గోదావరి తీరాన ప్రాచీన వాణిజ్యం ::
అంక తెలుగరి సెట్టి కథ
డా. జి వి పూర్ణచందు
“ఆంధ్ర దేశస్థ సర్వాపగాభంగాత్ రంగరంగముల శౌర్యములు నేర్చి,ఆత్మప్రలాప శౌర్యములు తాలిచి, సుమిత్రా బోర్నియో ద్వీపతతులు గెలిచి,వంగ మహారాష్ట్ర హద్దులు పరిచయ స్థలములై వినయమ్ము సలుప మెలగి,ఈజిప్టు నుండి కృష్ణాజలమ్ములకు బోరంబాటగా పరాక్రమము జూపి,సకల దీవుల విజయధ్వజములు నాటి, తనదు తెరచాప వార్థిరాజునకు కట్టుకోకగా, పూర్వమాంధ్రుల నౌకరాజ్య మమర జేసిన దేడు సంద్రముల మీద”
“ఆంధ్రదేశం లోని సమస్త నదీతీర ప్రాంతాల్లో వెలుగు లీనిన మహానాగరికతకు వారసులు తెలుగు ప్రజలు. తాము నేర్చిన శౌర్యాలతో సుమిత్రా బోర్నియో లాంటి ద్వీపదేశాలు గెలుచుకుని ఆంధ్ర రాజ్యాలు స్థాపించారు. వంగ-మహారాష్ట్ర హద్దుల దాకా భూములు ‘అమ్మ పుట్టిళ్ళుగా పరిచయాలే’ అన్నట్లు వినయ సంపన్నతతో మెలిగిన జాతి మనది! అటు ఈజిప్టు నైలూ జలాల మీదుగా ఇటు కృష్ణాజలాల వరకూ వాణిజ్యాల కోసం రాకపోక లెన్నో జరిపి, సముద్రం పైన తమదే అధికారంగా సకల దేశాల్లోనూ విజయధ్వజాలు నాటారు” అంటూ, తొలినాటి ఆంధ్రుల ప్రశస్తిని విశ్వనాథ ‘ఆంధ్ర పౌరుషం’ ఖండికలో కీర్తించారు సముద్ర రాజుకు తెరచాపను ‘కట్టుకోక’గా కట్టిన ఆంధ్రులు తమ ఆంధ్రరాజ్యాన్ని నౌకారాజ్యంగా ఏడు సముద్రాల మీదా అమర చేశారట! ప్రాచీనాంధ్రుల వాణిజ్య వైభవానికి ఇది అద్దం పడుతుంది. అందులో గోదావరి తీరానిది విశిష్ట స్థానం.
సమాజం ఏర్పడే దశలో ధనిక శ్రామిక వర్గభేదాలు తక్కువ! అందరూ శ్రామికులే! పొట్ట చేతపట్టి తిరిగేవాళ్ళే! అవసరాలు పెరుగుతున్నకొద్దీ అందుకు తగ్గ ఉత్పాదకత వైపు అందరి దృష్టి మళ్ళింది! పెసలు పండించిన వాడు అవి ఇచ్చి, బియ్యమో, రాగులో, జొన్నలో పుచ్చుకునే వాడు. క్రమేణా ఇది తక్కువిచ్చి ఎక్కువ తీసుకోవాలనే ఆలోచనకు దారితీసింది. వాణిజ్యవేత్తలనే ఒక కొత్త వర్గం బయలు దేరింది. ఉత్పాదకులు వారికి వాణిజ్యసాధనాలయ్యారు.
గోదావరి తీరం ప్రాచీన కాలంలోనే వాణిజ్య ప్రముఖులతో నిండి ఉంది. వాణిజ్య వేత్తలకు ‘విపులాచ పృధ్వి’ సూక్తి బాగా వర్తిస్తుంది. ఉత్పత్తి పెరిగితే వాణిజ్యం విస్తరిస్తుంది. “ఈజిప్టు నుండి కృష్ణాజలమ్ములకు బోరంబాటగా పరాక్రమము జూపి...” వ్యాపార ప్రయోజనాల కోసమే ఓడలు కట్టుకుని, సరుకు మూట లెక్కించుకుని దేశదేశాలు తిరిగారు తెలుగు వణిజులు.
