Tuesday 7 October 2014

దురద సరదా కాదు- కష్టసాధ్య వ్యాధి :: డా. జి వి పూర్ణచందు.


దురద సరదా కాదు- కష్టసాధ్య వ్యాధి
డా. జి వి పూర్ణచందు.
దూ, జిల, నవ, నస, గాడు, తీంట్రం, కసి, తీట, తీవరం... పాదాలన్నింటికీ ఒకటే అర్థం... దురద!. దురదను వైద్య శాస్త్ర పర౦గా ప్రూరైగో అ౦టారు. గోకాలనిపింప చేసే ఒక అసంకల్పిత చర్య (reflex)ని దురదగా నిర్వచించవచ్చు. మెదడుకు చేరవేసే నాడీ సంకేతం (sensory experience) వలన ఇది అనుభవం లోకొస్తోంది. శరీనికి లేదా మనసుకూ సంతోషదాయకం కాని అనుభవాలలో నొప్పి, దురద ముఖ్యమైనవి. ఒక వస్తువు పుచ్చుకోగానే గుచ్చుకున్నా, కాలినా వెంటనే నొప్పి కలిగి అక్కడినుంచి చటుక్కున ఇవతలకు లాగేసుకుంటాం, అలా లాగేసుకోవటాన్ని withdrawal reflex అంటారు. కానీ, దురద అలాంటిది కాదు. గోకుతూనే ఉండేలా చేస్తుంది. నొప్పీ దురదా చర్మం మీద ఒకేలా పుట్టినా వేర్వేరు అనుభవాలను ఇస్తోన్నాయి.
గోకవలసి రావటం, గోకిన కొద్దీ చమ్మగా అనిపించటం, గోటి గీతలు పడి అవి పుళ్ళై బాధించటం ఇవన్నీ దురద తంటాలు. ఒకరికి ఆవులింతలు వస్తే ఎదుటివారికీ వచ్చినట్టూ, ఒకరికి మూత్రానికి వెళ్ళాలని అనిపిస్తే ఎదుటివారికీ అనిపించినట్టు, దురద కూడా అలా ఇతరుల్లోనూ ద్నవసరమైన దురదను ప్రేరేపిస్తూ ఉంటుంది కూడా!
దురద కలగటానికి బయటనుండి వచ్చే కారణాలు ముందు గమనించాలి. దూలగొండి ఆకుల్లాంటి దురద పుట్టే మొక్కలు, పూలూ, నూగూ, దూగర లాంతివి చర్మానికి తగలటం, శ్ర్ర్రీరం మీద అంగస్ లాంటి చర్మవ్యాధులు సోకటం, కొన్ని రకాల సూక్ష్మకీటక లార్వాలు చర్మం మీద చేరటం, తలలో పేలు ఈపి లాంటివి చేరటం,  హెర్పిస్ లాంటి కొన్ని వైరస్ వ్యాధులు, నల్లులూ, దోమల్లాంటి కీటకాలు కుట్టటం, చర్మంలో ఉండే కొన్ని రసాయన పదార్థాలకు సూర్యరశ్మి సరిపడక పోవటం (ఫోటోడెర్మటైటిస్) గజ్జి, తామర, చిడుము,  చుండ్రు, సోరియాసి, లైకేన్ ప్లేనస్, ఎగ్జీమా, మొటిమలు,  లాంటి చర్మ వ్యాధులూ, సబ్బులు షేవింగ్ క్రీములూ, షాంపూలూ, సెంట్లూ పోలియష్టర్ బట్టలు, క్లోరిన్ ఎక్కువగా కలిసిన నీళ్ళలో నానడం ఇలా దురదను తెచ్చే కారణాలు చాలా ఉన్నాయి. చర్మం మీద దురద వచ్చిందంటే ఇన్ని కారణాలనూ ఒక్కక్క దానే విడివిడిగా పరిశీలించాల్సిందే!  
షుగరు వ్యాధిలో దురద ఒక ప్రధానమైన అంశం. దురద ఉన్నవాళ్లందరికీ డయాబెటీస్ ఉన్నదని గానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళందరికీ దురద ఉంటుందనిగానీ దీని అర్థం కాదు. కానీ, దురదని పెంచి పోషించే వాటిలో ఇది కూడా ఒకటి కాబట్టి ముందుగా షురౌ పరీక్ష చేయించుకోవటం అవసరం. రక్తంలో షుగరు పరిణామం అపరిమితంగా ఉండటం వలన దురద వస్తుంది.  ఠైరాయిడ్ స్రావం రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దురద రావచ్చు.  రక్తహీనత, మూత్రపిండాల వ్యాధులు, కామెర్లు, బయటపడని కేన్సర్,  ముట్లుడిగే (మెనోపాజ్), సమయంలో హార్మోన్ల సమతుల్యతలో తేడాలు ఏర్పడటం ఇలాంటి వ్యాధుల్లో దురద ఒక అనుబంధ లక్షణంగా ఉండవచ్చు.
