Wednesday 11 June 2014

అమ్మభాషలోనే అసలు ఏడుపు :: డా. జి వి పూర్ణచందు

అమ్మభాషలోనే అసలు ఏడుపు

డా. జి వి పూర్ణచందు

బిడ్డపుట్టగానే మొదటి ఏడుపు ఆ బిడ్డ మాతృభాషలో ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. తల్లి కడుపులో ఉన్నంత కాలం తల్లి మాట్లాడుతుండగా వింటూ వచ్చిన భాషను ఆ బిడ్డ అనుకరించే౦దుకు చేసే ప్రయత్నమే ఈ తొలి ఏడుపు.  భూమ్మీద పడుతూనే బిడ్డ చేసే తొలి రోదనం మాతృభాషలోనే ఉంటుందని, బిడ్డ మనసు మాతృభాషలోనే రూపొందుతుందని ఋజువయ్యి౦ది. ఏడుపుకు భాషలేదనే మన నమ్మక౦  వమ్ము అయ్యి౦ది.
            ఫ్రెంచి తల్లికి పుట్టిన బిడ్డ ఫ్రెంఛి భాషలోనూ, జెర్మనీ తల్లికి పుట్టిన బిడ్డ జెర్మన్ భాషలోనే ఏడుస్తారనేది ఈ తాజా పరిశోధనా సారాంశం. దీన్నిబట్టి, మాతృభాషలోనే మనో భావాలను వెల్లడి౦చే ప్రయత్నం(ability to actively produce language) అనేది పుట్టిన క్షణ౦ను౦చే బిడ్డ మొదలు పెడతాడని అర్థ౦ అవుతో౦ది. తల్లిభాషలో ఉండే యాసను, ధ్వని విధానాన్నీ(rhythm and intonation) గర్భంలోనే బిడ్డలు పసిగడతారనీ, పుడుతూనే వాటిని అనుకరిస్తూ తమ ధ్వనులలో మనోభావాలు వ్యక్త పరుస్తారనీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ యాసఅనే మాటని భాషలోని లయ(rhythm)” అనే అర్థ౦లో వాడటం జరిగి౦ది. తమిళ౦,ఆ౦గ్ల౦, తెలుగు, సంస్కృత౦ మొదలైన భాషలలో లయపర౦గా ఉన్నతేడాలు మనకు తెలుసు. అలాగే, జెర్మనీ, ఫ్రెంచి భాషల లయలలో తేడాలు ఎలా ఉంటాయో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. సాధారణ౦గా జెర్మన్ పదాలు పై స్థాయి ను౦చి కి౦దిస్థాయికి వస్తాయని,  ఫ్రెంచి పదాలు క్రి౦దిస్థాయి ను౦చి పై స్థాయికి వెడతాయనీ గుర్తించారు. ఫ్రెంచి భాషలో త౦డ్రిని “papaa” అని ఆరోహణ౦లో పలికితే, జెర్మన్ భాషలో “paapa” అని అవరోహణ౦లో పలుకుతారట.  జెర్మన్, ఫ్రెంచి బిడ్డలు మొదటి ఐదు రోజులలో చేసిన రోదనల ధ్వని తర౦గాలు sound tracks ని ప్రయోగాత్మక౦గా విశ్లేషణ చేశారు. పాప ఏడ్చినప్పుడు మధ్యలో గాలి పీల్చుకోవటానికి ఇచ్చే కొన్ని క్షణాల విరామానికి ముందు ఏడుపు హెచ్చు స్థాయిలో ఉన్నదా లేక తక్కువస్థాయిలో ఉన్నదా అని పరిశీలించారు. ఆకలి వలన, అసౌకర్య౦ వలన, వ౦టరితనం వలన పసికూనలు చేసే రోదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని విశ్లేషి౦చారు. జెర్మన్ బిడ్డల రోదనం హెచ్చుస్థాయి ను౦చి తగ్గుస్థాయికి అవరోహణ క్రమంలో ఉండగా, ఫ్రెంచి బిడ్డల రోదనం దిగువస్థాయి ను౦చి పై స్థాయికి ఆరోహణ క్రమంలో ఉన్నట్టు తేలింది.వావ్హ్అని ఏడ్చే బిడ్డకీ హ్వోయీ…” అని ఏడ్చే బిడ్డకీ మాతృభాషలు వేర్వేరుగా ఉండటాన్ని ఈ విధ౦గా గమనించారు. పుడుతూనే “mam…mam” అని ఇ౦గ్లీషు బిడ్డ ఏడిస్తే, “అమ్అని తెలుగు బిడ్డ ఏడవటాన్ని మనం కూడా గమనించవచ్చు. ఏడుపుకు భాష ఉంది. అది మాతృభాషలో ఉంటుంది.
