Isnin, 9 Jun 2014

అన్నమయ్య పలుకుబడులు - నేటి అవసరాలు - డా|| జి.వి.పూర్ణచందు

అన్నమయ్య పలుకుబడులు - నేటి అవసరాలు

డా|| జి.వి.పూర్ణచందు


'ఒక్క సంకీర్తనె చాలు ఒద్దికె మమ్ము రక్షింపగ
తక్కినవి భండారాన దాచి వుండనీ'' అంటూ ముప్పది వేల పాటల సృష్టికర్తపదకవితా పితామహుడు అన్నమయ్య ఆ సృష్టికర్తను శాసించగలిగాడు. ప్రజల కష్టసుఖాలు శ్వాసించగలిగాడు కాబట్టే వాటిని స్వామికి తన పాటలో నివేదించగలిగాడు!
''నేనొక్కడ లేకుండితె నీ కృపకు పాత్రమేదిఅనీ, నా వల్లనె కీర్తి పొందేవు నీవు - '' అనీ దేవుడితో చెప్పగలిగాడు. భక్తులులేని దేవుడికి గుర్తింపు ఉండదు పొమ్మన్నాడు.
''జనతాభిమతాధిక దానరతుడు'' అంటూనే,''నీవే నేరవుగాని/ నిన్ను పండించేము నేము/దైవమా!నీకంటే నీ దాసులెనేర్పరులు'' అని హెచ్చరిస్తాడు.
దాసులు చేస్తున్నదేమిటంటేఆయన చెరువులో నీళ్లు తెచ్చిఆయన నెత్తినే గుమ్మరించి వరాలు పొందుతున్నారట! ఇదే భావాన్ని పురందరదాసు కూడా ఇలా తిప్పి చెప్తాడు...చెరువులోని నీటిని/ తిరిగి చెరువులోనే పోసి/వరాలను పొందిన భక్తుల వలె కన్పించండి....హరికరుణ వలన సంపదను/ హరికి సమర్పించి/ఆనందంగా జీవించండి'' అని!
''అందరికీ శ్రీ హరే అంతరాత్మ'' అనటం ఒక సంస్కర్త హృదయాన్ని చాటుతోంది.
కానీఅన్నమయ్య రచనలు దాదాపు ఐదు శతాబ్దాలుగా మరుగున పడిపోయి ఎవరికీ కాన రాకపోవటానికి కారణాలు అంతుబట్టవు. ఆయన ''సంస్కృత దాసుడు'' కాకపోవటంపామర భాషలోనే రాయటంఅగ్రవర్ణాధి పత్యానికి దోహదం చేయకపోవటం లాంటి కారణాల వలన అన్నమయ్య తామ్రపత్రాలన్నీ చీకటి కొట్లో బందీలై ఉండవచ్చు.
ఆళ్వారులతో సమానమైన భక్తి ప్రపత్తులు ఉన్నప్పటికీ తమిళుడు గానీతమిళ దేశీయుడుగానీ కాకపోవటం కూడా ఈ చీకటి బందీకి దోహదపడి ఉండవచ్చు. కడపటి విజయనగర రాజులు తమ ఉనికిని కాపాడుకోవటం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి రావటాన కూడా ఈ నిరాదరణజరిగి ఉండొచ్చు.అన్నమయ్య తరువాత తెరమరుగైన ఆయన పదసాహిత్యం వేటూరి ప్రభాకరశాస్త్రి కృషి ఫలితంగా వ్యావహారిక భాషోద్యమకాలంలో ''వెలుగు''లోకి వచ్చింది.
ఇప్పుడు వాటిని కొత్తగా చదివేవారికి అన్నమయ్య పలుకుబడులునుడికారాలు చూస్తుంటేఅచ్చమైన జనం కవి రచనా వైదుష్యం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆయన ప్రయోగించిన కొన్ని పదబంధాలను పరిశీలిద్దాం...
