Saturday 8 November 2014

“వెయ్యి చంద్రుళ్ళను చూస్తారా?”::డా. జి వి పూర్ణచందు

వెయ్యి చంద్రుళ్ళను చూస్తారా?
డా. జి వి పూర్ణచందు


శరీర కారణాం పరమం మూలం గ్రామ్యాహారః శరీరాని కొచ్చే సమస్త వ్యాధులకూ గ్రామ్యాహారం పరమ మూలకారణం అని చరక సంహిత చికిత్సా స్థానంలో ఒక సూత్రం ఉంది.
చరకుడనే మహర్షి వ్రాసిన ఈ వైద్య గ్రంథం 2,500 యేళ్ళ క్రితం నాటి బౌద్ధ యుగానికి చెందిందని భావిస్తున్నారు.
అంతటి ప్రాచీన కాలంలోనే చరకమహర్షి చెప్పిన ప్రతి అక్షరం అత్యాధునికమైన నేటి కాలానికి వర్తించేదిగా ఉండటం ఆశ్చర్యకరం. సర్వే శరీర దోషా భవన్తి: సమస్త శరీర దోషాలు ఈ క్రింది కారణాలవలన కలుగుతాయంటాడాయన:
గ్రామ్యాహారాత్ అమ్ల, లవణ, కటుక, క్షార, శుష్క, శాక, మాంస, తిలపలల పిష్టాన్న భోజినాం: గ్రామ్యాహారం- గ్రామ శబ్దానికి పల్లెలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, మహా నగరాలు అని అర్థం. వీటిలో నివసించే ప్రజలు కృత్రిమ ఆహార విహారాలకు అలవాటు పడి ఉంటారు కాబట్టి, అలాంటి ఆహారాన్ని గ్రామ్యాహారం అన్నాడు.
 పుల్లని పదార్థాలు, అతిగా ఉప్పూ, కారాలు, రంగులు రసాయనాలూ కలిసిన క్షారాలు, తాజా దనం కోల్పోయిన శుష్కమైన ఆకుకూరలు, కూరగాయలు, వివిథ జంతుమాంసాలు, తిలపలలం అంటే నూనె తీసేసిన తెలికిపిండి లాంటి ద్రవ్యాలు, పిష్టాన్నం అంటే అతిగా పిండిపదార్థాలు వీటిని భోజనంగా స్వీకరించటం అనేది పట్టణ నాగరికతలో కనిపించే ఒక సొగసు-ఫ్యాషన్! అదే వ్యాధులు తెచ్చి కొంప ముంచుతోందంటాడు చరకుడు.
ఇక్కడ రెండు విషయాలు చర్చించవలసినవి ఉన్నాయి. శుష్క పదార్థాలను వద్దని చెప్పగానే మనం ఫ్రిజ్జులో పెట్టుకునే పదిల పరుస్తున్నాం అనీ, పాడైపోకుండా, ఎండి పోకుండా శీతలీకరణ పద్ధతుల్లో జాగ్రత్త చేస్తున్నాం అనీ, చరకుడు చెప్పింది ఆకాలానికే గానీ ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానం అందుబాటులో ఉన్న మనకు కాదనీ, వాదిస్తాం. కానీ ఫ్రిజ్జులోనూ, శీతలీకరణ ప్రక్రియలోనూ కూరగాయల్లోపల అంతర్గతంగా జరిగే శ్వాసప్రక్రియ ఆగదు. కాబట్టి, ఫ్రిజ్జులో బెండకాయలు, దొండకాయలూ వగైరా ముదిరి పోకుండానూ పండిపోకుండానూ ఉంటాయనుకోవటం భ్రమ. బాక్టీరియా ఫ్రిజ్జులో నిస్తేజంగా ఉంటుంది కాబట్టి, కుళ్ళిపోక పోవచ్చు గానీ, చరకుడు చెప్పిన శుష్కత్వాన్ని ఆపలేదు. నిజమైన తాజాదనాన్ని ఇవ్వలేదు.
ఇంక రెండో ప్రమాదకర మైంది పిండిమయంగా ఉన్న ఆహారపదార్థం. ఇది కష్టంగా అరుగుతుంది. అరుగుదల దెబ్బ తిన్నందువలన అనారోగ్యా లేర్పడతాయి. మనుషులందరి జీర్ణ శక్తీ ఒకే స్థాయిలో ఉండదు. కొందరు పర్వతాలు ఫలహారం చేయగలిగే వారుగా ఉంటారు. కొందరికి ఆ ఊళ్ళో నీళ్ళు పడలేదండి...అంటారే, అలా అత్యంత అల్ప జీర్ణశక్తి ఉంటుంది. నీళ్ళే అరక్కపోతే శాకమాంసాలేం అరుగుతాయీ...? జీర్ణశక్తి ననుసరించి అది అరిగించగల ఆహార పదార్ధాలను ఎంచుకుని తినాలని చరకుడు సూచించాడు.
