Monday 4 May 2015

బుద్ధయానం :: డా. జి వి పూర్ణచందు


బుద్ధయానం


డా. జి వి పూర్ణచందు


“కనక వలయ భూషిత ప్రకోష్టైః కమల నిఖైః కమలానివ ప్రవిద్య

అవనత తనవస్తతో అన్యయక్ష శ్ఛకిత గతై ర్ధధీరె ఖురాన్‘కరాగ్రై”

అమరావతిలో దొరికిన శ
ిలా ఫలకాలలో ఒక అద్వితీయమైన శిల్పఖండం మీద సిద్దార్థ రాకుమారుడి మహాపరిత్యాగ దృశ్యం కనిపిస్తుంది. ఆ ఫలకం కుడి చివర సిద్దార్థుడి గుర్రం “కంటకం” ఉంది. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా కంటకం, దాన్ని నడిపే రౌతు చెన్నడు, సిద్దార్థుడు రహస్యంగా ఇల్లు వదిలి వెళ్తున్న సమయంలో గుర్రపు పదధ్వనులు వినిపించ కుండా దివ్యులు దానికాళ్ళను ఎత్తిపట్టుకున్న అద్భుత దృశ్యాన్ని మనం చూడవచ్చు.
“యక్షులు తమ శరీరాల్ని వంచి, తమ కరాగ్రాలతో (అరచేతుల్తో) గుర్రం కాళ్ళ డెక్కల్ని పైకెత్తి పట్టుకున్నారు. గుర్రం కాళ్ళు నేలకు తగిలి శబ్దం చెయ్యకుండా ఇలా చేశారు. మోచేతులదాకా బంగారు కంకణాలు తొడుక్కున్న ఆ యక్షుల చేతులు తామరపూవుల్లా ఉన్నాయి. అంచేత తామర పూవులమీంచి గుర్రం నడిచి వెడుతున్నట్టుగా ఉంది. తన ప్రభువు వెళ్ళి పోతున్నాడని దుఃఖిస్తున్నట్టుగా కంటకాశ్వం కనిపిస్తుంది...” ఇదీ ఈ శ్లోకంలో వర్ణన.

అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర కావ్యంలో చెప్పిన విషయాలే బుద్ధుడి చరిత్రకు ప్రధాన ఆలంబన. ఈ కావ్యంలో ఆయన చూపించిన నాటకీయత గొప్పది. ఆయన క్రీ.శ. ఒకటో శతాబ్ది వాడు. అమరావతి స్తూప నిర్మాణ కాలానికి చెందిన వాడు. ఆయన చేసిన వర్ణనలు ఈ అమరావతి స్తూప ఫలకాలమీద అనేక శిల్పాలలో కనిపిస్తాయి. అశ్వఘోషుడి నాటకీయతకు ఏ మాత్రం తీసిపోని నాటకీయ దృశ్యాలెన్నో అమరావతి ఫలకాలలో ఉన్నాయి. ఒక శిల్పంలో సిద్దార్థుడు భార్యా పుత్రులను వదలి వెళ్ళబోయే ముందు తల్లి పక్కలో పడుకుని ఉన్న తన బిడ్డడు రాహులుడి వంక దీనంగా చూస్తూ, చేతులతో స్పృశిస్తున్న దృశ్యం కరుణ రసాన్వితంగా ఉంటుంది. ఆ శిల్పఫలకంలో కనిపించే ప్రతి వస్తువులోనూ విషాదం కమ్ముకుని ఉంటుంది. గుర్రాన్ని నడిపే చెన్నడు దైన్యం నిండిన కళ్ళతో చేతిలో కాగడాతో నిలబడి ఉంటాడు. అది అర్ధరాత్రి సమయం అని చూడగానే మనకు స్ఫురించేందుకోసం కాగడాని చెక్కిన ఆ తెలుగు శిల్పి నిజంగా అమరశిల్పే! 