కొనుగోలుదారుల అవసరాల ఎరుక కోసం ఆయా సమాజాలతో సాన్నిహిత్యం పెంచుకోవటం వలన వివిధ జాతులతో సంబంధాలు అనేక సామాజిక పరిణామాలకు తెరతీశాయి. అటువారు ఇక్కడికీ, ఇటువారు అక్కడికీ తరలి వెళ్ళారు. నైలూ నుండి కృష్ణదాకా జాతుల వ్యాపనం ఇలానే సాగింది. కృష్ణ నుండి నైలూ దాకా సంస్కృతి పరివ్యాప్తమైంది.
కొనుగోలుదారుల అవసరాల ఎరుక కోసం ఆయా సమాజాలతో సాన్నిహిత్యం పెంచుకోవటం వలన వివిధ జాతులతో సంబంధాలు అనేక సామాజిక పరిణామాలకు తెరతీశాయి. అటువారు ఇక్కడికీ, ఇటువారు అక్కడికీ తరలి వెళ్ళారు. నైలూ నుండి కృష్ణదాకా జాతుల వ్యాపనం ఇలానే సాగింది. కృష్ణ నుండి నైలూ దాకా సంస్కృతి పరివ్యాప్తమైంది.
చారిత్రక యుగంలో రోము, అరేబియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలతో తెలుగు వారి వాణిజ్య సంబంధాలకు అనేక సాక్ష్యాలున్నాయి. బౌద్ధమత గ్రంథం‘శాసనాలంకార’లో పాగాన్(బర్మా)రాజు పేరు ‘శాన్ లాన్ క్రోమ్’అని, అతను తెలంగ్ (తెలుగు వాడు) అని ఉంది. ఇది శాలంకాయన శబ్దానికి పాళీ రూపం అనీ, ఇతను సాలంకాయన నందివర్మ కావచ్చునని పరిశోధకుల భావన. క్రీ.శ. తొలి శతాబ్దాల కాలంలోనే వేగిరాజ్యం నౌకా వాణిజ్యానికి ప్రసిద్ధి పొందిందనటానికి ఇది తార్కాణం.
W D జొసరాయ్ అనే పరిశోధకుడిని ఉదహరిస్తూ ఎం. డి రాఘవన్ “ఇండియా ఇన్ సిలనీస్ హిష్టరీ అండ్ కల్చర్” గ్రంథంలో “సాలిగోత్రీకులైన సాలంకాయన బ్రాహ్మణులు ‘మహాసాలిపట్టణం’ నిర్మించుకున్నారని, టోలెమీ చెప్పిన ‘మైసోలియా’ ఈ మహాసాలి నగరమే కావచ్చుననీ ఒక ఊహాత్మక ఆలోచన చేశాడు. వేగి నగరాన్ని తొలిసారిగా రాజధానిని చేసుకున్నది సాలంకాయనులే! అదే మహాసాలిపట్టణం కావచ్చునేమో ప్రశ్నార్ధకమే! ఈ సాలంకాయనులే కృష్ణా గోదావరీ తీరాలలో వస్త్ర పరిశ్రమకు ఆద్యులు. పైడిపత్తి చెట్టు లేని ఇల్లు లేదన్నంతగా ప్రతి తెలుగింటా రాట్నమాడిన రోజులవి. రాఘవన్ ఊహ నిజమైతే తెలుగు నేలపైన “సాలి” సామాజిక వర్గానికి సాలంకాయనులు మూలపురుషు లవుతారు. వెదికితే గుజరాతీ సోలంకీలకూ, సాలంకాయనులకు సంబంధాలు దొరకవచ్చు కూడా!