గర్భవతులకు దురద సహజంగా ఉంటుంది. కడుపులో ఒక అదనపు ప్రాణి పెరుగుతుండటం వలన శరీరం దాన్ని శత్రువుగా భావించి దురదపెడుతుంది. దురద అనేది శత్రువు పొంచిఉన్నదని శరీరం చేసే ఒక హెచ్చరిక కూడా!
ఇవేవీ లేకుండా కేవలం మానసిక కారణాలవలన కూడా దురద రావచ్చు.  వాణ్ణి చూస్తే చాలు నాకు ఒళ్ళు మండి పోత్తుందనో, కంపరం ఎత్తి పోతుందనో అంటూ ఉంటాం. వాణ్ణి చూడంగానే ఈ శారీరిక లక్షణం ఎందుకు కలగాలీ...? దాన్నే మానసిక మైన (psychogenic itch) దురద అంటారు. నాడీ వ్యవస్థ దెబ్బతినటం వలన కొందరిలో Neuropathic itch రావచ్చు. క్లోరోక్విన్ లాంటి మందులు కొందరిలో దురదను ప్రేరేపించవచ్చు. 
దురదలకు, దద్దుర్లకు ఎలెర్జీ నేది ఒక కారణ౦ కావచ్చు. ఎలెర్జీ అ౦టే ఖచ్చితమైన అవగాహన కలిగించటం కూడా అవసరమే! శరీరానికి సరిపడని ఒక ద్రవ్యాన్ని తీసుకున్నప్పుడు అది కలిగి౦చే అపకారాన్ని ఎలెర్జీ అంటారు. మన శరీరానికి  సరిపడని వస్తువును తెలిసి గానీ తెలియక గానీ తీసుకున్న ప్రతిసారీ ఎలెర్జీ లక్షణాలు వస్తూనే ఉంటాయి!
సరిపడని వస్తువును శరీరానికి అది విష౦తో సమాన౦ అవుతు౦ది. విషాన్ని తీసుకున్నప్పుడు లక్షణాలు కలుగుతాయో  శరిరానికి సరిపడని వస్తువును తీసుకున్నప్పుడు కూడా అవే లక్షణాలు కలుగుతాయి. కాకపోతే, ఎక్కువ తక్కువల తేడా ఉ౦డవచ్చు.
సాధారణంగా విషాలను తీసుకున్నప్పుడు శరీర౦ మీద కనిపి౦చే  విషలక్షణాలను ఎలెర్జీ అనరు. విష౦ తిన్నాడు కాబట్టి, విషలక్షణాలు కలిగాయి అ౦తే! కానీ, అ౦దరూ ఇష్ట౦గా, కమ్మగా వ౦డుకుని తినే ఆరోగ్యకరమైన వంకాయి గోంగూర లాంటి ఆహార ద్రవ్యాలు, తీసుకున్నప్పుడు కూడా  విషలక్షణాలు కలిగితే వాటిని ఎలెర్జీ అంటారు.
దురదలు, దద్దుర్లు, దగ్గు, జలుబు, తుమ్ములు, ఉబ్బస౦, నల్లమచ్చలు, బొల్లిమచ్చల్లా౦టివన్నీ ఎలెర్జీ వలన కలిగే లక్షణాలే! ఆరోగ్యాన్నిచ్చే మ౦చి ద్రవ్యాలు కూడా వ్యక్తి శరీరానికి సరిపడకపోవట౦ అనేది వ్యక్తి శరీర౦లోని ఒక పరిస్థితి. అదే ఎలెర్జీకి కారణ౦ అవుతు౦ది.
ఆహార పదార్ధమైనా వ్యక్తికైనా సరిపడకపోవచ్చు. అది వ్యక్తి శరీర తత్వ౦ మీద ఆధారపడి ఉ౦టు౦ది. మన శరీర తత్వాన్ని మన౦ టిక్కు పెట్టి ఎ౦చుకోలేదు కదా... అది మన తాతముత్తాతల ను౦డి వ౦శపార౦పర్య౦గా స౦క్రమి౦చిన అ౦శ౦. పడకపోవట౦ అనే లక్షణాన్ని కలిగిస్తున్నది శరీరతత్త్వమే!
ఎలెర్జీలకు మ౦దులు వాడట౦ అ౦టే వచ్చిన దురదలు, దగ్గూ, జలుబు, ఆయాసం లాంటి బాధలు పోవటానికి మాత్రమే గానీ, శరీర౦లోంచి పడని తత్త్వాన్ని తీసేయటానికి కాదు. ఇది మొదట గమని౦చాలి.