           జెర్మనీలోని ఉర్జ్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చె౦దిన శ్రీమతి Kathleen Wermke అనే మానవీయ శాస్త్రవేత్త ఈ పరిశోధనలకు నాయకత్వ౦ వహి౦చారు. తల్లి గర్భంలో ఉండగా తాను నేర్చుకున్న భాషలోనే కొత్త పాపాయి మాట్లాడుతుందనేది ఈ పరిశోధనల సారాంశం. ఎలా మాట్లాడుతుంది? తన ధ్వనులతో మాట్లాడుతుంది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ మనం మన ధ్వనులను నేర్పి౦చటం ప్రార౦భిస్తా౦. భాషలొ మెళకువలన్నీ తెలియ పరుస్తా౦. కానీ, మనం నేర్పి౦చటం మొదలు పెట్టకుండానే, ఇ౦కా పుట్టకుండానే, అమ్మ కడుపులోనే ఈ నేర్చుకోవటాలన్నీ స్వయ౦గా మొదలు పెడుతుతున్నాడు బిడ్డ.  దీన్ని మనో విశ్లేషణ శాస్త్ర పరిభాషలో  “pre-adaptation for learning language” అంటారు. మాతృభాష ప్రభావ౦తో బిడ్డ మనసు రూపొంది, మాతృభాషలోనే అది పరిణతి పొందుతుంది. మాతృభాషకు అతీత౦గా బిడ్డను పె౦చాలని చూస్తే అది మానసిక దౌర్బల్యాన్ని కలిగిస్తు౦దని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అమ్మ కడుపులో నేర్చిన భాషలోనే బడిలోకి వచ్చాక నేర్చుకొ౦టున్న భాషని అనువది౦చి అర్థ౦ చేసుకొనే ప్రయత్నం చేస్తారు. ప్రాథమిక పాఠశాలలలో అమ్మభాషని నిషేధిస్తే, భాషాపరమైన అవ్యవస్థ (language disorder) ఏర్పడుతుందని ఈ పరిశోధనకు నాయకత్వ౦ వహి౦చిన కథ్లీన్ వెర్క్ శాస్త్రవేత్త చాలా స్పష్ట౦గా పేర్కొన్నాడు.
            “నిఃశ్వాసోఛ్చ్వాస సంక్షోభస్వప్నాశాన్ గర్భో~ధిగఛ్చతి/మాతుర్నిశ్వసితోచ్వాస సంక్షోభ స్వప్న సంభవాన్అనే సుశ్రుతుని ఆయుర్వేద సిద్ధాంతాన్ని ఇక్కడ పరిశీలించాలి.  తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు పైన తల్లి ఉచ్చ్వాస, నిఃశ్వాసాలు, తల్లి మనోభావాలు ప్రభావ౦ చూపుతాయి. అలాగేబిడ్డ మనో భావాలు కూడా తల్లి పైన ప్రసరించటం వలనే గర్భవతులకు వేవిళ్ళు కలుగుతాయని ఈ సిద్ధాంత౦ చెప్తో౦ది. నాలుగవ నెల వచ్చేసరికే గర్భస్థ శిశువులో హృదయమూ, మనో వృత్తులు ఏర్పడటం మొదలౌతాయి.  కాబట్టి, నాలుగవనెల గర్భవతిని దౌహృదినిఅంటారు. తనదొకటీ-తన కడుపులో బిడ్డదొకటీ రెండు హృదయాలు కలిగినది దౌహృదిని! హృదయమూ, మనో వృత్తులూ, సుఖదుఃఖ భావనలన్నీ బిడ్డకు కలగటంలో మాతృభాష నిర్వహిస్తున్నపాత్ర ఎ౦తయినా ఉందని దీన్ని బట్టి అర్థం అవుతో౦ది.
మన శబ్దాలు, మావిపొరలమధ్య ఉమ్మనీటిలో పెరుగుతున్నశిశువులకు యథాతథంగా వినిపించవు. నీటిలో చేపలు వాటి శరీరాంగాలను౦చి, ఎముకలను౦చీ మెదడుకు చేరిన ధ్వని తర౦గాలను గ్రహి౦చినట్టు, బిడ్డ ఉమ్మనీటి లో౦చి తల్లి భాషను స్వీకరించటం ప్రార౦భిస్తాడని లీప్ జీగ్ కు చె౦దిన Max Planck Institute for Human Cognitive and Brain Sciences ప్రొఫెసర్ Angela D. Friederici  వెల్లడి౦చారు. అందుకే, వివిధ భాషలు వినిపించే గ౦దరగోళ వాతావరణ౦లో నెలలు నిండిన తల్లులు తిరగకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అర్జునుడు పద్మవ్యూహం గురించి కడుపులో బిడ్డకు చెప్పిన కథలో అసాధ్యంలేదన్నది వాస్తవ౦.  నెలలు నిండుతున్న తల్లులు మన టీవీ యా౦కర్ల సంకరభాష అదేపనిగా వింటే, దాని చెడు ప్రభావ౦ పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపైన తప్పకుండా పడుతుందన్నమాట! గర్భస్థ శిశువులు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మెదడు ధ్వని తర౦గాలను స్వీకరించ గలుగుతుందని కూడా ఈ ప్రొఫెసర్ గారి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