తొలినాటి తెలుగు వర్తక వాణిజ్యాలకు. శాతవాహనులు, సాలంకాయనులే కారకులు! కృష్ణాజిల్లా దివిసీమలో DIVI అక్షరాలున్న రోమునాణాలు దొరికాయి. శాతవాహనులు, సాలంకాయనుల నాణాలమీద నౌకా వాణిజ్య ముద్రలు ఉన్నాయి. ఆంధ్రుల నావికాయానం 2000 యేళ్ళ ప్రాచీనతకు ఇవి ఋజువులు
క్రీ. శ. ౩వ శతాబ్ది నాటి సముద్రగుప్తుడు దక్షిణాదికి దండు వచ్చాడు. కళింగ మీదుగా వేగి సహా కంచి వరకూ ఉన్న రాజ్యాలు జయించి, వాటి పేర్లను అలహాబాదు శాసనంలో పేర్కొన్నాడు. సాలంకాయనుల్లో చివరి వాడు స్కంథవర్మ. ఇతను కంతేరులో వేయించిన కూడూహార దానశాసనంలో ఏలూరు, నుండి కైకలూరు వరకూ కొన్నిగ్రామాల పేర్లున్నాయి. దీన్నిబట్టి, కుందూరు ఈశ్వరదత్తు గారు ‘ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం’ పుస్తకంలో ఏలూరు కైకలూరు మధ్య ప్రాంతం సాలంకాయన వేగి కావచ్చునన్నారు. ఏలూరుకు దగ్గరలో ఉన్న చినవేగి, పెద వేగి గ్రామాలను వేగి నగరంగా మరికొందరు చెప్తారు. అక్కడి పాత శివాలయాన్ని చిత్రరథస్వామి గుడిగా ఊహిస్తున్నారు. అక్కడే ఒక బౌద్ధ స్తూపం ఆనవాళ్ళున్నాయి. అది ఆనాటి పెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటని మల్లంపల్లి వారు వ్రాశారు. దశకుమారచరిత్రంలో కేతన, వేగిరాజ్యం కొల్లేరు తీరాన ఉందన్నాడు. షుమారు వెయ్యేళ్ళపాటు తెలుగువారి రాజధానిగా వర్ధిల్లిన వేగికి బలమైన వేదికగా నిలిచింది గోదావరి తీరం!
బర్నెల్ పండితుడు ఇండోనేషియాలో దొరికిన ఒక శాసనాన్ని వేగి కాలంనాటి తెలుగు అక్షరాలతో వ్రాయబడినదిగా గుర్తించాడు. అందులో పుషవాంగ్ (నావికుడు), స్థపక (శిల్పి), వగ్గకిలాలన్ (విదేశీ వర్తకుడు) వణియాగ (నౌకా వాణిజ్య వేత్త), వణిగ్రామ (వర్తక శ్రేణీ-merchants`guild), నిగమ లేదా నికమ (వస్తు మార్పిడి కేంద్రం) సహాయ (సంఘాలు-యూనియన్లు) ఇలా వ్యవహార నామాలు ఉన్నాయి. వణిజులు అనేమాట ఒక కులానికో ఒక వర్గం వ్యాపారులకో కాక విదేశీ వర్తక వ్యాపారులకు వర్తించేదిగా కనిపిస్తుంది. వణిజ, సెట్టి, గ్రహపతి ఇవి భూస్వాములూ ధనిక వ్యాపారులకు వర్తించే పదాలు. వీళ్ళలో కళింగ, ఆర్య, సింహళ, ద్రావిడ లాంటి వర్తక శ్రేణులు కూడా ఉండేవి.
