Monday, 2 June 2014

ఆగమేగాలు డా. జి వి పూర్ణచందు
ఇది ఏమంత ఆగమేగాలమీద చర్చించి నిగ్గు తేల్చాల్సినంత విషయం కానప్పటికీ, వాడకంలో చాలా తరచూ వాడ్తున్న ఒక మంచి తెలుగు జాతీయం కాబట్టి, దీని గురించి కొన్ని ముచ్చట్లు అవసరమే! మనం చాలా మాటల్ని వాటి అర్థాలు తెలియక పోయినా ఏదో ఒక రీతిగా  ప్రయోగిస్తుంటాం, వీలైతే కొత్త అర్థాల్ని కూడా సృష్టించే ప్రయత్నాలు చేస్తూంటాం. భాష పెరగాలంటే మాత్రం ప్రయత్నాలు జరగాలి. పండితులు సృష్టించే పదాలకన్నా పామరులు సృష్టించే పదాలకే వాడకం ఎక్కువగా ఉంటుంది. ఆగమేగం పామర సృష్టే!
ఒక నేపాలీ నిఘంటువులో మసాలా గురించి ఆశ్చర్యకరంగా కొన్ని కొత్త అర్థాలు కనిపించాయి. పరీక్షల్లో పాసవటానికి ఏదైనా మసాలా (దగ్గర దారి) ఉందా? అనే ప్రయోగం వాటిల్లో ఒకటి! reriyomaa masalaa siddiy - రేడియోలో మసాలా చచ్చిపోయింది అంటే, రేడియోలో బ్యాటరీ అయిపోయిందని! కూరకు మసాలా లాగా, రేడియోకి బ్యాటరీ ప్రాణప్రద మైందని అనటం వలన ఒక కొత్త పదం కొత్త అర్థంలో నేపాలీ జాతీయం అయ్యింది. ఆగమేగాలు కూడా ఇలా ఏర్పడిన తెలుగు జాతీయమే
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ / రామరామ రాజేశ్వరఅనే కీర్తన అనుపల్లవి
ఆగమేఘ మారుత శ్రీకర / ఆసురేశ మృగేంద్ర వినుత శ్రీఇలా సాగుతుంది. చాలా మంది కవులు ఆగమేఘ పదాన్ని విస్రృతంగానే ప్రయోగించారు. ఆఘమేగాల మీద వచ్చాడు అంటే, చాలా వేగంగా వచ్చాడని.
ఆగంతుకం అంటే చెప్పాపెట్టకుండా రావటం. అలా వచ్చేది ఆగంతువు. వచ్చేవాడు ఆగంతుకుడు. వచ్చింది ఆగతం. అగమేఘాలమీద వచ్చిన మేఘం ఉపయోగపడేదే కాబట్టి, వేగంగా వచ్చే వానాకాలం మేఘాల్ని ఆగమేఘాలు అంటారు. అలా వచ్చే వాళ్లని ఆగమేఘాలమీద వచ్చినట్టు భావిస్తారు. మొత్తంమీద మంచి రాకని సూచించే పదమే ఇది. వేగంగా శీఘ్రంగా, వెనువెంటనే అనే అర్థాల్లో వాడే తెలుగు జాతీయం ఇది. నిఘంటువులన్నిట్లోనూ కనిపించే విశ్లేషణ ఇది!
అంతకు మునుపు లేకుండా కొత్తగా వచ్చిందాన్నిఆగం అంటారు. శాస్త్రాన్నిఆగమం అని అందుకే పిలుస్తారు. పాతది పోయి కొత్తది రావటాన్నిఆపాయం అంటారు. ఆగమ ఆపాయాలు శాస్త్రాభివృద్ధికీ, శాస్త్ర ప్రమాణాలకూ కారణా లౌతాయి. వచ్చిన మేఘాలు చాలా ప్రామాణికమైనవనే అంతరార్థం కూడా ఇందులో ఉంది. అంటే ఆగమేఘాలు ఆగడాలు చేసేవి కాదన్నమాట. ఆగమేఘాలకు సంస్కృతార్థంలో విశ్లేషణ చేయవచ్చు. కానీ, ఒక తెలుగు జాతీయానికి సంస్కృతార్థం మీద ఆధారపడటం దేనికి...?
అగమేగాలకు తెలుగు అర్థంలో కూడా ఒక విశ్లేషణ చేయవచ్చు. పోతనగారు ....ఆగడపలం గడప వైచి వీచీ రేఖలం బో(ద్రోచి కుసుమనారాచు కేళాకూళిం గలజాళు వాసోపనంబుల( బ్రతిఘటించు... అంటూ ఆగడపలను ప్రస్తావించాడు. ఆగడపలంటే మేఘాల దొంతరలు. ఆకాశంలో ఆగడపలు వచ్చాయంటే ఇవ్వాళో రేపో వానలు కురుస్తాయని రైతులు భావిస్తారు.
