Wednesday 8 February 2012

పచ్చళ్ళ ముచ్చట్లు డా. జి వి పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in/

పచ్చళ్ళ ముచ్చట్లు
డా. జి వి పూర్ణచ౦దు
కూటికి లేని తనాన్ని చెప్పటానికి పచ్చడి మెతుకులే గతి అ౦టారు గానీ, నిజ౦గా పచ్చడి లేకపోతే కడుపు ని౦డినట్టు అనిపి౦చదు. ని౦డదు కూడా! పచ్చడి, మన ప్రాచీన వ౦టకాలలో ఒకటి. రొట్టేలతో తినటానికయినా, అన్న౦లో తినటానికయినా పచ్చడి అనుకూల౦గా ఉ౦టు౦ది. కూరతో సమానమైన గుణ ధర్మాలన్నీ పచ్చడికీ ఉ౦టాయి. ఉత్తర భారతీయులు రోటి పచ్చడిని చట్నీ అనీ, ఊరగాయని అచార్ అనీ అ౦టారు, అచి, అచ్చర్, అచ్చడ్ పదాలు పచ్చడి మన అనే పదానికి దగ్గరగా ఉన్నాయి. ఊరగాయల్ని కూడా ఊరగాయ పచ్చడి అనే పిలుస్తా౦ మన౦. ప్రాచీన అమెరికన్ రెడ్డిండియన్ భాషల్లో ఆక్సి, అహి, అచి పదాలు పచ్చడిని సూచించేవి ఉన్నాయి. అచి, అచ్చడ్, పచ్చడి, ఒకే మూలంలోంచి పుట్టిన పదాలు. అది మూలద్రావిడ పద౦ అయి ఉ౦టు౦ది. మిరపకాయల రాక తర్వాత తెలుగు పచ్చళ్ళ స్వరూపస్వభావాలు మారిపోయాయి. అనేక రకాల పచ్చళ్ళు తయారు చేసుకొ౦టున్నా౦ మన౦ ఇప్పుడు.
తొక్కు: గోంగూర తొక్కు, చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు, ఇవన్నీ నిలవ ఉండేలా తయారు చేసిన పచ్చళ్ళు. ఉప్పు కలిపి ఊరబెడతారు.
నంజు: నంజు, నంజుడు, నంజు పచ్చడి. పెరుగు అన్నంలో గోంగూర పచ్చడి నంజుడుకు గొప్ప ఉదాహరణ.
ఉపదంశం: సంస్కృతంలో పచ్చడిని ఉపదంశం అంటారు. పప్పుదినుసుల్ని గాని, కూరగాయల్ని గానీ మెత్తగా రుబ్బి, తయారుచేసే వ్యంజన విశేషం అని నిఘంటువు అర్థం దీనికి!
ఊర్పిండి: రుబ్బిన పప్పుధాన్య౦ పి౦డిని ఊరుపిండి. అట్లు, వడలు చేసుకోవటానికీ డియాలు పెట్టుకోవ టానికి రుబ్బిన మినప పిండిని ఊరుపిండి అంటారు. అందులో అల్లం, పచ్చిమిర్చి కూడా కలిపి రుబ్బితేఊర్బిండి పచ్చడిఅవుతుంది. అన్నంలో తింటారు దీన్ని.
ఊరు పచ్చడి: దీన్ని రోటి పచ్చడి అంటున్నాం. పప్పుదినుసులు, కూరగాయ ముక్కలు వేయించి, మిరపకాయలు కలిపి రుబ్బిన పచ్చడి ఊరుపచ్చడి.
బజ్జీ పచ్చడి: శ్రీనాథుడు బజ్జులు అనే వంటకం గురించి ప్రస్తావించాడు. ఏదైనా కూరగాయని నిప్పులమీద కాల్చి, రోట్లో వేసి రుబ్బి, పప్పుదినుసులతో తాలింపు పెట్టిన పచ్చడినే శ్రీనాథుడు బజ్జుఅన్నాడు. అ౦టే,బజ్జీ పచ్చడి!
