.
చిన్న
చిన్న తొట్లలో స్వంతంగా కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవటానికి సాధ్యపడేవారు దాని మీద శ్రద్ధపెట్టండి.
ప్రభుత్వాలకు ప్రజారోగ్య విధానాల మీద శ్రద్ధ ఏర్పడేవరకూ, మన ప్రాణాలను మనమే
కాపాడుకోవాలి కాబట్టి,
ఇదంతా
చదివాక శాకాహారంలోనే ఈ పురుగు మందుల గోల ఉంటుందని, మంసాహారం సర్వ శ్రేష్టం అనీ
ఎవరైనా అనుకుంటే అదే అపోహ. జలచరాలు, లేదా నేలమీద తిరిగే జంతువుల మాంసాలలో
మొక్కల్లో కన్నా ఎక్కువపురుగుమందుల అవశేషాలు ఉంటున్నాయని కనుగొన్నారు. పురుగు
మందులు, ఇతర రసాయనాలు గడ్డి, గాదాముల ద్వారా పశువుల్లోకి, జల కాలుష్యం ద్వారా
చేపల్లోకి చేరి వాటి మాంసంలో ఈ అవశేశాలు నిక్షిప్తం అయి ఉంటున్నాయి. మాంసంలోకి
చేరిన విషాన్ని కడిగినా, వండినా కాల్చినా ఎక్కడికీ పోదని గుర్తించాలి. నిజానికి మాంసాహారం
గురించే మనం ఎక్కువ భయపడాలి!
No comments:
Post a Comment