ఆగడప ఒక చక్కని తెలుగు మాట. బహుశా ఆగ+అడప= ఆగడప అయి ఉండొచ్చు. అడప అంటే దొంతరగా పేర్చినది. కిళ్ళీలు కట్టటానికి, తాంబూలం వేసుకోవటానికి ఆకుల్ని మధ్య ఈనెలు తీసి, దొంతరగా పేర్చుకుంటాం కాబట్టి అడప శబ్దం తాంబూలానికి స్థిరపడి ఉండవచ్చు. కృష్ణదేవరాయల కాలంలో అడపం గారు ఒక ఉన్నతోద్యోగి. రాజు గారికి ఆంతరంగికుడు. అయన తాంబూలం అందించే వాడని చరిత్రకారులు చెప్తారు గానీ, దానికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఒక వాణిజ ఒప్పందాన్ని గానీ, కొనుగోలు అమ్మకాలు గానీ, వివాహ సంబంధాలు గానీ ఖాయపరచు కునేందుకు తాంబూలా లిచ్చి పుచ్చుకోవటం  మన ప్రాచీన సాంప్రదాయం. కనీసం వెయ్యేళ్ళకు పైగా మనకు సాంప్రదాయం ఉన్నట్టు ప్రాకృత సాహిత్య ఆధారాలను చూపించారు పుల్లెల శ్రీరామచంద్రుడుగారు. రాజుగారి పక్షాన అటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే అధికారం ఉన్నవాడు అడపం గారు.
మేఘాలన్నీ అడపలు (దొంతరలు) తీరి ఉన్నప్పుడు వాటిని ఆగడపలు అన్నారు.  ఇక్కడ ఆగ శబ్దం మేఘం అనే అర్థంలో  కనిపిస్తుంది. నిఘంటువుల్లో ఎక్కడా అర్థం లేనప్పటికీ ఆగడపలు మాత్రం అర్థాన్నే ఇస్తున్నాయి. ఆగమేఘాలు అన్నప్పుడు ఆగ, మేఘ రెండూ ఒకే అర్థంలో పదాలు జంట పదాలుగా కనిపిస్తాయి. తట్టాబుట్టా, నగానట్రా లాంటి జంటపదాలు ఆగమేఘాలు కావచ్చు. ఇది ఒక విశ్లేషణ.
 మేగు లేదా మ్రేగు శబ్దానికి to smear, be smear. పూయు, దళముగా పూయు, దట్టముగా చరుము, దళసరిగా మెత్తు అనే అర్ధాలు కనిపిస్తాయి. "పెన్నలుపు మించి కందెన మేగినట్టున్ననూనె మెగమున చీకట్లు ముడివడ అనే ప్రయోగంలో మేగ శబ్దానికి to surround, ఆవరించు అనే అర్థాలు కనిపిస్తున్నాయి. తెలుగులోఆగం అంటే మేఘం. దట్టంగా ఆవరించటాన్ని మేగటం అంటారు. ఆగమేగాలంటే అప్పటికప్పుడు పెన్నల్లగా కమ్ముకున్న కారు మబ్బులు. వీటిని క్యుములోనింబస్ మేఘాలు అంటారు..  మండు వేసవిలో శక్తివంతమైన వేగవంతమైన ఇలాంటి కారుమబ్బులు కనిపిస్తుంటాయి. తొలకరికి ఉరుములు మెరుపులతో హడావిడి చేస్తూ, ఆగడపలు వేసుకుంటూ వస్తాయి. సమృద్ధిగా వానలిచ్చి పోషిస్తాయి. సమయానికి ఆగమేగంలా వచ్చి ఆదుకున్నాడనేది ఈ జాతీయానికి భావార్థం.
ఇక్కడే మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. 1930లో నైజీరియలో జరిగిన తిరుగుబాటులో అహేబీ అనే ఒక స్త్రీ, వలస వాదులపై చేసిన పోరాటానికి గుర్తుగా భాషలో ఆమెని ఆగమేగఅని పిలిచారట. ఆడపులి అని దీని అర్థం. నైలూ నుండి కృష్ణదాకా తెలుగు భాషామూలాలు వ్యాపించాయనే సిద్ధాంతానికి ఆగమేగ జాతీయం ఒక సాక్ష్యం. ఆఫ్రికా భాషల్లో జాతీయాన్ని వేగంగా దూసుకొచ్చి గెలుపు సాధించటం అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు. తెలుగులో కూడా ఆగమేగాలు ఇలానే ఉపయోగిస్తున్నాయి.  


No comments:

Post a Comment