Friday 8 May 2015

తెలుగువారు అట్టేపెట్టుకున్న అట్టు:: డా. జి.వి. పూర్ణచందు

తెలుగువారు అట్టేపెట్టుకున్న అట్టు::

డా. జి.వి. పూర్ణచందు


ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు భాషకి మూలభాషని పరిశోధకులు పునర్నిర్మించారు. ద్రవిడియన్ ఎటిమాలజీ పేరుతో ఈ పూర్వతెలుగు భాషా నిఘంటువు ఇంటర్ నెట్లో అందుబాటులో ఉందికూడా! ఇందులో అట్అనే పూర్వ తెలుగు (ప్రోటో తెలుగు) రూపానికి తడి ఆరిపోయేలాగా పొడిగా (dry) కాల్చటం, శుష్కింపచేయటం అనే అర్థాలున్నాయి. తెలుగులో అట్టముఅంటే ఆహారము. ఇంధనం కూడా! అడుఅంటే పూర్తిగా పొడిగా అయ్యేలా చేయటం. అన్నం అడుగంటింది అంటే తడి అంతా ఆవిరి అయి పోయి ఇంక మాడిపోతోందని అర్ధం. అట్ట్ ఉప్పుఅంటే సముద్రపు నీటిని ఆవిరి చేసి తీసిన ఉప్పు అని!.ఇనుప పెనాలు మనకు ఎప్పటినుంచీ వాడకంలోకి వచ్చాయో తెలియదు. పూర్వపు రోజుల్లో కుండని బోర్లి0చి లోపలి నుంచి మంటపెట్టి కుండ బైటవెపున అట్టులు కాల్చుకొనేవాళ్ళు. ఈ పద్ధతి లోనే పూతరేకులను పల్చగా కాల్చి తయారుచేస్తారు. అందుకేనేమో తెలుగులో అటిక’, ‘అట్టికఅనే పేర్లతో వెడల్పయిన మూతి కలిగిన కుండని పిలుస్తారు. పగిలిన పెద్ద కుండ పెంకుని కూడా ఇలానే ఆ రోజుల్లో ఉపయోగించి ఉంటారు అందుకని, ఇప్పటికీ అట్ల పెనాన్ని చాలామంది పెంకుఅనే పిలుస్తారు. మూతి భాగాన్ని పగలకొట్టి ఆ కుండని బూరెలమూకుడు మాదిరిగా వాడుకోవటాన్ని పల్లెల్లో చూడవచ్చు.అట్టగట్టింది అంటే, ఎండి, మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా అయ్యిందని అర్ధం. చెప్పు అదుగు భాగం అలా గట్టిగా ఉండాలి కాబట్టి అట్టఅనే పేరు దానికి సార్థకం అయ్యింది. పరీక్ష్ రాసె అట్ట, పుస్తకానికి వేసే అట్ట కూడా బహుశా ఈ అర్ధంలోనే ఏర్పడి ఉండవచ్చు. పెనం (లేదా) పెంకుమీద మెత్తగా రుబ్బిన పిండిని పలుచగానో మందంగానో పరిచి కాల్చినప్పుడు అది అట్టగడుతుంది. దాన్నే అట్టు అంటున్నాము.తమిళంలో అటు, అటువ్ అట్ట్ అనే పదాలు వండటం, కాల్చటం, వేయించటం, ఉడికించటం, కరిగించటం ఇన్ని అర్థాల్లో కనిపిస్తాయి.. అటుక్కలై = వంట గది;. అటుచిల్ = ఉప్పుడు బియ్యం; అట్టు = తీపి రొట్టె.. ఆటు= వండటం; అట్టు0బల=వంటగది; అడకల=వంటశాల; అట్టము=ఆహారం. ఈ నిరూపణల్ని బట్టి,’అట్టుఅనే పదం తెలుగు తమిళ భాషల్లో ఆహార పదార్ధం అనే అర్ధంలోకి పరిణమించిందని భావించవచ్చు. పెనం లేకుండా నేరుగా నిప్పుల సెగ మీద కాల్చిన అట్టుని తెలుగులో నిప్పట్టు అంటారు. నిప్పటి, ఇపటి, నిపటి అనే ప్రయోగాలు కూడా (DEDR3670) ఉన్నాయి. అది ఒక రకం తండూరి ప్రక్రియ కావచ్చు. అప్పడాలు, ఫుల్కాలు నిప్పులమీద కాల్చే ప్రక్రియ ఇప్పటికీ ఉందిఈ అట్టు పదం తెలుగులొకీ తమిళంలోకీ తల్లి ద్రావిడ భాషలోంచే వచ్చింది! ఈ పదం ఎంత ప్రాచీనమో అట్టు