 పిష్ఠాన్నం నైవ భుంజీత అని సుశ్రుతుడనే వైద్యుడు కూడా హెచ్చరించాడు. పొరబాటున కూడా పిండి పదార్ధాలను తినకండీ అని ఈ సూత్రానికి అర్థం. ఒకవేళ తినవలసి వచ్చినా, కొద్ది పరిమాణంలో తినండి తిన్న తరువాత రెండురెట్లు నీళ్ళు త్రాగండి అన్నాడు. చరక సుశ్రుతులిద్దరూ ఇంచుమించు ఒకే కాలానికి చెందిన ఆయుర్వేద శాస్త్ర ప్రవర్తకులు.
పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను పిష్టాన్నం అంటారు. వీటిని అతిగా తినటం వలన చాలా వ్యాధులు వస్తున్నాయి. ప్రొద్దున టిఫినుతో పిండిపదార్థాలు తినటం అనే ఒక ఉద్యమాన్ని మనం మొదలెడతాం. మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, బఠాణీ పప్పు, అలచందల్లాంటి పిండి ధాన్యాలతో చేసిన పిండివంటలు మనకు ప్రధాన ఆహారం అయ్యాయి. ప్రొద్దున్న పూట మెతుకు తగలకూడదనే ఒక భావన ఎలా ఏర్పడిందో గానీ అది జనాల్లో బాగా నాటుకు పోయింది. ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, గారె, మైసూరు బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న పిండి వంటలకు మనం దాసులమై పోయాం. ఏ వ్యాధికి మూలకారణం వెదికినా టిఫిన్ల విషయంలో మార్పు చేసుకోవాల్సిన అవసరాన్ని అది హెచ్చరిస్తుంది.
మనవాళ్ళు మొన్న మొన్నటి దాకా అంబలి, సంకటి లాంటి వాటిని ఉదయం అల్పాహారంగా తీసుకునే వాళ్ళు! మనం అనుకుంటాం... మన పూర్వులు తిండికి గతిలేని వాళ్ళు, డబ్బున్నా అనుభవించటం తెలీని వాళ్ళు, నాగరికత లేని పల్లెటూరు బైతులు... అని! కానీ, వాస్తవం ఏవంటే షష్టి పూర్తి, సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వాళ్ళ సంఖ్య ఇప్పటి మనకన్నా పెన్సిలిన్ కనుక్కోక పూర్వం జీవించిన వారిలోనే ఎక్కువ. ఎందుకంటే ఆనాటి ప్రజలకు ఇడ్లీ, అట్టు, గారె, పూరీ, ఉప్మా, మైసూరు బజ్జీల్ని ఉదయాన్నే మఠం వేసుకుని కూర్చుని తినటం తెలియదు కాబట్టి!
శ్రీనాథుడు దమయంతీ స్వయంవరాని కొచ్చిన అతిథులకు వడ్డించిన మధ్యాన్న భోజనంలో మెనూలిష్టు ఒకటి ఇచ్చాడు. వాటిలో ఇడ్డెనులూ, దోసియలూ ఉన్నాయి. అంతేగానీ, అతిథుల్ని ప్రొద్దున్నే టిఫినుకు పిలిచి వీటిని వడ్డించినట్టు వ్రాయ లేదు. టిఫిన్లు మనకు సరిపడే ఆహార అలవాటు కాదు!
మరి, ఆ రోజుల్లో ప్రొద్దున్నే బ్రేక్ఫస్ట్ ఏవిటీ అనేది మంచి ప్రశ్న: అంబటేళ అంటే ప్రొద్దున్నే అంబలి తాగే వేళ అని అర్థం. అదీ సంగతి! చిక్కటి గంజి, జావ, ముద్ద, వీటిని రాగి, జొన్న సజ్జ, ఉలవల్లాంటి ధాన్యాలతో తయారు చేసుకుంటే కడుపు నిండు తుంది కేలరీలు పెరగవు. జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది. కావాలంటే గంజీ, అంబలి అనకుండా సూపూ, పారిడ్జి, ఓట్మీల్ లాంటి ఇష్టమైన పేరు పెట్టుకుంటే భాషా ద్రోహం జరిగినా ఆరోగ్య క్షేమం దక్కుతుంది కదా!

కాబట్టి, పిండి పదార్ధాలను అనగా మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు వగైరా పిండి ధాన్యాలను సరదాగా జన్మానికో శివరాత్రి అన్నట్టు తీసుకో గలిగితే మనమూ సహస్ర చంద్ర దర్శనం చేసుకో గలుగుతాం. ఎవరు చూశారు మూడు యాబైలు? అనడిగాడు శ్రీశ్రీ. వెయ్యి చంద్రుళ్ళను చూశా ననిపించుకుంటే మూడు యాబైలు దాటినట్టే!  

No comments:

Post a Comment