సిద్దార్థుడు తన కంటకం గుర్రాన్ని కౌగిలించుకుని, ప్రేమగా తట్టి, దాని చెవిలో నెమ్మదిగా “ఎన్ని యుద్ధాల్లోనో ప్రభువు నీ పైన ఎక్కి శత్రుశేషం లేకుండా చేయగలిగాడు. నువ్వుంటే జయమే గానీ, అపజయం ఉండదు. ఆ అమృతత్వాన్ని నాక్కూడా ఇవ్వు...” అని ప్రార్థిస్తాడు. ఇంద్రియ సుఖాల కోసం చెలికాళ్ళు బాగా దొరుకుతారు. కానీ, కష్టాల్లో ఉన్నప్పుడూ, ధర్మాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు, ఒక్కడూ తోడు రాడు... నువ్వు నా తోడుగా వచ్చావు... అని మెచ్చుకుంటాడు. ఈ మహాయానం లోక కళ్యాణం కోసం, ధర్మ ప్రతిష్ఠాపన కోసం అని అర్థం చేసుకో’ అంటాడు. అందుకు తగ్గట్టుగా ఆ గుర్రం కూడా ఎలాంటి సకిలింపు లేకుండా డెక్కల చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ఆయన్ని ఇల్లు దాటించేందుకు సహకరిస్తుంది...
ఇక్కడ కరుణశ్రీ గారి ఒక పద్యాన్ని తప్పనిసరిగా స్మరించుకోవాలి. “ఈ ప్రగాఢ మధ్యే నిశీధి గడియ కదిలించుచున్న సవ్వడి ఇదేమి? ఇంత అర్ధరాత్రమున ఎవ్వారు వారు? మూసి యున్నట్టి తలుపులు తీసినారు?” సిద్దార్థుడు ఎలాంటి అడ్డూ లేకుండా నిష్క్రమించ టానికి దేవతలే తలుపు గడియ తీశారట!
ఆ రాత్రి సమయంలో సిద్దార్థుడు ఇల్లు వదిలి, అడవిలో ప్రయాణించి తెల్లవారేసరికి భృగు మహర్షి ఆశ్రమానికి చేరతాడు. గుర్రం దిగి, దాని వీపు తట్టి, “నీ విధి పూర్తయ్యింది” అంటాడు. అది విని కంటకాశ్వం దుఃఖపూరితం అవుతుంది. దాన్ని ఊరడిస్తూ, “కంటకమా! ఏడవకు. ఓర్చుకో! ఉత్తమాశ్వ లక్షణాలను నువ్వు ప్రదర్శించావు. ఈ శ్రమకి తగిన మంచి ఫలితాలు త్వరలోనే చూస్తావు” అంటాడు. భవిష్యత్తులో తాను సాధించబోయే మహత్కార్యాల సూచన ఈ మాటల్లో కనిపిస్తుంది.


చెన్నడి దగ్గర కత్తి తీసుకుని తలపాగాతో సహా తన జుత్తు కోసి ఆకాశంలోకి విసిరేస్తాడు. ఆకాశంలో దేవతలు దాన్ని అందుకుని ఆరాధన కోసం భద్రపరుస్తారు. తన తలపాగా పైన మణిని తీసి చెన్నడి కిచ్చి, తన తండ్రికి సందేశాన్ని కూడా ఇచ్చి వెనక్కి పంపించేస్తాడు. ఇదీ అశ్వఘోషుడు సృష్టించిన గొప్ప నాటకీయత. అమరావతి శిల్పాల్లో ఇవే పోకడలు కనిపిస్తాయి. వాటిని చూసి ఆనందించ గలిగే మనసు కావాలి.
భారతీయ పురావస్తు శాఖ (ఏ ఎస్ ఐ) అమరావతి శిల్ప పరిరక్షణ కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావలసిన సమయం ఇది. అమరావతి పరిసరాలలో బౌద్ధానికీ, జైనానికీ, శైవానికీ సంబంధించిన అనేక అవశేషాలు భూగర్భంలో పూడుకుని ఉన్నాయి. ఈ శాఖవారే పురావస్తు ప్రాంతాలుగా గుర్తించిన స్థలాలున్నాయి. కొత్త రాజధాని నిర్మాణ ఆవేశంలో అవి కరిగి పోవటం గానీ, దురూపయోగం కావటం గానీ, అక్రమ తరలింపులు జరగటం గానీ దేనికైనా అవకాశం ఉంది. ఆ శాఖవారు ముందుగా మేల్కొని, చారిత్రక సంపద కలిగిన భూమిని గుర్తించి పరిరక్షించే పని ప్రారంభించాలి!

No comments:

Post a Comment