మధ్య యుగాలలో తెలుగు నేలపైన వర్తక శ్రేణుల ప్రాబల్యం పెరిగింది. సంపన్నులైన ఉత్పాదకులు లేదా వణిజులు వాణిజ్య శ్రేణులకు నాయకత్వం వహించేవారు. కొన్ని గ్రామాలూ లేదా నగరాలకు ఒక్కో శ్రేణి ఉండేది. శ్రేణిసమితి (కార్యవర్గం) కనుసన్నల్లో వ్యాపారం జరుగుతుంది. సమితి నిర్ణయాలకు సభ్యులు బద్ధులు! ముఠాకట్టు లాంటిదే ఇది!
ప్రతీ శ్రేణి తమని ఫలానా నగరాధీశులుగా చెప్పుకుంటుంది. తెలికిశ్రేణి అంటే నూనె వ్యాపారులు, తాము బెజవాడ ప్రభువులం అనీ, అయోధ్య ఇక్ష్వాకు వంశజులం అనీ చెప్పుకుంటారు. ‘తెలికి వేవురు చేసిన శాసనము’ అంటే వెయ్యిమంది తెలికి శ్రేణి సభ్యులు చేసిన శాసనాన్ని ప్రభువు కూడా అంగీకరిస్తాడు. వైశ్యశ్రేణి తాము పెనుగొండ ప్రభువులమని, బలంజలు ‘తాము బీజాపూర్ ఐహోలు నగర ప్రభువులమనీ చెప్తారు. బలంజ శబ్దం వణిజ శబ్దానికి భ్రష్ట రూపం కావచ్చు! తెలికివారికి బెజవాడ మల్లేశ్వరుడు, వైశ్యులకు నగరేశ్వరుడు, బలంజలకు వినాయకుడు దేవుళ్ళు. తెలికలు 1,000 కుటుంబాలు, వైశ్యులు 714 కుటుంబాలు, బలింజాలు 500 కుటుంబాలూ ఉన్నట్టు కంభం పాటి వారి ‘ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర’ గ్రంథంలో ఉంది.
గోదావరి తీరంలో మధ్య యుగాల నాటి ఒక వర్తక శ్రేణి ప్రముఖుడు ‘అంక తెలుగరి సెట్టి’గారికి సంబంధించిన అంశాలు దాక్షారామ భీమేశ్వ రాలయ ప్రాకారంలోని ఒక నాగవిగ్రహం దగ్గర వేసిన శాసనంలో ఉన్నాయి. ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ‘ఆంధ్రదేశ చరిత్ర, భూగోళ సర్వస్వము’ గ్రంథంలో దాని వివరాలు వ్రాశారు. ఈ వ్యాసాన్నే ‘భారతదేశంలో వైశ్యులు’ గ్రంథంలో పునర్ముద్రించారు. ‘అంక తెలుగరి సెట్టి’ అసలు పేరు ‘అంక సెట్టి’ తెలుగువాడు కాబట్టి, విదేశాల్లో ఈయన్ని ‘తెలుగరి సెట్టి’గా పిలిచి ఉంటారు. ఎండపి, రాయవరం గ్రామాల మధ్యనున్న 11 వర్తక శ్రేణులవారితో కలిసి ‘అంకసెట్టి’ గారు దాక్షారామంలో చేసిన దాన వివరాలు ఈ శాసనంలో ఉన్నాయి. బలంజశ్రేణి వారు ఇచ్చిన విరాళాన్ని భీమేశ్వరుడికి సేవ చేస్తున్న రాజమహేంద్రి వాసి మల్లప్ప ఒడయరు గారి పుణ్యానికి అందించారట. ఇలాంటివే తక్కిన వివరాలన్నీ!
ఈశాసనంలో కనిపించే కొన్ని ఊళ్ళు ప్రస్తుతం అదృశ్యం. కొన్ని గమ్మత్తుగా ఉన్నాయి. “దేవర ఊళ్ళైన అవసరాల వేమవరం, వీరారెడ్డి నాగవరం, నల్లూరు, పోంకల గృడ్డ, అల్లాదరెడ్డి వేమవరం, వల్లూరి అంశం, ఆవిడి, తుని, పిరిమామిడాడ ఈ గ్రామాలనుండి వచ్చిన విరాళం పన్నుని దాక్షారామ బలంజ వారికి భీమేశ్వర సేవకై ఇచ్చితిమి” అని ఉంది. దీన్నిబట్టి ఈ శాసనాన్ని తాము వసూలు చేసిన సొమ్ము ఎలా ఖర్చు చేశారో ప్రజలందరికీ తెలియటానికి ఉద్ధేశించినట్టు అర్ధం అవుతోంది.