(1) నీర్వంక తుంగ : పారుతన్న ఏటిఒడ్డున నిలబడి చూడండి- ఒడ్డున పెరిగిన తుంగమొక్కలు తలలు వంచుకుని ఆనీటిని తాకుతున్నప్పుడువాలున ప్రవహిస్తున్న నీటి ఒరవడితో పాటు కొట్టుకుపోతున్నాయా.. అన్నట్టు కన్పిస్తాయి. ఇదొక భ్రమ. నీరు వంకనేపోతున్నట్లు తుంగలు కల్పిస్తున్న భ్రమ. ''నీర్వంక తుంగ మాయె మనసు'' అనే ప్రయోగంలో ఈ భ్రమను వివరిస్తాడు అన్నమయ్య. మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉండే వ్యక్తులను ఆయన నా ''నీరొంక తుంగ'' లంటాడు. రోజుకొక రాజకీయ పార్టీలోకి వలసలు వేగంగా జరుగుతున్న ఈ రోజుల్లో మనిషి ఒక పార్టీలోనే ఉన్న మనసు వేరు పార్టీ మీద ఉన్న వాళ్ళు నీరొంక తుంగలనిపించు కుంటారు. మనతో కలిసే నడిచాడుగా నిన్నటి దాకా..'' అని ఆ తర్వాత ఈ పార్టీ వారు ఆశ్చర్యపోతారు.
(2) అంగడికెత్తిన దివ్వె = అందరికీ ఉపయోగపడే విధంగా వెలిగించిన దీపం. వీధి దీపానికి ఈ పదబంధం అతికినట్టు సరిపోతుంది!
(3) అంగడి నమ్మి కొను : ''ఆపదలంగడి నమ్మి కొనరో పాపాత్ములు పైపై బడకా..'' అంటాడు. అందులోనే పడి కొట్టుకొంటున్నాడనిపాపకూపంలోంచి బైటపడలేకపోతు న్నాడని చెప్పటం.
(4) అంకడిబడు= పారిపోవటంబజార్నపడటం
(5) అడవుల వెన్నెలలు = పైపై తళుకులు
(6) అప్పలప్పలు : పిల్లల్ని ముద్దుగా పిలవడం
(7) అలుగువారు = అలుగు అంటే తూము.  చెరువునిండాక తూముల్లోంచి నీళ్ళు పారతాయి. తమ కడుపు నిండాక ఇఅతరుల గురించి ఆలోచించటం అనే వ్యంగ్యం
(8) ఆడుగొల = స్త్రీ హింస
(9) ఇరవ చూపు = చోటు చూపించటం
(10) ఇనుము దాగిన నీరగు = అందమైన అనుభవాన్ని పొందలేక పోవటం.''ఊహల నా భోగమెల్ల ఒళ్లబట్టె నంటామంటే, /దాహము తోడ నినుము దాగిన నీరాయగా!''
(11) ఈడు వెట్టడం : సమానం చేయటం. ''చక్కని కన్నుల సూర్య చంద్రులుగా గలవాడు/ఎక్కుడుగా కిందఱిలో నీడు వెట్టేదా?''
(12) ఉప్పవడమగు = ''ఉప్పవడము గావయ్యా ఉయ్యాల మంచము మీద'' = మేలుకోమని కోరటం.
(13) ఊరులేని పొలిమేర = ఉండదని చెప్పటానికి చేసే ప్రయోగం.
(14) యేకట తీరు = సంతృప్తి కలిగిందని చెప్పటం: ''నీ యేకట దీఱద యింకాను''
(15) ఎసరెత్తు = అసలుకే ఎసరు పెట్టడం'' కొసరుచు నాతో గూటమిసెసే/ యెసరెత్తకు మీ యింకానూ''
(16) యేటిలో పైరు = అశాశ్వతము-వృథా ప్రయాస
(17) ఏరు గుడిచి కాలువు పొగుడు= ఒకదాని వలన లాభం పొందిఅంతకన్నా చిన్నదాన్ని పొగడటం. తెలివితక్కువతనం