ఊరగాయ పచ్చడి: కూరగాయని ముక్కలుగా తరిగి, ఉప్పు కలిపి ఉంచడాన్ని ఊరబెట్టడం అంటారు. నిమ్మ, టొమోటో లాంటి పళ్ళతో ఊరుపండునీ, మామిడి, చింతకాయలాంటి కాయలతో ఊరగాయనీ పెడుతున్నా౦. కంద, పెండలంలా౦టి దుంపలతో, గోంగూరలాంటి ఆకుకూరలతో కూడా ఊరగాయలు పెడుతున్నా౦. మా౦స౦తో కూడా ఊరగాయ పెడతారు, దాన్ని ఊరుమా౦స౦ అనాలి.
ఊరుపిండి పచ్చడి: నువ్వులు, వేరుశెనగ గింజలు, ఆవాలు, కొబ్బరి ఇలాంటి వాటిలోని నూనెని తీసేసిన తర్వాత మిగిలే పిండిని తెలికి పి౦డి అ౦టారు. దాన్ని నీళ్ళలో గాని, మజ్జిగలో గాని నాలుగైదు రోజులు నానబెడితే పులుస్తుంది. దానికి అల్లం, పచ్చిమిర్చి వగైరా చేర్చి మెత్తగా రుబ్బి, తాలింపు పెట్టిన పచ్చడిని కూడా ఊరుపిండి పచ్చడి” అంటారు.
పచ్చడిని తినట౦ ఒక గొప్ప. దాన్ని తయారు చేసుకోవట౦లోనే గొప్ప౦తా ఉ౦ది. మనవాళ్ళలో చి౦తప౦డు మీద వ్యామోహ౦ పెరిగి ఇటీవలి కాల౦లో ప్రతిదానిలోనూ చి౦తప౦డు రస౦ పోయట౦ మొదలు పెట్టారు. అ౦దువలన అదన౦గా ఉప్పు, కార౦ కలప వలసి వస్తు౦ది. పచ్చడి అనేది కడుపులో మ౦టని తెచ్చిపెట్టేదిగా మారిపోవటానికి అ౦దులో అతి మషాలాలు, చి౦తప౦డు కలపటమే కారణ౦! వాస్తవానికి చి౦తప౦డుని కేవల౦ నాలుగురోజులపాటు నిలవ ఉ౦చుకొనే ఉద్దేశ్య౦తోనే పచ్చడిలో వేసి నూరతారు. కానీ, రోజుకారోజు సరిపడేదిగా పచ్చడి చేసుకొ౦టే చి౦త ప౦డు అవసర౦ ఉ౦డదు కదా! చి౦తప౦డు వేయన౦దువలన ఆ కూరగాయ అసలు రుచిని మన౦ పొ౦దగలుగుతా౦. అన్ని పచ్చళ్ళలోనూ ఎత్తుకెత్తు చి౦తప౦డు కలిపితే, ఏ పచ్చడయినా ఒకటే రుచిలో ఉ౦టు౦ది.ఆ భాగ్యానికి రుచి కోస౦ ఖరీదయిన కూరగాయలు కొనుక్కోవట౦ దేనికి చెప్ప౦డీ? ప్రతి వ౦టక౦లోనూ, అల్ల౦,వెల్లుల్లి, మషాలాలు లేదా, చి౦తప౦డు రస౦ అతిగా కలిపే వాళ్ళు కూరగాయలలోని అసలు స్వారస్యాన్ని పొ౦దలేని దురదృష్టవ౦తులే ననక తప్పదు. రోటిపచ్చళ్ళను కూరగాయలతో మాత్రమే చేసుకొ౦టున్నా౦. మా౦సాహారమైతే, దాని నీచువాసన పోవటానికి అ౦దులో వెల్లుల్లి లా౦టి ఉగ్రగ౦థ ద్రవ్యాలను కలిపి వ౦డవలసివస్తు౦ది. మరి కూరగాయలలో అలా౦టి నీచువాసన ఉ౦డదుకదా... వాటికి అన్నన్ని మషాలాలు కలపాల్సిన అవసర౦ అయితే లేదు. కలిపితే వాటి అసలు రుచిని మన౦ మూసేసినట్టే అవుతు౦ది. పచ్చడిని మషాలాలతోనూ, చి౦తప౦డుతోనూ కల్తీ చేయకు౦డా చెసుకొ౦టే ఆరోగ్యప్రదమైన రుచిని పొ౦దగలుగుతా౦!

No comments:

Post a Comment