కూడా అంతే ప్రాచీనం. అట్టు అనే పదానికి మరికొన్ని ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. అట్టేపెట్టు, అట్టే అగు గాక,అట్టనా..!, అట్టులా...? అట్టిది! వచ్చేటట్టు, చేసినట్టు, అట్టే పోయినాడు లాంటి ప్రయోగాలు- ఉండు, ఉంచు అర్థాల్లో కనిపిస్తాయి. ఆఫ్రో ఆసియాటిక్ భాషల్లో కూడా అట్టు పదం అదే ఉచ్చారణతో ఉందిగానీ, పక్కన, వెనుక వైపు ఇలాంటి అర్థాల్లో ఉంది. Blintz (బ్లిని), Mofletta (ముఫ్లెట్ట) పేర్లతో అట్టుని ప్రపంచంలో చాలా దేశాలవాళ్ళు వండుకొంటున్నారు. జపాన్ లో అట్టుకు ఒకోనోమియకీఅనే గమ్మత్తయిన పేరు0ది. ఇష్టమొచ్చినట్టు కాల్చుఅని దీని అర్ధం.ఇథియోపియాలో కూడా అట్లు పోసుకొనే అలవాటుందని తెలుస్తోంది. వాళ్ళు వాఝైఅని పిలుస్తారు. ఆఫ్రికానుంచి బయలుదేరిన ద్రావిడులు అనేక మజిలీల అనంతరం క్రీస్తు పూర్వ0 2000 నాటికే తెలుగునేలమీద చేరారు. వస్తూ తెచ్చుకున్న వంటకాలలో అట్టుకూడా ఉందన్నమాట! తెలుగింట అట్లకు కనీసం నాలుగువేలయేళ్ళ చరిత్ర ఉందని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. రవ్వట్టు. పెసరట్టు, మినపట్టు గుడ్డట్టు(ఆమ్లెట్ట్), చాపట్టు, నీరొట్టు, అట్లపెనము, అట్లకాడ. అట్లపొయ్యి పదాలు తెలుగు భాషలో రూపొందాయి.. తెలుగువారు అంతగా అట్టుని అట్టేపెట్టుకున్నారు.అట్ల తదియని ఉయ్యాల పండుగగానూ, గోరింటాకు పండుగగానూ జరుపుకొనే ఆచారం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు వాయనంగా సమర్పించటం అట్లతదియ నోము. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్" అనే పాటని బట్టి, అట్టుని ముద్దపప్పుతో నంజుకొని తినే అలవాటు తెలుగువాళ్ళకుండేదని అర్ధం అవుతోంది. శనగచట్నీ కూడా ముద్దపప్పే కదా! శృ0గారనైషధ0లో (2-120) శ్రీనాథ మహాకవి చాపట్లతొ పెసరపప్పుని నంజుకొని తినటం గురించి ప్రస్తావించాడు.శనగ చట్నీ, సాంబారు, నెయ్యి, కారప్పొడి వగైరా లేకపోతే హోటళ్ళలో దొరికే దోశెలు తినటం కష్టం. కానీ తెలుగు అట్టుని తినడానికి ఇవేవీ అవసరం లేదు. కాసింత ముద్దపప్పు చాలు లేదా కొంచెం బెల్లం ముక్క సరిపోతుంది. చెరుకురసాన్ని కాచి బెల్లం తయారు చేసేటప్పుడు ఆ తీపి ద్రావణంలో అట్టుని ముంచి తినే వాళ్ళు. ఇదే దోశెకీ, అట్టుకీ తేడా! రెండూ ఒకటి కావని గట్టిగా చెప్పవచ్చు.ప్రయాణాలప్పుడు వెంట తీసుకొని వెళ్ళి తినడానికి అట్టు అనుకూలంగా ఉంటుంది. నూనెని అతి తక్కువగా వేస్తారు. ఉల్లి, మషాలాల అవసరం ఉండదు. అందుకని అట్టు కడుపులో ఎసిడిటీని పెంచకుండా తేలికగా అరుగుతుంది. కన్నటం వారి దోసెకు లేని ఈ సుగుణాలు తెలుగు అట్టుకి ఉన్నాయి. తమిళులు అట్టు పదాన్ని ఏనాడో వదిలేసి, దోసై నే వాడుకోవటం మొదలు పెట్టారు. అట్టు తెలుగువారి స్వంతంగా మిగిలి పోయింది.

No comments:

Post a Comment