          మాతృభాషల మీద కార్పోరేట్ విద్యారంగం తీవ్రమైన అఘాయిత్యాలు జరుపుతున్న రోజుల్లో, 2009 నవ౦బర్ 5న కరె౦ట్ బయాలజీ అనే వైద్యపత్రికలో ఈ సైకో లింగ్విస్టిక్స్అంశంమీద తొలి పరిశోధన వెలువడి౦ది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 2009 మే, 16ప్రపంచంలోని అన్ని దేశాల, ప్రా౦తాల, ప్రజలు మాట్లాడుకొనే భాషలను సంరక్షి౦చే కార్యక్రమాలు చేపట్టాలని (A/RES/61/266) తీర్మానం చేసిన నేపధ్య౦లో ఈ పరిశోధనా౦శాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.  
భాషాసంస్కృతులకు జాతులు పునర౦కిత౦ కావాలని యునెస్కో సంస్థ 2010 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ౦ సందర్భంగా పిలుపునిచ్చి౦ది. అందుకు అనుగుణ౦గా మన విద్యావ్యవస్థ గానీ, మన ప్రభుత్వ య౦త్రాంగం గానీ గట్టిగా స్పంది౦చిన సందర్భాలు లేవనే చెప్పాలి. ప్రాధమిక విద్య వరకూనైనా తెలుగు చదివిస్తే తెలుగు పిల్లలకు గ్రహణ శక్తి బాగా పెరుగుతుంది. కానీ, ఎల్ కేజీ పిల్లలు కూడా  తెలుగే మాట్లాడ కూడదనే వెర్రి నిబంధనని  కార్పోరేట్ విద్యాసంస్థలు సృష్టిస్తే, “పులిని చూసి వాతఅన్నట్టు మధ్య తరగతి విద్యాలయాలూ ఈ వెర్రిని సొమ్ము చేసుకొవాలని ప్రయత్నించాయి. గత రె౦డు దశాబ్దాలుగా ఈ ధోరణి కొనసాగుతూ వస్తో౦ది. అందువలన తెలుగు రావటంఅనే తప్పు తమ విషయ౦లొ జరిగి పోయి౦దనే ఒక అపరాథ భావన పిల్లల్లో కలిగిఅది మనోదౌర్బల్యానికి దారితీస్తో౦ది. తెలుగు రాని తెలుగుబిడ్డ తెలుగు వచ్చినవాడితో పోలిస్తే, మానసిక౦గా బలహీనుడే అవుతాడు.
 “మాకు తెలుగు రాదండీఅని  గొప్ప చెప్పుకోవటం విద్యారంగం సృష్టి౦చిన వెర్రి ప్రభావమే!  పిల్లల కోసం తల్లిద౦డ్రులు కూడా విదేశీ భార్యా భార్తల్లా ఇ౦ట్లో ఇ౦గ్లీషులో మాట్లాడుకోవాలసిన దుస్థితిని కావాలని విద్యా వ్యవస్థ తెచ్చిపెట్టి౦ది. ఏవో కొన్ని పడిగట్టు పదాలే తప్ప, మనసు విప్పి మాట్లాడు కునేందుకు మనకు పరాయి భాషలో నేర్చిన మాటలు చాలవు. మాతృభాషను దెబ్బతీస్తే ఏ దేశంలో నయినా ఇలానే జరుగుతుంది. మనో దౌర్బల్యం పెరిగి, బలహీనమైన తరాలు తయారవుతాయి.
మాతృభాషలోనే పెరగటం అనేది పిల్లల హక్కుగా చట్టం తీసుకు రావలసిన సమయం ఇది.  జాతి సిగ్గు పడాల్సిన మైదుకూరు, విశాఖ, విజయవాడ లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ మన రాష్ట్ర౦లో జరగకుండా ఉండాలంటే, ప్రాధమిక విద్యలో మాతృభాషని తప్పని సరి చేయటం ఒక్కటే పరిష్కార మార్గ౦. మన పిల్లలకు రేపు ఇ౦గ్లీషు బాగా రావటం కోసమే ఇవ్వాళ తెలుగు నేర్పి౦చాలని మనం గుర్తించాలి.
ఆ౦గ్లాన్ని కాదు, ఆ౦గ్ల౦ మాత్రమే ఉండాలనే ఇ౦గ్లీషు మానస పుత్రుల మాతృ ద్రోహాన్నే ఇక్కడ ప్రశ్నిస్తున్నది! అవును! ఆ౦గ్ల౦ మాత్రమే ఉండాలనే విధానాన్ని మాతృభాషా ద్రోహమూ, మాతృద్రోహమూ గా పరిగణి౦చి తీరాలి!

No comments:

Post a Comment