(18) ఒగరు తీపగు = బాధే సౌఖ్యమనే భావన!
(19) ఒత్తి గొట్టాన పెట్టు= పిండిని పిసికి గొట్టంలో పెట్టి నూనెలో ఒత్తి కారప్పూసను వండుతారు''. బాధించటం ఒత్తిగొట్టాన బెట్టగని లేదు ఓరి నీ చిత్తమింతే కానీ''
(20) కఱ తలయోగి= కొందరికి ఎక్కేందుకు మెట్లుండవు. కొందరికి దిగేందుకు మెట్లుండవు. ఎక్కేమెట్లులేని ఉన్నతస్థితి చేరిన వాడిని 'కరతల యోగి'' అన్నాడు అన్నమయ్య
(21) కాకుసేయు = చీకాకు పెట్టటం.
(22) కూరవండి కసవేరగోరు = కమ్మని కూరవండుకొనిగడ్డికోసం వెదకటంతగని పనులు
(23) కెల్లు రేగు = చెలరేగటం : ''కెల్లు రేగె దేహమందే!''
(24) కొంకి తెంచి ముడిగొంటేకుఱ్కు = బావిలోనీళ్ళు తోడ టానికి చేంతాడు కొసలు విడిపోయాయని కత్తిరించి ముడి వేసుకొంటూపోతే కొన్నాళ్ళకు చేంతాడు కురుచపోతుంది.
(25) కొంగు రొక్కాము = ''పాకెట్‌ మనీ'' లాంటి ప్రయోగం. అప్పటికప్పుడు అవసరానికి ఉపయోగపడే డబ్బు;
(26) కొండలకేగు = కొండలకేగెనుసత్యము'' కథకంచికి చేరిందనటం లాంటిది!
(27) గరివడు = ఇక్కడే స్థిరంగా నిలిచిపోవటం '' కలకాలమిందుననే గరివడె బ్రతుకు''
(28) గాడికట్టు = పాతుకుపోవడం
(29) గాలిపోవు : పరువు పోవుగాలి పోయిందనటం!
(30) చలివాపు = సిగ్గుసంకోచములను తొలగించారు.
చలివాపి ఆపెనిడ సరిచేసులాడుకొంటా..
(31) చవిగొన్న కూరలకుమేలుంకీడు గొనియాడు= తినేసి సరిపడుతుందా లేదా అని ఆలోచించి చింతించటం వృథా..
(32) చిగురులో చేగయగు = చిగురుగా ఉన్నప్పుడే చేవ దేరిందనటం.
(33) చిమడబెట్టు= మనసు కుతకుతలాడిపోవడం: ''చింతచే నీ మనసు చిమడబెట్టేవు''
(34) చుట్టపు పగలు = మిత్రులుగా కన్పించే శత్రువులు
(35) చే బంగారం = అందుబాటులో ఉన్నది.


అన్నమయ్య పలుకుబడులన్నీ ఆనాటి ప్రజలు మాట్లాడుకున్న తెలుగుభాషగా భావించాలి. వాటిలో కొన్ని సీమప్రాంతంలో నేటికీ వాడుకలో ఉన్నాయి. ఈనాటి భాషలో వాటిని 'మాండలికంఅంటున్నాం. ఈనాటి మాండలికాలన్నీ ఒకప్పటి తెలుగు భాషాపదాలే! ఆనాటి తెలుగు ప్రజలందరూ మాట్లాడుకున్నవే! ఈనాటికీ మాండలికాలను ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా'' పొంతకూటి కుండ''(అందరి హక్కు)గా చేయగలిగినందువలన ప్రయోజనం ఉంటుంది. నేటి అవసరాలకు తగిన పదాలను నాటి భాషలోంచి ఏరుకోవటంలో విజ్ఞత ఉంటుంది.

Tiada ulasan:

Catat Ulasan