అంకసెట్టి గారిది పంచముల గోత్రము. తండ్రి పెద్దినాయకుడు. తల్లి మారమాంబ. భార్య దేవాంబిక. ‘దేవాంబికా మనః కమల మిత్ర’(దేవాంబిక మనసులో చందమామ)గా తనను చెప్పుకున్నాడు. ‘పులియమార్కోలుగండ’ ‘పృథివీసెట్టి’, ‘బలంజ ధర్మప్రతిపాలక’ బిరుదు లున్నాయి. ఆయన డబ్బుమనిషి కాడు. పరాక్రమశాలి. సరసుడు. పాలనా దక్షుడని భావించవచ్చు. ఇది క్రీశ. 1444 నాటి శాసనం. ఆ సమయంలో రాజమహేంద్రి పాలకుడిగా మహారాజాధిరాజ వీరప్రతాప ప్రౌఢదేవరాయ గారి ప్రధాని నాగభూపాలుడి కొడుకు మలభూపాల ఉన్నాడట. అతనికి పుణ్యంగా ఈ దానశాసనం సమర్పించబడింది.
‘
అంక తెలుగరి సెట్టి శాసనాన్ని బట్టి వర్తక శ్రేణులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలు లేదా నగరాలు పాలనా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఇతర వర్తక శ్రేణుల వారిని కలుపుకుని దేవాలయ అభివృద్ధి పనులు, దానాలు, ఇతర స్వఛ్ఛంద పౌర సేవలూ చేస్తూ ఉంటారు. రాచకార్యాలు, ప్రభుత్వ నిర్వహణ, ఇతర సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా వచ్చే ఇబ్బందుల పరిష్కారం, వివాదాల పరిష్కారం అన్నీ ఈ వర్తక శ్రేణులు చూసుకుంటాయని తెలుస్తుంది.
‘
అంక తెలుగరి సెట్టి శాసనాన్ని బట్టి వర్తక శ్రేణులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలు లేదా నగరాలు పాలనా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఇతర వర్తక శ్రేణుల వారిని కలుపుకుని దేవాలయ అభివృద్ధి పనులు, దానాలు, ఇతర స్వఛ్ఛంద పౌర సేవలూ చేస్తూ ఉంటారు. రాచకార్యాలు, ప్రభుత్వ నిర్వహణ, ఇతర సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా వచ్చే ఇబ్బందుల పరిష్కారం, వివాదాల పరిష్కారం అన్నీ ఈ వర్తక శ్రేణులు చూసుకుంటాయని తెలుస్తుంది.
గోదావరి తీరంలో ప్రాచీన వాణిజ్యం కనీసం నాలుగు వందల యేళ్ళ క్రితం వరకూ క్రమశిక్షణాయుతంగా కొనసాగిందని అంకసెట్టిగారి కథ చెప్తోంది. దాన శాసనాల్లో పేర్లు తప్ప చరిత్ర ఏమీ ఉండదనే వారికి ఈ ‘అంక తెలుగరి సెట్టి శాసనం’ గట్టి పాఠం చెప్తుంది.
(ఆంధ్రభూమి దినపత్రిక వారు గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రచురించి తమ చందాదారులకు ఉచితంగా ఇచ్చిన 160 పేజీల ప్రత్యేక సంచికలో నా ఈ వ్యాసం ప్రచురితం అయ్యింది. సంపాదకులకు ధన్యవాదాలు)
No comments:
Post a Comment