Tuesday 14 October 2014

సంసారాలు చెడగొడుతున్న సెక్సు విముఖత :: డా. జి వి పూర్ణచందు



సంసారాలు చెడగొడుతున్న సెక్సు విముఖత
డా. జి వి పూర్ణచందు
సెక్సు పట్ల అత్యాసక్తి, ఆసక్తి, అనాసక్తి, ద్వేషం, వైరాగ్యం ఇలా మనుషుల్లో లైంగికానుభూతి వివిధ స్థాయిల్లో ఉంటుంది. వీటిల్లో లైంగిక ఆసక్తి ఒక్కటే సాధారణ స్థాయిలో ఆరోగ్యదాయకంగా ఉంటుంది.
బ్రహ్మచర్యం, మనోనిగ్రహం, వైరాగ్యం లాంటివి మనోబలంతో సాధించుకునే విషయాలు. తక్కినవన్నీ అంతో ఇంతో మానసిక రుగ్మతల కిందే లెక్క.
మానసిక సెక్సు రుగ్మతల్లో లైంగికద్వేషం (Sexual aversion disorder) గురించి మనం మాట్లాడుకో వలసింది చాలా ఉంది. కొందరికి సెక్సంటే చీదర(disgust). ఇంకొందరికి భయం, విరక్తీ(revulsion). మరికొందరికి. జీవిత భాగస్వామి పట్ల అయిష్టత (aversion) కారణంగా లాలస అనేది నశించిపోయి ఏర్పడే లైంగిక జడత్వంవగైరా ఏర్పడి ఉంటాయి. ఈ జడత్వం సాధారణ స్థాయి (normal loss of desire)నుండి తీవ్ర స్థాయి దాకా  వివిధ దశల్లో ఉండవచ్చు.
చాలామంది, కొత్త యువ దంపతుల్లో సెక్సు సుఖానుభూతిని సంపూర్ణంగా పొందాలని గానీ, అలా పొందాలని కోరుకోవటం గానీ ఇటీవలి కాలంలో చాలా తక్కువగా కనిపిస్తోంది.  ముఖ్యంగా స్వాధికారికత, స్వయం ప్రతిపత్తుల నిచ్చే ఐటీ రంగం, వైద్యరంగం, పాలనా రంగాలలో స్త్రీలు  విడాకులకు త్వరగా వెడుతున్నారు. ఎందుకని?
ఏ యుగంలో అయినా, దాంపత్య బంధానికి సెక్సు సంతృప్తే ముఖ్యమైన విషయం. తన స్త్రీలో లైంగిక ఆకర్షణ తక్కువగా ఉన్నప్పుడు మగవాడు త్వరగా బయట పడతాడు. కానీ, మారిన కాలంలో,  మగవాడిలో సెక్సు అసమర్థత కనిపించి నప్పుడు సహించేందుకు ఆడపిల్లలు కూడా సిద్ధంగా లేకపోవటం ఒక గొప్ప మార్పు! అందుకుతగ్గట్టుగా మగవాడే మారాల్సిన పరిస్థితి వచ్చేసింది. నువ్వునాకొద్దని ఆడవాళ్ళు ముఖాన చెప్పేస్తే, ఆ మగాడి జీవితం తిరగబడ్డట్టే అవుతోంది. మారు మనువులు మగాళ్ళలో కన్నా ఆడవాళ్లలోనే ఎక్కువగానూ. వేగంగా కూడా జరుగుతున్నాయి.
 లైంగిక సమర్థతలు ఎప్పుడూ మానసికమైన పరిస్థితుల కారణంగా పెంపు-దింపుగా నడుస్తుంటాయి. వాటిని పాత రోజుల్లో పరస్పర సహకారంతో సరిచేసుకో గలిగేవాళ్ళు! కానీ, నవీన కాలంలో అది కొరవడుతోంది. ఫలితంగా చాలా కొత్త సంసారాలు పెళ్ళి ప్రథమ వార్షికోత్సవాలకు కూడా నోచుకో లేకపోతున్నాయి.  
 నడివయసులో కొచ్చాక స్త్రీలలో మెనోపాజ్, పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథిలో వాపు లైంగిక విముఖతకు ముఖ్య కారణాలుగా ఉంటాయి. బాలింతగా ఉన్న సమయం లోనూ, బిడ్డకు పాలిచ్చే రోజుల్లోనూ, జబ్బుపడి లేచిన సమయంలోనూ,  సర్జరీలు జరిగినప్పుడూ, ఉద్యోగం పోయినప్పుడూ, పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడూ, ధన మాన ప్రాణాదులకు ఇబ్బంది కలిగినప్పుడూ దాంపత్య పరమైన సుఖానుభవానికి స్త్రీ పురుషులు విముఖులు కావటం సహజం. కానీ అది విడాకులదాకా సాగేంత వ్యవహారం కాకూడదు కదా!
ఇంటికి సంబంధించిన విషయాల్లో సమయం కేటాయించే తీరిక లేని వాళ్ళు ఒక్కోసారి సెక్సు విముఖతని ఎదుర్కొంటారు. పరిస్థితులను మార్పు చేసుకుంటే మళ్ళీ సాధారణ స్థితి రావచ్చు. ఇలాంటి తాత్కాలిక విముఖతని reversible loss of desire అంటారు. ఇంట్లో ఏకాంతం కుదరకపోవటం, కుటుంబంలో రాగద్వేషాలు, అత్తపోరు, మానసిక ఉద్వేగాలు, వత్తిళ్ళు లాంటి పరిస్థితులవలన కూడా తాత్కాలిక విముఖత కలగవచ్చు.