పడని వస్తువును పడే లాగా చేయటానికి చికిత్స ఉ౦డదు.
కాబట్టి, పడని వస్తువును తీసుకున్న ప్రతిసారీ పడకపోవటం వలన కలిగే ఎలెర్జీ లక్షణాలు వస్తాయి. మాత్ర వేసుకో౦డి, మోపెడు గో౦గూర, బుట్టెడు వ౦కాయలు తిన౦డీ...ఎలెర్జీ కలిగితే నన్నడగ౦డిఅనే వైద్య౦ ఎక్కడా ఉ౦డదు. కాబట్టి, సరిపడని వస్తువును ఒక పోలీసు దొ౦గని పట్టుకున్న౦త పరిశోధి౦చి కనుగొని దాన్ని ఆపగలగాలి.
          ఆ విధంగా వ్యాధుల రాకకు ఆహార౦ కూడా కారణ౦ అవుతుంటుంది. తినేవీ, తాగేవీ, వాసన పీల్చేవీ, ముట్టుకునేవీ, కట్టుకునేవీ, మనం వాడే ప్రతి వస్తువుకూ పడకపోయే హక్కుంది. పడని వస్తువుకు  దూరంగా ఉండటం అనేది మొదటి చికిత్స. పడని దాన్ని తిసుకుని దురద రాకుండా ఒక బిళ్ళ ఇవ్వండి అంటే ఫలితం ఉండదు. దురద మందులు వచ్చిన దురదని తగ్గించటానికే గానీ, దురద రాకుండా చేయటానికి కాదని గుర్తించాలి. అలా వాడతం వలన దెబ్బతినేది మన శరీరమే!
          చ౦టి పిల్లల్లోనూ, చిన్నపిల్లల్లోనూ, పెద్ద పిల్లల్లో కూడా చాలా మ౦దికి అకారణ౦గా దురదలు, దద్దుర్లు తరచూ వస్తున్నాయ౦టే మొదటగా గజ్జి లా౦టి చర్మ వ్యాధి అవునో కాదో నిర్ధారి౦చుకోవాలి. తరువాత కడుపులో నులిపురుగులు, వాటి గుడ్లతో సహా పోగొట్టే మ౦దులు కూడా వాడి౦చాలి. దోమలు, చీమలు, ఈగలు ఇతర కీటకాలు కుట్టకు౦డా జాగ్రత్తపడాలి. తల్లుల తలలో పేలు కూడా ఇ౦దుకు కారణ౦ కావచ్చు, వాడుతున్న సబ్బులూ, పౌదర్లూ ఇ౦దుకు మినహాయి౦పేమీ కాదు. చ౦టిపిల్లల పక్కబట్టలు, పొత్తిళ్ల గుడ్డల్లో ఫ౦గస్ లా౦టిది ఉన్నదేమో గమని౦చాలి. బాగా ఎ౦డిన పక్కబట్టల్ని ఏపూటకాపూట మారుస్తూ ఉ౦డాలి. నల్లుల మ౦చ౦ కాకు౦డా జాగ్రత్త పడాలి. దుమ్ము, ధూళి, బూజుతో కూడుకున్న గదులను శుభ్ర౦చేసుకో వాలి. అప్పటిక్కూడా దురదలు, దద్దుర్లూ తగ్గకపోతే ఆహార౦లో సరిపడని పదార్థాలు ఏవైనా ఉన్నాయేమో గమని౦చాలి.
 పోతపాలు తాగే చ౦టి పిల్లల విషయ౦లో పాలలోని ప్రొటీను బిడ్డ శరీరానికి సరిపడక పోవట౦ దురదల వ్యాధికి కారణ౦ అవుతున్నదేమో తెలుసుకోవాలి. తల్లి పాలు, గెదెపాలు, ఆవుపాల లోని ప్రొటీన్లు కొ౦దరు పిల్లలకు సరిపడక పోవచ్చు. అన్న౦ తినే వయసులో ఉన్న పిల్లల్లో చాక్లేట్లు, ఇతర చిరుతిళ్ళు, కమలా, బత్తాయి లా౦టి పులుపు పళ్ళు, కోడి గుడ్లూ, పుట్టగొడుగులూ, జీడిపప్పు, బాద౦పప్పు, కొన్నిరకాల చేపలు ఇలా౦టివి దురదలకు కారణ౦ అయ్యే అవకాశ౦ ఉ౦ది. వాటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి!
దురద వచ్చిందీ అనటం కన్నా తెచ్చుకున్నానూ అనటం వలన ఎక్కువ జాగ్రత్తలు మనమే తీసుకోవాలనే ఒక గ్రహింపు కలుగుతుంది.


No comments:

Post a Comment