ఇలాంటివేవీ లేకుండా సెక్సువిద్వేషం, విముఖత కలుగుతున్నదంటే ఆ వ్యక్తికి  వైద్యపరమైన సలహా అవసరం అవుతుందనే అర్థం. సెక్సు విముఖతని తగ్గించుకోకుండా దాంపత్యం నిలవాలంటే అది కష్టమే అవుతుంది. నన్నూ, నా పరిస్థితినీ అర్థం చేసుకో అంటే ఓర్పు పట్టే వ్యక్తులు ఈ రోజుల్లో అరుదు. ఎదుటి మనిషికి అర్థం అయ్యేలా ప్రవర్తించ గలగటమే దానికి నివారణ. ఎదుటి మనిషిలో తాను కోరుకుంటున్న మార్పుని తాను మారి సాధించాల్సి ఉంటుంది.
సంసారం అంటే కేవలం సెక్సే కానప్పటికీ, సెక్సు అనేది సంసారంలో ముఖ్యాంశం కాబట్టి, అది తప్ప మిగతాదంతా ఓకేఅంటే, అది నిజమైన దాంపత్యం అనిపించు కోదు. బహుశా అలాంటి జీవితానికి సహజీవనం లాంటి పేర్లు అతుకుతాయి.
జీవితం అంటే డబ్బు కాదు, జీవితం అంటే సుఖం ఇచ్చిపుచ్చుకోవటం! స్త్రీ గానీ, పురుషుడు గానీ, ఇవ్వటమూ పుచ్చు కోవటమూ రెండూ చెయ్యలేక పోతున్నట్టు గమనిస్తే,  రెండో వ్యక్తి సహకరించి సుఖానుభవాన్ని పెంపు చేసేందుకు తోడ్పడాలి.
దుర్వాసనతో కూడుకున్న జననాంగాలు, శరీరంలోచి చెమట వాసన, నోట్లోంచి వెల్లుల్లిపాయి కంపు, సిగరెట్టు, ఆల్కాహాలు వెగటు వాసన, హింసాత్మకంగా రాక్షసంగా సెక్సుని పొందాలని ప్రయత్నించటం- ఇలాంటివి స్త్రీకి సహజంగానే ఎదుటివ్యక్తికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఆ పురుషుడి సెక్సు సమర్థత కలిగినవాడైనప్పటికీ, దగ్గరగా వస్తేనే విరక్తి కలిగేలా ఉంటే ఆ స్త్రీ ఎవరితో ఏవని మొరపెట్టుకుంటుంది...? ఇలా మొదలైన విముఖత, సంబంధం లేని ఇతర విషయాల మీదకు మళ్ళి, చిలవలు పలవలై, దాంపత్య బంధం చెడేదాకా దారి తీయవచ్చు.  ఇలాంటి పరిస్థితినే కొందరు పురుషులు కూడా ఎదుర్కొంటూ ఉండొచ్చు.  గది నాలుగ్గోడల మధ్య స్త్రీ పురుషులు స్వేఛ్ఛగా ఆచరించే వ్యవహారం కాబట్టి ఆ క్షణంలో వ్యక్తిగమైన మానసిక బలహీనతలు బయటకొచ్చి ఇబ్బంది పెడుతుంటాయి.
సెక్సు విముఖత మొదటినుండీ ఉన్నదా? ఆ వ్యక్తితో మాత్రమే ఉన్నదా? ఎప్పుడు సెక్సుకు తలపడినా ఉంటున్నదా? ఇవన్నీ అడగవలసిన ప్రశ్నలే! తాత్కాలిక కారణాలు కనిపించినప్పుడు వాటిని సరిచేసుకోవటం ఉత్తమం. పురుషుల్లో కన్నా స్త్రీలలో సెక్సు విముఖత ఎక్కువగా ఉంటుంది. సెక్సు తపన, రంధి, కుతి లాంటివి పురుషులతో పోలిస్తే స్త్రీలలో సహజంగానే తక్కువగా ఉంటాయి!
 సున్నితమైన సెక్సుని, సున్నితమైన తీరులో సుతారంగా జరిపితే ఎక్కువమంది స్త్రీలు సంతృప్తి పడతారు. మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటారు. మోతాదు మించి జరిపినప్పుడు గానీ, లేక, అస్సలు మొదలెట్టలేకపోయినప్పుడు గానీ, ఆ స్త్రీ సెక్సు విముఖతనీ, సంసార విముఖతనీ పొందే ప్రమాదం ఉంది. అతి సెక్సునీ, అసమర్థ సెక్సునీ స్త్రీలు అంగీకరించలేరన్నమాట!  
కనీసం 20-30% కొత్త దాంపత్యాలు కనీసం నూరు రోజుల పండుగ కూడా చేసుకోలేకపోవటాన్ని గమనించినప్పుడు, చాలామంది అడపిల్లల తండ్రులు చెప్పే కారణాలు సెక్సు పరమైనవే కనిపిస్తున్నాయి. తమ అల్లుడు అతి కాముకుడనీ, అనేక స్త్రీలతో సంబంధాలున్నవాడని గానీ, లేదా అతను అసమర్థుడనీ, అసల్దే అతనికి లేదనీ అనడం మనం గమనిస్తున్నాం. అంటే, దాంపత్యం చెడటానికి సెక్సు కారణాలే ప్రముఖంగా కనిపిస్తున్నాయన్నమాట! చాలామంది దాన్ని పైకి చెప్పలేక వరకట్నాల వేధింపులూ, గృహ హింస వేధింపుల గురించి మాట్లాడుతుంటారు. ఈ వేధింపులకు మూలకారణం సెక్సు విముఖత ఏర్పడటమే కావచ్చు. దాన్ని సరిచేయటానికి ప్రయత్నించటం అవసరం.

No comments:

Post a Comment